విషవలయంలో న్యాయ వ్యవస్థ!

by Disha edit |
విషవలయంలో న్యాయ వ్యవస్థ!
X

న్యాయం అంగట్లో సరుకుగా మారకూడదు. న్యాయం అమ్మకపు వస్తువుగా మారితే సంపన్నులు, అధికారపక్షం చేతిలో కీలుబొమ్మగా మారి సత్యాన్ని సమాధి చేస్తుంది. ప్రభుత్వ తప్పిదాలపై గళం విప్పితే పాలకపక్షాల బారి నుంచి ప్రజలను న్యాయస్థానాలు కాపాడాలి. కానీ న్యాయవ్యవస్థ పనితీరు అందుకు భిన్నంగా ఉంది. దురదృష్టవశాత్తు పాలకపక్షం చేతిలో పావుగా మారింది. విచారణలు వాయిదాలు పడుతున్నాయి. తీర్పులు రిజర్వ్‌లు చేస్తున్నారు. బెంచ్ హంటింగ్‌లు జరుగుతున్నాయి. బెయిళ్లు కొంతమందికే పరిమితమవుతున్నాయి. న్యాయస్థానాల్లో జరిగేవి, జరుగుతున్నవి, రానున్న తీర్పులు కొన్ని పత్రికలకు, ఛానళ్లకు ఎలా తెలుస్తున్నాయని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో..

జగన్ రెడ్డి తెలివితేటలను, శక్తియుక్తులను ప్రజల బతుకులు బాగుచేయడానికి వినియోగించాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రజల బతుకులు నాశనం చేయడానికి వాడుతున్నారు. చట్టం ముందు అందరూ సమానమనే సామెత పాతది. ఇప్పుడు చట్టం ముందు కొందరే సమానం. బడిత ఉన్నవాడిదే బర్రె. అధికారం, డబ్బు ఉన్నవాడిదే సర్వస్వం. విలువలకు వలువలు ఊడదీసి అన్యాయం, అధర్మం కరాళనృత్యం చేస్తుంటే సామాన్యులు విలవిలలాడుతున్నారు. న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించకూడదు. కానీ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోటుపాట్లు, లోపాలు సరిదిద్దుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిన జగన్ రెడ్డి కంటే... న్యాయవ్యవస్థపైనే ప్రజలు ఎక్కువగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

న్యాయవ్యవస్థను కొంతమంది నియంత్రిస్తున్నారనే భావన ప్రజానీకంలో బలంగా ఉంది. రాజ్యాన్ని నేరస్థులు ఏలుతున్నారంటే ఆ రాజ్యంలోని మేధావులు స్వార్థపరులైన అయి ఉండాలి, లేదా పిరికిపందలైనా అయి ఉండాలి. మన రాజ్యాంగంలో అందరికీ సమానమైన స్వేచ్ఛ, హక్కులు ఉండాలని లిఖించుకున్నాం. అది నూటికి నూరు శాతం ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు... కానీ కొద్దిపాటి స్వేచ్ఛ, కొన్ని పౌర హక్కులనైనా కాపాడాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భావించే భారతదేశంలో న్యాయం విషవలయంలో చిక్కుకుంది. ప్రజాస్వామ్య దేశాల సూచిలో భారత్ 2014లో 27వ స్థానం, 2016లో 32వ స్థానంలో ఉండగా.. ఇప్పుడది 55వ స్థానానికి పడిపోయింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం సగానికి పైగా పడిపోవడం అత్యంత తీవ్రమైన పరిణామం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నియంతృత్వ విధానాలే కారణం. అన్ని వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం తమ చెప్పు చేతల్లోకి తీసుకుని ప్రజాస్వామ్యాన్ని గేలి చేస్తోంది.

