రామప్పకు శాశ్వత హెరిటేజ్ హోదా రావాలి

by Disha edit |
రామప్పకు శాశ్వత హెరిటేజ్ హోదా రావాలి
X

రాష్ట్రంలో తొలిసారి ములుగు జిల్లా వెంకటాపురం మండలం, పాలంపేటలోని రామప్ప గుడికి గుర్తింపు దక్కడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు సంబరపడ్డారు. గుర్తింపు ఇచ్చే సమయంలో నార్వే దేశం ప్రతినిధులు వ్యతిరేకించడంతో కొన్ని షరతులతో తాత్కాలిక గుర్తింపు ఇస్తున్నట్లు హెరిటేజ్ కమిటీ తెలిపింది. 2022 డిసెంబర్‌లోగా ఆలయ ఆవరణలో ఉన్న రామేశ్వరాలయాన్ని (సభా మండపం) పునరుద్దరించాలని, రామప్ప పరిసర ప్రాంతాలలోని పది ఉప ఆలయాలను వినియోగంలోకి తీసుకురావాలని, ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని షరతులు విధించింది. హెరిటేజ్ కమిటీ యునెస్కో విధించిన గడువు లోపు అవి పూర్తిచేస్తే అధికారికంగా రామప్పకు యునెస్కో శాశ్వత గుర్తింపు పత్రం దక్కుతుంది.

కాకతీయ రాజులు ఏలిన గడ్డ, స్వయంభువుగా వెలసిన ఆలయాలు, సహజ సౌందర్యం ఉట్టిపడే శిల్ప సంపద, నదులు, జలపాతాలు, ధర్మ రాజ్య పరిపాలన జరిగిన ప్రాంతంగా చరిత్ర పుటలలో నమోదైన ప్రాంతం ఓరుగల్లు. దీనికి ఘనమైన చరిత్ర ఉంది. ఎన్నో ఆలయాలు, గొలుసు చెరువులు, రాజమందిరం, కోట కట్టడాలతో ఓరుగల్లు పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతున్నది. వరంగల్ ఉమ్మడి జిల్లా దేశంలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. కాకతీయ రాజులు(kakatiya kings) ఎంతో విశిష్ట రీతిలో, అద్భుత శిల్ప సంపదతో రామప్ప పేరిట శివాలయాన్ని నిర్మించారు. ఎందరో నాట్యకారులు రామప్ప గుడిలో ప్రదర్శనలు నిర్వహించారు. ఎందరో సంగీత విద్వాంసులు, నాట్యాచార్యులు ఆలయాన్ని దర్శించారు.

కాకతీయ శిల్ప శైలి

అద్భుత శిల్ప సంపద కలిగిన కట్టడాలు దేశంలో చాలానే ఉన్నాయి. అదే కోవలో అనేక చారిత్రక నిర్మాణాలు కలిగిన తెలంగాణ రాష్ట్రంలో చరిత్రకు నిలువుటద్దంగా కాకతీయ సామ్రాజ్య(kakatiya kingdom) కీర్తి పతాకాన్ని ఎగురవేసిన కట్టడాలు వరంగల్ జిల్లాలోనూ ఉన్నాయి. రామప్ప క్షేత్రంలో కాకతీయ శిల్ప శైలి(kakatiya architechture) చూపరులను అలరిస్తుంది. పన్నెండు మంది మదనికల శిల్పాలు, ఆరుగురు నర్తకీమణుల శిల్పాలు, ఇద్దరు ధనుర్ధారిణులైన వేటకత్తెల శిల్పాలు, చామర ధరిణి, మద్దెల మోగించు పడతి, అర్ధనగ్న మహిళ, నగ్నంగా ఉన్న నాగిని శిల్పం పర్యాటకులను కట్టిపడేస్తాయి. నిర్మాణపరంగా చూస్తే, ఏటవాలు ఊతకమ్మల సైజుకు సరిపోయే విధంగా పొడుగాటి మూర్తులను శిల్పి ఎన్నుకొన్నట్టుగా కనిపిస్తుంది. ఆనాటి సామాజిక స్థితిగతులను, నాట్య సంప్రదాయాలను శిల్ప సంపదలో పొందుపరిచారని తెలుస్తుంది. నాట్యానికి తోడు అందెల సవ్వడులననుసరిస్తూ మద్దెల దరువు ఉండటం కోసం, మద్దెలను మోగించు మదనిక నొకదానిని ప్రత్యేకంగా రూపొందించారు. అంతేగాక శిల్పి ప్రతి నాట్యకత్తె కిరువైపులా నిలబడి ఆమె పద ఘట్టణలకనుగుణంగా మద్దెల వాయిస్తున్నట్లు ఇద్దరు మూర్తులను చెరోవైపు చిన్న సైజులో రూపుదిద్దారు.

