బీఆర్ఎస్ పాలనలో.. ప్రజాధనం దుర్వినియోగం!

by Disha edit |
బీఆర్ఎస్ పాలనలో.. ప్రజాధనం దుర్వినియోగం!
X

తెలంగాణ రాష్ట్రం 301 కోట్ల మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రం. కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అప్పు 4.33 లక్షల కోట్ల రూపాయలు. ఈ అప్పుల భారంతో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేక ప్రభుత్వ భూములను వేలం వేస్తున్నారు. కోకాపేట భూముల అమ్మకం రాష్ట్ర సర్కారుకి ఖజానా తెచ్చిందని తాటాకు అక్షరాలతో గప్పాలు కొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, జంట నగరాలకు తాగునీరు ఇచ్చే జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను కాలుష్యం బారిన పడకుండా ఆపగలుగుతుందా? పూర్వకాలంలో దాదాపు 7వేల చెరువులు ఉండిన హైదరాబాద్‌లో ప్రస్తుతం కేవలం 169 చెరువులు ఉన్నాయి. చెరువుల ఆక్రమణను ఆపుతుందా? ఎఫ్.టి.ఎల్, బఫర్ జోన్లలో తాపీగా భవనాలు నిర్మిస్తున్నారు. ఇదంతా పాలకులకు అవగతమే. అయినప్పటికీ పట్టించుకోరు. పైగా గత 27 సంవత్సరాలుగా జంట జలాశయాలకు రక్షణ కవచంలా నిలిచిన జీవో నెంబర్ 111ని ఉన్నఫళంగా ఎత్తివేసి భవిష్యత్తు తరాలకు మరో మూసీ నది, హుస్సేన్ సాగర్ లాంటి మురికి జలాలను నగర ప్రజలకు అందించబోతుందా?

దోచుకోవడమే లక్ష్యంగా..

కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి గుదిబండలా మారింది. బహుళార్థక సాధక ప్రాజెక్టు అంటే, అతి తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడుకొని అతి ఎక్కువ ప్రయోజనాలను చేకూర్చేవై ఉండాలి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అతి ఎక్కువ పెట్టుబడి తో పాటు, నిర్వహణ ఖర్చు కూడా అధికమే... అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా అతి తక్కువ బడ్జెట్‌తో, అతి తక్కువ నిర్వహణ ఖర్చుతో నీటిని తరలించే ప్రాజెక్టును మార్చి తెలంగాణ ప్రజల ధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ ఒక చీఫ్ ఇంజనీరుగా మారి రీడిజైన్ చేశాడు. తద్వారా 38,500 కోట్లతో పూర్తయి, 12 లక్షల ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్టుగా కాకుండా, 1.21 లక్షల కోట్లతో కాళేశ్వరం నిర్మించి 18 లక్షల 25 వేల ఎకరాలకు నీరు అందుతుందని ప్రగల్భాలు పలుకుతున్నారు. అంటే అదనంగా 6 లక్షల ఎకరాల కొరకై, 82 వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయడమేగాక, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టారు. దీనికి తోడు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కరెంట్ బిల్లు తడిసి మోపెడవుతుంది. మొదటి నెల కరెంట్ బిల్లు 11.57 కోట్ల రూపాయలు అంటే ఒక ఎకరానికి నీళ్లు అందించడానికి ప్రభుత్వం లక్ష రూపాయలు కరెంట్ బిల్లు కడుతుందన్నట్లు. ఇప్పటికీ విద్యుత్ రంగ సంస్థలకు 3114 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడింది.

పెరిగిన కరెంట్ చార్జీలు..

ఈ ప్రాజెక్టు ప్రతి ఏటా 400 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తుందని గొప్పలు చెప్పారు, కానీ మొత్తంగా 20 లిఫ్టులు ఉంటే 8 పంపులతో గత 3 సంవత్సరాలలో ఎత్తి పోసింది కేవలం 140 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోసిన నీళ్లను వర్షాలతో ప్రాజెక్టులు నిండటం వల్ల మళ్లీ కిందకి వదిలారు.‌‌.. అంటే ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం పొందినది అంతంత మాత్రమే.... అంతేకాకుండా గత సంవత్సరం వరదల కారణంగా పంపు హౌస్‌లు మునిగి చెడిపోయాయి. వీటి రిపేర్లకు రూ. 1250 కోట్లు ప్రజాధనం వృధా అయ్యింది. మళ్లీ భవిష్యత్తులో కూడా వరదల కారణంగా పంపు హౌస్లు పాడవవని హామీ లేదు. ఇది పక్కన పెడితే బీహెచ్ఈఎల్ 1687 కోట్ల రూపాయలకు మోటార్లను 7349 కోట్లు పెట్టినట్లుగా లెక్క చూపి దాదాపు 5662 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. అవే నిధులు రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులకు కేటాయించి ఉంటే పాలమూరు సహా అనేక ఇతర ప్రాజెక్టులు పూర్తి అయి దక్షిణ తెలంగాణ ప్రజలకు వాటి ఫలాలు అందేవి. కాళేశ్వరం కోసం ఏటా 5 వేల కోట్ల రూపాయల కరెంట్ అవసరం పడుతుందని సీఎం తెలిపారు అంటే ఇతర రాష్ట్రాల నుండి ప్రైవేట్ సంస్థల నుండి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్ర ప్రజల గృహ అవసరాలకు వాడే విద్యుత్ పైన యూజర్ చార్జీలు, సర్ చార్జీల పేరిట అదనపు భారం వేస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి కరెంటు బిల్లు దాదాపు రెట్టింపు అవ్వడం మనమంతా గమనించాం..

