కరుణ చూపండి.. క్రమబద్ధీకరించండి

by Disha edit |
కరుణ చూపండి.. క్రమబద్ధీకరించండి
X

ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి ఉన్నత స్థానంలో నిలవాలనుకొని, వచ్చిన ప్రభుత్వ ఉద్యోగ అవకాశం వదలకూడదని గ్రామ కార్యదర్శి ఉద్యోగంలో చేరారు. అయితే, వారిపై ఎంతో పనిభారం పెరిగినా భరిస్తూ ఉద్యోగం చేస్తున్న కార్యదర్శులు తమ ఉద్యోగం క్రమబద్ధీకరణ జరగకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నూతన పంచాయత్ యాక్ట్ తీసుకొచ్చి, గ్రామ పంచాయతీలను ఏర్పాటుచేసి రాష్ట్ర ప్రభుత్వం 2018 లో 9,355 పంచాయతీ కార్యదర్శులను నియమించింది. వీరిని మూడేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌తో 15 వేల వేతనం ఇస్తూ పనితీరు ఆధారంగా క్రమబద్ధీకరణ చేస్తామంటూ షరతులు విధించింది. అయితే వీరి నియామకం జరిగి నాలుగేళ్లు కావొస్తున్న, తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్ యాక్ట్‌కు విరుద్ధంగా జీఓ నెం 26 ద్వారా ప్రొబేషనరీ పిరియడ్‌ను మరో ఏడాది పెంచింది.

నోటిఫికేషన్ ప్రకారం, మూడేళ్ల తర్వాత గ్రేడ్-4 ఉద్యోగులుగా గుర్తించాలి. కానీ నాలుగేళ్లు పూర్తి కావొస్తున్నా వీరిని క్రమబద్ధీకరించకపోవడంతో వారు కోర్టుని ఆశ్రయించారు. వీరి ఉద్యోగం క్రమబద్ధీకరించపోగా, ఉద్యోగంలో మితిమీరిన ఒత్తిడులు పెరగడంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. గ్రామపంచాయతీ పరిధిలో 50 రకాల విధులను నిర్వహిస్తున్నారు. రోజుకు 10 నుంచి 12 గంటలపాటు వెట్టి చాకిరి చేస్తున్నారు. ఇంత చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామ కార్యదర్శుల క్రమబద్దీకరణ‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఇప్పటికే స్థానిక రాజకీయాల నాయకుల వేధింపులతో రాష్ట్రంలో దాదాపు 1500 మంది ఉద్యోగాలు వదిలేశారు. ఇతర అనారోగ్య సమస్యలతో 40 మంది వరకు మృతి చెందారు. గత పీఆర్సీలో భాగంగా 30 శాతం జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం తమపై కరుణ చూపించి సెర్ప్ ఉద్యోగులలాగే తమనూ రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు.

అంకం నరేష్

6301650324



Next Story

Most Viewed