కథా సంవేదన: సంతృప్తి

by Disha edit |
కథా సంవేదన: సంతృప్తి
X

ఒక కేసు తరువాత మరో కేసుని పిలుస్తూ వున్నాడు బెంచ్ క్లర్క్. ఫ్యామిలీ కోర్టులో కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రేమించి పెళ్ళి చేసుకున్న వాళ్ళు కూడా సంవత్సరం దాటి దాటగానే కోర్టుకి వస్తున్నారు. కేసులని పిలవగానే పార్టీలు వస్తున్నారు. వెళ్తున్నారు సాక్ష్యం వున్న కేసుని ప్రక్కన పెట్టి మిగితా కేసులని వాయిదా వేస్తూ వున్నాను. అప్పుడప్పుడు తల పైకెత్తి పార్టీల వైపు చూస్తూ వున్నాను.

ఒక కేసుని పిలిచాడు. కోర్టు హాలు ముందు కాస్త హడావిడి కన్పించింది. అనుకోకుండా నా దృష్టి అటువైపు వెళ్ళింది. ఇద్దరూ వచ్చి చెరోవైపు నిల్చున్నారు. ఆమె వయస్సు ముప్పై సంవత్సరాలు వుండవచ్చు. మనిషి తెల్లగా హుందాగా వుంది. అతని వయస్సు 35 సంవత్సరాలు వుండవచ్చు. అతను కూడా హుందాగానే అనిపించాడు. మనిషి ఆరడుగుల ఎత్తు ఉన్నాడు.

ఆమె విడాకులని కోరింది. అతను దానికి జవాబు ఇచ్చాడు. విడాకులను వ్యతిరేకిస్తూ జవాబు దాఖలు చేశాడు. సాక్షులని స్వీకరించే ముందు ఇద్దరు పార్టీలతో మాట్లాడి వారు కలిసి వుండే విధంగా చూడాల్సిన బాధ్యత కోర్టుపైన వుంటుంది. కేసు స్టేటస్‌ని బెంచ్ క్లర్క్ చెప్పాడు. ఆ దశలో వున్న కేసులని శనివారం రోజుకి వాయిదా వేసి ఇద్దరితో మాట్లాడి న్యాయమూర్తి వారిని కలిపి వుంచే ప్రయత్నం చేయాలి. ఆ కేసుని వచ్చే శనివారంకి వాయిదా వేశాను. ఆ రోజు ఇద్దరూ తప్పక రావాలని చెప్పాను. ఇద్దరూ తలలు వూపుతూ కోర్టు హాలు నుంచి బయటకు వెళ్ళిపోయారు.

ఆ తరువాత మరోకేసు, మరోకేసు అలా కేసులని పిలుస్తూపోయాడు బెంచ్ క్లర్క్. ఇలాంటి కేసులు మరో నాలుగు వచ్చాయి. వాటిని కూడా వచ్చే శనివారంకి పోస్ట్‌ చేశాను. ఆ తరువాత సాక్ష్యాలు వాదనలు, తీర్పులు ఆ రోజు అలా గడిచిపోయింది.

శనివారం వరకి వాళ్ళ కేసు గుర్తుకు రాలేదు. ఫ్యామిలీ కోర్టుల్లో కేసుల ఒత్తిడి ఆదే మాదిరిగానే వుంటుంది. శనివారం రోజు 10.30లోపు కోర్టుకి వచ్చాను. చాంబర్‌లో కూర్చున్నారు. ఆ రోజు కోర్టు పని వుండదు. అంటే రెగ్యూలర్ కోర్టు పని ఉండదు. నేను వచ్చిన విషయం తెలియగానే ఆ రోజు కన్సల్టేషన్ కోసం వున్న ఐదు కేసులని నా ముందు తెచ్చి పెట్టాడు బెంచ్ క్లర్క్. పార్టీలు వచ్చారని కూడా చెప్పాడు. కేసు ఫైల్స్ చూసిన తరువాత పిలుద్దామని చెప్పాను అతను వెళ్ళిపోయాడు.

