ఆర్థిక మందగమనంతో కలవరం

by Disha edit |
ఆర్థిక మందగమనంతో కలవరం
X

దిగుమతులపై ఖచ్చితమైన పరిమితులు ఉండాలి. మన చమురు వినియోగంలో 80 శాతం దిగుమతులే. దానిని తగ్గించడానికి పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించాలి, బంగారంలాంటి దిగుమతులపై భారీ సుంకాలు వేయాలి. బాహ్య వాణిజ్య రుణాల షరతులను సడలిస్తే విదేశీ కరెన్సీ రుణాలను పొందవచ్చు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల మీద సంతకాలు చేయాలి. ముఖ్యమైన వాణిజ్య దేశాలలో భారత వాణిజ్య మార్కెట్ చొచ్చుకుపోవడానికి చర్యలు తీసుకోవాలి, చైనా మాదిరిగా ప్రత్యేక ఆర్థిక మండళ్లను అభివృద్ధి చేయాలి. ఎగుమతి ప్రయోజనాలు, తక్కువ వడ్డీ రేట్లు, కార్మిక యోజన సంస్కరణల అమలు ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు విదేశీ సంస్థలను ఆకర్షించాలి. సంస్థలు మరలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంధనంపై పన్నులు, జీఎస్‌టీ తగ్గించాలి. నిరుపేదలకు ఉచిత ఆహార పథకాలను విస్తరించాలి.

దేశ ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా నడుస్తున్నదా? నిజమేనంటున్నారు కొందరు ఆర్థికవేత్తలు. రూపాయి విలువ జీవిత కాల కనిష్ఠానికి అంటే, ఒక అమెరికన్ డాలర్‌కి 80 రూపాయలకు చేరుకుంది. దేశ చరిత్రలోనే ఇదే భారీ స్థాయి పతనం. 2029 నాటికి ఇది రూ.94 కు చేరవచ్చని ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ) అంచనా వేసింది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, తగ్గిపోతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు, స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులు, అధికమవుతున్న నిరుద్యోగం రేటు, ఊహకందని రీతిలో ధరల మోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎటువైపు చూసినా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. పేదవాడి బతుకు మరింత భారంగా మారే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. ఐదు లక్షల ట్రిలియన్ డాలర్ల ఎకానమీ వైపు మన దేశం అడుగులు పడుతున్నాయని చెప్పుకుంటున్న సమయం ఇది.

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఆర్థిక పరిణామాలు మాత్రం అందుకు అనుగుణంగా కనిపించడం లేదు. కొవిడ్‌తో మొదలైన ఆర్థిక వ్యవస్థ క్షీణత, ఆ తరువాత కోలుకుంటుందన్న సంకేతాలు కనిపించినా, ఎక్కువగా అపసవ్య దిశలోనే పయనిస్తోంది. ఇప్పటికే మన చుట్టుపక్కల దేశాలైనా పాకిస్తాన్, శ్రీలంక, భూటాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. శ్రీలంక పరిస్థితి మన కండ్ల ముందే ఊహించలేని స్థాయికి చేరుకున్నది. చివరకు కొన్ని రాష్ట్రాలు ఇబ్బడిముబ్బడిగా చేస్తున్న అప్పులతో మన ఆర్థిక వ్యవస్థ కూడా భవిష్యత్తులో ఏమౌతుందోననే భయాందోళన వ్యక్తమవుతోంది.

అనేక రంగాల మీద ప్రభావం

రూపాయి విలువ జీవిత కాల కనిష్ఠానికి పతనం కావడాన్ని తక్కువగా అంచనా వేయవద్దు. దీని ప్రభావం అనేక రంగాలపై కచ్చితంగా ఉంటుంది. సామాన్యుడి రోజువారీ జీవితంలో కీలకమైన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు మరింతగా కొండనెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రోజుకే సబ్సిడీ వంట గ్యాస్ ధర రూ.1150 పైగా గా ఉంది. మళ్లీ రూపాయి పతనంతో గ్యాస్ ధర ఎంత వరకు పెరుగుతుందో ఊహించలేకపోతున్నాం. పెట్రో ధరలు సెంచరీ దాటి ముందుకే పరుగులు పెడుతున్నాయి. పెట్రో ధరలు పెరిగితే సహజంగానే అన్ని వస్తువుల రవాణా వ్యయం, నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం మళ్లీ పెరగవచ్చు. మన దేశం చేసే ఎగుమతుల కంటే దిగుమతుల పరిమాణం చాలా పెద్దది.

ఏ దేశానికైనా దిగుమతుల బిల్లే జీడీపీని నిర్దేశిస్తుంది. దిగుమతుల భారం పెరిగే కొద్దీ ఆర్థిక సూచీలన్నీ పతనమౌతాయి. సంక్షోభం ముదురుతున్న కొద్దీ దాన్ని చక్కదిద్దటం కూడా కష్టసాధ్యమౌతుంది. పప్పులు, ఉప్పుల దగ్గర్నుంచీ పెట్రోల్ వరకూ అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న ధరల దెబ్బకు ఇప్పటికే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం మూలాన ఇవాళ ఆహారం, వంటగ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌, దుస్తులు, పాదరక్షలు మొదలుకొని గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల వరకు అన్నింటి ధరలూ పెరిగిపోయాయి. ప్రభుత్వం దగ్గర కూడా ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి నిర్దిష్ట ప్రణాళిక ఉన్నట్టు కనిపించడం లేదు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం కంటే రాజకీయాలపైనే ప్రభుత్వాలు ఎక్కువగా ఫోకస్ పెట్టడం కూడా ఈ దుస్థితికి మరో ప్రధాన కారణం.

