మరోకోణం:వలస చట్టాలు తిరగరాయండి!

by D.Markandeya |
మరోకోణం:వలస చట్టాలు తిరగరాయండి!
X

రాజద్రోహ చట్టం అమలుపై గత బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక నిర్ణయాన్ని వెలువరించింది. ఇండియన్ పీనల్ కోడ్‌ (ఐపీసీ)లోని సెక్షన్ 124-ఎ రూపంలో కొనసాగుతున్న ఈ చట్టం అమలును వెంటనే నిలిపివేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఈ సెక్షన్ కింద తాజాగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయవద్దని, ఇప్పటికే పెట్టిన కేసుల విచారణను, తదుపరి చర్యలను నిలిపివేయాలని కేంద్రంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను నిర్దేశించింది. 160 ఏండ్లనాటి అత్యంత కఠినమైన ఈ వలసవాద చట్టాన్ని భారత ప్రభుత్వం పున:పరిశీలన చేసేదాకా నిలుపుదల చేయాలని, అప్పటివరకూ తమ ఆదేశాలు అమలులో ఉంటాయని బెంచ్ స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

* ఇదే రోజు ఢిల్లీ హైకోర్టు మరో కీలక అంశంపై భిన్న వైఖరులతో కూడిన తీర్పు ఇచ్చింది. 18 ఏండ్లకు పైబడిన వివాహిత మహిళలపై, వారి సమ్మతం లేకుండా భర్త అయినా సరే సెక్స్ చేయడం అత్యాచారం కిందికే వస్తుందని, ఇలాంటి నేరాల నుంచి భర్తలకు మినహాయింపునిచ్చే ఐపీసీలోని సెక్షన్ 375 రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులకు భంగమని జస్టిస్ రాజీవ్ షక్దర్ తీర్పునిచ్చారు. ఇదే ధర్మాసనంలోని మరో జడ్జి ఈ అభిప్రాయంతో విభేదించారు. భార్యలతో బలవంతపు సెక్స్‌ విషయంలో భర్తలకు ఇచ్చిన మినహాయింపులను వివాహ వ్యవస్థ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలని జస్టిస్ హరిశంకర్ అన్నారు.

* ఐపీసీలోని మరో వివాదాస్పద సెక్షన్ 377 విషయంలో కూడా గతంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. పరస్పర సమ్మతితో 18 ఏళ్లు దాటిన ఇద్దరు పురుషులు లేదా మహిళల మధ్య జరిగే హోమో సెక్స్, 18 ఏళ్లు దాటిన మహిళలు-పురుషుల మధ్య సాగే ఓరల్ సెక్స్ చర్యలను నేరంగా పరిగణించే ఈ సెక్షన్‌ను జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించింది. పౌరుల ప్రాథమిక హక్కులలో ఒకటైన సమానత్వపు హక్కుకు ఈ సెక్షన్ విఘాతం కలిగిస్తుందని స్పష్టం చేసింది.

* ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15లను ఉల్లంఘిస్తున్నదంటూ గతంలో సుప్రీంకోర్టు మరో తీర్పును వెలువరించింది. భర్త సమ్మతి లేకుండా ఒక వివాహిత మహిళతో పరాయి పురుషుడి సంభోగాన్ని వ్యభిచారంగా పరిగణించి శిక్షించాలని, అయితే ఆ మహిళను శిక్షించకూడదని ఈ సెక్షన్ నిర్దేశిస్తుంది. వివాహిత మహిళలను భర్తల సొంత ఆస్తిగా పరిగణించే ఈ సెక్షన్‌ను వెంటనే రద్దు చేయాలని ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

