అసమానతలపై నినదించిన ధిక్కారస్వరం

by Disha edit |
అసమానతలపై నినదించిన ధిక్కారస్వరం
X

పుదుచ్చేరి శాసనసభకు ఎన్నికైన ఏకైక మహిళా శాసనసభ్యురాలు, దళితురాలు ఎస్. చందిర ప్రియంగ తన పదవికి రాజీనామా చేశారు. ఎ.ఐ.ఎన్.ఆర్.సి, బీజేపీ సంకీర్ణ మంత్రివర్గంలో రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె తన చుట్టూ ఉన్న అసమానతలను, కుల వివక్షను సహించలేక అక్టోబర్ 10న మంత్రి పదవికి రాజీనామా చేసి సంచలనం కలిగించారు. ఆమె పుదుచ్చేరిలో మొదటి మహిళా మంత్రి కావడం గమనార్హం. పైగా, గత నాలుగు దశాబ్దాల కాలంలో కేంద్రపాలిత ప్రాంతంలో మంత్రి పదవిని చేపట్టిన మొదటి మహిళగా ఆమె రికార్డుని సాధించారు. ఆమె 'పురుషాధిక్య రాజకీయ రంగంలో కుల, లింగ వివక్షను అధిగమించడం కష్టంగా మారినందున తాను తప్పనిసరి పరిస్థితులలో మంత్రిగా వైదొలగాల్సి వచ్చిందని, పేర్కొన్నారు. పైగా 'కుట్రాజకీయాలను నిరంతరం భరించాల్సిన విషమ పరిస్థితులలో ఆమె పదవిలో కొనసాగడం ఏమాత్రం సహేతుకం కాదు' అని ఆమె పేర్కొనడం దేశంలో రాజకీయ అసమానతలను ఎత్తి చూపుతుంది.

కుట్ర రాజకీయాలు భరించలేక

2021 పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలలో ఆమె పుదుచ్చేరి లోని కారైకల్ ప్రాంతంలోని నెడున్కాడు రిజర్వుడ్ నియోజకవర్గం నుండి శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. 'నియోజకవర్గ ప్రజల్లో నాకున్న ఆదరణ కారణంగా అసెంబ్లీలోకి ప్రవేశించాను. కానీ కుట్రాజకీయాలను అధిగమించడం అంత సులువు కాదని, నిరంతరం నన్ను లక్ష్యంగా చేసుకుని కుట్రాజకీయాలకు పాల్పడటాన్ని నేను సహించలేకపోయానని, అడుగడుగున నేను కులతత్వం, లింగ పక్షపాతాన్ని ఎదుర్కొన్నాను, వీటిని ఒక పరిమితికి మించి నేను భరించలేకపోయానని, ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పదవీకాలంలో నేను ఒంటరినయ్యాయని,

రాజకీయ కుట్రల సంక్లిష్టతలను, ఆర్థిక వనరుల విపరీతమైన ప్రభావాన్నినేను భరించలేని స్థితికి చేరుకున్నాను. దీంతో తట్టుకోలేక మంత్రి పదవికి రాజీనామా చేశాను. ఇలా చేసినందుకు నా ఓటర్లకు క్షమాపణలు చెబుతున్నాను. మంత్రిగా రాజీనామా చేసినప్పటికీ తనపై విశ్వాసం ఉంచిన ప్రజల కోసం పని చేయడానికి శాసనసభ్యురాలు గాను, ఒక సాధారణ కార్యకర్త గాను ఎల్లప్పుడూ సంసిద్ధంగానే ఉంటాను. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయా శాఖలలో తాను సూచించిన మార్పులు, చేర్పులు, మెరుగుదలలు, సంస్కరణలను హైలైట్ చేయడానికి సవివరమైన నివేదికతో త్వరలో బయటకు వచ్చి ప్రజలను కలుస్తాను' అని ఆమె పేర్కొనడం హర్షణీయం.

పదవిని త్యజించి..

'దళితులు రాజకీయాల్లో విజయవంతంగా రాణించి చరిత్ర సృష్టించిన ఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి నేను కూడా సానుకూల దృక్పథంతో రాజకీయ రంగంలోకి ప్రవేశించాను. కానీ లింగ, కుల వివక్షను ఎదుర్కోవలసి వచ్చింది. అంతేకాకుండా ధన బలం, కుట్రాజకీయాలతో పోరాడలేకపోయాను. మహిళలు విద్యావంతులు కావచ్చు, విశేష నేపథ్యం నుండి వచ్చినవారు కూడా కావచ్చు, కానీ పురుషాధిక్య రాజకీయ ప్రపంచం మహిళలను విచ్ఛిన్నం చేసే కుట్ర పన్నుతోంది. పితృస్వామ్యంలో పాతుకుపోయిన వేధింపులను నేను భరించలేకపోయాను. అయితే, అన్యాయాలు జరుగుతున్నప్పటికీ చూసిచూడనట్లు వ్యవహరిస్తూ ఉండడం కన్నా ఆ అన్యాయలపై తిరుగుబాటు చేయాల్సిన పోరాట అవసరాన్ని ఎస్. చందిర ప్రియంగ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం ద్వారా ఒక సృష్టమైన సంకేతాన్ని దేశ పాలకుల ముందు ప్రదర్శించారు. మరోపక్క ఎన్నో అసమానతలకు గురవుతున్నా, కనీసం నోరు విప్పకుండా తమ పదవులను కాపాడుకోవడం కోసం ఉన్నత వర్గాలకు చెంచాలుగా ఉంటూ వారికి పాదపూజలు చేసే ప్రజాప్రతినిధులు నేడు కోకొల్లలుగా ఉన్నారు. సాక్ష్యాత్తు ఒక మహిళా మంత్రి అసమానతలను, వివక్షను భరించలేక ఏకంగా మంత్రి పదవికి రాజీనామాను సమర్పించిన ఈ ఉదంతాన్ని దళిత ప్రజాప్రతినిధులు, మంత్రులు సైతం ఒక పోరాట స్ఫూర్తిగా తీసుకొని చైతన్యం ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- జె.జె.సి.పి. బాబూరావు

రీసెర్చ్ స్కాలర్,

94933 19690

Next Story

Most Viewed