జలదృశ్యం నుంచి జలధార‌ దాకా

by Disha edit |
జలదృశ్యం నుంచి జలధార‌ దాకా
X

టీఆర్‌ఎస్ సబ్బండ వర్ణాలను ఏకతాటి మీదకు తెచ్చి తెలంగాణా రాష్ట్రాన్ని సాకారం చేసింది. 2014 మే నెలలో జరిగిన ఎన్నికలలో పక్కా పొలిటికల్ పార్టీగా బరిలోకి దిగింది. ప్రజలు టీఆర్ఎస్‌కే పట్టం కట్టారు. 2014 జూన్ 2న కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. 'నీళ్లు, నిధులు, నియామకాలు' అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఈ ఏడున్నరేండ్ల పాలనలో ఇక్కడి భౌగోళిక, సాంస్కృతిక అంశాలను మేళవించి పాలన సాగించింది. రైతులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు, సబ్బండ వర్గాలు అకుంఠిత దీక్షతో బలమైన ఆకాంక్షతో చేసిన పోరాట ఫలితాలు ఒక్కొక్కటిగా అవిష్కరించబడుచున్నాయి. బీడు భూములకు సాగునీరు, ఇంటింటికీ మంచినీరు అందుతున్నది.

ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి 21 వసంతాలు విజయవంతం గా పూర్తి చేసుకుంది. రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ వస్తుందన్న భావనతోనే కేసీఆర్ టీడీపీ సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. రాజకీయ పార్టీకి ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శనం చేశారు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్ సమీపంలోని జలదృశ్యం కేంద్రంగా 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పురుడు పోసుకుంది. ఏడాదికి పైగా జలదృశ్యంలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకలాపాలు సాగాయి. 2001 మే 17న కరీంనగర్‌ ఎస్‌‌ఆర్‌‌ఆర్‌ కాలేజీ గ్రౌండ్‌‌లో నిర్వహించిన 'సింహగర్జన‌' సభ ఉమ్మడి ఏపీ రాజకీయాలలో పెను మార్పులకు బీజం వేసింది.

ప్రత్యేక రాష్ట్రమే ఏకైక ఎజెండాగా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రయాణంలో వైఫల్యాలు, విజయాలు దోబూచులాడాయి. పార్టీ ప్రస్థానం పడిలేచిన కెరటాన్ని తలపిస్తుంది. పడిపోయిన ప్రతీసారి లేచి తన ఉనికిని కాపాడుకుంది. తెలంగాణ ఆకాంక్ష, నినాదం, భావన వ్యక్తిగత స్థాయి నుంచి వ్యవస్థీకృతంగా మార్చడంలో, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను వ్యాపింపచేయడంలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. తెలంగాణవాదం బలహీనపడుతోందని భావించిన ప్రతిసారీ టీఆర్ఎస్ రాజీనామాలనే అస్త్రంగా ప్రయోగించింది. కోవర్టుల కారణంగా పార్టీ చాలా సార్లు చీలికలకు గురైంది. ఒకానొక దశలో పార్టీ మనుగడే ప్రశ్నార్థంగా మారింది. టీఆర్ఎస్ ఒక పార్టీనా? అని నవ్విన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతి తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సంఘటనలు టీఆర్ఎస్‌కు కలసివచ్చాయి. పద్నాలుగేండ్లపాటు అవిశ్రాంతంగా ఉద్యమాన్ని సాగించిన కేసీఆర్‌ అనుకున్నది సాధించి సక్సెస్ అయ్యారు.

బుడిబుడి నడకలనాడే

పార్టీ పెట్టిన కొన్ని నెలలకే స్థానిక సంస్థలకు ఎన్నికలు వచ్చాయి. టీఆర్ఎస్ ఊహించని స్థాయిలో సీట్లు గెలుచుకుంది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్‌ పదవులు టీఆర్ఎస్ వశం అయ్యాయి. కేసీఆర్ తెలంగాణలోని పది జిల్లాలలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణ భావజాలాన్ని వ్యాపింపజేశారు. టీఆర్ఎస్ కంటే ముందే పుట్టిన పార్టీలు కనుమరుగయ్యాయి. కొన్ని కాంగ్రెస్‌లో కలిసిపోయాయి. మంత్రి పదవి ఇవ్వనందునే కేసీఆర్ పార్టీ పెట్టారని, టీడీపీ నేతల నుంచి చౌకబారు విమర్శలొచ్చాయి. టీఆర్ఎస్‌కు ఆదరణ పెరగడంతో అప్పుడు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయాలని భావించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉంటేనే కాంగ్రెస్‌తో కలవడానికి సిద్ధమని టీఆర్ఎస్ ప్రకటించింది. కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోవడంతో 2004 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీకి దిగాయి. టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. 42 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ 26 స్థానాలు గెలుచుకుంది. ఆరు లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసి ఐదు చోట్ల గెలుపొందింది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కూడా తెలంగాణ ఏర్పాటు విషయంలో నాన్చివేత ధోరణే అవలంబించింది. కాంగ్రెస్ జెండాతో మంత్రి పదవి పొందిన కేసీఆర్ దమ్ముంటే ఎంపీ స్థానానికి కూడా రాజీనామా చేసి గెలవాలని కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణ రావు సవాలు విసిరి గేలి చేసారు. ఆ సవాలును స్వీకరించిన కేసీఆర్ కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికలలో కరీంనగర్ ఫలితం తెలంగాణకు రెఫరెండం అని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందరు అనుకున్నట్లుగానే టీఅర్ఎస్‌కు ప్రజలు భారీ మెజార్టీ కట్టబెట్టారు. కేసీఆర్ దాదాపు రెండు లక్షల మెజారిటీతో మరోసారి ఎంపీగా గెలిపించారు. ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాతపెట్టారు.

