కథా సంవేదన: అపురూప వస్తువు

by Disha edit |
కథా సంవేదన: అపురూప వస్తువు
X

నా చిన్నప్పుడు మా ఇంట్లో ఉన్న ఏకైక యంత్రసాధనం టేబుల్ గడియారం. దాన్ని కుంజీ ఇచ్చే గడియారం అనేవాళ్లం. అది గుండ్రంగా ఉండేది. చుట్టూ స్టీల్ ఫ్రేమ్. తెల్లటి డయల్. దాని మీద కాలాన్ని సూచించే అంకెలు. పెద్ద ముల్లు, చిన్న ముల్లు, త్వరత్వరగా నడిచే మరో పెద్ద ముల్లు ఉండేది. అది సెకన్ల ముల్లు.

ఆ గడియారం పైన, ఆ గడియారాన్ని పట్టుకోవడానికి ఒక కొక్కెం ఉండేది. దాని వెనుక రెండు కుంజీలు ఉండేవీ. ఒకటి గడియారం నడవడానికి ఇచ్చే కుంజీ. రెండవది అలారమ్ కుంజీ. రెండోది అలారమ్ కుంజీ. మా గడియారం కాలాన్ని సూచించాలంటే రోజూ కుంజీ ఇవ్వాల్సిందే. ఏదైనా ఒక రోజు కుంజీ ఇవ్వకపోతే అది ఆగిపోయేది. దాంతోపాటుగా అలారం కూడా ఆగిపోయేది. అది సక్రమంగా నడవటానికి కుంజీ ఇవ్వకపోతే బాగుండేదని మాకు అనిపించేది.

దానికి కుంజీ ఇవ్వకపోయినా మా అలారమ్ క్రమం తప్పకుండా మోగేది. మా రాజేశ్వరుని గుడిలో భూమయ్య గారు సరిగ్గా నాలుగు గంటలకు సుప్రభాతం చదివేవారు. ఆయన దగ్గర ఏం గడియారం ఉందో మాకు తెలీదు. ఆయన దానికి కుంజీ ఇవ్వడం మర్చిపోయేవారో లేదో తెలీదు. కానీ ఆయన సుప్రభాతం చదివే సమయంలో ఎలాంటి మార్పూ ఉండేది కాదు. ఆయన సుప్రభాతంతో మా వూరివాళ్లు తమ సమయాన్ని సరిచేసుకునే వాళ్లు అంటారు.

మా భూమయ్య గారు అంటే చదువుకున్న వ్యక్తి. సమయపాలన తెలిసిన వ్యక్తి. కానీ నిరక్షరాస్యుడైన మా నామాల మల్లయ్య కూడా సమయపాలనని బాగా పాటించేవాడు. సుప్రభాతం మొదలైన అరగంట తర్వాత మా మల్లయ్య వచ్చి మా అమ్మని, బామ్మని పిలిచేవాడు. అతను రాగానే ఇంట్లో సందడి మొదలయ్యేది. మా బర్రెలకి మేతని వేసేవాడు. పాలు పిండి వంటింట్లో పెట్టేవాడు. మా గడియారానికి కుంజీ ఇవ్వకపోయినా రోజూ ఉదయం ఐదు గంటల ప్రాంతంలో మమ్మల్ని నిద్రలేపేవాళ్లు చదువుకోవడానికి.

అంత ఉదయం పూట నిద్ర లేవడం కష్టంగా ఉండేది. అయినా తప్పేది కాదు. చలికాలం అయితే మరీ కష్టంగా ఉండేది. దుప్పట్లు కప్పుకుని అయినా చదివాల్సిందే. ఇంటి ముందటి కచేరీలో కూర్చుని పిల్లలం చదివేవాళ్లం. ఆ ఉదయం పూట మాలో మేం చదువుకోవడానికి వీల్లేదు. పైకి వినబడే విధంగా చదవాల్సిందే. నిద్రలోకి జారుకోకుండా వుండటానికి ఈ విధంగా పైకి చదవాలని పెద్దవాళ్లు చెప్పేవాళ్లు. గట్టిగా పైకి చదవాలని పెద్దవాళ్లు చెప్పేవాళ్లు. గట్టిగా పైకి అందరం చదివినా, అసౌకర్యంగా అనిపించకపోయేది. గట్టిగా పైకి చదవకపోతే వాళ్లు నిద్రపోతున్నట్లే లెక్క. ఎవరిదైనా గొంతు పైకి వినిపించకపోతే పెద్దవాళ్లు వాళ్లని హెచ్చరించేవారు. దాంతో వాళ్లు నిద్రలేచి గట్టిగా చదివేవాళ్లు. చదవకపోతే వాళ్లని లేపి కళ్లను నీళ్లలో కడిగించి కూర్చోబెట్టేవాళ్లు.

