స్నేహం అనంతానంత జీవన సౌందర్యం

by Disha edit |
స్నేహం అనంతానంత జీవన సౌందర్యం
X

'బాధల గాథలు బొక్కెనతో చేది

తల్లడిల్లిన మనసును సేద తీర్చేందుకు

సావాసగాళ్లు ఒక్కరిద్దరైనా ఉండాలి

తీగ పందిరి మీద పారినట్టుగా

మిత్రుత్వమూ పొంతనగా ఎదగాలి'

స్నేహానికి సంబంధించిన ఈ కవితా పంక్తులు 'వరి గొలుసులు' కవితా సంపుటిలోనివి. ఈ సహృదయ సౌందర్యంలో జీవించడం ఎలా ఉంటుందనేది ఇటీవల జరిగిన ఒక వాట్సాప్ గ్రూప్ 'గెట్ టు గెదర్' సమావేశంలో వ్యక్తం అయ్యింది. ఆ గ్రూప్‌లోని సభ్యులు కొందరు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నవారు. కొందరు సామాజిక సేవా సంస్థలలో పని చేస్తున్నవారు. మరికొందరు ఇతర వృత్తులవారు. ఉద్యోగాలు చేసి అలసి విశ్రాంతి తీసుకుంటున్న వారు ఇంకొందరు. అందరికీ ఏ తక్షణ సమస్యలు లేవు. వేరు వేరు చోట్ల వేరువేరుగా జీవిస్తున్నవారు. అందరిని కలిపి 2013లో గ్రూప్ క్రియేట్ చేసి కలిపింది మరొక సహృదయుడు.

తన గురించి చివరగా చెబుతాను. అయితే ఆ సమావేశంలో అందరూ స్నేహ పరిమళం వెదజల్లే వారు. నిజానికి ఎంత ఎదిగినా అందరి వృత్తిలో ఏదో తెలియని ఒత్తిడి ఉండి ఉంటుంది. పై వారి నుంచి ఫోర్స్, ఆ ఫోర్స్ కాస్త కిందికి ప్రసరింపజేయడం, ఇందులో విసుగు, చిరాకు, పరాకులు సాధారణంగానే కన్పిస్తాయి వీటన్నిటి నుంచి స్వచ్ఛమైన మల్లెపువ్వులా నవ్వుతూ పరిమళించే వాళ్ళు కొందరు ఉంటారు. అట్లాంటి తెల్ల కాయిదంలాంటి నిష్కల్మష మనస్తత్వం ఉన్న బృందం ఇది.

అనుభూతులు నెమరు వేసుకుని

ఈ బృందంలో వ్యాసకర్త కూడా ఉన్నాడు. కొందరు సాహిత్య అభిమానులు ఉన్నారు. మనిషికి కుటుంబంలోనైనా, ఆఫీసులోనైనా, స్నేహబృందంలోనైనా ఇగోతోనే సమస్య. అహంకారపు అంగి ని విడిచేస్తే హాయిగా గాలి వీస్తుంది. ఈ అహం 'నేను గొప్ప, అంతా నేనే, నాదే నడవాలె, నేను చెప్తున్నా కదా' అనేది. ఈ నేను అనే పదమే మనిషిని అథ:పాతాళానికి తొక్కివేస్తుంది. అథ:పాతాళం అంటే ఆయనకు ఏం కాదు, ఆనందంగా, సంబరంగా, నవ్వుతూ, తుల్లుతూ జీవించలేడు. ముఖం అంతా మూడ్చుకొని ఏదో కోల్పోయినట్టు గా బతుకుతాడు. జీవితంలో సారం లేదు. జీవన సౌందర్యాన్ని అనుభవించ లేడు.

ఈ వాట్సాప్ 'గెట్ టు గెదర్' లో ఒక జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి మాట్లాడుతూ తన బాల్యం అనుభూతులను నెమరు వేసుకున్నారు. 'నన్ను ఏమిరా! ఫోన్ చేస్తలేవు, ఏందిరా? అని తిట్టే స్నేహితులు దూరమవుతున్న కాలం ఇది' అన్నారు. సోపతిగాళ్లతో 'రారా పోరా' అనేది ఎంత గమ్మతి అన్నారు. మరొక మిత్రుడు మాట్లాడుతూ 'స్వచ్ఛమైన మనస్తత్వం, ఇతరులకు సహాయం చేసుకోవాలనుకునే తత్వం గల అందరం ఇక్కడ జమయినాం. ఇది ఎంత ఆనందంగా ఉన్నది' అన్నారు. సమావేశం మొత్తం పాటలు ఆటలతో సాగింది. జీవితంలోని ఈస్తటిక్స్ పట్టుకోవాలి, దానికి మానవ సంబంధాల పట్ల స్వార్థ రహిత ప్రేమ ఉండాలి అంటారు.

ఇంతకూ ఆ వాట్సాప్ గ్రూప్ పేరు 'ఎస్‌పీ ఫ్రెండ్స్' దాని అడ్మిన్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, కరీంనగర్ అడిషనల్ కలెక్టర్. స్నేహం అంటే చాలా ఇష్టం. తను మాట్లాడుతూ 'నేను పనిచేసిన చోటల్లా వివిధ రంగాలకు చెందిన సహృదయ స్నేహశీలురతో ఈ గ్రూప్ ఏర్పాటు చేశాను' అన్నారు. గ్రూప్ సభ్యునికి ఉండాల్సింది ముఖ్యంగా స్నేహపూరిత, సహృదయత మాత్రమే. ఇంకా ఎందరో ఇట్లాంటివారు ఉన్నారు. దీనిని 2013 లో ఏర్పాటు చేశారు. రోజూ ఉదయం ఒక సుభాషితాన్ని గ్రూప్‌లో పెడతారు. ఒక మిత్రుడు దిన పత్రిక పెడతారు. కొందరు పాత పాటలను షేర్ చేస్తారు. మరికొందరు ఆహ్లాదకర జోకులు పేలుస్తారు.

చాలా మందికి తెలియదు కానీ, అందరి పుట్టిన రోజులు, పెళ్లి రోజులు అడ్మిన్ దగ్గర ఉంటాయి. ఆయా రోజులలో వారికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతుంది. ఇందులో ఉన్నతస్థాయి ఉద్యోగులతోపాటు కింది స్థాయి వాళ్లు కూడా ఉన్నారు. హెచ్చుతగ్గులు లేవు. అంతా సమానమనే దృక్పథంతో నడుస్తున్న గ్రూప్ సమావేశం నవ్వులు పూయించింది. పాటలు కవిత్వం పద్యాలు ఉండనే ఉన్నాయి. చాలా మంది దగ్గర అధికారం, డబ్బు, ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి కానీ, ఆనందంగా జీవించడం తక్కువ కన్పిస్తుంది. మనిషికి సాధారణత అవసరం. సామాన్యత అత్యవసరం. ముఖ్యంగా సాటి మనిషిని ప్రేమించడం, సహృదయ సంస్కారాన్ని ఇతరులకు పంచడం అవసరం. అట్లాంటి అనంతానంత జీవన సౌందర్యం వెల్లివిరియాలి.

అన్నవరం దేవేందర్

9440763479



Next Story

Most Viewed