తెలుగు సినిమా గమనం

by Disha edit |
తెలుగు సినిమా గమనం
X

తెలుగు సినిమా ఎటుపోతోంది అనేది ప్రశ్న. మనం (మన తెలుగు సినిమా) ఎటు వెళ్తున్నాం! నడిచివచ్చిన దారిని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుని, ఇప్పుడు వెళ్తున్న దారి ఎలా వుందో, ఎందుకిలా వుందో, ఎలా వుంటే బాగుంటుందో విశ్లేషించుకుంటే మంచిది కదా! మంచి గతమున కొంచెమేనోయ్ వెనకబడితే వెనకేనోయ్ అన్నారు గురజాడ మహాకవి. నిజమే, గతం, జాగ్రత్తగా దాచుకున్న ఒక ఫోటో ఆల్బమ్ లాంటిది. ఒక్కో ఫోటో గత స్మృతిని, నిశ్చలనం చేసి, చిన్నగా కుదించి చూపిస్తుంది. అందుకనే గతం మనకి అందంగా కనిపిస్తుంది. ఆ కారణంగానే, గతంలో వచ్చిన సినిమాలే గొప్పవి అంటుంటారు పెద్దలు! గతంలో వచ్చిన వాటిని ఇప్పటి సినిమాలతో పోల్చితే, మంచి గతమున కొంచెమోనా అని ఒప్పించగలమా! అసలుకి, ఏది మంచి సినిమా ఏది కాదు అని వివరించి చెప్పటానికి కొలమానం ఎక్కడుంది, ఎవరు చెప్తారు సాధారణ ప్రేక్షకులా హీరోల అభిమానులా పత్రికల్లో వచ్చే రివ్యూలా ఎన్ని థియేటర్లలో ఎన్ని రోజులు ఆడిందనా! నిర్మాతకి వచ్చిన లాభాలతోనా! లేక వసూళ్లతో సంబంధం లేకుండా కళాత్మకంగా సెబాసులు అందుకున్నవా! ఇదేదీ కాదు, కలకాలం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయినదే. గొప్పదా! ముమ్మాటికీ అదే మంచి సినిమా అంతకన్నా గొప్పది వుంటుందా తప్పకుండా వుంటుంది.

20 వేల సినిమాల్లో.. నచ్చినవెన్ని?

కళాత్మక విలువలతో ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని పొందడమే కాకుండా, ప్రజల దృష్టిని మానవతా విలువల వైపు మరల్చి, ఆలోచనలు రేకెత్తించి, సామాజికంగా మంచి చెడులకి ఉదాహరణగా నిలవడమే కాకుండా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చి పెట్టినవే అతిగొప్ప సినిమాలు. త్యాగయ్య పంచరత్నాలు, అన్నమయ్య కీర్తనలు, గురజాడ కన్యాశుల్కం, శ్రీశ్రీ మహాప్రస్థానం, లాంటి వాటిని క్లాసిక్స్ అంటాం. ఎన్నిసార్లు విన్నా, ఎన్ని సార్లు చదివినా విసుగు పుట్టదు. మళ్లీ మళ్లీ ఆ అనుభూతిని పొందాలనిపించేంత గొప్పవి అవి. మరి ఆ స్థాయిలో క్లాసిక్ అనిపించే సినిమాలు మనకున్నాయా ఉన్నాయి. మాయాబజార్, మల్లీశ్వరి, దేవదాసు, మిస్సమ్మ లాంటివి. నిజమే, ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి. కానీ ఇవి జాతీయ స్థాయిలో కొంతవరకు మాత్రమే గుర్తింపుని పొందగలిగాయి. అంతర్జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ గుర్తింపులేనివే. అలాంటి సినిమాలు చేసిన దర్శకుల్ని కూడా మనం తలుచుకుంటాం... సినిమా నిర్మాణంలో చూస్తే, రష్యన్, అమెరికన్, యూరప్ దేశాలతో పోల్చితే ఒక్క అడుగు వెనుకగా మన సినిమాలు కూడా మొదలయ్యాయి. మరి ఆ దేశాల్లో సినిమాలు వేసినంతగా ముందంజ మనవాళ్లు ఎందుకు వెయ్యలేదు తెలుగులో యిప్పటి వరకు సుమారుగా 20,000 సినిమాలు వచ్చాయట. సినిమాలంటే ఇష్టపడే వారిలో, మీ - ఇష్టం వచ్చిన వారిని అడగండి. మీకు బాగా నచ్చిన సినిమాలు ఎన్ని అవి ఏవి అని. ఒక ఇరవై వరకు సునాయాసంగా చెప్పగలరు. తరువాత ఆలోచిస్తూ యింకో ముప్పై వరకు చెప్తారు. ఇంకా అడిగితే యింకో యాబై వరకు కూడబలుక్కుని చెప్పగలరనే అనుకుంటున్నాను.

