కేసీఆర్‌కి ఓటు, ఆంధ్రప్రదేశ్‌కి చేటు!

by Ravi |
కేసీఆర్‌కి ఓటు, ఆంధ్రప్రదేశ్‌కి చేటు!
X

కుట్ర రాజకీయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెను శాపంగా పరిణమించింది. ఎక్కడా లేని దుష్ట రాజకీయం ఆంధ్రప్రదేశ్‌లో పోగుబడింది. రాష్ట్రం, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలతో అభివృద్ధి చెందితే తెలంగాణ అభివృద్దిలో వెనకబడి పోతుందని, చంద్రబాబుని ఓడించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవాలన్న దురుద్దేశంతో 2019 ఎన్నికల్లో కేసీఆర్, జగన్ రెడ్డికి పరోక్షంగా సహకారం అందించి ఆంధ్రప్రదేశ్ ఆగం కావడానికి కారకుడు అయ్యారు. చంద్రబాబుపై ముప్పేట దాడి చేసి తెలుగుదేశం పార్టీని ఓడించడానికి కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డారు. కుళ్ళు రాజకీయంతో ఆంధ్రప్రదేశ్‌పై భస్మాసురహస్తం పెట్టారు. 2024 ఎన్నికల్లోనూ జగన్ రెడ్డే అధికారంలోకి రావాలని, కేసీఆర్, ఆయన కుటుంబం కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

విభజనతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ పట్ల పదేళ్లలో ఒక్కసారి కూడా కేసీఆర్ సానుకూలంగా వ్యవహరించకపోగా అసమర్ధుడికి సహకరించి ఆంధ్రప్రదేశ్‌ని కోలుకోలేని దెబ్బతీశారు. ఇటు జగన్ సైతం అధికారమే ముఖ్యంగా కేసీఆర్‌తో చేతులు కలిపి రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారు. ఇంత స్వార్ధ రాజకీయం ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యమేలుతుంటే రాష్ట్రమేగతిన బాగుపడుతుంది? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వెనుకబడి ఉండాలని కోరుకొంటున్న వ్యక్తితో చేతులు కలపడం ఎవరి ప్రయోజనాల కోసం? ఆంధ్రప్రదేశ్‌లో జగన్ రెడ్డే అధికారంలో వుండాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకు పోకూడదని కేసీఆర్ ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ ఎంత ఆగం అయితే కేసీఆర్‌కి అంత ఆనందం. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కి సహకారం అందిస్తున్నకేసీఆర్‌కి తెలంగాణాలో ఓటు వెయ్యడం వలన ఆంధ్రప్రదేశ్‌కి చేటు చేస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలి.

రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి..

జగన్ రెడ్డి, కేసీఆర్ మధ్య మరో బంధం బయటపడింది. రాయలసీమకు ఉరి బిగించే రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణం చేసి ప్రారంభించినా జగన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదు. విభజన చట్టం 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రాజెక్టుల జాబితాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇరు రాష్ట్రాలు కొత్తగా ఏ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నా విభజన చట్టం మేరకు అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి కావడంతో 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు డిండి ఎత్తిపోతల పథకాల నిర్మాణాన్ని నిలిపివేయాలని తీర్మానం చేశారు. తర్వాత 2019 ఎన్నికల్లో కేసీఆర్ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది. ఇరువురు అపూర్వ సహోదరులుగా వ్యవహరించారు. తర్వాత కేంద్ర జల వనరుల శాఖ మంత్రి షెకావత్ ఆధ్వర్యంలో జరిగిన రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో శ్రీశైలం జలాశయం నుంచి 90 టీఎంసీల నీటిని తోడుకొనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నోరు తెరవలేదు. అంతేకాకుండా కృష్ణానదీ జలాలు తిరిగి రెండు రాష్ట్రాల మధ్య సమానంగా పంపిణీ చేయాలని కేసీఆర్ డిమాండ్ చేసినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం చెప్పలేదు. కేసీఆర్ నిర్మించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అమలులోనికి వస్తే తనకు రాజకీయ జన్మనిచ్చిన రాయలసీమకు ఉరి బిగించబోతుందన్న ఆలోచన చెయ్యకుండా, 2016లో జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ తీర్మానాన్ని గుర్తు చేయకుండా జగన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాలకోసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కేసీఆర్‌కి తాకట్టు పెట్టారు. ప్రతిపక్ష నాయకుడుగా కాళేశ్వరం అక్రమం అని దీక్ష చేసిన జగన్ రెడ్డి, ముఖ్యమంత్రి కాగానే, కేసీఆర్ ఆహ్వానం మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లారు. జగన్, కేసీఆర్‌తో జతకట్టి

