మంది సొమ్ముతో... శ్రీమంత సీఎం సుద్దులు

by Disha edit |
మంది సొమ్ముతో... శ్రీమంత సీఎం సుద్దులు
X

మధ్య దేశంలో వున్న 30 మంది ముఖ్యమంత్రులలో ఏపీ సీఎం జగన్ రెడ్డి మహా శ్రీమంత ముఖ్యమంత్రిగా నిలిచినట్లు ప్రముఖ వెబ్ పత్రిక ది ప్రింట్ వెల్లడించింది. అన్ని రాష్ట్రాల సీఎంల గత ఎన్నికల అఫిడవిట్‌లను సేకరించి వారి ఆస్తులు వెల్లడించింది. దేశంలో అత్యంత ధనవంతుడిగా ఏపీ సియం రూ. 373.8 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా చివరన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆస్తి కేవలం రూ 15 లక్షలు మాత్రమే ఉన్నట్లు వెబ్ పత్రిక వెల్లడించింది. అఫిడవిట్‌లో పెట్టిన ఆస్తుల వివరాలు మాత్రమే ప్రముఖ పత్రిక వెలువరించింది. చట్టబద్ధ పద్ధతుల్లో, ప్రజ్ఞాపాటవాలతో ఎవరు ఎదిగినా ఎవ్వరికి అభ్యంతరం ఉండదు. తానేం చేసినా ప్రజా ప్రయోజనాల కోసమేనని బుకాయించి ఎక్కడికక్కడ అవినీతి గోపురాలు నిర్మించిన చరిత్ర జగన్ రెడ్డిది. రాజ్య యంత్రాంగాన్ని తన దోపిడీకి సాధనంగా మార్చి దానికి సలహాదారులను జతచేసి ఎదురుదాడి వ్యూహంతో, విపక్షాల గొంతు నొక్కి ప్యాక్షనిజం నైజంతో జగన్ బొక్కింది ఎంతో, ఏ ఆర్ధిక గణాంకుడు లెక్క తేల్చగలరు? అలాంటి వ్యక్తి, చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు అసెంబ్లీలో వీరంగాలు వెయ్యడం సిగ్గు చేటు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు హయాంలో 6 లక్షల కోట్లు అవినీతి జరిగిందని పుస్తకాలు వేసి ప్రచారం చేశారు. మరి గత నాలుగేళ్లుగా అధికారంలో వుండి ఏం చేశారు? మరో ఆరునెలల్లో మీ ప్రభుత్వానికి నూకలు చెల్లబోతున్న సమయంలో, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో ఏకంగా రూ. 371 కోట్లు దోచేశారు అంటూ వీరంగాలు వేస్తున్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితి లేదు.

ఓటమి భారం తప్పించుకునేందుకే..