అందని ద్రాక్షపండులా.. న్యాయం

నా శత్రువు నోరు విప్పకుండా చేయగల బలం, అధికారం నాకు ఉన్నప్పటికీ.. అతను తన అభిప్రాయాలను స్వేచ్ఛగా, నిర్భయంగా వెల్లడించే హక్కును నేను కాలరాయను. చివరకు అతని మాటలు నాపై విమర్శలైనా సరే. అదే నిజమైన ప్రజాస్వామ్యమని అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన అబ్రహం లింకన్ వ్యాఖ్యానించారు. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుంది. రాష్ట్రంలో పౌరహక్కులను బలహీనపరచి పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారు. పాలకపక్షం ఆదేశించడం ఆలస్యం న్యాయంగా, చట్టప్రకారం ఉందా లేదా అని నిర్ధారించుకోకుండా, తప్పు చేశారా, చేయలేదా అనేది కూడా ఆలోచించకుండా అక్రమ అరెస్ట్‌లకు పాల్పడుతున్నారు. న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తే.. దానికోసం ఏళ్ల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేప్పటికీ పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది. న్యాయం అందని ద్రాక్షపండులా మారింది. న్యాయం ఆలస్యం కావడం కూడా ఒక శిక్షేనని గుర్తించాలి. చేయని నేరానికి నెల రోజులకు పైగా చంద్రబాబు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు.. కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్షపడకూడదనేది సహజ న్యాయసూత్రం. ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతున్న నాలుగు స్తంభాల్లో అత్యంత కీలకమైంది న్యాయవ్యవస్థ. అలాంటి వ్యవస్థపై అపనమ్మకం ఏర్పడకూడదు. ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పిదాలను నియంత్రిస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో న్యాయస్థానాలు కీలకపాత్ర పోషించాలి. రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను, స్వేచ్ఛను కాపాడుతూ.. వాటిని అమలుచేసేందుకు న్యాయస్థానాలు నిక్కచ్చిగా వ్యవహరించాలి.

ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయవచ్చా?

కేవలం రాజకీయ కక్షతోనే చంద్రబాబును అక్రమంగా నిర్బంధించారని రాష్ట్ర ప్రజానీకం భావిస్తున్నారు. ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయవచ్చు, ఏ వ్యవహారంలోనైనా చక్రం తిప్పవచ్చని జగన్ రెడ్డి రుజువు చేశారు. ఎదుటివారిని హింసించి, బాధించి జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇటీవల న్యాయస్థానాల్లో జరుగుతున్న పరిణామాలు పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రజాస్వామ్యవాదులని ఆలోచనలో పడేస్తున్నాయి. గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ స్కాం అప్పట్లో పెనుసంచలనం సృష్టించింది. బెయిల్ కోసం న్యాయమూర్తికి రూ.100 కోట్లు లంచం ఇవ్వజూపారని సీబీఐ కేసు నమోదు చేయడం మనం చూశాం. లంచం తీసుకుని బెయిల్ ఇచ్చిన జడ్జి జైలు పాలయ్యారు. విజయవాడలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో దోషి అనేది ఎవరో ఇప్పటికీ తేల్చలేకపోయారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు సత్యం బాబు నిర్దోషిగా బయటపడ్డాడు. కానీ కొన్ని సంవత్సరాల పాటు జైల్లో మగ్గారు. దీనికి ఎవరు బాధ్యులు? కోడికత్తి కేసులో అరెస్టైన శ్రీనుకు బెయిల్ రాకుండా వేధిస్తున్నారు. కోడికత్తి కేసు విచారణకు హాజరుకాకుండా జగన్ రెడ్డి తప్పించుకు తిరుగుతున్నారు. ఎన్ఐఏ కూడా కోడికత్తి శ్రీను అమాయకుడని తేల్చిచెప్పినా ఐదేళ్లుగా జైల్లోనే మగ్గుతున్నాడు.

