డబ్బుకు సీటు దాసోహం కారాదు

by Disha edit |
డబ్బుకు సీటు దాసోహం కారాదు
X

దేశ ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న మంత్రి నిర్మలా సీతారామన్ తాను డబ్బు లేకపోవడం వల్ల ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ ప్రకటించడం జరిగింది.' ఊరుకోండి మేడం,మీ దగ్గర డబ్బు లేకపోవడమేమిట'ని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా, దేశం సొమ్ము నా వ్యక్తిగతం కాదు కదా అని కరెక్ట్ గానే స్పందించారు. నిజమే కదా! కానీ ఒక జాతీయ స్థాయిలో ప్రముఖమైన వ్యక్తి ఒక ఎన్నికలో నిలబడడానికి కూడా జంకే పరిస్థితి ఉండడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అయితే అది పాక్షిక సత్యమే. స్వంత పార్టీ తలిస్తే ఆమె అభ్యర్థి కావడం ఏమంత కష్టం కాదు కదా. ఆ పార్టీ కి నిధుల లేమి బాధ లేదు కదా! అలా తలవక పోవడానికి వేరే కారణాలు ఉండొచ్చు కానీ డబ్బు మాత్రం ఏకైక కారణం అంటే నమ్మశక్యం కాదు.

నేనింతవరకూ మూడుసార్లు ఎన్నికల బరిలో ఉన్నాను. మొదటిసారి తెలుగుదేశం 1999లో తటస్థ వ్యక్తుల్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ టికెట్‌లు కేటాయించినప్పుడు నా దగ్గర డబ్బులేని సంగతి ఆటంకం కాలేదు. పార్టీ ఎన్నికల ఖర్చు భరించింది. గెలిచాను. 2004లో మళ్లీ నాకు అవకాశం ఇచ్చింది. స్వల్ప తేడాతో ఓడిపోయాను. అప్పుడు కూడా నా స్థాయికి మించిన ఖర్చు నా నుండి ఎవరూ ఆశించలేదు. మళ్లీ 2009లో ఎన్నికల వేళ మిత్రులు చెప్తుండేవారు 'డబ్బులు లేవని అనకు. రాజకీయాల్లో అలా అనకూడదు. టికెట్ ఇవ్వరు. బాగా ఉన్నాయని చెప్పాలి' అంటూ. నేను ఒప్పుకోలేదు ' అలాంటి అబద్ధాలు అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి సిగ్గెందుకు' అంటూ.

చివరి క్షణంలో టికెట్ రాలే...

అయితే పార్టీతో అలాంటి సంభాషణ అవసరమే పడలేదు. ఇద్దామనుకున్నా అరకు పార్లమెంట్ సీటు మిత్ర పక్షానికి కేటాయించింది టీడీపీ. నాకు సాలూరు అసెంబ్లీ సీటు ప్రకటించారు. పైనుండి క్రిందివరకు ఎక్కడా డబ్బుల ప్రస్తావన రాలేదు. ఇంతలో మళ్లీ నా బీ ఫామ్ మార్చి వేరే అభ్యర్థికి ఇచ్చారు. అలా ఎందుకు చేశారో, అంత బలమైన కారణం ఏమిటో తెలియదు. అయితే అందుకు నా దగ్గర డబ్బు లేకపోవడమే కారణం కావొచ్చని ఊహిస్తూ ఆ నియోజకవర్గంలో అన్ని మండలాల నాయకులు అధిష్టానానికి టెలిగ్రామ్‌లు పంపారు.. 'మాకు పార్టీ పైసా ఇవ్వొద్దు. అభ్యర్థి తరపున ప్రచారం తదితర ఖర్చులు మేమే భరిస్తాం. అవసరమైతే తిరిగి మేమే ఇస్తాం 'అంటూ. ఒకరిద్దరు' ఎన్నికల ఖర్చుని చూసి వెనుకాడవద్దు. మాది పూచీ' అని కూడా అన్నారు.(అయితే నేను మంచి మిత్రులు అనుకున్నవారంతా మొహం చాటేశారు. కనీసం నైతిక మద్దతు కూడా ప్రకటించకుండా). పార్టీ నిర్ణయానికి ఎదురెళ్ళడం ఇష్టం లేక వద్దన్నాను.