మొదటి ఫైల్ తీసి చూసాను. ఆ రోజు నా దృష్టిని ఆకర్షించిన జంట కేసు. ఆమె దరఖాస్తుని, అతని జవాబుని చదివాను. ఆమె అక్కడ రెవిన్యూ అధికారిగా పనిచేస్తుంది. ఐఏఎస్ రావడానికి దగ్గరలో వుంది. అతను అక్కడే డాక్టర్‌గా ప్రాక్టిస్ చేస్తున్నాడు. వారి వివాహం ఐదు సంవత్సరాల క్రితం జరిగింది. పిల్లలు లేరు. గత రెండు సంవత్సరాలుగా ఇద్దరి మధ్య గొడవలు మొదలైనాయి. సంఘంలో ఆమెకి లభిస్తున్న గౌరవాన్ని అతను ఇష్టపడుతున్నట్లుగా లేదని ఆమె దరఖాస్తులో ఆరోపించింది. అంతేకాదు అటెండర్ల ముందు ఆమెను ఆగౌరపరుస్తున్నట్టు కూడా ఆమె తన పిటిషన్లో పేర్కొంది. అంతే కాదు ఒకసారి వంటమనిషి ముందు చేయి చేసుకున్నట్టుగా కూడా ఆమె తన పిటిషన్లో ఆరోపించింది. అతనితో జీవించలేనని తనకు విడాకులు ఇప్పించమని ఆమె కోర్టుని కోరింది.

అతని జవాబును చదివాను. ఆమె చేసిన ఆరోపణలను అతను ఖండించాడు. అవి అన్నీ అబద్దమని పేర్కొన్నాడు. ఐఏఎస్‌కి దగ్గరలో వుండటం వలన ఆమెకి అహంకారం పెరిగిందని అందుకని విడాకులు కోరుతుందని అతను తన జవాబులో పేర్కొన్నాడు. ఆమె దరఖాస్తుని కొట్టివేయాలని కోర్టును అతను కోరినాడు.

బెల్ కొట్టి ఆమెను చాంబర్‌లోకి పంపించమని ఆమె భర్తను వేచి వుండమని చెప్పాను. బెంచ్ క్లర్క్ కూడా వచ్చాడు. కాస్సేపటికి ఆమె వచ్చింది. నమస్కారం చేసి నిల్చుంది. ఎదురుగా వున్న కుర్చీలో కూర్చోమని చెప్పాను. ఆమె కూర్చుంది. ఆమె విషయం చెప్పమని అడిగాను.

ఆమె పిటిషన్లో వున్న విషయాలను చెప్పింది. అతనితో కలిసి వుండలేనని నిర్ద్వంద్వంగా చెప్పింది. ఆమె చెప్పిన విషయాలు విన్న తరువాత ఆమెను రాజీపడి వుండమని చెప్పలేకపోయాను. కాస్సేపు ఆమెతో మాట్లాడి బయట వేచి వుండమని చెప్పాను. ఆమె బయటకు వెళ్ళింది.

ఆమె భర్త చాంబర్‌లోకి వచ్చాడు. అటెండర్ ఇదివరకే చెప్పినట్టు వున్నాడు. అతనూ నమస్కారం చేసి నిల్చున్నాడు. కూర్చోమని చెప్పాను. ఎదురుగా వున్న కుర్చీలో అతను కూర్చున్నాడు. అతని కథనాన్ని చెప్పమని అడిగాను. తన జవాబులో చెప్పిన అంశాలనే అతను చెప్పాడు. ఆమెతో కలిసి తిరిగి జీవించడానికి తాను సిద్ధంగా వున్నానని చెప్పాడు.

వాళ్ళకి పిల్లలు లేరు. రెండు సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఎలాంటి వాయిదాలు తీసుకోకుండా వాళ్ళు కేసు నడిపించుకుంటే త్వరగా పరిష్కారం అవుతుంది. అయితే అన్ని పరిస్థితులు అనుకూలిస్తేనే. ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేం. వాళ్ళు కోర్టులో ప్రవేశపెట్టే సాక్ష్యాలను బట్టి ఫలితం వుంటుంది.

