సాంప్రదాయ షాపులని కాపాడాలి!

by Disha edit |
సాంప్రదాయ షాపులని కాపాడాలి!
X

అనాదిగా మన అనుదిన అవసరాలు తీర్చే సాంప్రదాయ షాపులు భవిష్యత్తులో కనుమరుగు అవుతున్నాయి. ప్రతీ ఆవాసంలో చిన్న చిన్న కిరణా కొట్టులు, కూరగాయల దుకాణాలు ఉండేవి.‌ నిత్యం ఆ ప్రాంత ప్రజలతో ఆ దుకాణ యజమానులకు, వ్యాపారస్తులకు మంచి సంబంధాలు ఉండేవి.‌ మంచి చెడులు పంచుకునే అవకాశం ఉండేది. ముఖ్యంగా " బేరం" ఆడటం ద్వారా పొదుపు మంత్రం అందరిలో అలవడేది.‌ ఆర్థిక క్రమశిక్షణ పిల్లల నుంచి పెద్దల దాకా అలవడేది. ప్రస్తుతం షాపింగ్ మాల్స్, ఆన్లైన్ బుకింగ్, డోర్ డెలివరీ వంటివి సామాజిక మాధ్యమాల ద్వారా అందుబాటులోకి రావడంతో బేరం ఆడే మాట అదృశ్యం అయింది. ఎన్ని లక్షల రూపాయలు సంపాదించినా, అప్పులు, క్రెడిట్ కార్డులతో జీవితాన్ని నెట్టుకొచ్చే పరిస్థితి దాపురించింది.‌ దీనికి ప్రధాన కారణం వ్యాపారస్తులకు, కొనుగోలు దారులకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు కనుమరుగు కావడం.‌

ఆఫర్ల మైకంతో...

ఇదివరకు పెద్ద పెద్ద నగరాల్లో, పట్టణాల్లో ఉండే షాపింగ్ మాల్స్ ఈరోజు చిన్న చిన్న పట్టణాలు ఆ మాటకొస్తే కొంచెం పెద్ద పెద్ద గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా విస్తరిస్తున్నాయి. నేటికీ భారత్‌లో చాలామంది గ్రామాల్లో నివసించడం వలన ఎక్కువ జనాభా షాపింగ్ మాల్స్ బాట పడుతున్నారు. ముఖ్యంగా అన్ని వస్తువులు ఒకే చోట దొరకడం, వివిధ బ్రాండ్‌లు అందుబాటులో ఉండటం, డిస్కౌంట్ ఆఫర్లు పేరుతో షాపింగ్ మాల్స్ బాట పడుతున్నారు.‌ ఆహ్లాదకరమైన వాతావరణం, పరిశుభ్రంగా ఉండటం వలన కూడా షాపింగ్ మాల్స్ బాట పడుతున్నారు.‌ దాదాపు అన్ని వస్తువులపై ముందుగానే ధరలు ఫిక్స్ చేసి ఉండుట వలన బేరం ఆడే మాట లేకుండా, వారికి నచ్చినవి కొనుక్కొనే వీలు కలుగుతుంది.

ఇక భారతదేశంలో జరుపుకునే వివిధ పండుగలు, పర్వదినాల సందర్భంగా కొన్ని వస్తువులపై భారీ రాయితీలు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. డోర్ డెలివరీ వంటివి సదుపాయాలు ఉన్నాయి. ఒన్ ప్లస్ ఒన్, బయ్ వన్ గెట్ వన్ వంటి పలు ఆఫర్లు వినియోగదారులకు మైకం కలుగజేస్తూండటంతో, అవసరం లేని వస్తువులను కూడా కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ఫోన్ పే, గూగుల్ పే, స్కాన్, కార్డులు ద్వారా డబ్బులు చెల్లించడంతో డబ్బు విలువ తెలియకపోవడం వల్ల కూడా షాపింగ్ మాల్స్ ఆకర్షణలో అందరూ మునిగితేలుతున్నారు... అందుచేతనే ఎన్ని లక్షల ప్యాకేజీ జీతాలు తీసుకుంటున్నా, దాదాపు అందరూ అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. ఒక నెల జీతం ఆలస్యం అయినా, ఏ కారణం చేతనైనా రాకపోతే, జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి...

కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ డబ్బు విలువ తెలిసికోవాలి.‌ వినియోగమయ సంస్కృతి నుంచి బయట పడాలి. అవసరమైన వస్తువులే కొనాలి. ముఖ్యంగా సాంప్రదాయ షాపులు వారి అభివృద్ధికి కృషి చేయాలి.‌ వారి జీవనోపాధి అవకాశాలు మెరుగు పరచడానికి అందరూ కృషి చేయాలి.‌ కల్తీ, నాసిరకం, తూకాల మోసాలు లేకుండా సాంప్రదాయ షాపులు, వర్తకులు ప్రజల మనసులు గెలవాలి. మరీ ముఖ్యంగా చిల్లర దుకాణాలు బతికి బట్టకట్టాలి.

ఐ. ప్రసాదరావు

సీనియర్ జర్నలిస్ట్

63056 82733

Next Story

Most Viewed