న్యాయానికి సంకెళ్లు

వాస్తవానికి న్యాయానికి సంకెళ్లు నాలుగేళ్ల క్రితమే పడ్డాయి. ఈ నెల 15వ తేదీన న్యాయానికి సంకెళ్లు పేరుతో జరిగిన వినూత్న నిరసన కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజానీకం స్వచ్ఛందంగా పాల్గొని సంఘీభావం తెలియజేశారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రాష్ట్ర హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా విశాఖకు రాజధానిని తరలిస్తానని ముఖ్యమంత్రి చెప్పిన రోజే న్యాయానికి సంకెళ్లు పడ్డాయి. హైకోర్టు జడ్జీలపై అనుచితమైన వ్యాఖ్యలు చేసి, అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోనప్పుడే న్యాయానికి సంకెళ్లు పడ్డాయి. అనేక సందర్భాల్లో కోర్టు తీర్పులు ఖాతరు చేయకుండా తన ఇష్టారాజ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న రోజే న్యాయానికి సంకెళ్లు పడ్డాయి. తీవ్రమైన ఆర్థిక నేరాలు ఎదుర్కొంటూ జగన్ రెడ్డి గత పదేళ్ల నుంచి కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకున్న రోజే న్యాయానికి సంకెళ్లు పడ్డాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా న్యాయస్థానాలు కాపాడిన రోజే న్యాయానికి సంకెళ్లు పడ్డాయి. డాక్టర్ సుధాకర్, ఎమ్మెల్సీ అనంత్ బాబు సొంత డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసిన ఘటన, పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిని చనిపోయిన కిరణ్ కుమార్, అమర్ నాథ్ అనే విద్యార్థిని సజీవదహనం చేసిన ఘటనల్లో ఏ ఒక్కరికి సరైన న్యాయం లభించలేదు. ఆనాడే న్యాయానికి సంకెళ్లు పడ్డాయి. చేయని నేరానికి చంద్రబాబునాయుడు అక్రమంగా అరెస్టై జైలుకు వెళ్లిన రోజు న్యాయాన్ని ఏకంగా ఉరితీశారు.

న్యాయవ్యవస్థ ప్రతిష్ట మసకబారితే...

ఇటీవల జరిగిన సభలో చంద్రబాబు అరెస్ట్ తనకు తెలియదని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పడం అబద్ధాలకు పరాకాష్ట. అరెస్ట్ అంశాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు అతని ముఖకవళికలు, హావభావాల్లో పైశాచిక ఆనందం స్పష్టంగా కనిపించాయి. ఎవరిపైనైనా, ఎలాంటి కేసులైనా పెట్టవచ్చు, వాటికేమి పెద్దగా సాక్ష్యాధారాలు అవసరం లేదని జగన్ రెడ్డి భావిస్తున్నారు. తాను అనుకుంటే ఎవరినైనా జైలుకు పంపవచ్చని చంద్రబాబుపై కేసు ద్వారా జగన్ రెడ్డి నిరూపించారు. అరెస్టైన వారు వారి నిర్దోషిత్వాన్ని వారే నిరూపించుకోవాలి కాబట్టి కొంతకాలం జైలులో ఉంచవచ్చు. ఇలాంటి పోకడలు ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రాజ్యాంగ వ్యవస్థలపై అపనమ్మకం ఏర్పడితే.. ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతుంది. ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థ ప్రతిష్ట మసకబారకూడదు. దేశంలో న్యాయస్థానంపై ప్రజల్లో అచంచలమైన విశ్వాసం ఉంది. నెలరోజుల నుంచి రాష్ట్ర ప్రజానీకం న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆధారాలతో సహా దొరికి జైలుకు పోవాల్సిన ఆర్థిక నేరస్థులు, హంతకులు, దొంగలు, దోపిడీదారులు బయట తిరుగుతుంటే.. అమాయకులు, నిర్దోషులు జైళ్లలో మగ్గుతున్నారు. చంద్రబాబు నిర్దోషిగా విడుదలవుతారని ప్రజలందరూ న్యాయం కోసం పడిగాపులు కాశారు. కానీ ధర్మం దారి తప్పినట్లుంది. ప్రజలకే నిరాశే ఎదురైంది. న్యాయం ఎండమావిగా మారినా, తీర్పుల్లో నిష్పాక్షికత లోపించినా సమాజంలో అశాంతి ప్రబలుతుంది. అంతిమంగా న్యాయం గెలిస్తేనే రాజ్యాంగ వ్యవస్థలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది.

మన్నవ సుబ్బారావు

99497 77727

Next Story

Most Viewed