కథా సంవేదన: ప్రయాణం

by Disha edit |
కథా సంవేదన: ప్రయాణం
X

చాలా కాలం నుంచి ‘లా’ పుస్తకాల షాపుల వైపు వెళ్లలేదు. న్యాయమూర్తిగా ఉన్నప్పుడు తరచూ వెళ్లేవాడిని. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ‘లా’ పుస్తకాల షాపుల వైపు వెళ్లడం చాలా తగ్గింది. ఆ పదవీ విరమణ తరువాత కొంత కాలం వెళ్లాను. ఇంతలో కరోనా కాలం వచ్చేసింది. పుస్తకాల షాపు వైపు వెళ్లడం పూర్తిగా తగ్గిపోయింది.

కవి మిత్రులు పోస్ట్‌లో పంపిన పుస్తకాలని మూడు రోజుల తరువాత కానీ చేతిలోకి తీసుకోలేదు. కరోనా భయం తగ్గిన తరువాత అప్పుడప్పుడు పుస్తకాల షాప్ వైపు వెళ్లడం మొదలు పెట్టాను. కవిత్వం, కథల పుస్తకాలతో బాటు తెలుగులో చాలా ‘లా’ పుస్తకాలు రాశాను. లెక్కలేనన్ని లీగల్ వ్యాసాలు రాశాను. రాస్తున్నాను కూడా. తెలుగులో చాలా తీర్పులను వెలువరించి ఓ ఒరవడిని సృష్టించాను.

నేను రాసిన లీగల్ పుస్తకాలకి డిమాండ్ ఎక్కువ. వాటిని ఈ రోజుకి తగినట్టుగా కొత్త తీర్పులతో మార్పులు చేయమని నా పబ్లిషర్స్ చాలా కాలం నుంచి కోరుతున్నారు. ఆ పనిని పూర్తిగా నిర్లక్ష్యం చేశాను. కొత్త పదవిలో చేరినా అలా చేయాల్సిన పనిలేదు. కానీ అలా జరిగిపోయింది. అందుకు కారణం నేను సాహిత్యం వైపు ఎక్కువగా నా దృష్టిని కేంద్రీకరించడం కూడా కారణం కావొచ్చు. ఈ మధ్య ‘లా’ పుస్తకాల షాపు వైపు వెళ్లాను. నా లీగల్ పుస్తకాలు అన్నీ రీ ప్రింటులో కన్పించాయి. తెలుగులో రీప్రింట్‌లు కొంటారు. కానీ ఇంగ్లీష్‌లో అంతగా కొనరు. ఎందుకంటే తెలుగులో సులువుగా చదివించే ‘లా’ పుస్తకాలు చాలా తక్కువ.

దాదాపు వందకు మించి లా’ పుస్తకాలు రాయాలని, తెలుగులో ‘లా’ డిక్షనరీ రాయాలని నా కోరిక. ఆ విషయాన్ని దాదాపు మర్చిపోయాను. పబ్లిషర్స్ నుంచి వస్తున్న స్పందనని చూసిన తరువాత మళ్లీ నా గోల్స్ గుర్తుకు వచ్చాయి. ఈ వయసులో ఎక్కువ పని ఎందుకు అనే మిత్రులు సన్నిహితులూ వున్నారు. అది వాళ్ల అభిమానం. నా ప్రయత్నం ఆపలేదు. కథలూ కవిత్వంతో బాటూ లా పుస్తకాలు రాయడం మొదలు పెట్టాను. తెలుగు సులువుగా రాసే వాళ్లు తక్కువ. లేరని చెప్పవచ్చు. న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తరువాత కూడా అలాంటి బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఆర్బిట్రేటర్‌గా చాలా అవార్డులని ప్రకటిస్తున్నాను. వాటిల్లో ఎక్కువ మంది తెలుగు రాని వాళ్లే వుంటారు. అందుకని వాటిని తెలుగులో చెప్పడం కుదరడం తక్కువ. అందుకని తెలుగులో లా పుస్తకాలు రాయడం కొనసాగించడం మొదలు పెట్టాను.

ఒక్క సారి జూలు విదిల్చాను. కథలూ, కవిత్వంతో పాటూ లా పుస్తకాల వైపు నా దృష్టిని కేంద్రీకరించాను. పని చేయడానికి వయస్సుతో పనిలేదు.

మనుషులు వయస్సుని బట్టి ఆలోచిస్తారు. కానీ పక్షులు, జంతువులు ఆ విధంగా ఆలోచించవు. సింహం ఉదయం లేవగానే తన వేటను ప్రారంభిస్తుంది. పెంగ్విన్స్ మంచి చేప కోసం నీటిలో వెతుకుతూ ఉంటాయి. తేనెటీగలు మకరందం వున్న పుష్పాల కోసం తిరుగుతూ వుంటాయి. కానీ మనిషి...

మనిషి కూడా వాటిలాగా మారిపోవాలి.లక్ష్యాలు మన దరి చేరవు. మనమే లక్ష్యాల వైపు పరుగు తీయాలి. ఇప్పుడు నేను చేస్తున్నది అదే పని. అదే నా ప్రయాణం.

మంగారి రాజేందర్ జింబో

94404 83001



Next Story

Most Viewed