అరుదైన బౌలర్ బయోపిక్ '800'..!

by Disha Web Desk 13 |
అరుదైన బౌలర్ బయోపిక్ 800..!
X

క్రీడాకారుల జీవిత కథల ఆధారంగా తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త కాదు. ‘అశ్విని’ వంటి చిత్రాలు ప్రజాదరణను పొందాయి. అరుదుగా వచ్చే ఇటువంటి కథాంశాలు ఉన్న చిత్రాలలో ‘రిస్క్’ ఎక్కువ. కొన్ని సందర్భాలలో ‘నాటకీయతకు’ ప్రాధాన్యం ఇవ్వవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో ‘సహజత్వం’ దూరమవుతుంది. ‘ఎమోషన్స్’ మిస్ అవుతాయి. సాధారణ ప్రేక్షకులు (క్రీడల పట్ల ఆసక్తి లేనివారు) ఇటువంటి చిత్రాలకు కనెక్ట్ కారు. వారి కోసం ప్రత్యేకమైన ‘వాణిజ్యాంశాలు’ జోడిస్తే కథలో సాగతీత ఎక్కువవుతుంది. ఇక్కడ గమనించదగ్గ అంశమేమిటంటే ఏ క్రీడాకారుని జీవిత కథ ఆధారంగా సినిమా తీస్తున్నారో.. సదరు ఆటగాడికి ‘కథ’ నచ్చేలా ‘స్క్రీన్ ప్లే’ నడపడం కష్టమైన పని. అయితే ప్రఖ్యాత గాంచిన, టీంలో ప్రముఖ పాత్ర వహించిన, జట్టు విజయాలకు సారధిగా నిలిచిన ‘ఆటగాడి’ జీవిత కథలో ‘వాణిజ్యంశాలు’ ఎక్కువగానే ఉంటాయి. వారికి ప్రత్యేకమైన ‘పర్సనల్ లైఫ్’ తక్కువ. జీవితం, బాల్యం, వివాహం, ఆట, విజయాలు, అపజయాలు, బలహీనతలు అన్నీ కూడా పేపర్లో నిత్యం ‘న్యూస్’గా నిలుస్తాయి. సచిన్, కపిల్, గవాస్కర్, కోహ్లీ ఇలా ప్రతి ఒక్కరి జీవితం సమాజంలో భాగంగానే ఉంటుంది. అటువంటి విశిష్ట క్రీడాకారుడే శ్రీలంకకు చెందిన క్రికెట్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్.

కథ ఎవరికి నచ్చాలి..?

శ్రీలంకలో జాతి వివక్షా పూరిత ఉద్రిక్తతల కారణంగా ముత్తయ్య కుటుంబం అనేక కష్టాలనెదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత, వృత్తి అనుభవాలతో కథ నడుస్తుంది. మురళీధరన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించక ముందు తరువాత అతని జీవన పోరాటాలను, క్రికెట్లోకి ప్రవేశించిన తర్వాత బౌలింగ్ యాక్షన్ చుట్టూ ‘కథనం’ ఉంటుంది. మురళీధరన్ పాత్ర పోషించిన ‘స్లమ్ డాగ్ మిలీనియర్’ నటుడు మధుర్ మిట్టల్ అన్ని తానై ఈ కథను నడిపించారు. అతడిలోని ‘నటుడి’ని ప్రేక్షకులు గుర్తిస్తారు. ‘800’… స్పోర్ట్స్ డ్రామా చిత్రం. ముత్తయ్య మురళీధరన్ క్రీడా జీవితం కంటే వ్యక్తిగత జీవితం పైన ఎక్కువ చిత్రాన్ని దర్శకుడు ఎం.ఎస్.శ్రీపతి నడిపించాడు. దీనివలన రెండు భాగాలుగా ఉన్న (విశ్రాంతికి ముందు, తర్వాత) చిత్రంలో ఎమోషనల్ లోతుగా ఉన్న సన్నివేశాలలోనూ, క్రీడాంశాల పరమైన నాటకీయత చిత్రణలోనూ సమతుల్యత కొరవడింది. ఇది స్క్రీన్ ప్లే‌లో స్పష్టంగానే తెలుస్తుంది. దర్శకుడు కథను ఎంపిక చేసుకునే సమయంలో కనిపించిన నైపుణ్యం చిత్రీకరణకు వచ్చేసరికి... మురళీధర్ అన్న కథ ప్రేక్షకులకు నచ్చాలి, వారు మెచ్చాలి అనే పాయింట్ నుంచి మురళీధరన్‌కు నచ్చాలి అనే దశకు చేరుకున్నారేమోనని ప్రేక్షకులు అసహనానికి లోనవుతారు.

ఇది రిఫైన్డ్ బయోపిక్..