ఎన్నికల్లో సహకరించినందుకు ఆంధ్రప్రదేశ్‌కి దక్కాల్సిన ఆస్తులను జగన్ రెడ్డి తెలంగాణాకు ధారాదత్తం చేశారు. తెలంగాణాలో తన ఆస్తులు కాపాడుకోవడానికి ఆంధ్రా ఆస్తులు తెలంగాణాకి కట్టబెట్టారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన బిల్డింగులను అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణాకి అప్పగించారు. విభజన చట్టంలోని 9,10షెడ్యూళ్లలోని ఉమ్మడి సంస్థలన్నీ మావేనంటూ కేంద్ర హోంశాఖ సమక్షంలో కేసీఆర్ వాదించి షెడ్యూల్ 10లో సంస్థలు ఆంధ్రాకు సంబంధం లేదని బుకాయించారు. రెండు రాష్ట్రాల మధ్య జరగాల్సిన ఆస్తుల పంపకంపై కోర్టుకు వెళ్ళి ఆస్తులు పంపకం జరగకుండా అడ్డుకొన్న కేసీఆర్‌తో జగన్ చేతులు కలిపారు.

పోలవరంపై కేసులు వేసి అడ్డుకుంటున్నా, ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వాల్సిన రూ.6,000 వేల కోట్లు విద్యుత్ బకాయిలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వారితో చేతులు కలపడం ఎవరి ప్రయోజనాల కోసం? 2024లో ఎలాగైనా అధికారం చేపట్టాలన్నది జగన్ లక్ష్యం. అందుకోసం ఎంత దూరం అయినా వెళ్లాలన్నది జగన్ ఆలోచన. అందుకే సకల విద్యలు, విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. ఆ నాటకంలో భాగంగా మళ్లీ కేసీఆర్‌తో చేతులు కలిపి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీయడానికి పూనుకొన్నారు.

చంద్రబాబుకి పేరు వస్తుందని..

ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతూనే ఉంది. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి నిలిచిపోయిందని అప్పులు తప్ప అభివృద్ధి కనపడదని అందరూ అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసినా ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. ప్రభుత్వ ఆస్తులు పెరిగాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. నాయకుడికి ఉండే దార్శనికత, దూర దృష్టిని బట్టే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుంది. ఆ రెండూ లేకపోతే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతమున్న పరిస్థితులే ఉత్పన్నమవుతాయి.

2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి అతి కొద్ది సమయంలో అంతర్జాతీయ స్థాయిలో అమరావతికి వచ్చిన బ్రాండ్ ఇమేజ్‌ను, అంతర్జాతీయ వేదికలపై అమరావతిపై జరుగుతున్న చర్చను, అక్కడికి వస్తున్న పెట్టుబడులు చూసి ఓర్చుకోలేక పోయిన కేసీఆర్ కుట్రలకు తెరతీశారు. తెరవెనుక మంత్రాంగం నడిపి అమరావతిని పురిటిలోనే చంపేయాలని కంకణం కట్టుకొని జగన్‌కి 2019 ఎన్నికల్లో మద్ధతుగా నిలబడి గెలిచాకా, మూడు రాజధానుల సలహా ఇచ్చి అమరావతి రెక్కలు విరిసి ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని కూడా లేకుండా చేశారు. అద్భుత రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబుకి పేరు వస్తుందన్న దుష్ట బుద్దితో ఈ వికృత రాజకీయానికి పూనుకొన్నారు 2019 ఎన్నికల సమయంలో తెలంగాణలో కొన్ని సామాజిక వర్గాల నాయకులను ఏపీకి పంపించి కులాల మధ్య చీలికలు తెచ్చి జగన్‌కి అనుకూలంగా ప్రచారం చేయించడంతో పాటు జగన్‌కి వందల కోట్ల రూపాయల ధన సహాయం చేసి జగన్ అధికారంలోకి రావడానికి ఎంత చేయాలో అంత చేసి నేడు ఆంధ్రప్రదేశ్ బలిపీఠంపైకి నెట్టారు కేసీఆర్.