కేంద్రం మీద ఒత్తిడి

సోనియాగాంధీ కోరిక మీద కేసీఆర్ షిప్పింగ్ శాఖా మంత్రిగా కేంద్రంలో చేరారు. డీఎంకే తమకే షిప్పింగ్ శాఖ కావాలని పట్టుబట్టడంతో కేసీఆర్ తన శాఖను వదులుకున్నారు. ఆరు నెలల పాటు ఏ శాఖ లేని మంత్రిగా కొనసాగారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారు. ప్రణబ్‌ముఖర్జీ నేతృత్వంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణకు అనుకూలంగా దాదాపు 36 పార్టీలు లేఖ ఇవ్వడంలో టీఆర్ఎస్ పార్టీ కృషి చేసింది. రోశయ్య హయాంలో హైదరాబాద్ ఫ్రీ జోన్ వివాదం తెర ముందుకు రావడం ఉద్యమానికి ఆజ్యం పోసింది. 'కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో' అంటూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఉద్యమం ఉధృతం అయింది. దిగివచ్చిన యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు దిశగా ప్రక్రియ ప్రారంభిస్తామంటూ 2009 డిసెంబర్ 9న ప్రకటన చేసింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో డిసెంబర్ 23న ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తెలంగాణ ఏర్పాటుపై అందరి అభిప్రాయాలను సేకరించేందుకు శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ దశలో టీఆర్ఎస్ మిగిలిన పార్టీలతో కలిసి తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడింది. జేఏసీ ఉమ్మడి పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై శ్రీకృష్ణ కమిటీకి ప్రత్యేక నివేదికను తయారు చేసి ఇచ్చింది. ఎట్టకేలకు 2013లో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

అందరినీ ఏకం చేసి

టీఆర్‌ఎస్ సబ్బండ వర్ణాలను ఏకతాటి మీదకు తెచ్చి తెలంగాణా రాష్ట్రాన్ని సాకారం చేసింది. 2014 మే నెలలో జరిగిన ఎన్నికలలో పక్కా పొలిటికల్ పార్టీగా బరిలోకి దిగింది. ప్రజలు టీఆర్ఎస్‌కే పట్టం కట్టారు. 2014 జూన్ 2న కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. 'నీళ్లు, నిధులు, నియామకాలు' అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఈ ఏడున్నరేండ్ల పాలనలో ఇక్కడి భౌగోళిక, సాంస్కృతిక అంశాలను మేళవించి పాలన సాగించింది. రైతులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు, సబ్బండ వర్గాలు అకుంఠిత దీక్షతో బలమైన ఆకాంక్షతో చేసిన పోరాట ఫలితాలు ఒక్కొక్కటిగా అవిష్కరించబడుచున్నాయి. బీడు భూములకు సాగునీరు, ఇంటింటికీ మంచినీరు అందుతున్నది.

తెలంగాణ జీఎస్‌డీపీ 2014-2015లో రూ. 5,05,849 కోట్లు ఉంటే, 2021-22 లో 11,54,860 కోట్లకు పెరిగింది. అంతర్జాతీయ ఐటీ, ఫార్మా, పరిశ్రమల సంస్థలు 2.21 లక్షల కోట్ల పెట్టుబడులతో 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాయి. 2014 నుంచి 1,33,942 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. ఈ ఏడాది 91,142 ఉద్యోగాల ప్రకటనతో దేశం ఉలిక్కిపడింది. తెలంగాణలో సమకూర్చుకున్న ప్రతి రూపాయి ఉపయోగపడే విధంగా రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణలక్ష్మి, ఆసరా, దళితబంధు లాంటి అనేక సంక్షేమ‌ పథకాలు అప్రతిహతంగా కొనసాగుచున్నాయి. దేశం అంతటా సంక్షేమ‌ పథకాలు అమలు కావాలంటే టీర్ఎస్ జాతీయ పార్టీగా ఎదగాల్సిన అవసరం ఉంది.

డా. సంగని మల్లేశ్వర్

జర్నలిజం విభాగాధిపతి

కేయూ, వరంగల్

98662 55355



Next Story

Most Viewed