పై నాలుగు తీర్పులకు కారణమైన సెక్షన్లు మన దేశంలోని కోర్టులు, న్యాయవాదులు, పోలీసులు భగవద్గీతగా భావించే భారత శిక్షాస్మృతి చట్టం (ఐపీసీ) లోనివే. గమనించాల్సిన విషయమేమంటే ఈ ఐపీసీ మనకు బ్రిటిష్ వలసవాద పాలన నుంచి వారసత్వంగా పరిణమించింది. లార్డ్ మెకాలె నేతృత్వంలోని ఒక బృందం 1833లో అప్పటి సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల నేపథ్యంలో, వలస పాలకుల అవసరాల ఆధారంగా ఈ చట్టాన్ని రూపొందించింది. సిపాయిల తిరుగుబాటు అనంతరం 1862 నుంచి బ్రిటిష్ ప్రభుత్వం ఈ చట్టాన్ని భారత్‌లో అమలు చేసింది. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చి, ప్రజాస్వామిక, లౌకికవాద రిపబ్లిక్‌గా అవతరించిన తర్వాత స్వదేశీ పాలకులు మనకంటూ ఒక కొత్త రాజ్యాంగాన్ని రూపొందించగలిగారు కానీ కొత్త శిక్షాస్మృతి చట్టాన్ని మాత్రం తయారుచేయలేకపోయారు. బదులుగా పాత చట్టంలోని కొన్ని సెక్షన్లకు నామమాత్రపు సవరణలు చేసి యథాతథంగా అమలులోకి తెచ్చారు.

మార్పులు, చేర్పులు జరిగినా

ఆ తర్వాత ఈ 75 ఏండ్లలో ఆయా ప్రభుత్వాలు 38 మార్లు ఈ చట్టంలోని వివిధ సెక్షన్లలో సమయానుకూలంగా మార్పులు-చేర్పులు చేసినప్పటికీ, 2017లో 245 పనికిరాని సెక్షన్లను ఎత్తివేసినప్పటికీ 124-ఎ, 375, 377, 497తో పాటుగా కీలకమైన పలు ఇతర సెక్షన్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. సెక్షన్ 309 (ఆత్మహత్యాయత్నం), సెక్షన్ 295-ఎ (దైవదూషణ), సెక్షన్ 141 (ఐదుగురు ఆ పైన వ్యక్తులు చట్టవిరుద్ధంగా గుమికూడడం) వంటివన్నీ ఈ కోవలోనివే.

ఐపీసీ కాకుండా మరికొన్ని చట్టాలు కూడా బ్రిటిషర్ల వారసత్వంగా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. డ్రమాటిక్ పర్ఫార్మెన్స్ యాక్ట్-1876 (రంగస్థల నియంత్రణ చట్టం), సాల్ట్ సెస్ యాక్ట్-1835 (ఉప్పు తయారీపై పన్ను), ఇండియన్ పోలీస్ యాక్ట్-1861(పోలీసు వ్యవస్థ నియమ నిబంధనలు), ప్రిజన్స్ యాక్ట్-1894 (జైళ్ల నియమ నిబంధనలు), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్-1872 (సాక్ష్యాలు), ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్-1882 (ఆస్తుల బదిలీ) వంటి చట్టాలు ఇలాంటివే.

వలస పాలకుల చట్టాలే

ఈ అన్ని సెక్షన్లను, చట్టాలను కూడా బ్రిటిష్ వలస పాలకులు తమ దృక్కోణంలో, తమ పాలనావసరాల కోసమే రూపొందించారు. వ్యాపారం పేరుతో భారత్‌కు వచ్చి, ఆ పైన మొత్తం దేశాన్నే కబళించి, ఎదిరించిన వారి రక్తం పారించిన చరిత్ర వాళ్లది. పరాయి పాలనకు వ్యతిరేకంగా తిరగబడకుండా, స్థానిక వనరుల దోపిడికి అడ్డుగా నిలువకుండా, ప్రభువుల పట్ల ప్రజలు భయభక్తులు చూపడానికి వీలుగానే ఐపీసీ సహా ఈ చట్టాల రూపకల్పన జరిగింది. నిజానికి స్వాతంత్రం రాగానే ఈ చట్టాలన్నింటినీ సమూలంగా మార్చివేయాల్సి ఉండింది. కానీ, రాజ్యాంగ రచనపై చూపిన శ్రద్ధను అప్పటి పాలకులు ఈ చట్టాలను తిరగరాయడంలో చూపించలేదు. పాత చట్టాలను కొనసాగించడానికే మొగ్గుచూపారు.

