డేంజర్‌ జోన్‌లో.. హిమాలయ నగరాలు!

by Disha edit |
డేంజర్‌ జోన్‌లో.. హిమాలయ నగరాలు!
X

హిమాలయ పర్వత సానువుల్లోని రాష్ట్రాల్లో ప్రకృతి కన్నెర్ర చేసింది. అక్కడ జల ప్రళయాలు పెరిగిపోయాయి. విరామం లేకుండా ఎడాపెడా భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు పర్వత ప్రాంతాల్లో కట్టిన ఇండ్లు పేకమేడల్లా కూలిపోయాయి. తెరిపి అనేదే లేకుండా భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. హిమాలయ రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు సంభవించటం ఇదే తొలిసారి కాదు. 2013 అలాగే 2020 సంవత్సరాల్లోనూ హిమాలయ రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా భారీ సంఖ్యలో మరణాలు సంభవించాయి. అంతేకాదు ఆస్తి నష్టం కూడా భారీగా జరిగింది.

ప్రకృతి విపత్తులు అంటూ..

వాస్తవానికి హిమాలయ నగరాల నిర్మాణం భిన్నమైంది. ఇసుక, రాతి నిక్షేపాలపై ఈ నగరాలు ఏర్పడ్డాయి. అయితే మనుషులు నివసించడానికి ఇది అనుకూలమైన నేలకాదు. హిమాలయ నగరాల్లో భారీ నిర్మాణాలు ఏమాత్రం పనికిరావంటారు పట్టణాభివృద్ధి వ్యవహారాల నిపుణులు. అయితే ఈ మౌలిక సూత్రాన్ని అక్కడి ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయి. దరఖాస్తు చేసుకోవడమే తరువాయి భారీ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నాయి. దీంతో రియల్టర్లు ఎడాపెడా భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. సొమ్ములు చేసుకుంటున్నారు. హిమాలయ నగరాల దుస్థితికి ప్రభుత్వాల తీరే ప్రధాన కారణం అంటూ మండిపడుతున్నారు. మైదాన ప్రాంత నగరాలకు అనువైన అభివృద్ధి ప్రణాళికలను భౌగోళికంగా ఎంతో భిన్నంగా ఉండే హిమాలయ నగరాల్లో అమలుచేస్తుండడమే అనేక సమస్యలకు కారణమవుతోంది. కమిటీల సూచనలను పెడచెవిన పెట్టి ఆదాయానికి పెద్దపీట వేస్తూ అశాస్త్రీయ అభివృద్ధి ప్రణాళికలను ప్రభుత్వాలు రూపొందిస్తున్నాయి. తమ లోపాలు, నిర్లక్ష్యం బయటపడకుండా ప్రకృతి విపత్తులు పేరు చెప్పి తప్పించుకోవడానికి పాలకవర్గాలు ప్రయత్నిస్తున్నాయని నిపుణుల ఆరోపణ.

అభివృద్ధి పేరుతో వినాశనం

జోషిమఠ్‌, అభివృద్ధి పేరుతో జరుగుతోన్న వినాశనానికి ఒక సజీవ ఉదాహరణ. ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ను ఈ ఏడాది జనవరి నెలలో విపత్తు ప్రాంతంగా ప్రకటించింది ప్రభుత్వం. హిమాలయ పర్వత ప్రాంతంలో ఉంటుంది ఈ పట్టణం. ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ పట్టణంలో దాదాపు నాలుగున్నర వేల సంఖ్యలో ఇండ్లున్నాయి. ఈ ఏడాది జనవరి నెలలో దాదాపు వెయ్యి ఇండ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో జోషిమఠ్‌ వాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మంచు కొండల రాష్ట్రంలోని జోషిమఠ్ మౌలికంగా శిథిలాల మీద నిర్మితమైన పట్టణం. ఇక్కడ తరచూ కొండచరియలు విరిగి పడుతుంటాయి. కొన్నేళ్ల కింద‌టి నుంచి ఈ ఉపద్రవాలు సంభవిస్తూనే ఉన్నాయి. ప్రజలు వీటికి అలవాటుపడ్డారు. అయితే ఇటీవల ఉపద్రవాల తాకిడి ఎక్కువ అయింది. దీంతో ఈ ఏడాది జనవరి నెల ప్రాంతంలో జోషిమఠ్‌ హాట్ టాపిక్‌గా మారింది.

