నిరుద్యోగుల్లో చెదురుతున్న ఉద్యోగ 'కల'

by Disha edit |
నిరుద్యోగుల్లో చెదురుతున్న ఉద్యోగ కల
X

తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన డిమాండ్లుగా సాగింది. ఈ ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు రాష్ట్ర సాధన కోసం వివిధ రూపాల్లో ఉద్యమిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అయితే ఇందులో విద్యార్థుల, నిరుద్యోగుల పాత్ర మరువలేనిది. రాష్ట్రం సాధించుకుంటేనే ఉద్యోగ అవకాశాలు వస్తాయని అప్పటి ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ నిరుద్యోగులలో భారీ ఆశలు రేపి, నేడు రెండుసార్లు అధికారంలోకి వచ్చాక కూడా పూర్తిగా ఉద్యోగాలను పూరించలేకపోయారు. పైగా ఈ తొమ్మిది సంవత్సరాల పాలన చూస్తుంటే ఇందుకేనా దశాబ్దాల తరబడి తెలంగాణ సాధించుకుందని అనిపిస్తుంది. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని అసలు పట్టించుకోకపోవడం వలన నిరుద్యోగ యువత ఆశలు ఆవిరయ్యాయి.

నిరుద్యోగుల్లో గుబులు..

టీఎస్‌పీఎస్సీ ద్వారా జారీచేసిన కొన్ని ఉద్యోగ ప్రకటనలు కోర్టు కేసుల సమస్యలు, కొన్ని పరీక్షల నిర్వహణలో వైఫల్యం, పరీక్ష పేపర్లు లీకేజీకి గురికావడం విస్మయం కలిగిస్తోంది. ఇటీవల లీకైన పేపర్లు అంగట్లో సరుకు లెక్కన లక్షల రూపాయలకు అమ్ముకోవడంలో ప్రత్యక్షంగా బోర్డులో పనిచేసే ఉద్యోగులే కారణం అవ్వడం విచారకరం. అయితే దీని వెనకాల ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నప్పటికీ, దీన్ని ఛేదించకుండా ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోవడం నిరుద్యోగులలో అసహనాన్ని కలిగిస్తుంది. పేపర్ల లీకేజీలపై వేసిన సిట్ విచారణ కేసు రోజుకో మలుపు తిరుగుతుంటే ఉద్యోగ ప్రక్రియపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తెలంగాణలో నిరుద్యోగులకు గెండెకాయ అయినటువంటి టీఎస్‌పీఎస్సీలోనే ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకోవడం నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. దీంతో టీఎస్‌పీఎస్సీ పారదర్శకత, ప్రభుత్వ పనితీరుపై యువతలో తీవ్ర నిరాశ, నిస్పృహలు నెలకొని అసహనం కలిగిస్తున్నాయి. దీంతో నిరుద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రోజులు ఏర్పడ్డాయి.

రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల పాలన చాలా వరకు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతోనే నడుపుతున్నారు. దీనిపై విద్యార్థులలో వ్యతిరేకత రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాది మార్చిలో అసెంబ్లీలో 80,039 ఉద్యోగాల భర్తీ చేస్తామని స్పష్టం చేసినా అది అమలుకు నోచుకోలేదు. టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్స్ -1 ప్రిలిమ్స్, ఏఈఈ, డిఏఓ పరీక్షలు జరిగాయి. తీరా ఇవి లీకైనట్లు ఇటీవల నిర్ధారణ కావడంతో పరీక్షలు రద్దు చేశారు. దీంతో ఇప్పుడు నిరుద్యోగుల్లో గుబులు మొదలై భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. గ్రూప్-1, 2 కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు సెలవు పెట్టి చదువుకుంటున్నారు. మరికొంత మంది ప్రైవేట్ ఉద్యోగాలు వదిలిపెట్టి చదువుకుంటున్నారు యువత అప్పులు చేసి కోచింగ్ కేంద్రాల్లో చేరారు. ఇప్పుడు పరీక్షలు రద్దవడంతో మళ్లీ సన్నద్ధమవడమెలా అని యువతలో కలవరం మొదలైంది. పిల్లలు మంచి ఉద్యోగం సాధించాలని తల్లిదండ్రులు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు కన్నబిడ్డల బాధ చూడలేక వారంత తల్లడిల్లిపోతున్నారు.

నిరుద్యోగులకు నమ్మకం కలిగేలా..

టీఎస్‌పీఎస్సీ పరీక్షల రద్దుకు ప్రభుత్వం సైతం పూర్తిస్థాయి బాధ్యత వహించి వీరిని ఆదుకోవాలి. కేవలం స్టడీ మెటీరియల్, స్టడీ హాల్స్ అందుబాటులో ఉంచడం వంటి కంటి తుడుపు చర్యలకే పరిమితం కాకుండా విద్యార్థులకు ఆర్థిక భారం కలగకుండా ఎగ్జామ్ నిర్వహించే వరకు వారి తల్లిదండ్రుల మీద భారం పడకుండా వారికి భృతిని చెల్లించాలి. ఇప్పటికే లీకైన ప్రశ్నపత్రాల అంశంపై సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ దర్యాప్తును మరింత పారదర్శకంగా నిర్వహించడానికి నిరుద్యోగులలో ప్రభుత్వంపై పోయిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఈ కేసును వెంటనే సీబీఐకి బదిలీ చేయాలి లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. తద్వారా దీని వెనకాల ఉన్న రాజకీయ, రాజకీయేతర శక్తుల హస్తం బయటపడి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి.

ప్రశ్నపత్రాలు లీక్ చేసిన వారికి కఠిన శిక్షపడేలా రాష్ట్రంలో ప్రత్యేక చట్టం తీసుకురావాలి. టీఎస్‌పీఎస్సీ బోర్డు చైర్మన్, సభ్యులను వెంటనే బర్తరఫ్ చేయాలి. కొత్త బోర్డును ఏర్పాటు చేసిన తరువాతనే పరీక్షలు నిర్వహించాలి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వేషించి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలి. ప్రస్తుత తరుణంలో ఇది సాధ్యం కాకపోతే వెంటనే పరీక్ష నిర్వహణ బాధ్యతను యూపీఎస్సీకి అప్పగించాలి. అప్పుడే నిరుద్యోగుల్లో నమ్మకం కలుగుతోంది. ఒకేసారి అన్ని ఉద్యోగ ప్రకటనలు ఇవ్వకుండా ఉద్యోగ క్యాలండర్‌ను ప్రకటించాలి. దీనికనుగుణంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. లేదంటే ఒక తరం విద్యావంతులు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులయ్యారు. ఇంకా మిగిలిన ముప్పై లక్షల మంది నిరుద్యోగులు నష్టపోకుండా వెంటనే ఈ చర్యలు చేపట్టాలి. తక్షణమే ఉద్యోగాల భర్తీనీ పారదర్శకతతో వేగవంతం చేయాలి. లేనియెడల రాష్ట్రంలోని నిరుద్యోగులలో ప్రభుత్వ ఉద్యోగం అనే కల కలగానే మిగిలిపోతుంది.

డా. పెంట కృష్ణ

రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు

80083 90993

Next Story

Most Viewed