పోనీ వంద అనుకుందాం! అవి చెప్పేవారు కూడా తమకి నచ్చిన దర్శకులు, నిర్మాతలు, హీరోల సినిమాలనే గుర్తుచేసుకుంటూ చెప్తారు. ఆ సినిమాలన్నీ కూడా సాహితీ విలువలతో, సంగీతరస ప్రధానమైనవి. ఆ పాటలు... ఆ సినిమాలని మనం మరిచిపోకుండా కాపాడుతున్నవి. ఇలాంటి సినిమాలన్నిటిలో ఏది ఉత్తమమైనది అని నిలదీస్తే, తడుముకోకుండా వచ్చే సమాధానం మాయాబజార్ కానీ యీ కళాఖండం, తెలుగు వారికి మాత్రమే పరిమితమైపోయింది. కారణం ఒక్కటే! అది... ఆ సినిమాలో వున్న నూటికి నూరు శాతం తెలుగుతనం దాన్ని యితర భాషలవారూ, ప్రాంతాలవారూ అంతగా ఆస్వాదించలేరు. (హీరోల అభిమానులని మాత్రం అడగకండి. వారి దగ్గర వారి అభిమాన హీరో గురించిన సమస్త సమాచారం. వుంటుంది. అది ప్రస్తుతం మనకి అనవసరం)

ఇరవై వేల సినిమాల్లో మనసుని ఆక్రమించినవి. బుర్రలో ఒక మధురానుభూతిగా నిలిచిపోయినవి అంత తక్కువ సంఖ్యలో వున్నాయా! ఒక సాధారణ ప్రేక్షకుడు, తన జీవితకాలంలో, సినిమాలు చూస్తూ వాటిని నెమరు వేసుకునే దశలో కనీసం 5000 సినిమాలయినా విడుదల అయి ఉంటాయి. అంటే 2%.. రెండు శాతం మాత్రమే చెప్పుకోదగ్గవి, గుర్తుకొచ్చేవి. ఇదే ప్రశ్న హిందీ, బెంగాలీ, మళయాలం వారిని అడిగితే కొంచెం ఎక్కువగా చెప్పగలుగుతారు. కన్నడం, తమిళం, అస్సామీ వారు కూడానూ! గుర్తున్న ఆ కొన్ని సినిమాలు కూడా అసాధారణమైనవి అయితే గర్వంగా వుంటుంది. ఠాగోర్, శరత్ రచనలు. బెంగాలీ సాహిత్యానికి అంతర్జాతీయంగా ఒక గుర్తింపునీ, గౌరవాన్నీ సంపాదించినట్టుగా, వారికి సత్యజిత్ రే సినిమాలు యింకా ఖ్యాతిని తెచ్చి పెట్టాయి...

ఇక్కడ ఫిల్మోత్సవ్‌లు ఏవీ?

