నిఖార్సయిన తెలంగాణ వాది..

by Disha edit |
నిఖార్సయిన తెలంగాణ వాది..
X

తెలంగాణ ఉద్యమ కారుడు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, నైజాం వ్యతిరేక పోరాట యోధుడు, చేనేత ఉద్యమకారుడు, బీసీల కోసం విశేష కృషి చేసిన వ్యక్తి, ఉద్యమ శిఖరం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన 1915 సెప్టెంబర్ 27న ఆసిఫాబాద్‌ జిల్లాలోని వాంకిడి గ్రామంలో జన్మించారు. ఆయన నాల్గో తరగతి చదివే సమయంలో చంద్రాపూర్ గ్రామానికి మహాత్మాగాంధీ రావడంతో అక్కడికి ఎవరు వెళ్లవద్దని నిజాం హుకుం జారీ చేశారు.. అయినా ధైర్యంగా ఆనాటి గాంధీజీ సమావేశంలో పాల్గొని స్ఫూర్తి పొందిన వ్యక్తి. ఆయన 1938లో హెచ్‌ఎస్‌సి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షలో పాల్గొనడంతో నిజాం ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆ తరువాత హైదరాబాద్‌కు వచ్చి ‘లా’ ఇక్కడే పూర్తి చేశారు. 1945లో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన కొండా లక్ష్మణ్ బాపూజీ... తెలంగాణ పోరాటంలో అరెస్టైన వారి పక్షాన ఉచితంగా వాదించిన వ్యక్తి. 1947 డిసెంబరు 4న నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాంబుదాడికి పాల్పడి సంవత్సరం పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఆపరేషన్ పోలో తరువాత ఆయనపై ఉన్న కేసులు ఎత్తి వేయడంతో బయటకు వచ్చారు.

రాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించి..

ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న కొండా లక్ష్మణ్ బాపూజీకి 1986లో తిరుపతిలో జరిగిన బీసీల సమావేశంలో రామారావు ప్రభుత్వం ఆచార్య అనే బిరుదు ఇచ్చి సత్కరించింది. అలాగే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌లో ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల 1952లో ఆసిఫాబాద్‌ నుంచి ఎమ్మెల్యే‌గా ఎన్నికయ్యారు. ఆ తరువాత ఆసిఫాబాద్ నియోజకవర్గం రిజర్వ్ కావడంతో ఆయన అప్పటి చిన్న కోడూరు నుంచి గెలిచి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అలాగే 1960-62 మధ్యలో దామోదరం సంజీవయ్య మంత్రి వర్గంలో ఎక్సైజ్, చిన్నతరహా పరిశ్రమ, చేనేత, జౌళి శాఖ మంత్రిగా పని చేశారు. 1962లో మునుగోడు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1967-69లో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గంలోనూ పని చేశారు. 1969లో ఉద్యమం జరుగుతున్న సమయంలో తన మంత్రి పదవికి 1969 మార్చి 28న రాజీనామా చేశారు. ఆ తరువాత ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను బలంగా విన్పించడానికి తెలంగాణ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశారు. ఆ తరువాత రాజకీయ పరిణామాల వల్ల తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే బీసీలకు సంబంధించిన మండల కమిషన్‌ బీసీ రిజర్వేషన్లను అప్పటి కేంద్రంలో ఉన్న పీవీ సింగ్ ప్రభుత్వం ఒప్పుకుంది. అయినప్పటికీ ఓ ప్రధాన నాయకుడు బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 1997లో తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటు కాగా దాని కార్యాలయాన్ని జలదృశ్యంలో నిర్మించారు. కాగా కక్ష గట్టిన అప్పటి టీడీపీ ప్రభుత్వం జలదృశ్యాన్ని నేలమట్టం చేసింది.

మూడు తరాల ఉద్యమ నాయకుడు..

తెలంగాణ కోసం చివరి దశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో 96 ఏళ్ల వయసులో కొండా లక్ష్మణ్ బాపూజీ 2011 నవంబర్‌లో వారం రోజుల పాటు డిల్లీలో తెలంగాణ కోసం నిరాహారదీక్షను బాపూజీ పూనుకున్నారు. మూడు తరాల ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత కార్మిక ఉద్యమం, బీసీ ఉద్యమం, సహకార సంఘాల కోసం కృషి చేశారు. ఆయనతో పాటు ఆయన కుటుంబం అంతా సమాజానికి ఉపయోగపడే గొప్ప సామాజిక సేవకులు. ఆమె భార్య వైద్యురాలు. కొడుకు వైమానిక దళంలో పనిచేస్తున్నారు. ఇవే కాకుండా చేనేత సహకార సంఘం, ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం, మత్స్య కార్మిక, చర్మకార సహకార సంఘాల కోసం కృషి చేసిన మహనీయుడు.. బలహీన వర్గాల గొంతును బలంగా విన్పిస్తూ... కుట్రల వల్ల ముఖ్యమంత్రి అవకాశాన్ని వదులుకున్నా ఆయన ఏనాడు కుంగిపోలేదు. నిఖార్సయిన తెలంగాణ వాదాన్ని నింపుకొని.. మూడు తరాల ఉద్యమంలో ఆయన ఓ గొప్ప శిఖరంలా నిలిచారు. తన జీవితాన్ని సర్వస్వం తెలంగాణ కోసం అర్పించిన ఆ మహనీయుని స్మరిస్తూ... ఆయన ఆశయాలకు అనుగుణంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాకా ఆయనను స్మరిస్తూ తెలంగాణ ప్రభుత్వం సైతం ఉద్యానవన యూనివర్సిటీకి కొండా లక్షణ్ బాపూజీగా నామకరణం చేసి గుర్తింపును ఇచ్చారు. ఆయన 2012 సెప్టెంబర్ 21న అనారోగ్యంతో మరణించారు. ముందు తెలంగాణ తరువాత రాజకీయం అంటూ... ప్రత్యేక తెలంగాణ కోసం... అవిశ్రాంతంగా కృషి చేసిన ఆ మహనీయుని త్యాగం చరిత్ర పుటల్లో ఎప్పటికీ చెరపలేని సాక్ష్యం.

(నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి)

సంపత్ గడ్డం

దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు

78933 03516



Next Story

Most Viewed