ప్రకృతి విధ్వంసాన్ని ఆపుదాం

by Disha edit |
ప్రకృతి విధ్వంసాన్ని ఆపుదాం
X

ప్రకృతిని ధ్వంసం చేయకుండా అభివృద్ధి సాధించడానికి దోహదం చేసే ప్రణాళికలను రూపొందించుకొని అమలు పరచేందుకు కృషి చేయాలి. ముఖ్యంగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించడాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలి. మన అవసరాలకు చెట్లు నరికేయొద్దు. ఎందుకంటే, చెట్టుపై ఆధారపడి జీవించే జీవులన్నీ నాశనమైపోతాయి. చెట్లు అందించే ఆక్సిజన్‌ను భర్తీ చేసుకోవడానికి ప్రత్యామ్నాయం అంటూ ఏమీ లేదు. మనం నాటిన మొక్కలు వృక్షాలుగా మారేందుకు కనీసం 30 నుంచి 40 సంవత్సరాలు పడుతుంది. అందుకనే చెట్లను నరకకుండా రక్షించుకుందాం. చెట్టు, చేమలే జగతికి మూలాధారం అని చాటుదాం.

న్నో జీవరాసులు మనుగడ సాగిస్తున్న ఈ విశ్వంలో మానవుడు కూడా ఒక జీవే. ఒకప్పుడు భూమి, గాలి, నిప్పు, నీరు ఆకాశాన్ని పంచభూతాలుగా ఎంచి 'ప్రకృతిమాతగా' పూజించేవారు. అందుకే వర్షాలు, పంటలు సమృద్ధిగా ఉంటున్నాయని భావించేవారు. ఎప్పుడైతే మానవుడు ప్రకృతి మీద ఆధిపత్యం కోసం అనాలోచితంగా, వికృత చర్యలకు పాల్పడడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి ఉత్పాతాలు ప్రారంభమయ్యాయి. భూ ఉష్ణోగ్రత పెరగడం, వాతావరణంలో ఆకస్మిక మార్పులు, ఋతుపవనాలు గతి తప్పడం వంటివి జరుగుతున్నాయి.

జనాభా పెరగడంతో అవసరాల కోసం, ఆవాసాల కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ప్లాస్టిక్ సంచుల వినియోగం, వస్తువుల వాడకం ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. అయినా, వాటికి ప్రత్యామ్నాయాలను రూపొందించడంలో మనం విఫలమవుతూనే ఉన్నాం. అక్రమంగా ఇసుక తవ్వకాలు, గుట్టల విధ్వంసం వంటివి కొనసాగుతూనే ఉన్నాయి. ఇతర జీవరాసులపై కనికరం లేకుండా, స్వార్థంతో భూగర్భ జలాలను వెలికితీయడం, శిలాజ ఇంధనాల వినియోగం, పరిశ్రమలు స్థాపించడం, బహుళ అంతస్తులు నిర్మించడంతో పాటు అడవుల నరికివేతకు పాల్పడుతున్నాం.

మానవ తప్పిదాలుగా గుర్తించి

అడవులు అంతరించిపోతే అరుదైన జీవరాసులను భవిష్యత్ తరాలకు జువాలాజికల్ పార్క్‌లో కాకుండా బొమ్మల రూపంలో చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే గాలి, నీరు కలుషితం కావడంతో దేశంలో 40 శాతం మంది శ్వాసకోశ, చర్మ, క్యాన్సర్ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. పరిశ్రమల వ్యర్థాలు నదులలో కలవడంతో ఆ నీరు సేవించిన వారు మరణిస్తున్నారు. జలచరాలు కూడా అంతమైపోతున్నాయి. వ్యవసాయంలో రసాయనాల వాడకం వలన అనేక పక్షి జాతులు అంతరించిపోవడమే కాకుండా, మనం తినే ఆహారం విషపూరితమవుతోంది.

భూగోళం వేడెక్కడం వలన ధృవ ప్రాంతాలు కరిగి సముద్ర నీటి మట్టాలు పెరిగి ముందుకు రావడంతో తీర ప్రాంతం తగ్గుతోంది. అధిక జనాభా, పేదరికం, రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల వలన మెట్రోపాలిటన్ సిటీలలో శబ్ద కాలుష్యం నేడు ప్రధాన సమస్యగా మారింది. ఆధునిక జీవనశైలి పోకడ వలన భూగ్రహాన్ని ఒక గొడుగులా కాపాడే ఓజోన్ పొర పలుచబడటం ఆందోళన కలిగించే అంశం. పెరుగుతున్న వ్యర్థాల వలన పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోంది. హిమాలయాలలో మంచు సంవత్సరానికి 34 మీటర్ల చొప్పున తరిగిపోతోంది. మానవ తప్పిదాల వలననే భూగోళం వేడేక్కుతోందని, కాలుష్య నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించడంతో ఐక్యరాజ్య సమితి 1972 జూన్‌ నుంచి ఏటా 'ప్రపంచ పర్యావరణ దినోత్సవం' జరపాలని ప్రతిపాదించింది.

వచ్చే తరాలను గుర్తుంచుకోవాలి

ఈ యేడు 'ఒకే ఒక భూమి' అనే నినాదంతో 'ప్రకృతితో స్థిరంగా, సామరస్యంగా జీవించడం' అనే థీమ్‌తో పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుందామని ఐరాస పిలుపునిచ్చింది. ప్రకృతి ప్రసాదించిన వనరులను విచక్షణారహితంగా వినియోగించుకోవడం వలన వాతావరణ సమతుల్యత దెబ్బ తింటున్నది. మన ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు ఒక సమగ్ర జాతీయ విధానంతో చట్టాలు రూపొందించింది. మంచి ఆరోగ్యకర వాతావరణంలో జీవించడం ప్రతి మనిషి ప్రాథమిక హక్కు. తోటి పౌరుల పట్ల, భూమి పట్ల, భవిష్యత్ తరాల పట్ల మనకు కూడా బాధ్యతలున్నాయని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. కాలుష్య కారక వాయువుల ఉద్గారాలను అరికట్టడానికి ప్రయత్నం చేయడంతో పాటు మన చుట్టూ ఉండేవారిని ప్రోత్సహించాలి.

ప్రకృతిని ధ్వంసం చేయకుండా అభివృద్ధి సాధించడానికి దోహదం చేసే ప్రణాళికలను రూపొందించుకొని అమలు పరచేందుకు కృషి చేయాలి. ముఖ్యంగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించడాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలి. మన అవసరాలకు చెట్లు నరికేయొద్దు. ఎందుకంటే, చెట్టుపై ఆధారపడి జీవించే జీవులన్నీ నాశనమైపోతాయి. చెట్లు అందించే ఆక్సిజన్‌ను భర్తీ చేసుకోవడానికి ప్రత్యామ్నాయం అంటూ ఏమీ లేదు. మనం నాటిన మొక్కలు వృక్షాలుగా మారేందుకు కనీసం 30 నుంచి 40 సంవత్సరాలు పడుతుంది. అందుకనే చెట్లను నరకకుండా రక్షించుకుందాం. చెట్టు,చేమలే జగతికి మూలాధారం అని చాటుదాం.

( నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం)

నరేందర్ రాచమల్ల

99892 67462

Next Story

Most Viewed