గత ప్రభుత్వంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం జరిగిందంటూ జగన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పడానికి ఆపసోపాలు పడ్డారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే కాదు... దేశ చరిత్రలోనే నిరుద్యోగులు, విద్యార్ధుల పేరిట జరిగిన అతిపెద్ద స్కాం అని ఇష్టానుసారం అబద్ధాలు చెప్పారు. దోపిడీ అనేది బాబుకి తెలిసిన స్కిల్‌ అని, స్కిల్లింగ్‌ ద్వారా నిజంగా పిల్లల్లో నైపుణ్యాలు అభివృద్ధి చేసి తద్వారా ఉద్యోగాలలో వాళ్లకు వచ్చే అవకాశాలను మెరుగుపర్చాలని ఏ ప్రభుత్వమైనా ఆలోచన చేయాలి కానీ ఆ స్కిల్లింగ్‌ పేరుతో ఏకంగా డబ్బులు దోచేయడం అన్నది, నిజంగా చంద్రబాబుకి మాత్రమే తెలిసిన గొప్ప స్కిల్‌ అని సీఎం జగన్ ఆరోపించారు. పద్ధతి ప్రకారం రూ. 371 కోట్లు దోపిడీ చేశారని, చంద్రబాబు ఒక వ్యూహం ప్రకారం ముఠాగా ఏర్పడి యూత్‌కు శిక్షణ పేరుతో ఈ డబ్బంతా దోచేయడం బాధాకరం అని పేర్కొన్నారు. చేయని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఎలా చూపించాలి? దోచేసిన డబ్బును ఎలా జేబులోకి తెచ్చుకోవాలి? చట్టానికి దొరక్కుండా ఏయే ఫైల్స్‌ను ముందుగానే మాయం చేయాలి? దర్యాప్తు జరిగితే తప్పించుకోవడానికి ఏం చేయాలి? అసలు విచారణ జరగకుండా ఏం చేయాలి? ఇవన్నీ కూడా ముందుగానే ఊహించుకుని ఈ విజన్‌ రూపకల్పన చేశారని సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడారు. స్కిల్ డెవలప్‌మెంట్‌పై నాలుగేళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాలుగేళ్లుగా మీరు చేసిన దర్యాపు ఏమిటి? నిధులు ఏ పెద్దల ఖాతాలోకి వెళ్ళాయో వివరాలు ఎందుకు బయటపెట్టరు? ఏదో కంపెనీలో అక్రమాలు జరిగితే నాటి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? సీమెన్స్ కంపెనీ ప్రతినిధుల్ని విచారణకు ఎందుకు పిలవరు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భారం నుండి తప్పించుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్‌లో అవినీతి జరిగిందంటూ అసెంబ్లీలో చంద్రబాబుపై అసత్యాలతో చిందులు వెయ్యడం సిగ్గు చేటు.

తండ్రి పాలనలోనే రాజప్రాసాదాలు

తన తండ్రి ముఖ్యమంత్రి కాకముందు కర్ణాటకలో 22.5 మెగావాట్ల చిన్న సెకండ్ హ్యాండ్ విద్యుత్తు ప్లాంట్ నడుపుకుంటున్న జగన్ రెడ్డికి, ఐదేళ్లలో ఇన్ని వేల కోట్ల ఆస్తులు, ఇన్ని కంపెనీలు స్థాపించడం ఎలా సాధ్యమైందో ప్రజలకు చెప్పాలి. భారతదేశంలో వ్యాపార దిగ్గజాలు అయిన టాటాలు, బిర్లాలు, అంబానీలు దశాబ్దాలుగా కష్టపడి సంపాదించారు. కానీ ఐదేళ్ల వ్యవధిలో ఇన్ని వేల కోట్ల ఆస్తులు తాను ఎలా కూడబెట్టారో, ఆ విజయ రహస్యం ఏమిటో జగన్ రెడ్డి వెల్లడించాలి. 2004లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు జగన్మోహన్‌ రెడ్డి సామాన్యుడు మాత్రమే. చేసిన వ్యాపారాలు కూడా పెద్దగా లేవు. బడా కాంట్రాక్ట్‌ కంపెనీల వద్ద చిన్న, చిన్న సబ్‌ కాంట్రాక్టులు చేసేవారు. ఆ సమయంలో తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కర్ణాటకలో సండూర్‌ పవర్‌ కంపెనీ ఏర్పాటుకు జగన్‌కు అవకాశం లభించింది. అయితే చేతిలో చిల్లిగవ్వ లేదు. దీంతో రాజశేఖర రెడ్డి నివాసం ఉన్న బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–2 లోని ఇంటిని తాకట్టుపెట్టుకొని అప్పు ఇవ్వవలసిందిగా తెలిసిన వారి వద్దకు వెళ్లేవారు. అయితే తండ్రి చేతిలో అధికారం ఉండటంతో అప్పు చేసే అవసరమే లేకుండా కంపెనీల మీద కంపెనీలు ఏర్పాటు చేయడం ఎలాగో జగన్‌కు తెలిసిపోయింది. అప్పటి వరకు జగన్‌ను పట్టించుకోని బడా కంపెనీలకు చెందినవారు ఆయన కంపెనీలలో ఉచితంగా ఎడాపెడా పెట్టుబడులు పెట్టడానికి క్యూలో నిలబడ్డారు. దీంతో కంపెనీలను జగన్మోహన్‌ రెడ్డి శరవేగంగా ఏర్పాటు చేశారు. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో సొంత మీడియాను ఏర్పాటు చేసుకున్నారు. తండ్రి చేతికి అధికారం రాగానే ఆయనలోని వ్యాపారవేత్త జడలు విప్పి నాట్యం చేశాడు. రాజశేఖర రెడ్డి ఐదేళ్ల పాలన పూర్తయ్యేసరికి జగన్మోహన్‌ రెడ్డి డజన్ల సంఖ్యలో షెల్ కంపెనీలు ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాల్లో రాజప్రాసాదాలు నిర్మించుకున్నారు.

