సకల శుభాల విజయదశమి!

by Disha edit |
సకల శుభాల విజయదశమి!
X

దసరా రోజున పాలపిట్టను చూడటం కూడా ఆనవాయితీ. తెలంగాణలో పాలపిట్టకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఎప్పుడో గానీ కనిపించని ఈ అరుదైన పక్షి విజయదశమి నాడు కచ్చితంగా దర్శనమివ్వడం తెలుగు ప్రజలు అదృష్టంగా భావిస్తారు. పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద నుంచి తీసుకొని తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటుండగా వారికి పాలపిట్ట కనిపించిందని, అప్పటి నుంచి వారికి సకల విజయాలు సిద్ధించాయని ఒక నమ్మకం. అందుకే విజయదశమి నాడు పాలపిట్టని దర్శించే ఆనవాయితీ మొదలయ్యింది. పాలపిట్ట జీవిత కాలం సుమారు 17 నుండి 20 సంవత్సరాలు ఉంటుంది.

తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత తెలుగు పండుగలకు ప్రాధాన్యం పెరిగింది. బతుకమ్మ సంస్కృతి విదేశాలకు కూడా విస్తరించింది. దసరాను ఘనంగా జరుపుకోవడమూ పెరిగింది. దసరా రోజున పాలపిట్టను దర్శించుకోవడం, జమ్మి చెట్టును పూజించడం అదృష్టంగా భావిస్తారు. చెడు మీద మంచి విజయానికి గురుతుగా నవరాత్రులలో దుర్గామాతను పూజిస్తారు.

దసరా రోజున సాయంత్రం తెలంగాణ ప్రజలు పాలపిట్టను చూడడానికి ఊరి బయటకు బయలుదేరుతారు. అనంతరం ఊరంతా ఒకచోట చేరి జమ్మిచెట్టుకు పూజలు నిర్వహిస్తారు. గుమ్మడికాయనో, ఆనిగెపు కాయనో, గొర్రె పోతునో కొడతారు. జమ్మి ఆకులను బంగారంగా భావించి పెద్దల చేతిలో పెట్టి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అడవులలో ఉండే చెట్లను దైవంగా పూజించడం ఇక్కడ విశేషం.

శమీ వృక్షం మనదే

జమ్మి చెట్టు భారతీయులకు కొత్తేమీ కాదు. భారత ఉపఖండంలోనే ఈ వృక్షం ఉద్భవించింది. మనం పురాణాలలో, వేదాలలో తరచూ వినే అరణిని ఈ జమ్మితోనే రూపొందించారని చెబుతారు. జమ్మి చెట్టు ఎలాంటి ప్రాంతాలలో అయినా త్వరత్వరగా పెరుగుతుంది. అందుకే ఎడారి ప్రాంతం రాజస్థాన్ మొదలుకొని వర్షపాతం తక్కువగా ఉండే తెలంగాణ ప్రాంతం వరకు జమ్మి చెట్టు గురించి బాగా తెలుసు. రైతులకు, గ్రామీణ ప్రజలకు, జమ్మి చెట్టు అంటే ప్రాణం. జమ్మి ఆకులు, కొమ్మలు, పశువులకు మేతగా ఉపయోగపడతాయి. చెట్టులోని ప్రతి భాగాన్ని ఔషధాలలో వాడుతారు. ఈ చెట్టు నుండి వచ్చే గాలి పీల్చినా, జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఆరోగ్యం బాగుంటుందని నమ్ముతారు. అందుకే వినాయక చవితి నాడు పూజించే పక వింశతి పత్రాలలో శమీ పత్రాన్ని కూడా చేర్చుతారు.

దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం, జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకుని అందరికీ మంచి శుభం జరగాలని కోరుకోవటం మన ఆనవాయితీ. అజ్ఞాతవాసానికి బయలుదేరిన పాండవులు విజయదశమి రోజున ఆయుధాలను జమ్మిచెట్టుపై దాచి వెళ్లారు. తిరిగి అదే విజయదశమి నాడు జమ్మి చెట్టు రూపంలో ఉన్న అపరాజితాదేవిని పూజించి తమ ఆయుధాలను తీసుకున్నారు. రామునికి సైతం జమ్మిచెట్టు ఇష్టం అని చెబుతారు. విజయదశమి నాడే రాముడు అపరాజితాదేవి (శమీ వృక్షము)ని పూజించి, రావణుడిని సంహరించాడు. అనేక కారణాలతో అంతరించిపోతున్న జమ్మిచెట్టును ప్రతి ఊరిలో, ప్రతీ గుడిలో ఉండేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున 'ఊరూరుకో జమ్మి చెట్టు–గుడి గుడికో జమ్మి చెట్టు' అనే నినాదంతో నాటాలి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు ను ప్రకటించింది.

పాలపిట్ట దర్శనం

దసరా రోజున పాలపిట్టను చూడడం కూడా ఆనవాయితీ. తెలంగాణలో పాలపిట్టకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఎప్పుడో గానీ కనిపించని ఈ అరుదైన పక్షి విజయదశమి నాడు కచ్చితంగా దర్శనమివ్వడం తెలుగు ప్రజలు అదృష్టంగా భావిస్తారు. పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద నుంచి తీసుకొని తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటుండగా వారికి పాలపిట్ట కనిపించిందని, అప్పటి నుంచి వారికి సకల విజయాలు సిద్ధించాయని ఒక నమ్మకం. అందుకే విజయదశమి నాడు పాలపిట్ట ని దర్శించే ఆనవాయితీ మొదలయ్యింది.

పాలపిట్ట జీవిత కాలం సుమారు 17 నుండి 20 సంవత్సరాలు ఉంటుంది. తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశమంతా గొప్పగా జరుపుకునే పండుగ దసరా. పశుపక్ష్యాదులను దైవ స్వరూపాలుగా భావించి పూజించడం భారతీయ సాంప్రదాయం. పాలపిట్ట దేవీ స్వరూపమని నమ్మకం. పాలపిట్టను తెలంగాణ రాష్ట్ర పక్షిగా గుర్తించి గౌరవం ఇచ్చుకున్నాం. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, బిహార్ కూడా పాలపిట్టను రాష్ట్ర పక్షిగా గుర్తించాయి. తెలుగు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు.

(నేడు విజయదశమి)


లకావత్ చిరంజీవి నాయక్

కేయూ వరంగల్

99630 40960



Next Story

Most Viewed