గిరిజన వర్సిటీ జాప్యానికి కారకులెవరు!

by Disha edit |
గిరిజన వర్సిటీ జాప్యానికి కారకులెవరు!
X

తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని గిరిజనులు కట్టగట్టుకుని పోరాటం చేసి ఒక్కటై రాష్ట్రాన్ని సాధించుకున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఎన్నో హామీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగానే గిరిజన యూనివర్సిటీ సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో గిరిజనులు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని ఆశపడ్డారు. కానీ నేటికీ దశాబ్దం కావస్తున్నా గిరిజన యూనివర్సిటీ రాలేదు. యూనివర్సిటీ వస్తుందని కళ్ళు కాసేలా ఎదురుచూసిన గిరిజనులకు నిరాశే మిగిలింది. ఉన్నత విద్య, ఉద్యోగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని గిరిజన భాషలలో చదువు వస్తుందని గిరిజన సంస్కృతి సాంప్రదాయాలపైన పరిశోధన చేయొచ్చని గిరిజన సమాజం అభివృద్ధి దిశన వెళ్తుందని భావించారు. కానీ అది జరగలేదు.

పక్కదోవ పట్టించేందుకే.. సోయం

గిరిజన యూనివర్సిటీ వస్తే 16 రకాల డిపార్ట్మెంట్ ఏర్పడతాయని వేల సంఖ్యలలో విద్యార్థులు విద్యను అభ్యసించవచ్చని గిరిజనుల అభివృద్ధి తారస్థాయికి వెళ్ళిపోతుందని అందరూ భావించినట్లుగానే గిరిజనులు భావించారు. దేశంలో ఉన్న గిరిజన తెగలు, జాతులు ఇతర దేశాలకు వెళ్లకుండా స్థానికంగా విద్యను అభ్యసించవచ్చని, తద్వారా గిరిజన జీవితాల్లో మార్పు వస్తుందని భావించారు. విద్యలో ఇతర దేశాలతో పోటీపడవచ్చనీ అనుకున్నారు. 2014 రాష్ట్ర విభజన చట్టం గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు పైన నొక్కి చెప్పింది కానీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండాకు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు అనేక దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా పరిగణలోకి తీసుకోవడం లేదని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెబుతున్నారు. దీనిని పక్కదోవ పట్టించడానికి ఎంపీ సోయం బాబూరావు ద్వారా గిరిజన తెగల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. గోండు తెగ అభివృద్ధి కాకపోవడానికి లంబాడి తెగ కారణమంటూ విద్వేషాలను సృష్టించి దాడులకు పూనుకుంటున్నారు. తెగల వారిగా అభివృద్ధి చేయాలని నిబంధనలు ఉన్న దానిని పక్కకు పెట్టి దాడులు సృష్టించడం ఆనవాయితీగా మారింది. ఓట్ల రాజకీయం తప్ప తెగల అభివృద్ధి కోణం ఇందులో కనబడడం లేదు. గిరిజన తెగల మధ్య విద్వేషాలు సృష్టించడం బీజేపీకి పరిపాటిగా మారింది.

2014న గిరిజన యూనివర్సిటీ కోసం 420 కోట్లు కేటాయించినట్లు నివేదికలు చూపుతున్నాయి. కానీ ఆ నిధులు ఎటు మాయమైపోయాయో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా జాకారంలో తాత్కాలికంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసి క్లాసులు నిర్వహించుకోవాలని ప్రతిపాదనలు పంపినా అది నేటికీ నోచుకోలేదు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం 37 కోట్లు కేటాయించినట్లు పత్రికల్లో వార్తలు సైతం వచ్చాయి. 2019 గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లాకు ఇన్చార్జిగా ఉన్నారు. అధికారులు ములుగు ప్రాంతంలో 443 ఎకరాల భూమి ఉందని అనధికారికంగా చెప్పారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ఓ కింద సర్వే చేసి 335.04 భూమి ఉందని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. 2018న హెచ్ఆర్డిఓ ద్వారా భూములను కేటాయించింది. గిరిజన యూనివర్సిటీకి గిరిజనులు భూములు ఇచ్చినా, ఆ భూములను గిరిజనులు సాగు చేసుకోలేక, గిరిజన యూనివర్సిటీ రాక రైతులు నష్టపోతున్నారు.

ప్రతిపాదనలే రాలేదు..కానీ

2022 కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో గిరిజన యూనివర్సిటీ బిల్లు పెడుతుందని రాష్ట్రమంతా ఎదురుచూసింది. ఆ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటువంటి ప్రతిపాదనలు ఏమి రాలేదని పార్లమెంటు సాక్షిగా చెప్పారు. కానీ 2019లోనే కేంద్ర ప్రభుత్వం 15 కోట్లు కేటాయించింది. 2020లో నాలుగు కోట్లు తర్వాత మూడు కోట్లు, ఒక కోటి రూపాయలు కేటాయిస్తూ బడ్జెట్‌లు చూపెట్టింది. దీనిని బట్టి ఏం అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. ఇది ఇలా ఉండగా బీజేపీ ప్రభుత్వం ఖమ్మంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామనడం గిరిజనులను మోసం చేయడం తప్ప మరొకటి కాదని స్పష్టమవుతుంది. ఈ యూనివర్సిటీ కోసం గిరిజన సంఘాలు ఆందోళనలు, పోరాటాలు చేస్తున్నారు. వినతులు ఇచ్చినా ఫలితం లేకుండా లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన యూనివర్సిటీ 2019న ఏర్పాటు చేసుకున్నారు. 15 డిపార్ట్మెంట్‌లతో ఫ్యాకల్టీతో వందల విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీ మంజూరు కాకపోవడంతో దశాబ్ద కాలంగా ఉన్నత చదువులు చదవలేక గిరిజన యువకులు నష్టపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం స్వయానా ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి అడవిని అభివృద్ధి చేసే దిశలో ప్రయత్నిస్తున్నది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసి గిరిజన బిడ్డలకు ఉన్నత చదువులు చదివే అవకాశం కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి. అవసరమైన ఉన్నత విద్య కోసం డిపార్ట్మెంట్‌లు, ఫ్యాకల్టీలతో పాటు గిరిజనులపై ప్రత్యేకంగా పీహెచ్‌డి కోర్సులు అందుబాటులో తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిధులు కేటాయించి గిరిజన యూనివర్సిటీ తక్షణమే ఏర్పాటు చేయాలి.

మూడ్ ధర్మ నాయక్

రాష్ట్ర అధ్యక్షులు గిరిజన సంఘం

94900 98685



Next Story

Most Viewed