పూర్తిగా కోలుకోక ముందే

కొవిడ్ మహమ్మారి మూలంగా దెబ్బతిన్న చాలా పరిశ్రమలు, వ్యాపారాలు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఉద్యోగాలు కోల్పోయిన కోట్లాది మంది మళ్లీ పనిలో చేరలేకపోతున్నారు. శ్రామిక వర్గంలో 60 శాతం మాత్రమే పనిలో కుదురుకున్నారు. ధనికులు, పేదల మధ్య అంతరాలు అందనంత ఎత్తుకు పెరిగిపోతున్నాయి. వివిధ రాష్ట్రాల తలసరి ఆదాయంలోనూ విపరీత తేడాలున్నాయి. రాష్ట్రాలలో పెరుగుతున్న రాజకీయ సంక్లిష్టతలు కూడా పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా మారుతున్న తరుణంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోకుండా ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశం లేదు. ప్రభుత్వాలు ఓట్ల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు 1991 నాటి ఆర్థిక సంక్షోభం నాటి పరిస్థితులను తిరిగి తెస్తాయేమోననే భయాలు కూడా ఉన్నాయి.

కొవిడ్‌ దశలవారీగా ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసిందని ఆర్‌బీఐ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 'కరెన్సీ అండ్‌ ఫైనాన్స్‌' నివేదికలో వెల్లడించింది. కొవిడ్ కారణంగా రూ.52 లక్షల కోట్ల ఉత్పత్తి నష్టం వాటిల్లిందని, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఫలితంగా అంతర్జాతీయ, దేశీయ వృద్ధి కూడా తగ్గుతోందని, కమొడిటీ ధరలు పెరగడం, అంతర్జాతీయ సరఫరా చైన్‌లో అంతరాయాలూ ఇందుకు కారణమని వివరించింది. ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ విదేశీ మారక నిల్వలు, కరెంట్ ఖాతా లోటుపై ఆధారపడి ఉంటుంది. భారత్ వద్ద ఉన్న ప్రస్తుతం 650 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 2.7 శాతంగా ఉంది. ఇది కూడా మూడు శాతానికి పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.

అంచనాలు తప్పుతాయా?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది శాతం వృద్ధిరేటు సాధించగలమని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, కమ్ముకొస్తున్న ఆర్థిక పతనపు మేఘాలతో ఆ అంచనా తప్పవుతుందనే అభిప్రాయాలున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు, రూపాయి పతనం ఇలా ఏ గణాంకాలు కూడా ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టుగా లేవు. భారాల నుంచి ప్రజలకు ఊరట కలిగించడానికి బదులు ప్రభుత్వాలు పన్నులు, యూజర్‌ చార్జీలు, సెస్సులు, సర్‌ చార్జీలు, విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలను పెంచుతూ వారి నడ్డి విరుస్తున్నాయి. ఆర్థిక సంక్షోభాన్ని నివారించే మార్గాలున్నాయి. దీనికి ప్రభుత్వమే చొరవ చూపాలి. 2003-13 మధ్య కాలం జీడీపీకి సువర్ణాధ్యాయం అనే చెప్పాలి. ఆ దశాబ్దంలో వృద్ధి రేటు పరుగులు పెట్టింది. ఆ తర్వాతే మందగమనం మొదలైంది. దిగుమతులపై ఖచ్చితమైన పరిమితులు ఉండాలి.

మన చమురు వినియోగంలో 80 శాతం దిగుమతులే. దానిని తగ్గించడానికి పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించాలి, బంగారం లాంటి దిగుమతులపై భారీ సుంకాలు వేయాలి. బాహ్య వాణిజ్య రుణాల షరతులను సడలిస్తే విదేశీ కరెన్సీ రుణాలను పొందవచ్చు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల మీద సంతకాలు చేయాలి. ముఖ్యమైన వాణిజ్య దేశాలలో భారత వాణిజ్య మార్కెట్ చొచ్చుకుపోవడానికి చర్యలు తీసుకోవాలి, చైనా మాదిరిగా ప్రత్యేక ఆర్థిక మండళ్లను అభివృద్ధి చేయాలి. ఎగుమతి ప్రయోజనాలు, తక్కువ వడ్డీ రేట్లు, కార్మిక యోజన సంస్కరణల అమలు ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు విదేశీ సంస్థలను ఆకర్షించాలి. సంస్థలు మరలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంధనంపై పన్నులు, జీఎస్‌టీ తగ్గించాలి. నిరుపేదలకు ఉచిత ఆహార పథకాలను విస్తరించాలి. ఎంఎస్‌ఎంఈ రంగానికి నగదు బదిలీ చేయడం ద్వారా ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. 2023 లో కనీసం 12 శాతం వృద్ధి రేటు సాధిస్తే తప్ప ఆర్థిక రథం అనుకున్న స్థాయిలో ముందుకు కదలదు.

డా. బి. కేశవులు ఎండీ

తెలంగాణ మేధావుల సంఘం

85010 61659



Next Story

Most Viewed