వరల్డ్ వాక్: భారత్‌కు జి-20 సారథ్యం

by Disha edit |
వరల్డ్ వాక్: భారత్‌కు జి-20 సారథ్యం
X

కరోనాను ఇంత పెద్ద దేశంలో చాకచక్యంగా కట్టడి చేయడం, ఇతర దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయడం, డిజిటల్ రివల్యూషన్స్, కర్బన ఉద్గారాలు తగ్గించే దిశగా అడుగులు, రెన్యువల్ ఎనర్జీపై దృష్టి కేంద్రీకరించడం, మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వయం స్వావలంబన దిశగా ప్రయత్నాలు, విదేశాంగ విధానం వంటివి ఇటీవల కాలంలో భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేటట్లు చేశాయి.‌ ప్రపంచ దేశాలకు సరికొత్త నాయకత్వంగా భారతదేశం కనిపించడం మనం గర్వించదగ్గ విషయం. ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉన్న అమెరికా, చైనా వంటి దేశాలు కూడా భారత్ వైపు చూడడం గమనార్హం.‌ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించి ఒక సంవత్సరం కాలంలో 'అన్నీ సాధిస్తాం' అనుకునే కన్నా సారథ్యం అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రపంచానికి భారత్ సత్తా చాటాలి.

మయం సమీపిస్తున్నది. ప్రతిష్టాత్మక జి-20 కూటమికి మన దేశం డిసెంబర్ ఒకటి నుంచి అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలను ఒక తాటి మీదకు తీసుకువచ్చి వాటిని దిగ్విజయంగా నడిపించే బాధ్యత మన భుజ స్కంధాలపై ఉన్నది. ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితులలో చాలా చాకచక్యంగా వ్యవహరించవలసి ఉన్నది. 1999లో ప్రారంభమైన జి-20 కూటమి 17వ సమావేశం నవంబర్ నెలలో ఇండోనేషియాలోని 'బాలి' లో జరగబోతున్నది. అమెరికా-చైనా ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, నాటోతో సత్సంబంధాలు లేకపోవడం, ఇండియా-చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో మన దేశం జి-20 కూటమికి సారథ్యం వహించడం 'కత్తి మీద సాము' లాంటిదే.

అయితే, ఇదే సమయంలో ప్రపంచ రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించి, మనసత్తా చాటవలసిన ఆవశ్యకత ఉంది.‌ ఇది ఒక చారిత్రక ఘట్టంగా చూడవలసి ఉంటుంది.‌ వివిధ దేశాల నాయకులతో, అధికారులతో, స్వచ్ఛంద సంస్థలతో, రాయబారులతో వందల కొలది సమావేశాలు నిర్వహించి అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.‌ 1983లో 'నామ్' సదస్సు ఏర్పాటు చేసిన అనుభవం, 2015లో 'ఇండియా-ఆఫ్రికా ఫోరం' సమావేశం ఏర్పాటు చేసిన అనుభవం మనకు ఉంది. ఆ అనుభవాలతో జి-20 కూటమి సారథ్యం కూడా జయప్రదంగా ముగించడానికి మనకు ప్రతిభ ఉందనే వాస్తవాన్ని మరువరాదు.‌ అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదరికం, నిరక్షరాస్యత, తీవ్రవాదం, ద్రవ్యోల్బణం, అక్రమ రవాణా, యుద్ధ వాతావరణం, వాతావరణ సమస్యలు, కోవిడ్-19, మంకీ ఫాక్స్ వంటి సమస్యలు సవాల్‌గా నిలుస్తాయి. అన్ని దేశాలతో సమాలోచనలు జరుపుతూ పటిష్ట ప్రణాళికలు రూపొందించి వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగాలి.