అటెండర్‌ని పిలిచి ఆమెను లోపలికి రమ్మనమని చెప్పాను. ఆమె వచ్చింది. కుర్చీలో కూర్చుంది. ఇద్దరినీ అడిగాను. ఆమె కలిసి వుండటానికి సుముఖంగా లేదు. అతను సుముఖంగా వున్నాడు. వాళ్ళిద్దరి కధనాలు విన్న తరువాత వాళ్ళను కలిసి వుండాలని ఒత్తిడి చేయడం అర్థరహితమని అనిపించింది.

ఉభయుల సమ్మతితో విడాకులు తీసుకుంటే బాగుంటుందన్న ప్రతిపాదనని ఆమె చేసింది. అతను ఒప్పుకోలేదు. అది కుదిరే వ్యవహారం కాదని నాకు అర్థమైంది. ఆమె వైపు చూసాను. నాకు ఈ రెండు మూడు మాసాల్లో బదిలీ అయ్యే అవకాశం వుంది సార్! అని చెప్పింది.

ఆమె ఉద్దేశ్యం నాకు అర్థమైంది. ఆమె ఆ మాట చెప్పకపోయినా నేను ఇదే విషయం వాళ్ళకి చెప్పేవాన్ని. ఇద్దరి వైపు చూస్తూ ఇలా అన్నాను. కలిసి వుండటానికి ఆమె సుముఖంగా లేదు. ఉభయుల సమ్మతితో విడాకులు తీసుకోవడానికి అనుకూలంగా లేరు. అందుకని ఎలాంటి వాయిదాలు తీసుకోకుండా కేసు పురోగతికి తోడ్పడండి.

ఇద్దరూ తలవూపి నమస్కారం చేసి నా చాంబర్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. కేసుని సోమవారంకి పోస్ట్ చేశాను. సోమవారం రోజు ఆమె ముగ్గురు సాక్ష్యుల సాక్ష్యాన్ని ప్రమాణ పత్ర రూపంలో దాఖలు చేసింది. ఆ ముగ్గురిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అతనికి రెండు మాసాలు పట్టింది. ఆ తరువాత అతని తరఫున సాక్ష్యాలు చాలా ఖచ్చితంగా చెప్పడంతో, వాయిదాలు ఇవ్వడానికి నిరాకరించడంతో అతని సాక్ష్యుల విచారణ జరిగింది. అలా మరో రెండు నెలలు గడిచాయి.

మొత్తానికి ఆరుమాసాల్లో కేసులో తీర్పుని ప్రకటించాను. అటెండర్ల ముందు అవమానించడం, వంటమనిషి ముందు కొట్టడానికి ప్రయత్నం చేయడం క్రూరత్వం అవుతుందని ఆ రెండు అంశాలు రుజువయ్యాయని పేర్కొంటూ వారి వివాహాన్ని రద్దు చేసి విడాకులు మంజూరు చేశాను.

కాలం పరుగులు తీసింది. ఎన్నో కేసులు ఎన్నో కేసుల కలయిక. మరెన్నో కేసుల ఎడబాటు నా కోర్టు మారింది. ఫ్యామిలీ కోర్టు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాను. హైదరాబాద్ వచ్చేశాను. వాళ్ళ విషయమే మర్చిపోయాను.

ఓ రెండు సంవత్సరాల తరువాత ఓ మీటింగ్‌లో ఆమె కనిపించింది. నేను గుర్తు పట్టలేదు. ఆమె నన్ను గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చి పరిచయం చేసుకుని మాట్లాడింది. ఆమె భర్త హైకోర్టుకి అప్పీలు చేశాడని అక్కడ కూడా అతనికి రిలీఫ్ లభించలేదని, అప్పీలు డిస్మిస్ చేశారని సంతోషంగా చెప్పింది.

ఆమె మొఖంలోని సంతోషం చూసి నాకు ఆనందం వేసింది. ఏదో తెలియని సంతృప్తి. అన్ని కేసులని త్వరగా పరిష్కరించాలి. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ కోర్టులో వున్న కేసులను. అవి భావోద్వేగాలతో వున్న కేసులు. కేసులని పరిష్కరించడం వరకే మేం చేసే పని. అప్పీల్‌లో మా తీర్పు ఏమవుతుందన్న దానితో మాకు సంబంధం లేదు.

మంగారి రాజేందర్ జింబో

94404 83001



Next Story

Most Viewed