జర్నలిజం‌కు సంకెళ్లు

by Disha edit |
జర్నలిజం‌కు సంకెళ్లు
X

2002లో గుజరాత్‌లో జరిగిన దాడులు, విధ్వంసం మీద ఇప్పటి పీఎం అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ పాత్రపై బీబీసీ ఒక డాక్యుమెంటరీ రూపొందించింది. అయితే దీనిపై బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేయగా ఈ డాక్యుమెంటరీని మన దేశంలో బ్యాన్ చేశారు. అయితే రెండు రోజుల కింద దేశంలోని బీబీసీకి చెందిన కార్యకలాపాలపై ఐటీ బృందాలు రైడ్ చేశాయి. బీబీసీ మీద ఐటీ దాడి జరగడానికి కారణం ఈ డాక్యుమెంటరీ రూపొందించడమే కారణమని అంటున్నారు మెజారిటీ ప్రజలు. దీంతో మరోసారి దేశంలో జర్నలిస్టుల రక్షణ మీద చర్చ జరుగుతున్నది. ఈ దాడులకు అదానీ వ్యాపార కార్యకలపాలపై హిండెన్‌బర్గ్ రిపోర్టును కూడా బీబీసీ ప్రసారం చేయడం కారణమంటున్నారు. ఎన్డీటీవిని మోదీ సన్నిహితుడైన అదానీ కోనేసాడు. రవీశ్ కుమార్ వంటి జర్నలిస్ట్‌ను తనకు తానుగా బయటకు వెళ్లేలా చేసారు. అలాగే బీబీసీను కొనలేరు కాబట్టి ఈ దాడులు చేయించారంటున్నారు. ప్రస్తుతం జీ-20 దేశాలకు అధ్యక్ష బాధ్యతలు వహిస్తున్న మన నరేంద్ర మోడీ నిష్పక్ష పాత్ర గురించి ప్రపంచానికి ఏం చెబుతారు?

అక్రమంగా అరెస్ట్ చేసి

ఇప్పటికే మనదేశం ప్రెస్ ఫ్రీడంలో చాలా వెనుకబడి వందకు పైగా ర్యాంకులో ఉంది. ఇప్పడు కూడా బీబీసీ కార్యాలయాల్లో రిపోర్టర్స్ వద్ద సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు లాక్కున్నారట. మనదేశంలో నిజం మాట్లాడుతూ, నిజం చెబుతూ, నిజం రాసే సిద్దిక్ కప్పన్ లాంటి వారిని ఏళ్ల తరబడి నిర్బంధిస్తున్నారు. గత ఎనమిదేండ్లుగా ఎన్నడూ లేని విధంగా అన్యాయాన్ని ఎదిరించి, న్యాయం వైపు నిలబడే జర్నలిస్టులు, పౌరహక్కుల, సామాజిక కార్యకర్తలను ఉపా, దేశద్రోహం కేసులలో ఇరికించి సంవత్సరాల తరబడి జైళ్లలో పెట్టేస్తున్నారు. యూపీలోని హత్రాస్‌లో అణగారిన వర్గాల యువతిపై అత్యాచారం, హత్య అనంతరం ఆమె శవాన్ని సైతం చూడనీయకుండా కుటుంబ సభ్యులకు తెలియకుండా పోలీస్‌లు దహనం చేసిన తీరును కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్‌ను ఉపా కేసు పెట్టి అరెస్ట్ చేశారు. 28 నెలలు కప్పన్ జైలులో ఉండి ఇటీవలే విడుదల అయ్యాడు. సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినా ఆయన విడుదలను అడ్డుకున్నారు. ఈ ఘటనను జరిగాక వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన రాహుల్ గాంధీని, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను అడ్డుకున్నారు. అయితే దీనిని కవర్ చేసేందుకు వెళ్ళిన కప్పన్‌ను విడుదల చేయాలని కేరళ జర్నలిస్ట్ యూనియన్, అక్కడి జర్నలిస్టులు ఒక్కటై పోరాడినా, ఆయన భార్య రెహానా భర్త విడుదల కోసం పోరాడుతూ ఆమె ఒక జర్నలిస్ట్‌గా మారాల్సి వచ్చింది. కుప్పన్ అరెస్ట్ అయ్యాక తన ఆరోగ్యం బాలేదని జాగ్రత్తగా చూసుకోవాలని మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని తన భార్య కేరళ సీఎం, యూపీ సీఎంకు లేఖ రాశారు. తన భర్తను కాళ్లు, చేతులు కట్టేసి హింసిస్తున్నారని రెహానా ఫిర్యాదులు చేస్తున్న పట్టించుకునే నాథుడే లేడు. ఆమెకు కేరళ సమాజం అండగా నిల్చుంది. కప్పన్ తొమ్మిదేండ్ల కూతురు నాన్న అరెస్టుపై పాఠశాలలోని ఓ కార్యక్రమంలో తన తండ్రిని న్యాయం వైపు పోరాడినందుకు జైలులో ఉంచారని చెప్పిన మాటలు పలువురిని కంటతడి పెట్టించాయి.