సవాళ్లు ఉంటాయి

90 శాతం జీడీపీ, 80 శాతం వ్యాపారం (ట్రేడ్), 67 శాతం జనాభా కలిగిన ఈ జి-20 కూటమి సారథ్యం ఈ దేశాలకే కాకుండా, యావత్ ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తుంది.‌ ప్రపంచ రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను కమాండ్ చేస్తుంది.‌ అసలు జి-20 కూటమి ఏర్పాటు ప్రధాన లక్ష్యం 'ఆర్థిక సహకారం, ప్రగతి సాధన' అని మరువరాదు.‌ ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, డబ్ల్యూ.హెచ్ఓ, డబ్ల్యూటీఓ వంటి అంతర్జాతీయ సంస్థలకు దీటుగా ఈ జి-20 కూటమిని నడపవలసిన ఆవశ్యకత ఉంది. గతంలో 2008-09 మధ్య వచ్చిన ఆర్థిక సంక్షోభం, 2010లో వచ్చిన యూరో సంక్షోభం సందర్భంగా జి-20 కీలక పాత్ర పోషించింది.‌ ప్రస్తుతం అమెరికా, చైనా, రష్యా, ఈయూ వంటి కీలక ఆర్థిక వ్యవస్థలను సమైక్యపరుస్తూ జి-20 కూటమిని నడపవలసిన ఉంటుంది.‌ అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలు రేపు బాలిలో జరిగే సమావేశంలో ఒకచోట కూర్చుని చర్చించే పరిస్థితి కనిపించడం లేదు.‌ ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపైనే భవిష్యత్ జి-20 ప్రయాణం ఆధారపడి ఉంటుందని గ్రహించాలి. ఇటువంటి పరిస్థితులలో భారత్ సారథ్యం ఒక ఛాలెంజ్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అవే మనకు ఆదర్శం

కరోనాను ఇంత పెద్ద దేశంలో చాకచక్యంగా కట్టడి చేయడం, ఇతర దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయడం, డిజిటల్ రివల్యూషన్స్, కర్బన ఉద్గారాలు తగ్గించే దిశగా అడుగులు, రెన్యువల్ ఎనర్జీపై దృష్టి కేంద్రీకరించడం, మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వయం స్వావలంబన దిశగా ప్రయత్నాలు, విదేశాంగ విధానం వంటివి ఇటీవల కాలంలో భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేటట్లు చేశాయి.‌ ప్రపంచ దేశాలకు సరికొత్త నాయకత్వంగా భారతదేశం కనిపించడం మనం గర్వించదగ్గ విషయం.

ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉన్న అమెరికా, చైనా వంటి దేశాలు కూడా భారత్ వైపు చూడడం గమనార్హం.‌ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించి ఒక సంవత్సరం కాలంలో 'అన్నీ సాధిస్తాం' అనుకునే కన్నా సారథ్యం అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రపంచానికి భారత్ సత్తా చాటాలి. ఆ విధంగా మన దేశ నాయకత్వం, అధికారులు సరైన వ్యూహాలు, ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. జి-20 కూటమి చరిత్ర పుటలలో మన నిర్ణయాలు కొన్ని అయినా, సువర్ణ అక్షరాలతో లిఖితమై ఉండేటట్లు చూసుకోవాలి.

సమన్వయం కావాలి

గొప్ప విచిత్రం ఏమిటంటే, 2022 ఇండోనేషియా, 2023 ఇండియా, 2024 బ్రెజిల్, 2025 సౌత్ ఆఫ్రికా వంటి ప్రపంచ పెద్ద ప్రజాస్వామ్య దేశాలు జి-20 కూటమికి వరుసగా బాధ్యతలు తీసుకోవడం ఆహ్వానించదగిన పరిణామం. ఐబీఎస్ఏ, బ్రిక్స్, ఇతర కూటములు, ఈయూ వంటి దేశాలను ముఖ్యంగా అమెరికా, రష్యా చైనా వంటి దేశాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుట, అదే సమయంలో అన్ని దేశాల సమగ్రత, ఆర్థిక అభివృద్ధికి, రాజకీయ సుస్థిరతకు, వ్యాపార భాగస్వామ్యం, అభివృద్ధికి కృషి చేయుటలో నేర్పు ఓర్పు ద్వారా భారత్ నాయకత్వం ప్రపంచమే ప్రశంసించే విధంగా ఉండాలని ఆశిద్దాం.

ఐ. ప్రసాదరావు

63056 82733

Next Story

Most Viewed