మహిళా బిల్లుపై ఓట్ బ్యాంక్ పాలిటిక్స్..

by Viswanth |
మహిళా బిల్లుపై ఓట్ బ్యాంక్ పాలిటిక్స్..
X

నారీ శక్తి, ప్రకృతికి ప్రతిరూపం, ఆకాశంలో సగం.. మన పొలిటీషియన్స్ నుంచి ఇలాంటి డైలాగుల్ని తరచూ వింటూ ఉంటాం. ఒకవైపు జనాభాలో సగం అని చెబుతూనే రిజర్వేషన్ విషయంలో మాత్రం వారిని 33 శాతానికే పరిమితం చేశారు. దాదాపు ఒకటిన్నర దశాబ్దం తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు మళ్లీ పార్లమెంటుకు చేరింది. నిజానికి స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ ఖరారు చేసే టైమ్‌లోనే ఇది కూడా రావాల్సి ఉన్నది. నాలుగైదేండ్లు ఆలస్యమై దేవెగౌడ హయాంలో తొలి అడుగు పడినా ఇప్పటికీ ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది.

తాజాగా మరోసారి లోక్‌సభ ముందుకొచ్చింది. వెంటనే అమల్లోకి వస్తుందేమోననే అభిప్రాయం ఏర్పడింది. కానీ దానికి జన గణన, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ లంకె పెట్టడంతో అది ఇప్పట్లో అయ్యే పని కాదని తేలిపోయింది. ఇంకో ఐదేళ్ళో, పదేళ్ళో ఆగక తప్పదు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధే ఉంటే తక్షణం అమల్లోకి తెచ్చేలా ఆలోచించి ఉండొచ్చు. కానీ జనాభా లెక్కలంటూ నాన్చివేత ధోరణికి తెర లేపింది. ఒకవైపు జనాభాలో సగం అని చెప్తూనే మళ్ళీ ఆ లెక్కలకు లింకు పెట్టడం పార్టీలకే మింగుడుపడలేదు. మహిళా బిల్లుపై నిజాయితీ ఏపాటిదో స్పష్టమవుతున్నది.

కాలయాపన చేయడానికే..

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పొలిటికల్ మైలేజ్ కోసమే ఈ తపనంతా. ఇప్పుడున్న లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే మహిళలకు 33% రిజర్వు చేయడానికి వచ్చే ఇబ్బందేమీ లేకున్నా డీలిమిటేషన్‌కు జోడించింది. కాలయాపన చేయడానికే ఈ ప్రయత్నం. కొత్త నియోజకవర్గాలు వచ్చిన తర్వాతే అనే షరతు పెట్టడమంటేనే ఇప్పుడున్న స్థానాల్లో వారికి అవకాశం కల్పించడానికి మనసు రాలేదనేది నిర్వివాదాంశం. ఆర్థికంగా, సామాజికంగా అవకాశాలు కల్పించాలని చెప్పే పార్టీలు రాజకీయంగా పరిమితుల్లోకి నెడుతున్నాయి.

మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అభిప్రాయమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కూ ఉన్నది. అందువల్లనే తెలంగాణ ఏర్పడిన రెండు వారాల్లోనే అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానంలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను 33% మేర పెంచి వాటిని మహిళలకు ఇవ్వాలని ప్రతిపాదించారు. పరోక్షంగా ఇప్పుడున్న సీట్లలో ఇవ్వడం కుదరదనే క్లారిటీ ఇచ్చారు. మహిళలకు రాజకీయంగా అవకాశాలు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటూనే సీట్ల సంఖ్యను పెంచితేనే అనే షరతు పెట్టారు. మోడీ సైతం జనగణన, డీలిమిటేషన్ రూపంలో ఈ బిల్లు అమలుకు ఆంక్షలు పెట్టారు.

మహిళలకు ఎరగా.. బిల్లు

గతంలో మన్మోహన్ సింగ్ హయాంలో వచ్చిన బిల్లుతో పోలిస్తే ఇప్పుడు మోడీ ప్రభుత్వం పెట్టినదాంట్లో కొత్తదనమేమీ లేదు. అప్పుడూ 33% కోటానే ఉన్నది. ఇప్పుడూ అదే కంటిన్యూ అవుతున్నది. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్న బీజేపీ వాటివాటి మేనిఫెస్టోల్లోనూ మహిళా రిజర్వేషన్ మీద వాగ్ధానాలు చేశాయి. దాదాపు తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఇంతకాలం తాత్సారం చేసింది. ఇప్పుడు సరిగ్గా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హడావిడి చేస్తున్నది. పొలిటికల్ మైలేజ్ పొందాలనుకుంటున్నది.

