దేశంలోపేదలేమో.. ఇంకా పేదలుగా.. మిలియనీర్లు బిలియనీర్లుగా..

by Disha edit |
దేశంలోపేదలేమో.. ఇంకా పేదలుగా.. మిలియనీర్లు బిలియనీర్లుగా..
X

భారతదేశం బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను దాటేసి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందనీ, త్వరలో ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకొని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటుందనీ, దేశంలో కుల రాజకీయాలు చేయొద్దని, మన దేశంలో ఉన్నది రెండే రెండు వర్గాలని ఒకటి పేదలు రెండవ వారు పేదలను ఉద్ధరించే వారని పదే పదే చెబుతున్నారు. అయితే దేశంలో పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. సమాజం కులాల పరంగా, మతాల పరంగా విడిపోయి దేశంలో 28 కోట్ల మంది ప్రజలు అర్ధాకలితోనూ, 21 కోట్ల మంది అనారోగ్యాలతోనూ, కోట్లాదిమంది నిరుద్యోగంతోనో ఉన్నారని అనేక ఆర్థిక నివేదికలు తెలియజేస్తున్నాయి.

మన ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మహిళలు 80 శాతం మందికి రక్తహీనత, 30 శాతం మంది అవిద్యతో, 80 శాతం మంది స్త్రీలు ఎటువంటి నైపుణ్యాలు లేక అతి తక్కువ వేతనాలతో దేశంలో ఉన్నారు. ఇటీవలే అంతర్జాతీయ శ్రామిక సంస్థ నివేదిక ప్రకారం మన దేశంలో యువత 83 శాతం మంది ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకుండా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే దేశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో బోధపడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నులు ఈ సదుపాయాలు ఎందుకు కల్పించలేక వాటిపై పెట్టుబడులు పెట్టలేకపోతున్నారో, తాము అధికారంలోకి వచ్చేందుకు ఉచిత పథకాలపై ఖర్చు చేస్తూ ప్రజలను ప్రలోభ పెడుతున్నారో తీసుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైనది. దేశంలో బ్రతుకుతెరువు లేక మన దేశ పౌరులు ప్రపంచ దేశాల్లో 3.7 కోట్ల మంది విదేశీ పౌరసత్వాన్ని తీసుకున్నారు. వీరందరూ ఉపాధి అవకాశాలు ఈ దేశంలో లేనందువలన వలస బాట పట్టిన వారే. ఈ వలస బాటలో మన దేశ కోటీశ్వరులు కూడా ఉన్నారు. 2013 -22 మధ్యకాలంలో 48,500 మంది కోటీశ్వరులు విదేశీ పౌరులుగా మారిపోయారు.

పెరిగిన బిలియనీర్లు 200

మనదేశంలో నూతన ఆర్థిక సంస్కరణల పేరుతో ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరిస్తున్నారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వలన మన ఆర్థిక వ్యవస్థ స్వేచ్ఛా వాణిజ్య పోటీ మార్కెట్ నుంచి గుత్త పెట్టుబడిగా తర్వాత నేటి కార్పొరేటీకరణ వరకు ప్రభుత్వ మద్దతుతోనే కొనసాగుతూ పెట్టుబడిదారీ వ్యవస్థగా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ ఉన్నది. ప్రపంచీకరణ తొలి రోజుల్లో (1991) భారత్‌లో పదిమంది కూడా లేని బిలినియర్ల సంఖ్య తాజా లెక్కల ప్రకారం 200కు చేరింది. ప్రభుత్వమంటే పెట్టుబడిదారీ వ్యవహారాలను చక్కబెట్టే యంత్రంగా మిగిలిపోవడం వల్లే నేడు దేశంలో పేదరికం, నిరుద్యోగం విలయతాండవం చేస్తున్నాయి. వెనుకబడిన కులాలు ఈ అభివృద్ధిలో పాలు పంచుకో లేనందువలన పేదరికం, నిరుద్యోగం ప్రబలమైపోతున్నది. నేడు దేశంలో ఆదాయ అసమానతలు బ్రిటిష్ వలస పాలనలో కన్నా ఎక్కువగా ఉన్నాయని అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నివేదికలు తెలియజేస్తున్నాయి.