బీజేపీ‌లో చేరితే అన్ని మాఫ్

దేశాన్ని తెల్లదొరలు వదిలి వెళ్లి 75 ఏండ్లు దాటినా ఆ బ్రిటీషర్ల మానసికమైన ఆలోచన, విధానాలు ఇంకా మన పాలకులలో కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే ఉపా, దేశద్రోహం లాంటి కేసులు అతి సామాన్యుల మీద పెడుతూ ఇబ్బందుల పాలు చేస్తున్నారు. కపిల్ ఖాన్, భూపె‌యిన్ గగోయి, అఖిల్ గగోయి, దిశా రవి నిర్భంధాలు అన్నీ అన్యాయంగా జరిగినవే. సంవత్సరాలు, నెలలుగా వారిని జైల్లో పెట్టినా వారి నేరాలపై ఆధారాలు, రుజువులు ఏవీ కోర్టు ముందు పెట్టలేక‌పోయారు. ఆరోపణల పేరుతో స్టాన్ స్వామి లాంటి ప్రీస్ట్, కురువృద్ధుడు జైలులోనే మరణించడానికి కారణమయిన పోలీసుల మీద, ఇతర ఏజెన్సీ‌ల మీద ఎన్నడైనా చర్యలు తీసుకున్నారా.. అలాంటి సందర్భాలు ఉన్నాయా? సిద్దిక్ కప్పన్ లాంటి వారి కేసులు మాజీ కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ లాంటి వారు, ఇతర న్యాయవాదుల సహకారంతో కోర్టులో వాదిస్తున్నారు. కానీ ఒకప్పుడు హార్ధిక్ పటేల్ మీద పెట్టిన ఉపా కేసును తాను బీజేపీలో చేరాక మాఫీ చేసేశారు. అటు బెంగాల్‌లోనూ ఈడీ, ఐటీ కేసులను బీజేపీలో చేరాక మాఫీ చేశారు. ముంబైలో ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండే మద్ధతుదారుల కేసులు మాఫీ అయ్యాయి. కానీ జర్నలిస్టుల మీద అక్రమ కేసులు మాత్రం తొలగించడం లేదు.

ఢిల్లీలో ఇటీవల పీఎం నరేంద్ర మోడీ రోడ్డు పేరును కర్తవ్య పథ్‌గా మార్చి, చమక్ ధమక్ ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. కానీ రోడ్డు పేరు మార్చినంత మాత్రాన దేశానికి, దేశ ప్రజలకు ఏమి కావాలో తెలిసి కూడా తెలియనట్టు చర్యలుంటే..అది కర్తవ్యం ఎలా అవుతుంది? కోట్లాది మంది నిరుద్యోగులు, అసమానతలు, అధిక ధరలు, చేయి జారిపోతున్న దేశ ఆర్థిక పరిస్థితి వీటన్నింటికి ఏ కర్తవ్యం సమాధానం చెబుతుంది? అదానీ లాంటి కార్పొరేట్ వల్ల 10 లక్షల కోట్ల షేర్ హోల్డర్ల డబ్బు మునిగినా, ఈ విషయం మీద విపక్షాలు గగ్గోలు పెడుతున్నా పీఎం మోదీ ఒక్క మాట మాట్లాడరు. న్యాయంగా పాత్రికేయ వృత్తిని కూడా నిర్వహించలేని పరిస్థితి ఈ దేశంలో ఉంది. క్రిమినల్స్, అవినీతి, అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు కొమ్ముకాసే జర్నలిస్టులకు తప్ప, క్రిటికల్ జర్నలిజం వైపుకు వెళ్లే వారికి ఇప్పుడు కేసులు, జైళ్లే దిక్కు అనే పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో కేరళ జర్నలిస్ట్‌ల మాదిరి దేశమంతా జర్నలిస్ట్‌లు ఒక్కటి కావాలి. సిద్దిక్ కప్పన్ కోసం అక్కడి జర్నలిస్టులు ఐక్యంగా పోరాడిన తీరు, భర్త కోసం రెండు సంవత్సరాలు కప్పన్ భార్య రెహానా లీగల్‌గా పోరాడిన తీరు ఎందరికో ఆదర్శనీయం. నిజాయితీ‌గా సమాజ హితం కోసం పని‌చేసే జర్నలిస్ట్‌ల వెంట తప్పనిసరిగా సభ్య సమాజం ఉంటుంది. అందుకే ఆవాజ్ దో హమ్ ఏక్ హై.. జీనా హై తో మర్నా సీఖో.. కదం, కదం పర్ లడ్నా సీఖో,. దేశంలో జర్నలిజం‌కు సంకెళ్లు, ఇంకెంత కాలం!

ఎండి.మునీర్

సీనియర్ జర్నలిస్ట్,కాలమిస్ట్

9951865223



Next Story