మహిళా ఓటు బ్యాంకును ఆకర్షించడం మీదనే పార్టీల దృష్టంతా. బిల్లు పేరుతో వారికి ఎర వేస్తున్నది. నిజంగా మహిళలకు పొలిటికల్‌గా అవకాశాలు ఇవ్వాలనే అభిప్రాయమే ఉంటే చట్టంతో సంబంధం లేకుండానే టికెట్లు ఇవ్వొచ్చు. కానీ ఏ పార్టీకి మనసొప్పదు. అందుకే అటు మోడీగానీ, ఇటు కేసీఆర్‌గానీ కొత్తగా పెంచే అసెంబ్లీ సీట్లనే వారికి ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నారు. జన గణన, డీలిమిటేషన్‌కు ఎంత టైమ్ పడుతుందో మోడీకి తెలియందేమీ కాదు. కానీ రిజర్వేషన్ ఇస్తున్నట్లు హైప్ క్రియేట్ చేసి పడిపోతున్న గ్రాఫ్‌ను స్టేబుల్ చేసుకోవడమే ఈ బిల్లు వెనకున్న ఉద్దేశం.

ఈ బిల్లుకి ఏకాభిప్రాయం ఉండదా?

మహిళలను రాజకీయంగా ఎదిగించాలన్నదే కేసీఆర్ భావన అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తగిన ప్రాధాన్యత ఇచ్చి ఉండేవారు. మొదటిసారి ఎన్నికల్లో నలుగురికి, 2018లో ఆరుగురికి, ఇప్పుడు ఏడుగురికి మాత్రమే టికెట్లు ఇచ్చారు. తొలి టర్ములో మంత్రివర్గంలో మహిళకు చోటే లేదు. పార్లమెంటు ఎన్నికల్లో సైతం తొలిసారి కూతురు కవితకు అవకాశం ఇచ్చారు. రెండోసారి మరో కవితకు ఛాన్స్ ఇచ్చారు. మొత్తం 17 స్థానాల్లో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇచ్చారు. మహిళా సాధికారత అంటూనే వారికి ఆ అంశంలో ఏ మేరకు చిత్తశుద్ధి ఉన్నదో వారి ఆచరణనే నిదర్శనం.

గతంలో పార్లమెంటులో మహిళా బిల్లు వచ్చినప్పుడు ‘కోటాలో కోటా’, ఓబీసీ కోటా.. అంటూ అనేక పార్టీలు సవరణలను ప్రతిపాదించాయి. వాటిని చేర్చకుంటే మద్దతు ఇవ్వబోమన్న షరతు పెట్టాయి. తాజాగా మజ్లిస్ నేత అసదుద్దీన్ సైతం మైనారిటీ కోటా ఉండాలన్న ప్రతిపాదన చేశారు. జీఎస్టీ లాంటి కొత్త సంస్కరణల విషయంలో అన్ని పార్టీలతో చర్చించి ఏకాభిప్రాయాన్ని సాధించిన కసరత్తు మహిళా బిల్లు విషయంలో ఆ పార్టీల్లో కనిపించదు. అన్ని పార్టీల వైఖరీ ఒకటే. ఎంత రాజకీయ లబ్ది కలుగుతుందన్నదే వాటి ఆలోచన. మహిళా రిజర్వేషన్ అలాంటి అస్త్రాల్లో ఒకటి.

వివక్ష వద్దంటూనే కొత్త వివక్ష

మహిళల ఓట్లపై ఉన్న శ్రద్ధ వారికి టికెట్ ఇచ్చి చట్టసభలకు పంపడం మీద ఉండదు. మహిళా బిల్లును కేవలం లోక్‌సభ, అసెంబ్లీలకు మాత్రమే బీజేపీ పరిమితం చేసింది. ప్రజలు నేరుగా ఎన్నుకునే సభలకే వర్తించేలా బిల్లును రూపొందించింది. ఒకవైపు మహిళల పట్ల వివక్ష ఉండొద్దని చెప్తూనే రాజ్యసభ, శాసనమండలి విషయంలో భిన్నంగా వ్యవహరించింది. చట్టసభలు అన్నీ సమానమే అయినా, దేని ప్రాధాన్యత దానికున్నా అవకాశాలివ్వడంలో మాత్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. పెద్దల సభ అని పిలుస్తూనే ప్రాతినిధ్యం కల్పించడానికి నో అంటున్నాయి.

