బీసీల సంక్షేమాన్ని విస్మరించిన రాష్ట్ర బడ్జెట్

by Disha edit |
బీసీల సంక్షేమాన్ని విస్మరించిన రాష్ట్ర బడ్జెట్
X

డ్జెట్ అంటే అంకెలు కాదు, అంకెల గారడీ అంతకన్నా కాదు. బడ్జెట్‌ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాలి. అలాగే ప్రజల అవసరాలను తీర్చే, ప్రజా సమస్యలను పరిష్కరించే ఒక సాధనంగా ఉపయోగపడితే అప్పుడే బడ్జెట్‌ని సహేతుకమైనదిగా నిర్మాణాత్మకమైనదిగా భావించాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ప్రతీ ప్రభుత్వం చెప్పేది ఒక్కటే ఈ బడ్జెట్ రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుంది కాబట్టి రాష్ట్ర సంక్షేమానికి స్వర్ణయుగమని. కానీ వాస్తవాలను పరిశీలిస్తే రాష్ట్రంలోని 52 శాతం ఉన్న బీసీలకు తక్కువ బడ్జెట్ కేటాయిస్తూ బీసీలకు అన్యాయం చేస్తుందని గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 52 శాతంగా ఉన్న బీసీలకు కేటాయిస్తున్న బడ్జెట్ కేవలం మూడు శాతమే. ప్రస్తుత బడ్జెట్ 2.90 లక్షల కోట్లతో ప్రవేశపెడితే అందులో బీసీల సంక్షేమం కోసం 6229 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. ఇది పూర్తి బడ్జెట్‌లో కేవలం 2.1 శాతం మాత్రమే.

పూర్తి నిధులు ఖర్చు పెట్టకపోగా..

ఈ బడ్జెట్‌లోనే కాదు గత మూడు బడ్జెట్లలోనూ బీసీ సంక్షేమానికి వరుసగా రూ. 4,356, రూ. 5,552, రూ. 5,697 కోట్లు మాత్రమే. ఇందుకు భిన్నంగా ఏపీలో బీసీల సంక్షేమానికి 30వేల కోట్లు కేటాయించడమే కాకుండా బీసీ సబ్ ప్లాన్ కింద నిధులు కేటాయిస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో నిధుల కేటాయింపు ఏ స్థాయిలో ఉందో బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో అర్థమవుతుంది. ప్రభుత్వం బీసీ కార్పొరేషన్‌కి, ఎంబీసీ కార్పొరేషన్‌కి నిధులు పెంచాలనే బీసీ సంఘాల విజ్ఞప్తులను పట్టించుకోకపోగా ఈ రెండు కార్పొరేషన్లకి గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయకపోగా, ప్రతి బడ్జెట్‌లో నిధులను తగ్గించుకుంటూ వస్తున్నారు. బీసీ ఎంబీసీ కార్పొరేషన్లకి గత బడ్జెట్‌లో 600 కోట్ల రూపాయల నిధుల కేటాయిస్తే, ఈ బడ్జెట్‌లో ఆ రెండు కార్పొరేషన్ల నిధుల ప్రస్తావనే లేదు. 12 కుల ఫెడరేషన్లకి బీసీల వ్యక్తిగత రుణాల ప్రస్తావన కూడా బడ్జెట్‌లో లేకపోవడంతో ప్రభుత్వం బడ్జెట్‌లో బీసీల సంక్షేమాన్ని విస్మరించినట్లుగానే భావించాలి.

బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి అరకొర నిధులు కేటాయించడం వలన బీసీ విద్యార్థులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు చెల్లించలేక పోతుంది. అలాగే పూలే విదేశీ విద్యా జ్యోతి పథకం కింద ప్రతి సంవత్సరం కేవలం 300 మంది బీసీ విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. బీసీల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం బడ్జెట్‌లో చేప పిల్లలు, గొర్రెల పంపిణీ, నేతన్నలకు చేయూత బీమా టెక్స్‌టైల్ పార్కులు, గురుకులాల పెంపు అని మభ్యపెట్టే పథకాలను చూపెడుతూ బీసీలను మోసం చేస్తుంది. ఈ బడ్జెట్‌లో బీసీ సంఘాల ఏ ఒక్క ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిగణన‌లోకి తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలు డిమాండ్ చేస్తున్న విధంగా మేము ఎంతో మాకు అంత వాటా, బీసీలు సగం బీసీలకు సగం, ఆర్థికంలో సగం అనే ఆకాంక్షను పట్టించుకోలేదు. అందుకే బీసీలు చైతన్యవంతం కానంత కాలం, తమ హక్కుల కోసం గళం విప్పి లేనంత కాలం ప్రభుత్వాలు బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగానే భావిస్తారు తప్ప, వారి కోసం ప్రత్యేక పథకాలు నిధులు కేటాయించాలనే ఆలోచన చేయరనేది మరోసారి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో రుజువైంది.

డా. తిరునహరి శేషు

బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్

9885465877

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ ౭౯౯౫౮౬౬౬౭౨

ఇవి కూడా చదవండి : 31 మంది ఎంపీలు ఏం ఉద్ధరించారు?

Next Story

Most Viewed