ఓయూకి పునర్ వైభవం రావాలి.

by Disha edit |
ఓయూకి పునర్ వైభవం రావాలి.
X

ఆరు దశాబ్దాలు తెలంగాణ ఉద్యమానికి ఆయువుగా నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం.. స్వరాష్ట్రంలో ఉనికి కోసం అల్లాడుతోంది. తన ఒడికి చేరిన బిడ్డలు భవిష్యత్తు కానరాక ఆవేదన చెందుతోంటే నిస్సహాయురాలై తల్లడిల్లుతోంది. ప్రొఫెసర్లు లేక, విద్యార్థులు రాక ఖాళీగా కనిపిస్తున్న తరగతి గదులని చూసి కన్నీళ్లుపెడుతోంది.

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్నో ప్రజాస్వామ్య పోరాటాలకు పురుడు పోసి, మరెన్నో విప్లవోద్యమాలకు నాయకత్వం వహించిన పోరు గడ్డ. పదేళ్ళుగా ఈ వర్సిటీ నిస్సారంగా ఉసూరుమంటోంటే సగటు తెలంగాణవాది మనసు కూడా చివుక్కుమన్నది. సొంత రాష్ట్రంలోనూ జవసత్వాలు నింపుకోలేని దీనస్థితిని చూసి బాధపడుతూ వచ్చింది. సమైక్య పాలనను మించిన ఆంక్షల మధ్య చదువులు సాగుతోంటే.. మళ్ళీ తానే మరో సమరభేరీ మోగించింది ఉస్మానియా. నియంత పాలనను అంతముందించేందుకు తన బిడ్డలనే సారథులుగా ముందుంచింది.. పదేళ్ల తర్వాత ఇప్పుడు ఉస్మానియా తిరిగి స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటోంది. అయితే ఇప్పుడు కావాల్సింది కేవలం స్వేచ్ఛ మాత్రమే కాదు వర్సిటీకీ పునర్ వైభవం.. తన బిడ్డలకు బంగారు భవిష్యత్తును ఇచ్చే బలం.

ఉస్మానియా అంటే అందరికీ గుర్తొచ్చేది ఆర్ట్స్ కాలేజ్... ఉద్యమ సమయంలో ఏ నిరసన, ఏ సభ నిర్వహించాలన్నా వేదిక ఇదే. ఉద్యమ సమయంలో ఎలాగైతే ముళ్లకంచెలతో ఆర్ట్స్ కాలేజ్ సరిహద్దు ప్రాంతాన్ని తలపించిందో.. స్వరాష్ట్రం ఏర్పడ్డాక కూడా అదే తరహాలో కనిపించింది. సభ పెట్టుకోవాలన్నా, నిరసన తెలపాలన్నా అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి.. ఇదే ఉస్మానియా నీడలో ఎదిగిన ఇద్దరు విద్యార్థి నాయకులు ఎమ్మెల్యేలుగా అయినా, ఎన్నడూ వర్సిటీ వెతల గురించి చట్టసభల్లో ప్రస్తావించలేదు..తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు, పాలకులకు గులాంగిరి చేయడం తప్పితే ఏనాడూ ఉస్మానియా దీనస్థితిపై ప్రభుత్వాన్ని ఎప్పుడూ ప్రశ్నించలేదు.

విద్యావ్యవస్థ కుంటుపడటంతో..

తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తుందని నమ్మి ఏ ప్రయోజనం ఆశించకుండా ఉద్యమంలో విస్తృతంగా పాల్గొన్నారు విద్యార్థులు. ఉద్యమ సారథి అని నమ్మి అధికారాన్ని కట్టబెడితే... విద్యా వ్యవస్థను కేసీఆర్ సర్కార్ పూర్తిగా విస్మరించింది. నియామకాలను భర్తీ చేయడంపై మీనమేషాలు లెక్కించింది. వరుస పేపర్ లీకులతో మురళి, సునీల్ , ప్రవళిక లాంటి ఎంతోమంది నిరుద్యోగులను పొట్టనపెట్టుకున్నది. ఆ ఆగ్రహమే, ఆ ఆవేదననే నేటి పాలకులు చెబుతున్న మార్పునకు కారణమైంది. ప్రభుత్వం మారడంతో విద్యార్థులకు ఏదైనా న్యాయం జరుగుతుందని..ఇది అడియాశ చేయకుండా రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఓయూకు పునర్ వైభవం తీసుకురావాలి.

ఓయూలో చదివే విద్యార్థులంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే. ఇక్కడికి గ్రామీణ ప్రాంతాల వారే ఉన్నత చదువుల కోసం వస్తారు. కానీ ఓయూలో విద్యా వ్యవస్థ అంత కుంటుపడింది. మూడు, నాలుగు డిపార్ట్మెంట్ తప్పితే ఏ డిపార్ట్ మెంట్లలోనూ రెగ్యులర్ ప్రొఫెసర్లు లేరు. ఉన్నవారిలోనూ కాంట్రాక్ట్, పార్ట్ టైం వాళ్లే ఎక్కువ. 1200 మంది ప్రొఫెసర్లు ఉండాల్సిన ఓయూలో 300 మంది మాత్రమే ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీంతో భవిష్యత్తుపై ఆశ సన్నగిల్లి చిన్నాచితక ఉద్యోగాలకు, జొమాటో, స్విగ్గిలో డెలివరీ బాయ్స్‌గా మారుతున్నారు. ఇంకొందరు కోచింగ్ సెంటర్ల వెంట పరుగులు తీస్తున్నారు. ఇలాంటి దుస్థితి ఓయూలో మునుపెన్నడు కనిపించలేదు. పదేళ్లు పాలకులు ఓయూను విస్మరించడమే నేటి వారి దైన్య స్థితికి కారణం. అందుకే ఈ కొత్త ప్రభుత్వమైనా ఓయూపై ప్రత్యేక దృష్టి సారించాలి. పునర్ వైభవం తీసుకురావాలి.

పగిళ్ల ప్రశాంత్,

ఓయూ విద్యార్ధి,

95812 62429

Next Story

Most Viewed