ఎన్ఎస్ఎస్ ప్రారంభించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి?

by Disha edit |
ఎన్ఎస్ఎస్ ప్రారంభించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి?
X

వీరి డ్రస్ కోడ్‌లో ఎర్ర రంగు ఉత్తేజం, నీలి రంగు మానవ సంక్షేమం, సమాజ సేవకు సూచికలుగా ఉంటాయి. వారు ఏదేని ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడ పరిశుభ్రత మీద కార్యక్రమాలు నిర్వహిస్తారు. రహదారుల పక్కన పిచ్చి మొక్కలను తొలగిస్తారు. ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేస్తారు. మురికివాడలను శుభ్రపరిచి, విద్య గురించి స్థానికులకు అవగాహన కలిగిస్తారు. ఆరోగ్య సూత్రాలను వివరించడమే కాకుండా, వయోజన విద్య ప్రాముఖ్యతను విడమరిచి చెబుతారు. విరాళాలు సేకరించి పేదవారికి సహాయం చేస్తారు.

దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చాక దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థి సమాజ సేవలో పాలుపంచుకోవాలని పాలకులు పిలుపునిచ్చారు. ఇందులో అందరూ భాగస్వాములు కావాలని ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. అదే 'నేషనల్ సర్వీస్ స్కీం (జాతీయ సేవా పథకం- ఎన్ఎస్ఎస్)' కేంద్ర విద్యాశాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇది ఏర్పడి నేటికి 53 సంవత్సరాలు. ఇది జాతీయ సమైక్యతను చాటి చెబుతుంది.

తగిన స్ఫూర్తిని ఇస్తుంది. ఈ కార్యక్రమం మహాత్మా గాంధీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా 1969 సెప్టెంబర్ 24న అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి వీకే‌ఆర్‌వీ రావు 37 విశ్వవిద్యాలయాలలో 40 వేల మంది విద్యార్థులతో ప్రారంభించారు. క్రమంగా ఇది దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. 2018 నాటికి 3 లక్షల 80 వేల మంది వాలంటీర్లను నమోదు చేసుకుంది.

దేశభక్తి, మానవతా విలువలు

దేశ ప్రగతిలో, ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించేది యువకులే. విద్యాసంస్థలలో వారికి సమాజ సేవ చేయడం నేర్పడం, దేశభక్తి, పరోపకారం, శ్రమ గౌరవం, మానవత విలువలను పెంచి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్ఎస్ఎస్ చురుకైన పాత్ర పోషిస్తుంది. విద్యార్థులుగా ఉన్నప్పుడే మనిషి మరొక మనిషికి సహకరించడం మానవతా లక్షణం అని నేర్పుతుంది. 'మనం పది మందిలో ఉంటే పది మందికి ప్రయోజనం కలగాలి లేదా మరొకరికి మేలైనా జరగాలి' అనేది ఎన్ఎస్ఎస్ వలంటీర్‌ల ముఖ్య లక్షణం. వివిధ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో వారందిస్తున్న సేవలు భవిష్యత్తులో వారు మంచి పౌరులుగా ఎదిగేందుకు దోహదపడతాయి. యేటా సెప్టెంబర్ 24న కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ దినోత్సవం జరుపుతారు.

ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు, అధికారులకు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలలో అవార్డులు అందజేస్తారు. వీరి డ్రస్ కోడ్‌లో ఎర్ర రంగు ఉత్తేజం, నీలి రంగు మానవ సంక్షేమం, సమాజ సేవకు సూచికలుగా ఉంటాయి. వారు ఏదేని ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడ పరిశుభ్రత మీద కార్యక్రమాలు నిర్వహిస్తారు. రహదారుల పక్కన పిచ్చి మొక్కలను తొలగిస్తారు. ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేస్తారు. మురికివాడలను శుభ్రపరిచి, విద్య గురించి స్థానికులకు అవగాహన కలిగిస్తారు. ఆరోగ్య సూత్రాలను వివరించడమే కాకుండా, వయోజన విద్య ప్రాముఖ్యతను విడమరిచి చెబుతారు. విరాళాలు సేకరించి పేదవారికి సహాయం చేస్తారు.

త్యాగమే పరమావధిగా

అగ్నిప్రమాదాలు జరిగినపుడు, విపత్తులు వచ్చినపుడు ప్రజలకు సేవ చేయడంలో ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్‌ల పాత్ర కీలకం. సాటి మానవులకు సహాయం చేయడం వలన త్యాగం, దేశభక్తి, మానవతా విలువలు, బాధ్యత వంటి లక్షణాలు పుణికి పుచ్చుకొని ఉత్తమ పౌరులుగా తయారవుతారు. అయితే, నేటి యువత సమాజ సేవకు దూరంగా ఉంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. దీంతో మనిషి స్వార్థం కలిగి సంఘజీవిగా ఉండలేడు.

కావున విద్యార్థి దశ నుంచే సమాజ సేవకు ఉపక్రమించాలి.వారికి శ్రామిక విలువలు తెలియజేయడంలో తల్లిదండ్రులు, అధికారులు, అధ్యాపకులు శ్రద్ధ వహించాలి. విద్యార్థుల ప్రథమ కర్తవ్యం విద్యాభ్యాసమే అయినా, భావి భారతాన్ని నిర్ణయించవలసినది నేటి యువకులే. 'నేను నా కోసం కాదు, నీ కోసం నేను' అనే భావన' పెంచడమే ఎన్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశం.

(నేడు ఎన్ఎస్ఎస్ దినోత్సవం)


లకావత్ చిరంజీవి నాయక్

కేయూ, వరంగల్

99630 40960

Next Story

Most Viewed