బతుకునిచ్చే భాష కోసం..

by Disha edit |
బతుకునిచ్చే భాష కోసం..
X

మహాకవి కావడానికి పాండిత్యం తెలిసి ఉండాలి. ప్రజా కవి కావడానికి ప్రజల కష్టాలు తెలిసి ఉండాలి. అలాంటి సామాన్య ప్రజల ధిక్కార స్వరం కాళోజీ. సమాజంలో జరుగుతున్న అన్యాయాలన్ని ఆకృత్యాల్నీ, అవకతవకలను జూచి హృదయం ద్రవించి తన సిరాచుక్కతో లక్షల మెదళ్లకు కదలిక తెచ్చారు. నియంతృత్వాన్ని ధిక్కరించారు. ప్రజల కోసం సమ సమాజం కోసం అక్షరాలు ఎక్కు పెట్టారు. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్ని ఎదిరించిన వాడు నాకు ఆరాధ్యుడు అంటూ ఎడతెగకుండా సాగుతున్న అన్యాయాలను చూసి ప్రశ్నించాడు. ‘ద్రోహం చేసినవాడు పరాయివాడైతే తరిమికొట్టు ఇక్కడ వాడైతే పాతిపెట్టు’ అంటూ దోపిడీ, పెత్తందారి వ్యవస్థపై కలంతో గళం విప్పారు. సాగిపోవుటే బతుకు ఆగిపోవుటే చావు అంటూ భారత స్వాతంత్ర ఉద్యమంలో భాగమయ్యారు. తెలంగాణ విమోచన ఉద్యమంలో ఉద్యమకారుడయ్యాడు. తెలుగు భాషా చైతన్యంలో ప్రజాకవి అయ్యాడు.

ధిక్కార స్వరం కాళోజీ!

కాళోజీ..20వ శతాబ్దం ప్రజా కవి, గొప్ప మానవతావాది! ఆయన కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని రట్టి హళ్లి గ్రామంలో కాళోజీ రంగారావు, రమాబాయమ్మ అనే దంపతులకు జన్మించారు. చిన్నతనంలో వీరి కుటుంబం కొన్నేళ్లు మహారాష్ట్రలో, ఆ తర్వాత తెలంగాణలోని మడికొండకు రావడం జరిగింది. ఆ తర్వాత తన నివాసమైన ఓరుగల్లును కేంద్రంగా చేసుకొని అనేక ప్రజా ఉద్యమాలను కాళోజీ నిర్మించారు. ఆయన కాలేజీ రోజుల్లో వందేమాతర ఉద్యమానికి సంఘీభావంగా తోటి విద్యార్థులతో కలిసి ఉద్యమించాడు. ప్రజా సాంస్కృతిక ఉద్యమంగా గ్రంథాలయోద్యమం తెలంగాణలో ప్రారంభమైతే తాను ఒక కార్యకర్తగా ఆ ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. ఫ్యూడల్ శక్తులు పాలన చేస్తున్న కాలంలో ప్రజా హక్కులకు భంగం వాటిలినప్పుడు తాడిత, పీడిత ప్రజల పక్షాన నిలిచి పాలకులను ప్రశ్నించాడు. నిరంతరం ప్రజాక్షేత్రంలో నిలిచి ప్రజల పక్షం వహించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో కవిత్వం రాసి జన సామాన్యుడిని మేలుకొల్పాడు. కాళోజీ మాటలలో, చేతులలో, ఆలోచనలలో, ఆవేదనలలో, వేష భాషల్లో, ప్రవర్తనలో తెలంగాణ స్వరూపం సంపూర్ణంగా కనిపిస్తుంది. అందుకే దాశరథి కృష్ణమాచార్యులు ఆయన్ని ‘తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం’ అని అన్నాడు. సామాజిక గొడవను తన గొడవగా చేసుకుని ‘నా గొడవ’ పేరుతో అనేక కవితలు రాసి వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించాడు. మంచి ఎక్కడున్నా స్వాగతించాడు. అన్యాయం అణిచివేతలపై తిరగబడ్డాడు. ‘కాటేసి తీరాలె’ అనే కవిత ద్వారా రజాకార్లపై ఆయనకున్న కోపాన్ని, తెలంగాణ ప్రజలకు ఉన్న కసిని చూపించారు. తన కవితలకు 1992లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

తెలంగాణ యాస.. ఆయన శ్వాస!

తెలంగాణ రచయితల వేదిక ప్రథమ మహాసభలో కాళోజీ నారాయణరావు అధ్యక్షోపన్యాసం ఇస్తూ తెలంగాణ బతుకు, భాష గురించి ఇచ్చిన ఉపన్యాసం తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్రలో సువర్ణాధ్యాయం. ‘ఎవని వాడుక భాష వాడు రాయాలి. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా? అని ముందరనే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లే. ఈ బానిస భావన పోవాలె, తెలంగాణ బతుకు బాగుపడాలి’ అని ఆయన అన్న మాటలు తెలంగాణ భాష యాస పట్ల ఆయనకున్న ప్రగాఢ విశ్వాసాన్ని తెలియజేస్తాయి. కాళోజీ దృష్టిలో భాష రెండు తీర్లు. ఒకటి ‘బడి పలుకుల భాష’, రెండవది ‘పలుకుబడుల భాష’ బడి పలుకుల భాష అనేది పుస్తకాల్లో ఉండే భాష, పండితుల భాష. ఇది చిలుక పలుకుల భాష, వికాసానికి దోహదం చేయని భాష అని కాళోజీ విశ్వాసం. అందుకే ప్రజల నాలుకలపై నడయాడే సహజమైన స్వచ్ఛమైన పలుకుబడుల భాష కోసం ఆయన తపనపడ్డాడు. జానపద సాహిత్యమంతా పలుకుబడుల భాష కనుక దానిలోనే అసలైన జీవిత వాస్తవికత ఉందని కాళోజీ గాఢంగా విశ్వసించారు. అందుకే ప్రజలు కాళోజీని అభినవ వేమన, ప్రజాకవి కాళోజీ అని పిలుచుకున్నారు. కాళోజీ వాడిన భాష సార్వజనీయమైనది అందుకే ఐదు దశాబ్దాలుగా ఆయన రాసిన కవిత్వాన్ని ప్రజలు ఏ మినహాయింపులు లేకుండా, పరిమితులు లేకుండా ఆదరించారు.

తెలంగాణ ప్రజలు, విద్యార్థులు వివిధ సంస్థల్లో పనిచేసే వాళ్లు మాట్లాడుతున్న తెలంగాణ భాషా సొగసులు గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా తెలంగాణ భాషా పదాలు అంతరించిపోకుండా ఉండడం కోసం వివిధ ప్రాంతాల్లో వర్క్ షాపులు పెట్టి ఆయా భాష పదాలను సేకరించి గ్రంధాలుగా ముద్రించవలసిన బాధ్యతను తెలంగాణ అధికార భాష సంఘం, తెలంగాణ సాహిత్య అకాడమీ తీసుకోవాలి. సంఘటిత రంగంలో స్వయం ఉపాధి పొందుతున్న స్త్రీలు, చేలల్లో పనిచేసే రైతులు గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య జనాలు తెలంగాణ యాసలో మాట్లాడుతున్న మాటలను పరిరక్షించవలసిన బాధ్యతను స్వీకరించాలి. అప్పుడే కాళన్నకు నిజమైన నివాళులు అర్పించినవాళ్ళమవుతాం.

(రేపు కాళోజీ జయంతి, తెలుగు భాషా దినోత్సవం)

-అంకం నరేష్

96036 50799



Next Story

Most Viewed