క్రీడాకారుని జీవితం చిత్రంగా వస్తుందని తెలిసిన దగ్గర నుంచి ఆ క్రీడాకారున్ని ఆరాధించేవారు, అభిమానించే వారు కూడా అన్ని రకాల సోర్సెస్ ద్వారా ముందుగానే తెలుసుకొని ఉంటారు. వారు కొన్ని అంచనాలతో ఇటువంటి చిత్రాలకు ‘థియేటర్స్’కు వస్తారు. ముత్తయ్య మురళీధర్ జీవితంలో ఎన్నెన్నో అసాధారణ అనూహ్యమైన సంఘటనలున్నాయి. ఇవి దాదాపుగా దేశమంతటా అందరికీ తెలిసిందే. కానీ.. ‘800’ చిత్రంలో వీటిని తగు పాళ్లలో ప్రదర్శించే అవకాశం లేకపోయింది. వాటిలోని భావోద్వేగాలను ప్రేక్షకులు తమతో మమేకం చేసుకునే అవకాశం కల్పించడంలో దర్శకుడు శ్రీపతి తడబడ్డారు. ‘బయోపిక్’లకు తెలిసిన కథనాన్ని ఆస్వాదింప చేసే లక్షణం అవసరం. ప్రముఖుల వ్యక్తిత్వం వీటిలో ‘ఆకర్షణీయంగా’ ఆలోచనలకు తావిచ్చే విధంగా కథనం ఉండాలి. చిత్రీకరణలో కూడా సాఫీగా సాగిపోయే నైజం ఉండాలి. దర్శకుడిగా శ్రీపతికి ఈ అంశంపై ‘అనుభవం’ తక్కువనే విషయం ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఏది ఏమైనా శ్రీపతి ఒక రిఫైన్డ్ బయోపిక్‌ని రూపొందించడంలో ప్రసిద్ధ బౌలర్‌ గురించి చిత్రంగా తీసే ప్రయత్నం అభినందనీయం, సాహసం అనే చెప్పాలి.

అన్ని ప్లస్‌లూ హీరోకే..

చిత్రంలో మైనస్ పాయింట్స్‌ను వదిలేస్తే దర్శక, నట, సాంకేతిక వర్గం ప్రతిభను ప్రదర్శించే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ముత్తయ్య పాత్రను పోషించిన మధుర మిట్టల్, ప్రేక్షకుల కనుల ముందు మురళీధరన్‌ని పరిపూర్ణంగా ఆవిష్కరించడంలో కృతకృత్యుడయ్యాడు. అతని నుంచి ఆ విధమైన నటనను రాబట్టుకున్న దర్శకుడు సగం విజయం సాధించాడు. ముఖ్యంగా మురళీధరన్ ‘బౌలింగ్ యాక్షన్’ వాస్తవికతను ఎంతో గొప్పగా అతడు ప్రదర్శించాడు. నాజర్ పాత్ర కూడా బావుంది. మిగిలిన పాత్రల్లో మహిమా నంబియార్, నారయిన్, శరత్ లోహిత స్వా తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. సినిమాటోగ్రఫీ నిర్వహించిన ఆర్డీ రాజశేఖర్ తన కర్తవ్యాన్ని సమర్ధవంతంగా నిర్వహించి ప్రేక్షకులకు చక్కని అనుభూతినిచ్చాడు. జిబ్రాన్ సంగీతం, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ మరింత మెరుగుగా ఉండాల్సింది. నిర్మాత వివేక రంగాచారి నిర్మాణ విలువలు బాగున్నాయి.

800.. ఫర్వాలేదు..

‘800’ చిత్రాన్ని మరింత మెరుగ్గా తీసి ఉండవచ్చు. కానీ ఉన్నంతలో కథ పరిధి మేరకు ఫర్వాలేదనే చెప్పుకోవాలి. క్రీడాకారుల జీవితంలో తెలియని కోణాల కన్నా తెలిసిన కోణమైన ‘క్రీడలు’ను మాత్రమే అభిమానులు ఆస్వాదిస్తారు, కోరుకుంటారు. ప్రస్తుతం ‘ప్రపంచ కప్’ క్రికెట్ నేపథ్యంలో గడిచిన కాలంనాటి ఆటగాళ్ల జీవిత ‘చిత్రాలు’ నేటి అభిమానులు తెలుసుకునే అవకాశం ఇటువంటి చిత్రాలు వలన కలుగుతుంది. ఇటువంటి ‘బయోపిక్’ల చిత్రీకరణలో దర్శకులకు తగిన అనుభవం లేకుంటే ఉత్త ‘బయోపిక్’లుగా మాత్రమే తయారవుతాయి. అందుకే ఏ చిత్ర పరిశ్రమ అయినా ఇటువంటి సాహస ప్రయోగాలు చేసేందుకు ముందడుగు వేయదు. దర్శక నిర్మాతలను ఈ విషయంలో అభినందించాలి.

- భమిడిపాటి గౌరీశంకర్

94928 58395





Next Story

Most Viewed