తాళ, వాద్య సహకారం లేని నాట్యానికి విలువ లేదని శిల్పి భావన కావచ్చు. రాజులు, రాణులకు సేవలు చేయ చామర ధరిణులు, చెలికత్తెలు, అడవి ప్రదేశంలో వెలసిన ఆ ఆలయ సమీపంలో వానర సంచారము, జంతువుల వేట కూడా ఉండాలి కాబట్టి శిల్పి ఈ అంశములను తన శిల్పాలకు వస్తువులుగా ఎన్నుకోవడంలో వింతేమీ లేదు. ఇక్కడ వింతైన విషయమొక్కటే అది 'నాగిని' శిల్పం. ఆ శిల్పాల సరసన దానికి ఎందుకు చోటు కల్పించారో తెలియడం లేదు. అది రామప్ప శిల్పకారులలో ఒకరి ప్రేయసి అని ఒకరంటే, తాంత్రిక శక్తులు కల్గిన 'యోగిని' రూపం అని మరొకరు అన్నారు. రకరకాల కల్పిత గాథలు, ఊహాజనిత కథనాలు సృష్టించారు. పన్నెండు మదనికల శిల్పాలు కాకతీయ ఘనతకు ప్రతీకలుగా, తలమానికంగా నిలిచి మిక్కిలి ఖ్యాతి గడించాయి. ఇది మన వారసత్వ సంపద. దీనిని పదిలంగా రక్షించుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది.

షరతులతో గుర్తింపు

ఇంతటి శిల్ప కళా కాంతులు వెదజల్లే నైపుణ్యంతో ఉండి పర్యాటకుల మనసులు దోచే ముగ్ద మనోహరం గల రామప్ప దేవాలయానికి(ramappa temple) యునెస్కో గుర్తింపు కోసం కాకతీయ హెరిటేజ్ కమిటీ 2012, 2013 లో ప్రతిపాదనలు పంపించింది. రెండుసార్లు గుర్తింపు లభించలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక కూడా 2014లో ప్రతిపాదనలు పంపగా వివరాలు పరిశీలించారు కానీ, గుర్తింపు రాలేదు. మరోసారి 2015, 2018లోనూ ప్రతిపాదనలు పంపగా నిరాశే మిగిలింది. చివరికి 2019 ఫిబ్రవరిలో దేశంలో ఒకే ప్రతిపాదన రావడంతో యునెస్కో(unesco) బృందం రామప్పను పరిశీలించి 2021 జూలై 25న గుర్తింపు ఇచ్చింది. కాకతీయులు నిర్మించిన చారిత్రాత్మక రామప్ప దేవాలయానికి వారసత్వ హోదా కల్పిస్తున్నట్లు వరల్డ్ హెరిటేజ్ కమిటీ(world heritage committee) ప్రకటించడంతో దేశం గర్వపడింది. రాష్ట్రంలో తొలిసారి ములుగు జిల్లా వెంకటాపురం మండలం, పాలంపేటలోని రామప్ప గుడికి గుర్తింపు దక్కడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు సంబరపడ్డారు. గుర్తింపు ఇచ్చే సమయంలో నార్వే దేశం ప్రతినిధులు వ్యతిరేకించడంతో కొన్ని షరతులతో తాత్కాలిక గుర్తింపు ఇస్తున్నట్లు హెరిటేజ్ కమిటీ తెలిపింది.

2022 డిసెంబర్‌లోగా ఆలయ ఆవరణలో ఉన్న రామేశ్వరాలయాన్ని (సభా మండపం) పునరుద్దరించాలని, రామప్ప పరిసర ప్రాంతాలలోని పది ఉప ఆలయాలను వినియోగంలోకి తీసుకురావాలని, ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని షరతులు విధించింది. హెరిటేజ్ కమిటీ యునెస్కో విధించిన గడువు లోపు అవి పూర్తిచేస్తే అధికారికంగా రామప్పకు(tourist spot in warangal) యునెస్కో శాశ్వత గుర్తింపు పత్రం దక్కుతుంది. ఆలయ అభివృద్ధికి 180 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, పాలంపేట ప్రభుత్వ విత్తన అభివృద్ధి క్షేత్రానికి చెందిన 27 ఎకరాల భూమిని టూరిజం శాఖకు అప్పగించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసి, పునరుద్దరణ పనులు వేగవంతం చేసి, శాశ్వత గుర్తింపు దక్కేలా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.


కొలనుపాక కుమారస్వామి

వరంగల్

9963720669



Next Story

Most Viewed