వారి ఓట్లు కొల్లగొట్టాలని..

రాష్ట్రంలో తాజా లెక్కల ప్రకారం దాదాపు 35 లక్షల మంది సొంత ఇంటిని కలిగి లేరు, మొదట డబుల్ బెడ్ రూమ్ అని తర్వాత సొంత జాగా ఉంటే ఐదు లక్షలని, మూడు లక్షలని పూటకో మాట మాట్లాడి ప్రజలను మోసం చేస్తున్నారు. అక్కడక్కడ అరకొరగా కట్టిన డబుల్ బెడ్ రూములు కూడా నాణ్యత లేకుండా వర్షాలకు కూలిపోవడం పెచ్చులూడటం మనం చూసాం. బిఆర్ఎస్ పార్టీ భవనాలను ఉన్న ప్రభుత్వ భూమి దళితుల మూడెకరాలకు మాత్రం దొరకడం లేదు. పైగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దళితులకు పంచిన భూములను ధరణి పేరిట స్వాహా చేస్తున్నారు. ఇలా దళితులను నిలువునా ముంచుతూ, దళితుల అభ్యున్నతి కొరకై పోరాడిన అంబేద్కర్ ఆశయాలను తుంగలోకి తొక్కి 146 కోట్లతో 125 అడుగుల విగ్రహం కట్టడం కేవలం దళితుల ఓట్లను కొల్లగొట్టాలనే దురాశ తప్ప మరొకటి కాదు. మూడోసారి ముఖ్యమంత్రి కావడానికి కేవలం వాస్తు బాగా లేదన్న కారణంగా ఇంకా 70 సంవత్సరాల పాటు పదిలంగా ఉండే సెక్రటేరియట్ భవనాన్ని హైకోర్టు స్టే విధిస్తుందనే భయంతో, రాత్రికి రాత్రి హడావిడిగా కూలగొట్టారు. 133 కోట్ల రూపాయలతో కట్టిన భవనం కూలగొట్టడానికి 11.68 కోట్లు వెరసి 145 కోట్ల ప్రజాధనం వృధా అయ్యింది. అదనంగా మరో 617 కోట్ల రూపాయలతో నూతన సచివాలయాన్ని నిర్మించారు. అది కూడా కరోనా కష్టకాలంలో.... దీన్నిబట్టే తెలుస్తుంది కేసీఆర్‌కి ప్రజల శ్రేయస్సు కన్నా అధికార దాహమే ఎక్కువ అని.

స్కీం ఏదైనా స్కాం పక్కా!

నిర్మాణరంగంలో అవినీతి ఒక ఎత్తు అయితే సంక్షేమ పథకాల పేరిట రైతుబంధు, దళిత బంధు, బీసీ బంధు అంటూ రాబందుల్లాగా ప్రజాధనాన్ని పీక్కు తింటున్నారు. వాస్తవికంగా ఇవి పంట పండించే రైతుల కంటే అధికంగా భూస్వాములకు ఇది మేలు చేస్తుంది. లంబాడి ఆదివాసులకు చెందాల్సిన భూములను అటవీ భూములను, గుట్టలను పట్టాలు చేసుకుని కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అప్పనంగా రైతుబంధు మింగుతున్నారు. దళిత బంధు లబ్ధిదారుల దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లంచం తీసుకుంటున్నారు.దీంతో సామాన్యులకు ఉపయోగపడాల్సిన ప్రజాధనం పరోక్షంగా అధికార పార్టీ నేతల జేబుల్లోకి పోతుంది. ఇలా స్కీం ఏదైనా స్కాం జరగడం మాత్రం పక్కా. హరితహారం పేరిట విద్యుత్ తీగల కింద చెట్లను నాటడం, మళ్లీ వర్షాకాలంలో విద్యుత్ సరఫరా నిలుపుదల కాకుండా వాటి నరికి వేయడం పరిపాటిగా మారింది. నర్సరీలలో చెట్ల ధరను పెంచి కొనుగోలు చేసినట్లు చూపడం, నర్సరీలలో మొక్కల సంరక్షణ నిర్వహణ ఖర్చుల్లో అవకతవకలు జరుపుతూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. సంక్షేమ పథకాలకు సరిపడా నిధులు లేక పరిమితికి మించి అప్పు చేయడానికి అవకాశం లేక భూమి, వాహన రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం, మద్యం అమ్మకాలు పెంచడానికి వైన్స్ షాపుల సంఖ్య పెంచడంతోపాటు.... ఊరూరా బెల్ట్ షాపుల జోలికి వెళ్లకుండా అధికారులకు అంతర్గత ఆదేశాలు ఇచ్చిందనే వాదనలు కూడా ఉన్నాయి. నేడు ప్రభుత్వాన్ని నడపడానికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి నిధులు లేక నగర శివారులలో భూములను వేలం పెట్టడం సిగ్గుచేటు... ఒక మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, అప్పుల ఊబి నుండి బయటపడేందుకు కేంద్రం తెచ్చిన మీడియం టర్మ్ డెట్ మేనేజ్మెంట్ స్ట్రాటజీలో చేరిన తొలి రెండు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇలా విచ్చలవిడిగా నిధుల దుర్వినియోగం వలన మన రాష్ట్రంలో యువకుల, పేదల, సామాన్య ప్రజల జీవనం గడవడం దుర్భరంగా మారింది.

బుర్ర రవితేజ గౌడ్

అడ్వకేట్, టీపీసీసీ లీగల్ డిపార్ట్‌మెంట్

94931 09462



Next Story

Most Viewed