అయితే ఏంటట... దేశంలో పేదరికాన్ని చూపించి అవార్డులూ, ఆస్కార్‌లు తెచ్చుకుంటే గొప్పతనమేనా అని విమర్శించే వాళ్ళు మన రంగంలో ఎక్కువగానే కనిపిస్తారు. ఆర్ట్ సినిమాలు తియ్యాలని తెలుగు దర్శకులు కూడా కొంత ప్రయత్నించారు. కానీ చెప్పుకొదగినంతగా అవార్డులు రాకపోగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాయని అందరికీ తెలిసిన విషయమే! అంతటి బెంగాలీ సినిమా రంగం ఇప్పుడు మన తెలుగు, తమిళ సినిమాలని అనుకరిస్తూ, కాపీ కొడుతూ నిలదొక్కుకునే ప్రయత్నంలో వుంది. సాంకేతికంగా తెలుగు సినిమా రంగం ఎంతో ప్రగతిని సాధించింది. హిందీ, బెంగాలీ, అస్సామీ, తమిళ, కన్నడ, మళయాలీ సినిమాలు హైదరాబాద్‌లో షూటింగులు జరుపుకుంటున్నాయి. కారణం అక్కడ సినిమా నిర్మాణానికి అవసరమైన అన్ని సదుపాయాలూ వున్నాయి. వ్యాపార పరంగా కూడా తెలుగు సినిమా, హిందీ, తమిళ సినిమాలకి బెదురు కలిగిస్తోంది. హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్ లో వున్న డిజిటల్ టెక్నాలజీని వాడుకుంటున్నాయి. మరి యీ ప్రగతి వైపు వేలెత్తి చూపించి, జై తెలుగు సినిమా అని ఎలుగెత్తి చాటి తృప్తి పడితే సరిపోతుందా అవును అలాగే తృప్తి పడుతూ గర్విస్తోంది తెలుగు సినిమా రంగం, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. ఏడాదికి తెలుగు సినిమాలు 150 నుంచి 200 వరకు తయారవుతున్నాయి. బెంగాలీలో 40-50 మాత్రమే, అందులో కనీసం 30-35 హైదరాబాద్‌లో తయారవుతాయి. కానీ బెంగాల్ ప్రభుత్వం ప్రతి ఏడాది 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కలకత్తాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (International Film Festival) నిర్వహిస్తోంది. అలాగే మలయాళం చిత్రసీమ తిరువనంతపురంలో నిర్వహిస్తోంది. అదేవిధంగా మద్రాసులో, బొంబాయిలో, బెంగళూరులో, గౌహతిలో, భువనేశ్వర్, కొచ్చిన్, తిరుపూర్, కొల్లాపూర్ లలో ఎన్నో జరుగుతున్నాయి. మన దేశంలో సుమారు 50 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు జరుగుతున్నాయి. కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటి కూడా జరగడం లేదు. హైదరాబాద్‌లో హైదరాబాద్ ఫిలిం సొసైటీ సొంత వనరులతో, చందాలు వసూలు చేసి రెండుసార్లు. నిర్వహించింది అంతే!

సినిమా లాభాపేక్ష కోసమేనా?

ఎందుకిలా జరుగుతోంది? అసలా చిత్రోత్సవాల అవసరం ఏమిటి? చాలా ఉంది. హాలీవుడ్ సినిమాలు చూసి తెలుగు దర్శకులు సాంకేతికపరంగా ఎదుగుతూ తమ ప్రతికను చాటుకోగలుగుతున్నారు గానీ ప్రజాపయోగమయిన సినిమాల అవసరాన్ని తెలుసుకోలేకపోతున్నారు. నిర్మాతలకి, నిర్మాణసంస్థలకి లాభాపేక్ష మాత్రమే ఉంటుంది. సహజంగా, మానవ సమాజంలో అత్యంత శక్తివంతమైనది, ప్రతిభావంతమైన కళారూపం నిస్సందేహంగా.. 'సినిమా'యే. కానీ ఈ కళారూపం ఎంతో ఖర్చుతో కూడుకొన్నది. కాబట్టి పెట్టుబడి ప్రధానాంశం అయింది. ఆ పెట్టుబడి డబ్బున్న మారాజుల దగ్గరనుంచే రావాలి. ఆ పెట్టుబడి పెట్టి నిర్మాతకి నచ్చని కథ సినిమాగా వచ్చే అవకాశమే లేదు. ఎంతటి గొప్ప మేధావులైన రచయిత, దర్శకులు అయినా సరే, నిర్మాతని మెప్పించకుండా సినిమా చెయ్యలేరు. సినిమా ఒక్క వ్యాపారమే గనుక లాభం కోరటం నేరం కాదు. అదే సబబు. ఆ ఆలోచనా ధోరణి వున్న నిర్మాతల నుండి అంతర్జాతీయ స్థాయి సినిమాలు కోరటం అత్యాశే అవుతుంది.

(ముగింపు వచ్చే వారం)

కె.ఎల్. ప్రసాద్

సినీ దర్శకులు, రచయిత

93910 25341



Next Story

Most Viewed