టికెట్ల కేటాయింపులో బోలెడు లెక్కలు

ఇక 2014 ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడినందున టీడీపీకి రాజీనామా చేసి నా ఉద్యోగం నేను చేసుకున్నాను. 2019లో ఆఖరు నిమిషంలో సీపీఐ అధినేత నన్ను పాలకొండ నుండి పోటీ చేస్తారా అని అడిగారు. ఐదు పార్టీలు కలిసి ఒక సామాజిక మార్పు దిశగా పోటీ చెయ్యడమన్న కాన్సెప్ట్ నచ్చింది. సరే అన్నాను. వారు కూడా ప్రచారం తదితర ఖర్చులు మేమే చూసుకుంటామని, ఇబ్బంది పడవొద్దని చెప్పారు. నేను ప్రధాన పార్టీల నుండి పోటీ చేస్తానని భావించి దగ్గరైన కొందరు మిత్రులు, అలా కాకపోయే సరికి జంప్ అయ్యారు. నా క్లాస్ మేట్ డాక్టర్లలో ఒక పది మంది వరకూ ఉడుతాసాయం చేశారు. రాజమండ్రిలో ఒక చిన్న పత్రిక ప్రజా పత్రిక కొన్ని కరపత్రాలు ఉచితంగా వేసింది. ఏమీ ఆశించకుండా ఎంతోమంది ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఏ ఊరు వెళ్ళినా అందరూ ఆదరించారు. అయితే ఓట్లు వెయ్యలేదు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే టికెట్ కేటాయింపులో ఎన్నో లెక్కలు పనిచేస్తాయి. అధిష్టానం డబ్బు ఒక్కటే ముఖ్యమని అనుకోదు. ఇవ్వకూడదనుకుంటే అది ఒక సాకుగా చూపుతుందేమో గానీ. అలాగే కేడర్ కూడా డబ్బు లేకపోతే కదిలేది లేదు అనరు. నమ్మితే తామే కష్టపడతారు.

కేంద్ర మంత్రి జంకితే ఎలా?

ఇదంతా ఒక కోణం. ఇంకో కోణం ఏమిటంటే ఎన్నికల్లో డబ్బు ప్రాధాన్యత విపరీతంగా పెరిగిపోవడం. డబ్బు విషయం పట్టించుకోకుండా ఎంతమందిని ప్రధాన పార్టీలైనా నిలపగలవు. అక్కడక్కడా ప్రయోగాలు చేయగలవు గానీ మెజారిటీ సీట్లలో కుదరదు కదా! ఎదుటి పార్టీ విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నప్పుడు, ఎంతోకొంత చెయ్యక పోతే ఓటమి తప్పదు కదా! ఇలా పార్టీలన్నీ ఒక విషవలయంలో చిక్కుకున్నాయి. ఆ వలయాన్ని దాటి రావడం అంటే గెలుపు సంగతి మర్చిపోవడమే అన్నట్టు తయారైంది. ఇక నిధులు లేని పార్టీలు, ఇండిపెండెట్‌లు గోదాలో ఉండడమే గగనంగా మారుతోంది. ఈ పరిస్థితి మారనంత వరకూ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నట్టే. డబ్బు ప్రమేయం లేని ఎన్నికల వ్యవస్థ సాధించే దిశగా దేశం ఆలోచించాలి. ఎన్నికల్లో గెలవడం సంగతి పక్కన పెడితే, నిలవడానికి దేశ ఆర్థిక మంత్రి జంకాల్సి రావడం శుభసూచకం కాదు.

డా.డి.వి.జి. శంకరరావు

మాజీ ఎంపీ.

94408 36931



Next Story

Most Viewed