రాష్ట్రాభివృద్ధి కాదు స్వాభివృద్ది

అప్పటివరకు కొన్నిచోట్ల అద్దె భవనాల్లో ఉన్న జగన్‌ మీడియా సంస్థలను సొంత భవనాల్లోకి మార్చారు. సండూరు పవర్‌ కంపెనీ కోసం తాకట్టు పెట్టాలనుకున్న ఇంటి స్థానంలో భారీ భవనాన్ని నిర్మించారు. నెలనెలా భారీ అద్దెలు తెచ్చిపెట్టే భవనాలు నిర్మించుకున్నారు. భారీ పెట్టుబడితో భారతీ సిమెంట్‌ కంపెనీ ఏర్పాటు చేశారు. ఇలా ఐదేళ్లలో జగన్‌ వ్యాపార సామ్రాజ్యం నలుదిశలా విస్తరించింది. అది చూసి వ్యాపార దిగ్గజాలకు నోటమాట రాలేదు. అధికారం చేతిలో ఉంటే ఎంతలా అభివృద్ధి చెందవచ్చో అమలు చేసి చూపించిన జగన్‌రెడ్డికి తానే ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదన్న ఆలోచన వచ్చింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేవలం ఐదేళ్లలో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోని దేశంలో అత్యంత శ్రీమంత ముఖ్యమంత్రిగా నిలిచారు జగన్ రెడ్డి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల కేసుల విచారణ ఏడాదిలోగా తేలిపోవాలని సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో స్పష్టంచేసినా జగన్మోహన్‌ రెడ్డి మాత్రం చిద్విలాసంగా ఉండగలుగుతున్నారంటే ఆయన శక్తిసామర్థ్యాలు ఏపాటివో తెలియడం లేదా? అధికారాన్ని రాజకీయంగా, ఆర్థికంగా తాను అభివృద్ధి చెందడానికి మాత్రమే జగన్‌ తన తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. ఆయన ఆలోచనలు, చేతలు అన్ని కపటత్వమే. రాష్ట్రానికి రాజధాని లేకపోయినా, రాష్ట్రం అభివృద్ధి ఆగిపోయినా ఆయనకు ఏ బాధా, చింతా ఉండదు. తన వ్యాపారాలు, తన కుటుంబం మాత్రమే బాగుండాలి. కష్టం వస్తే ఆదుకోవడానికి పైవారు ఎలాగూ ఉన్నారన్న ధీమాతో వున్నారు. అవినీతిపరులే పాలకులైతే ప్రజలు తమను తాము కాపాడుకోవడం తప్ప మరో మార్గం లేదు. తనకంటిన అవినీతి బురదని చంద్రబాబుకి పూయడం కోసం అసెంబ్లీ సాక్షిగా జగన్ రెడ్డి చెప్పిన అబద్దాలను ప్రజలు అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు. నవ్వి పోదురుగాక నాకేమి సిగ్గు అన్న చందంగా అవినీతిపై జగన్ రెడ్డి నీతులు చెప్పడం చూసి జనం నవ్వుకొంటున్నారు.

ఇవి కూడా చదవండి : అనూహ్య విజయం- సమస్యల వలయం

నీరుకొండ ప్రసాద్

9849625610

Next Story

Most Viewed