పేరుకు మాత్రమే అలారమ్ గడియారం. కానీ దానితో సంబంధం లేకుండా మమ్మల్ని నిద్రలేపేవాళ్ళు. మా అక్కలు, బావలు ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మాత్రం మా అలారమ్ గడియారం ప్రాముఖ్యం మరీ పెరిగేది. ఉదయం బస్సులు మిస్ కాకుండా వుండాలని, ఉదయం లేస్తామన్న గ్యారెంటీతో సంబంధం లేకుండా అలారమ్ గడియారంని గట్టిగా నమ్మేవాళ్ళు. అంతేకాదు మంచాలకి దూరంగా ఆ గడియారాన్ని పెట్టేవాళ్ళు. యథాలాపంగా ఆఫ్ బటన్ని నొక్కకుండా వుండటానికి ఆ విధంగా పెట్టేవాళ్ళు.

ఈ గడియారం బాధ, అదే ఉదయం లేచే బాధ తప్పాలంటే ఎండాకాలం రావాలి. పరీక్షలు అయిపోవాలి. వాటికోసం పిల్లలమంతా ఎదిరిచూసే వాళ్ళం. ఎండాకాలం ఉడుకుపోసినా, చెమటకాయలు ఒళ్ళంతా ఏర్పడినా ఎండాకాలం కోసం పిల్లలం ఎదురు చూసేవాళ్ళం.

ఎండాకాలం త్వరగా గడిచిపోయేది. ఆ తరువాత మా బడికాలం వచ్చేది. మళ్లీ మా టేబుల్ గడియారం మాకో పెద్దభూతం మాదిరిగా కనిపించేది.

మా గుడి మీద అయ్యగారు ఏ అలారమ్ పెట్టుకునే వారో తెలియదు. ఒకటి మాత్రం తెలుసు. మా మల్లయ్య దగ్గర మాత్రం అలారమ్ పీస్ లేదు. మా ఇంట్లో టేబుల్ గడియారం ఉంది. అది ఇచ్చే అలారమ్‌తో సంబంధం లేకుండా మా అమ్మా, బాపూ నిద్రలేచేవాళ్ళు. దానికి గల కారణాన్ని ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పనిలేదు. అది వాళ్ళ బాధ్యత. అదే వాళ్ళ అలారమ్.

మేం కాస్త పెద్దవాళ్ళం అయిన తరువాత చదువు, బాధ్యత తెలిసిన తర్వాత మా టేబుల్ గడియారం మాకు ఒక అపురూప వస్తువుగా కన్పించడం మొదలుపెట్టింది. దానికి కుంజీని మేం క్రమం తప్పకుండా ఇచ్చేవాళ్ళం. అది మోగిన సమయానికి నిద్రలేచేవాళ్ళం. ఆ తరువాత పైకి గట్టిగా చదవాల్సిన అవసరం అంతగా లేకుండా పోయింది.

తరువాత తరువాత మా టేబుల్ గడియారం ఎన్నో రూపాంతరాలు చెంది కన్పించకుండా పోయింది. మా మొబైల్ ఫోనే స్మార్ట్‌ఫోన్‌గా మారిపోయింది. ఈ మధ్య మా వేములవాడలోని ఇంటికి రంగులు వేసే క్రమంలో సామాన్లు అన్నీ సర్దుతూ వుంటే మా టేబుల్ గడియారం మమ్మల్ని పలకరించింది.

దాన్ని అపురూపంగా ఆత్మీయంగా తడిమాను. మనస్సు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది. ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టాయి. ఇప్పుడు ఆ టేబుల్ గడియారం ఓ అపురూప వస్తువుగా మా హైదరాబాద్ ఇంటిలో చేరిపోయింది.

మంగారి రాజేందర్ జింబో

94404 83001

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672



Next Story

Most Viewed