ఆయా సెక్షన్లలోని, చట్టాలలోని నిబంధనలు అధికారంలో ఉన్న పార్టీల, ప్రభుత్వవర్గాల ప్రయోజనాలకు అడ్డుగా నిలిచినప్పుడు, పాలనకు భంగం వాటిల్లినప్పుడు, శాంతిభద్రతలు అదుపు తప్పినప్పుడు, ప్రజలు తిరుగుబాట్లు, ఉద్యమాలు చేసినప్పుడు, న్యాయం కోరుతూ పౌరులు కోర్టుల మెట్లు ఎక్కినప్పుడు మాత్రమే స్పందించారు. కొన్నిసార్లు సవరణలతో సరిపెట్టారు. మరికొన్నిసార్లు కొత్త చట్టాలను సైతం తయారుచేశారు. అయినప్పటికీ వలసవాద సెక్షన్లు, చట్టాలనేకం ప్రస్తుతం యథాతథంగా కొనసాగుతున్నాయి.

సంచలన తీర్పులు వచ్చినా

పైన చెప్పిన 124-ఎ, 375, 377, 497 లాగానే లెక్కలేనన్ని సెక్షన్లు, చట్టాలు లెక్కలేనన్ని మార్లు గత 75 ఏండ్లలో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో, వివిధ హైకోర్టులలో విచారణకు, న్యాయసమీక్షకు వచ్చాయి. చాలా సందర్భాలలో ఆ సెక్షన్లపై చరిత్రాత్మక, సంచలనాత్మక తీర్పులు సైతం వచ్చాయి. ఆయా సెక్షన్లు, చట్టాలు రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నాయని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.

ఆర్టికల్-13, 14, 15, 19, 21 స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని కొన్నింటిని రద్దు చేశారు కూడా. అయినప్పటికీ, దేశాన్ని యాభై ఏండ్లకు పైగా ఏలిన కాంగ్రెస్ కానీ, 20 ఏండ్లకు పైగా పాలించిన జనతా, జనతాదళ్, బీజేపీ కానీ ఐపీసీపై, ఇతర వలస చట్టాలపై సమగ్ర సమీక్ష జరిపి కొత్త చట్టాల రూపకల్పన చేయకపోవడం విషాదకరం. పోలీసు, న్యాయ వ్యవస్థలలో, జైళ్ల మాన్యువల్స్‌లో, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లో అమలవుతున్న అనేక వలసవాద పద్ధతులను నిర్మూలించలేకపోవడం దారుణం.

కండ్లు తెరుస్తారా?

రాజద్రోహం సెక్షన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కండ్లు తెరవాలి. ఒక్క సెక్షన్ 124-ఎ పైనే కాకుండా స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రానంతరం రూపొందిన అన్ని చట్టాలను, చట్ట సవరణలను పున:సమీక్షించాలి. రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, నైతిక పరిస్థితులను అధ్యయనం చేసి కొత్త చట్టాలను తయారుచేయాలి. ఇందుకోసం రాజ్యాంగ, న్యాయ నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక లా కమిషన్‌ను నియమించాలి. చట్టాలు పాలకులకు చుట్టాలుగా మారకుండా, కుల, మత, జాతి, వర్గ, లింగ, ప్రాంత వివక్షలు కొనసాగకుండా, పౌరుల ప్రాథమిక, ప్రజాస్వామిక హక్కులకు భంగం వాటిల్లకుండా ఒక పకడ్బందీ న్యాయవ్యవస్థను రూపొందించాలి. ప్రస్తుత పరిస్థితులలో పనికిరాని, రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న అన్ని చట్టాలను, సెక్షన్లను రద్దు చేయాలి.

చివరగా, రాజ్యాంగంలోని ఆర్టికల్-13 ఈ విధంగా చెప్పింది.

''ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చే కంటే ముందు మన దేశంలో ఉనికిలో ఉండిన, ఇప్పటి నుంచి ఆయా ప్రభుత్వాలు చేసే అన్ని చట్టాలు కూడా పౌరుల ప్రాథమిక హక్కులకు లోబడి ఉండాలి. అనగా ఏ చట్టం కూడా పౌరుల సమానత్వపు హక్కు, వాక్-భావవ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కు, దోపిడిని నివారించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, సాంస్కృతిక-విద్యా హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు, ఆస్తి హక్కులకు భంగం కలిగించే విధంగా ఉండకూడదు. ఆర్టికల్ 368 కింద రాజ్యాంగానికి జరిగే సవరణలేవీ ఈ ఆర్టికల్ 13కు వర్తించవు.''

-డి మార్కండేయ

[email protected]
Next Story

Most Viewed