బతుకమ్మను బతికిద్దాం!

by Disha edit |
బతుకమ్మను బతికిద్దాం!
X

తెలంగాణ ప్రజలను, పాటలే ముందుండి నడిపినవి, పాటలే పెట్టని కోటలై నిలిచినవి. పాటలే కోటి కంఠాలయ్యి మోగినవని పెద్దలు చెబుతుంటారు. తన నాలుకను తాళపత్రంగా చేసుకుని, ప్రకృతిలోని అనేక శబ్ద ధాతువులను ఆస్వాదిస్తూ, అనుకరిస్తూ, తనకు తోచిన పదాలతో పాటను మొట్టమొదటిగా కైగట్టినది మన ‘అమ్మ’ అయితే తెలంగాణ పాటకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. తెలంగాణ పాటలో ఒకప్పుడు కష్టజీవులు, పల్లెజీవనం ఉన్న ఉత్పత్తి ప్రక్రియలన్నిటిలోను.. అన్ని దశలను చెప్పేదిగా ఉండేది. జీవన, విశేషాల ఘట్టాలన్నింటిలోను తెలంగాణ పాటలు ఉండేవి. అయితే తెలంగాణలో అత్యంత భక్తిభావంతో అమ్మవారిని బొడ్డెమ్మ పేరుతో ప్రకృతిలోనుండి వచ్చే పూలతో అలంకరించి (పేర్చి), ఆయా వాడల్లోని ముఖ్యమైన కూడలిలో పెట్టి, ఇంటి ఆడపడుచులు, బతుకమ్మ పాటలు పాడి, తమ కష్టసుఖాలను పంచుకునే వారు. ఈ బతుకమ్మకు దాదాపు కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉన్నట్టు చరిత్రకారులు చెబుతుంటారు.

ప్రజల కష్టాలను పాట రూపంలో..

బతుకమ్మ పాటల్లో జాతి, సంస్కృతి, సంప్రదాయాలు, చాటి చెప్పే రామాయణ, మహాభారత, భాగవత కథలు, నీతి ధర్మాలు, కుటుంబ జీవనంకు సంబంధించి, వివిధ సామాజిక అంశాలు ఇమిడి ఉండేవి. కరువు కాటకాలు వచ్చిన, కుటుంబంలో సమస్యలు వచ్చిన, తెలంగాణ అస్తిత్వానికి చెరిపేసే ప్రయత్నం చేసినవి, రజాకార్ల ఆగడాలను, తల్లుల మానాలు మంట గలిసిపోయినా, ఆ కన్నీటి గాధలన్నీ బతుకమ్మ పాటల రూపంలో వచ్చేవి. బతుకమ్మను ఒక దేవతగా కొలిచి, ఆ దేవతకు ప్రజలు కష్టాలను కథల పాటల రూపంలో చెప్పుకున్నారు. అయితే వెనుకటి పెద్ద మనుషులు ఆ రకంగా పాటలను కైకట్టి తెలంగాణ సమాజానికి అందించారు. ఆ రోజులలో తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాట పాడుతూ చప్పుళ్లతో ఆడుతుంటే ఏదో తెలియని ఉత్సాహం, తెలుసుకోవాల్సిన విషయాలు మనకి తెలియకుండానే నెత్తికి ఎక్కేవి. అందుకే కావచ్చు, నీతి, నిజాయితీలతో అప్పటి ప్రజలు బతికేశారు. ఇది కొన్ని శతాబ్దాలుగా ప్రజల నోళ్ళలో, లోగిళ్ళలో బతుకుతూ వచ్చింది. ఇది ఒక రకంగా సామూహిక, సామాజిక పండుగగా వర్ధిల్లుతూ.. వచ్చింది. ఇలాంటి బతుకమ్మ నేడు డిజె పాటల పాలైంది. తెలంగాణలో సాంప్రదాయ సమాజం ఉన్నంత మేరకు సంప్రదాయ సాంస్కృతిక రూపాలు కూడా ఉంటాయన్నది కాదు. తెలంగాణలోని పట్టణ నాగరీకుల సంఖ్య పెరుగుతున్నా, వారిలో పట్టణీకరణ అదే స్థాయిలలో పెరుగుతున్నదని చెప్పలేం. తెలంగాణలో ఉన్న మధ్యతరగతి కుటుంబాలు ఇంకా పల్లె జీవనాన్ని వదిలిపెట్టలేదు. బహుశ ఈ ఆర్థిక, సామాజిక కారణాలతో తెలంగాణ పాట నేడు ఈ ఆధునికమైన సంగీత శ్రేణిలోకి ప్రవేశించిందనిపిస్తుంది.