మహిళా బిల్లు క్రెడిట్ మాదంటే మాది.. అనే చర్చ మొదలైంది. మహిళా రిజర్వేషన్ కోసం ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర దీక్ష చేసినందువల్లనే పలు పార్టీల్లో కదలిక వచ్చిందనే వాదన తెరమీదకు వచ్చింది. ప్రధాని మోడీతో సహా ఇటీవల 47 పార్టీలకు లేఖలు రాసినందువల్లనే కేంద్రంపై ఒత్తిడి పెరిగిందని గులాబీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. మా వల్లనే సాధ్యమైందని చెప్పుకోవడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటు బ్యాంకును ఆకర్షించాలన్నది బీఆర్ఎస్ నేతల ఆలోచన. లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓట్ల ద్వారా లబ్ధి పొందాలన్నది బీజేపీ ప్లాన్.

మరోవైపు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు ఉంటుందని కేంద్రం నుంచి సంకేతాలు వచ్చినందువల్లనే కేసీఆర్ అకస్మాత్తుగా ప్రధానికి లేఖ రాశారన్న అనుమానాలూ లేకపోలేదు. గతంలో వ్యవసాయ చట్టాల విషయంలోనూ ఉపసంహరించుకోవాలని మోడీ భావిస్తున్న తరుణంలోనే కేసీఆర్ హడావిడిగా ధర్నా చౌక్‌లో దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ పెట్టారు. రైతుల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత తారస్థాయి చేరుకోవడంతో ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని భావించింది. ఆ విషయం ముందుగానే కేసీఆర్‌కు చేరడంతో డెడ్‌లైన్ పేరుతో కథ నడిచింది.

బీజేపీ, బీఆర్ఎస్ దొందూ దొందే!

ఇప్పుడు మహిళా బిల్లు విషయంలోనూ అదే రిపీట్ అయింది. బీజేపీ, బీఆర్ఎస్ పైకి కొట్టుకుంటున్నట్లు కనిపిస్తున్నా అవి రెండూ ఫ్రెండ్లీ పార్టీలనే అభిప్రాయం ప్రజల్లో బలంగానే ఉన్నది. ఆ సత్సంబంధాల కారణంగానే అక్కడా ఇక్కడా ఆ రెండు పార్టీలు ప్రయోజనం పొందేలా అప్పుడు సాగు చట్టాలు.. ఇప్పుడు మహిళా బిల్లు విషయంలో పకడ్బందీగా వ్యవహరించాయన్న వాదన సరేసరి. మహిళా రిజర్వేషన్ పట్ల చిత్తశుద్ధి ఉన్నది నిజమే అయితే ఇప్పుడు అలా చెప్పుకునే పార్టీలు జన గణన, డీలిమిటేషన్ షరతుల్లేకుండా కేంద్రంపై ఒత్తిడి పెంచాలి.

కవిత చేసిన దీక్షలు, రాసిన లేఖల వల్లనే రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు పార్లమెంటు ముందుకు వచ్చిందనేది నిజమైతే అది తక్షణం అమల్లోకి వచ్చేలా అన్ని పార్టీలకు ఆమె మరోసారి లేఖలు రాసి సహకారాన్ని కోరడం తక్షణావసరం. ఎప్పుడో పదేండ్ల తర్వాత సాకారమయ్యేదాన్ని రాబోయే ఎన్నికలకే వర్తించేలా కేంద్రం మెడలు వంచాలి. షరతుల ఎత్తివేత కోసం అవసరమైతే మరో దీక్షతో బీజేపీలో చలనం తీసుకురావాలి. చట్టసభల్లో మహిళలకు 33% టికెట్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోనే మొదలు కావాలి. పార్లమెంటు ఎన్నిలకు నాందిగా నిలవాలి.

మహిళా ఓటు బ్యాంకును పొందడమే కాదు.. వారికి రాజకీయ అధికారాన్ని కట్టబెట్టేలా అవకాశాలూ ఉండాలి. ఈ బిల్లు ఆమోదం పొందేలా అన్ని పార్టీలూ సహకరించాలి. చట్టం ఉంటేనే అవకాశాలు ఇస్తామనే ధోరణి నుంచి పార్టీలు బైటపడాలి. ఆ చట్టాన్ని డిమాండ్ చేయడానికి ముందే చిత్తశుద్ధిని నిరూపించుకోవడం ఆదర్శనీయం. గృహలక్ష్మి, గృహజ్యోతి, మహాలక్ష్మి అని స్కీమ్‌లకు పేర్లు పెట్టడమే కాదు.. అలాంటి మరెన్నో పథకాలకు, సంక్షేమానికి నాంది పలికేలా మహిళలను పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఎదిగించడంపై దృష్టి పెట్టాలి.

ఎన్. విశ్వనాథ్

99714 82403

Next Story

Most Viewed