కొద్దిమంది చేతుల్లో సంపద మేట

దేశంలో పెరుగుతున్న జీడీపీ ఎవరి జేబుల్లోకి పోతున్నది. 2022 లో 22.6% జాతీయ ఆదాయం ఉన్నత ఆదాయ వర్గాల ఒకే ఒక్క శాతం దగ్గర ఉన్నది. 1951లో ఈ ఒక్క శాతం జనాభా దగ్గర ఉన్నది 11.5% మాత్రమే. 1980 నాటికి 6 శాతానికి తగ్గిపోయినది. ఇలా ఆదాయాలని లబ్ధి పొందిన వారెవరు. అదే విధంగా ఉన్నత ఆదాయ వర్గం 10 శాతం జనాభా చేతిలో 1951లో 36.7 శాతం కాగా 2022 నాటికి 57.7% పెరిగిపోయినది. ఇలా ఆదాయాలని దక్కించుకున్న వారు ఎవరు? ఉన్నత కులాలవారా? దీనికి భిన్నంగా 2022 లో 50 శాతం జనాభా చేతిలో జాతీయ ఆదాయం కేవలం 15 శాతం మాత్రమే ఉంది. అయితే 1951లో ఈ 50 శాతం జనాభా వాటా 20.6 గా ఉన్నది. ఇలా పేదలు నిరుపేదలుగా మారడం, మిలియనీర్లు బిలియనీర్లుగా మారడం మన దేశంలోనే జరుగుతున్నది.

రెండు కులాలు.. నాలుగు కులాలు

2019లో మన ప్రధానమంత్రి మోడీ ప్రకారం దేశంలో రెండే రెండు కులాలు ఉన్నాయి. అవి పేదలు, రెండవది పేదలను అభివృద్ధి పరిచేవారు. అలా ఆనాడు అన్న ఆయన 2024 లో ఇప్పుడు దేశంలో నాలుగు కులాలు మాత్రమే ఉన్నాయి అవి ఒకటి స్త్రీలు, రెండు యువత, మూడు రైతులు, నాలుగు పేదలు అని అంటున్నారు. కులాల ద్వారా కులాల వలన కులాల చేత పాలన చేసే రాజకీయం వద్దంటున్నారు. పేదలను గుర్తించండి అని వారి అభివృద్ధికి పాటుపడాలని అంటున్నారు. దేశంలో ఎక్కువగా హింసకు గురవుతున్నది మహిళలే అని తద్వారా వారు ఆరోగ్యవంతమైన మానసిక స్థితి లేక నివాస సదుపాయాలు లేక నిరసించి పోతున్నారని అభిప్రాయపడ్డారు. పేదలు, పేదరికం ఈ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయని వీరి అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి జరుగుతుందని మన ప్రధానమంత్రి వాదన.

ఆధునిక ప్రజాస్వామిక, లౌకిక మార్గాలలో భారతదేశాన్ని నిర్మించాలంటే కుల ఆధారిత హిందూ సమాజానికి, దాని సంస్కృతికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం అవసరమని గ్రహించాలి. భారతదేశ సనాతన నాగరికత, సంస్కృతి కోటలు బీటలు పారందే సమ సమాజాన్ని నిర్మించలేం. పేదరికాన్ని నిర్మూలించలేం. 6400 కులాలు, ఆరు మతాలు, 1618 భాషలు, 29 రకాల పండుగలు ఉన్నటువంటి దేశంలో భిన్నత్వ కోణంలోనే కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పేదరికం, నిరుద్యోగం, ఆదాయ అసమానతలను నిర్మూలించగలం.

డా. ఎనుగొండ నాగరాజ నాయుడు

రిటైర్డ్ ప్రిన్సిపాల్

98663 22172



Next Story

Most Viewed