ఈ పరిస్థితికి కారణం ఎవరు?

ప్రస్తుత తెలంగాణ పాటలు (జానపద గీతాలు) డిజిటల్ (సోషల్ మీడియా) మాధ్యమంలో చాలా ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే వీటిని వివిధ సందర్భాలలో పెళ్లిళ్లు, వేడుకలు, సాంస్కృతిక ప్రదర్శనల్లో తెలంగాణ ప్రజలు ప్రత్యేక వినోదానికి అనువుగా వాడుకుంటున్నారు. బతుకమ్మ పాటలతో పోలిస్తే ఇలాంటి పాటలలో సందేశం, సమీకరణమో ఉందని గట్టిగా చెప్పలేము. అలాంటి పాటలను ‘బతుకమ్మ పండుగ’లో పాడటం కాదు, డిజె సౌండ్లతో డాన్స్‌లకు పరిమితమయ్యేలా చేసి అసలైన బతుకమ్మ సంస్కృతిని అభాసుపాలు చేస్తుంది నేటి సమాజం. ఇదే బతుకమ్మ పండుగను ఆసరాగా చేసుకొని కొంతమంది దుర్మార్గులు (రజాకార్లు) ఈ ఆటను అవహేళన చేస్తూ, ఇక్కడ సంస్కృతిని అధోగతి పాలు చేయడానికి తెలంగాణ ఆడబడుచులను నగ్నంగా బతుకమ్మలు ఆడించిన సంఘటనలు నేటి తరం మరువకూడని విషయం. అలాగే కొంతమంది వాళ్ళ ఇంటి ముందు బతుకమ్మలను పెట్టించి.. ఆడబిడ్డలు ఆడుతుంటే వాళ్ళ అందాలను ఆస్వాదించిన దుష్ట సంస్కృతిని కూడా మరవలేని విషయం. ప్రజలకు దిశానిర్దేశం చేయాల్సిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఇలాంటి సాంస్కృతిక బతుకుమ్మను కాపాడాల్సిన వీరు, వాడవాడల్లా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం డిజె బాక్సులు కొనిస్తూ, బతుకమ్మకు ఈ పరిస్థితి తీసుకురావడానికి వీరు కూడా కారణం అన్నదని నిజం. బతుకమ్మ సంప్రదాయ కళను తప్పింది. కృత్రిమ పోకడలవైపు పోనిస్తున్నారు. బతుకమ్మ పాట అంటే ఎగురుడు, దుంకుడు కాదు కదా? సభ్యత, సంస్కృతిని మరచిపోయి పాడే పాటలు, ఆడే ఆట కాదు కదా! బతుకమ్మ పాట జనుల నోళ్ళనుండి, వివిధ సామాజిక అంశాల నుండి బతికి వచ్చినవి కదా.

ఈ ఆధునిక సమాజంలోని ఆడపడుచులకు కష్టసుఖాలు లేకపోలేదు. ఒకవేళ నాటి పరిస్థితులు వేరుగా ఉండొచ్చు, నేటి పరిస్థితులు వేరుగా ఉండొచ్చు. ఆధునిక ఆడపడుచులు, వాటి బతుకమ్మ స్పూర్తిని తీసుకొని డిజె పాటలకు దూరంగా ఉండి, మన సంస్కృతి సంప్రదాయాలను తర్వాత తరానికి అందించేలా, చరిత్రను మరవకుండా తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడే విధంగా బతుకమ్మను బంధించకుండా, స్వేచ్ఛగా ఆడుకునేలా తెలంగాణ పౌర సమాజం అందరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పూసాల మోహన్ చారి,

హైదరాబాద్

98667 09607



Next Story

Most Viewed