చమోలి జిల్లాలో హిమాలయ పర్వత పాదాల వద్ద ఓ పెద్ద పర్వతానికి దిగువన ఉంది జోషిమఠ్‌. ఉత్తరాన అలక్‌నంద నది.. తూర్పున ధౌలి గంగ.. మధ్యన భారీ కొండచరియపైన ఉంది జోషిమఠ్‌ పట్టణం. జోషిమఠ్‌ అడుగున ఉన్న నేల కొండచరియ. దీంతో భూమి లోపలి మట్టి, రాళ్లు ఎక్కువ బరువు మోసే అవకాశం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. పురాతన కాలంలో ఓ పెద్ద పర్వతం నుంచి జారిపోయిన పెద్ద కొండచరియపైనే ఈ ప‌ట్ట‌ణం ఉండటం ప్రధాన కారణమని చెబుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా రోడ్లు, ఇళ్లు, ప్రాజెక్టులు పెరగడంతో ఇక్కడి నేలపై మోయలేని భారం పడటం మరో కారణం. జోషిమఠ్‌లో డ్రైనేజీ సిస్టం దారుణంగా ఉంటుంది. వరదలతో నాలాలు పూడుకుపోవడంతో వాన నీళ్లు, ఇళ్ల నుంచి విడుదలవుతున్న నీళ్లు ఇక్కడి మట్టిలోనే ఇంకిపోతున్నాయి. ఫలితంగా ఏటవాలుగా ఉన్న ఈ ప్రాంతం నుంచి నీళ్లు ఇంకిపోతూ లూజ్‌ మట్టి కరిగిపోయి నేల కుంగుతోంది. అభివృద్ధి పేరుతో పర్యావరణానికి తూట్లు పొడవటమే ప్రస్తుత అనర్థాలకు కారణం. జోషిమఠ్‌లో ఇలాంటిదేదో జరుగుతుందని చాలా కాలం కిందటే పర్యావరణవేత్తలు హెచ్చ‌రించారు. పర్యావరణానికి తూట్లు పొడవటం వల్ల భవిష్యత్తులో సంభవించే పరిణామాల గురించి అప్పట్లోనే పాలకులను హెచ్చరించారు. అయితే వీరి హెచ్చరికలను పాలకులు పెడచెవిన పెట్టారు. దీని ఫలితాన్నే జోషిమఠ్ ప్రజలు అనుభవిస్తున్నారు.

ఎడాపెడా అడవుల నరికివేత

అడవులను భూమికి ఊపిరితిత్తులుగా పేర్కొంటున్నారు. అయితే కొంతకాలం నుంచి అడవుల నరికివేత విశృంఖలంగా సాగుతోంది. ఫలితంగా చెట్లు కనిపించడం లేదు. అన్ని దేశాల్లోనూ ఎడాపెడా చెట్లను నరికివేస్తున్నారు. అభివృద్ధి కోసం చెట్లను నరికివేయడం తప్పదంటున్నారు పాలకులు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రస్తుత దుస్థితికి అడవుల నరికివేత కూడా ఒక కారణం. మ‌న‌దేశంలో ఒక వైపు విచ్చలవిడిగా అడ‌వుల‌ను న‌రికి వేస్తుంటారు. మ‌రో వైపు చెట్ల సంరక్షణ పేరుతో అక్కడక్కడా మొక్కలు నాటుతుంటారు. అభివృద్ధి పేరుతో అడ‌వుల న‌రికివేత చాలా కాలంగా యధేచ్ఛగా సాగుతోంది. ఈ విధ్వంస‌కాండ అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. దీంతో ఏడాదికేడాది అడ‌వుల విస్తీర్ణం త‌రిగిపోతోంది. అడ‌వుల‌ నరికివేత ప్రభావం ముందుగా ప‌ర్యావ‌ర‌ణం మీద పడుతోంది. చెట్ల న‌రికివేత ప‌ట్ల పాల‌కుల వైఖ‌రి మార‌క‌పోవ‌డంపై పలువురు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణంపై ముందుగా ప్రభుత్వాల వైఖరి మారాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి, పర్యావరణం ఈ రెండూ వేర్వేరు అంశాలన్న మైండ్‌సెట్‌ మారాలి. అభివృద్ధిలో భాగంగానే చెట్లను చూడాలి. అప్పుడే, మనం చెట్లను రక్షించుకోగలం. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులన్నీ మానవ తప్పిదాలే. ఇసుక, రాతి నిక్షేపాలపై ఏర్పాటైన హిమాలయ నగరాల్లో భారీ నిర్మాణాలకు తక్షణమే ఫుల్‌స్టాప్ పెట్టాలి. దీంతోపాటు వరదలు, భారీ వర్షాలు వచ్చే అవకాశాలుంటే ముందుగా హెచ్చరించే పక్కా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే పర్యాటక కేంద్రాలుగా మారిన హిమాలయ నగరాలను కాపాడుకోగలుగుతాం.

-ఎస్‌. అబ్దుల్ ఖాలిక్‌,

సీనియర్ జర్నలిస్ట్‌

63001 74320



Next Story

Most Viewed