హనుమాన్ విజయ యాత్ర…

by Disha edit |
హనుమాన్ విజయ యాత్ర…
X

వీర హనుమాన్ విజయయాత్ర.. ఇది హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ్ దళ్ నిర్వహించే హిందూ శక్తి ప్రదర్శన ర్యాలీ. హిందూ భరోసా ర్యాలీ ఇది. ధర్మ పరిరక్షణకు హిందూ.. ఐక్యతకు నిదర్శనం ఈ ర్యాలీ. ఏటా చైత్ర మాసంలో వచ్చే హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా యువకులు హనుమాన్ దీక్ష చేపట్టి.. నియమ నిష్టలు, భక్తిశ్రద్ధలతో కాషాయ వస్త్రాలు ధరించి 41 రోజుల పాటు దీక్ష చేపట్టి హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం.. ఆ తర్వాత జయంతి రోజున కనీవినీ ఎరుగని రీతిలో భారీ శోభాయాత్ర నిర్వహించడం భాగ్యనగర్ బజరంగ్ దళ్ ప్రత్యేకత.

మూడో దశాబ్దంలోకి..

ఈసారి నిర్వహించే బజరంగ్ దళ్ శోభాయాత్రకు ఓ ప్రత్యేకత ఉంది. 2004వ సంవత్సరంలో కేవలం 26 ద్విచక్ర వాహనాలతో ప్రారంభమైన హనుమాన్ జయంతి బైక్ ర్యాలీ.. నేడు మహాసంద్రమై రెండు లక్షల బైకులతో హిందూ యువ సైనికులు ర్యాలీలో పాల్గొనడం విశేషం. 2004లో ప్రారంభమైన హనుమాన్ జయంతి కార్యక్రమాలు రెండు దశాబ్దాలు పూర్తిచేసుకుని మూడో దశాబ్దంలోకి అడుగుపెట్టడం సంతోషకరం. హనుమంతుడికి ప్రీతిపాత్రమైన దైవం శ్రీరాముడు. 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మించడం కూడా ఇదే సంవత్సరం జరగడం యాదృచ్ఛికం. ఈ సంవత్సరం అయోధ్యలో రామ మందిరం ప్రారంభం.. యాత్ర ప్రారంభమై రెండు దశాబ్దాలు పూర్తి చేసుకొని మూడు దశాబ్దంలోకి అడుగుపెట్టడం.. ఇలా రెండు ఘట్టాలు ఒకేసారి కలిసి రావడంతో కార్యకర్తల ఆనందానికి అవధుల్లేవు.

వీర హనుమాన్ విజయయాత్రలు

భాగ్యనగర్ కేంద్రంగా ప్రారంభమైన ఈ ర్యాలీలు నేడు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నగరాలతో పాటు, జిల్లా, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల దాటుకొని కొండకోనల్లోని గిరిజన ప్రాంతాల్లో కూడా నేడు వీర హనుమాన్ విజయ యాత్రలు దిగ్విజయంగా కొనసాగుతూ ఉన్నాయి. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సాధించిన విజయం. ఆయా గ్రామ సీమల్లో విశ్వహిందూ పరిషత్ కమిటీలు లేకపోయినప్పటికీ యువకులంతా సంఘటితమై హనుమంతుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, కాషాయ జెండాలు చేతబట్టి వైభవంగా ర్యాలీలు నిర్వహిస్తుండటం హిందూ సంఘటనకు ప్రతిరూపం. తెలంగాణ రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు 3500 గ్రామాల్లో వీర హనుమాన్ విజయ యాత్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వినాయక చవితి ఉత్సవాలు అంటే ముంబాయి, పూణే కు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో.. హనుమాన్ జయంతి అంటే దేశవ్యాప్తంగా భాగ్యనగర్‌కు అంతే ప్రాముఖ్యం ఉంటుంది.

పగుడాకుల బాలస్వామి

ప్రచార ప్రముఖ్

విశ్వహిందూ పరిషత్

99129 75753



Next Story

Most Viewed