అప్పుడే.. ఆంధ్ర తిరోగమన బాట!

కేసీఆర్ చేసిన దారుణ దగాకి, సంకుచిత రాజకీయానికి రెక్కలు తెగేసిన జటాయువులా అమరావతి నిట్టనిలువునా కుప్పకూలింది. అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన అన్నదాతలు నాలుగేళ్లుగా దిక్కులు పిక్కటిల్లేలా ఆర్తనాదాలు చేస్తున్నారు రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారు. అమరావతిపై కక్షగట్టి, నవ్యాంధ్ర కోలుకుంటే కష్టమని అనేక కుట్రలకు తెరలేపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ ఒక వెలుగు వెలిగింది. పెద్ద ఎత్తున హైదరాబాద్ నుండి రియల్టర్లు అమరావతికి బారులు తీరారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. ప్రపంచం అంతా అమరావతి వైపు చూసింది. ఎప్పుడైతే మూడు రాజధానుల ప్రకటన వచ్చినదో అప్పుడే ఆంధ్రప్రదేశ్ తిరోగమన బాట పట్టింది. చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు కంపెనీలు,పెట్టుబడులు అన్నీ ఆంధ్రప్రదేశ్‌కి తరలించుకు పోయారని, ఇప్పుడు ఆ బాధ లేదని రియల్ ఎస్టేట్ రంగం బాగా కోలుకొన్నదని కేటీఆర్ కూడా అన్నారు. పక్క రాష్ట్రంలో రాజధాని పనులు ఆపేయడం, ఇసుక తవ్వకం ఆపేయడం మన రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగానికి కలిసొచ్చిన అదృష్టం అని బిల్డర్ అసోసియేషన్ మీటింగ్‌లో అన్నారు హరీష్‌రావు.

ఆంధ్రప్రదేశ్‌లో బిల్డింగ్‌ల నిర్మాణం ఆపెయ్యడంతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగమే కాకుండా భూముల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. తన రాజకీయ, ఆర్ధిక, ఆస్తులు కాపాడుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్‌ని నాశనం చేసి పొరుగు రాష్ట్రం తెలంగాణా అభివృద్ధి చెందే విధంగా నిర్ణయాలు తీసుకొన్నారు జగన్ రెడ్డి. మూడు రాజధానుల సలహా ఇచ్చి అమరావతి రెక్కలు విరిసి ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని కూడా లేకుండా చేసిన పాపం కేసీఆర్‌దే. కేసీఆర్ అంతర్నాటకం, జగన్ జగన్నాటకం ఆంధ్రప్రదేశ్‌ని అధోగతి పాలు చేశాయి. ఎవరైనా అభివృద్ధిలో పోటీ పడతారు కానీ ఈ విధమైన కుట్రలతో సమర్థులను, అభివృద్ధి కారకులను ఓడించి అసమర్ధులకు ఎదురు డబ్బులు ఇచ్చి గెలిపించి, ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు గుర్తించాలి. కావున తెలంగాణలో కేసీఆర్‌కి ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్‌కి చేటు చేస్తుందని తెలంగాణాలో వున్న ఆంధ్రులు గుర్తించాలి.

నీరుకొండ ప్రసాద్

సీనియర్ జర్నలిస్టు

98496 25610

Next Story

Most Viewed