కట్నం తీసుకోని వారి స్వయంవరం ఎక్కడ జరుగుతుందో తెలుసా?

by Disha edit |
కట్నం తీసుకోని వారి స్వయంవరం ఎక్కడ జరుగుతుందో తెలుసా?
X

కరోనా కారణంగా స్వయంవరంను వాయిదా వేయకుండా 2020లో కార్యక్రమాన్ని జూమ్ విధానంలో నడిపారు. తమ 17 వ స్వయంవరాన్ని ఈ నెల అనగా డిసెంబర్ 18 ఆదివారం రోజున ఆన్ లైన్‌లోనే జూమ్ యాప్ ద్వారా నిర్వహిస్తున్నారు. సభ్యులు మాత్రమే పాల్గొనే ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 దాకా సాగుతుంది. సభ్యుల అవసరార్థం వీలైతే ముగింపు సమయాన్ని పొడగిస్తారు. ఆసక్తిగలవారు ఉచితంగా తమ వివరాలు 'ఐ డోంట్ వాంట్ డౌరీ' డాట్ కామ్ సైట్లో నమోదు చేసుకోవచ్చు. కాంటాక్ట్@ఐ డోంట్ వాంట్ డౌరీ డాట్ కామ్ కు మెయిల్ ద్వారా కూడా పంపవచ్చు. మరిన్ని వివరాల కోసం 9885810100 మొబైల్ నెంబర్ కు కాల్ చేయొచ్చు.

రకట్నం చట్టరీత్యా నిషేధం అని అందరికీ తెలిసినా పెళ్లి కుదిరింది అనగానే 'కట్నం ఎంత?' అనే ప్రశ్న తప్పడం లేదు. పెళ్లి జరిపే రెండు కుటుంబాలకు కట్న కానుకలు ఇచ్చి పుచ్చుకోవడాలు నేరంగా కనబడవు. అయితే, ఇదే సమస్య బెడిసికొట్టినపుడు కొత్త చిక్కులు తెచ్చి వివాహిత యువతుల ఆత్మహత్యలకు కారణమవుతోంది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం దేశంలో రోజుకు 20 మంది వరకట్న సమస్యతో వచ్చిన కష్టాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు.

ఆడవారి ఆత్మహత్యల్లో 93 శాతానికి వరకట్న వేధింపులే కారణమట. వీటిలో నేర నిరూపణ జరిగి శిక్ష పడేది 34 శాతం కేసులకు మాత్రమేనని కోర్టు రికార్డులు చెప్తున్నాయి. ఇంతటి తీవ్ర సమస్య, చట్టం ఉల్లంఘనపై సమాజం, ప్రభుత్వాలు తగిన రీతిలో స్పందించడం లేదనేది సుస్పష్టం. 'కట్నం అడిగేవాడు గాడిద' అని ప్రచారం చేసే టీవీ ఛానల్‌కి గాడిదలు మనలా కట్నాలు తీసుకోవు అనే విషయం తెలియాలి. పొగాకు నమిలితే క్యాన్సర్ వస్తుందని సినిమాకు ముందు ప్రచార చిత్రాలు వేయించే పాలక పెద్దలకు వరకట్న వేధింపుల బాధిత కుటుంబాల గాథలు పట్టవు.

చిరు దీపం వెలిగించాలని

అందరూ చూస్తూ ఊర్కుంటున్న ఈ సమస్యను ఎదుర్కునే దిశగా ఓ అడుగు పడింది. 'చీకటిని తిట్టుకుంటూ కూర్చునే బదులు చిరు దీపాన్నైనా వెలిగించు' అనే చైనా సామెత ప్రేరణగా వరకట్నానికి వ్యతిరేక కార్యక్రమాలను ఓ సంస్థ చేపట్టింది. లాల్ బహదూర్ శాస్త్రి(lal bahadur sastri) తన పెళ్లి సమయంలో 'ఐ డోంట్ వాంట్ డౌరీ'(i dont want dowry) అని ఖచ్చితంగా చెప్పారట. అదే మాటని లక్ష్యంగా తీసుకోని హైదరాబాద్ కేంద్రంగా వెబ్ సొల్యూషన్స్ వ్యాపారం చేసుకునే 'ఎన్‌కేజీ ఆన్ లైన్ డాట్ కామ్' (nkg online.com)అనే సంస్థ 'ఐ డోంట్ వాంట్ డౌరీ డాట్ కామ్'(i dont want dowry.com) అనే మాట్రిమోనియల్ సైట్‌ను రూపొందించింది. ఇప్పుడు వరకట్న ప్రసక్తి లేని పెళ్లీడు జంటలకు ఇదొక వేదిక.

2 ఏప్రిల్ 2006 నాడు ఈ ఆన్ లైన్ పెళ్లి పందిరి నళిని చిదంబరం చేతులమీదుగా చెన్నైలోని ఆమె ఆఫీసులో ప్రారంభించబడింది. మాజీ కేంద్ర మంత్రి చిదంబరం(chidambaram) భార్య అయిన నళిని మద్రాస్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు.

ఆదర్శ యువత కోసం

అన్ని వధూవరుల పరిచయ వేదికలలాగే ఈ సైట్లోనూ పెళ్లి కావాలనుకునే యువతీ యువకులు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. వరకట్నం తీసుకోకపోవడం వీరి ప్రథమ, ప్రధాన నిబంధన. తొలుత 6 నెలల కాలానికి రూ.500 ఫీజుగా వసూలు చేశారు. 2016 నుండి ఈ సేవలు ఉచితంగానే అందిస్తున్నారు. ఆరంభించిన 2 నెలలకే 2000 దాకా రిజిస్ట్రేషన్లు కావడం వీరికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇందులో అమెరికా, ఇంగ్లాండుకు చెందిన వారు కూడా ఉన్నారు. ఈ సత్పలితం ప్రేరణగా వధూవరుల ప్రత్యక్ష పరిచయవేదికగా స్వయంవరం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 15 అక్టోబర్ 2006 నాడు తొలిసారిగా వరకట్నం కోరని యువతతో 'స్వయంవరం' హైద్రాబాద్ లోని రవీంద్రభారతి హాలులో నిర్వహించబడింది.

బెంగుళూరు, చెన్నై నుంచి కూడా సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఇలా యేటా క్రమం తప్పకుండా ఈ స్వయంవరం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సుమారు ఇరవై వేల సభ్యుల నమోదుతో వందల పెళ్లిళ్లు స్వయంవరం సాధించింది. ప్రతి నిర్వహణలో గతంలో జంటలైనవారితో ప్రసంగాలు ఇప్పిస్తారు. మరిన్ని కట్న విరోధ కల్యాణాలకు ప్రోత్సాహం కోసం వారి విజయగాథలను వినిపిస్తారు. కట్నం ఎందుకు ఈయాలి అనే అంశంపై ఎవరైనా ప్రసంగించవచ్చు. వీటికి తోడుగా వరకట్న వ్యతిరేక దినం సందర్భంగా 4 డిసెంబర్ 2013 రోజున 'వరకట్నంపై కార్టూనిస్టుల సమరం' అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఇందులో వరకట్న సమస్యపై వంద మంది గీసిన కార్టున్లున్నాయి.

ప్రతిజ్ఞతో ప్రారంభం

సైట్ ప్రారంభించి పదేళ్లయిన గుర్తుగా పొట్టి శ్రీరాములు ఆడిటోరియంలో 3 ఏప్రిల్ 2016 రోజున యువతతో వరకట్నానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభలకు సినీనటుడు, రచయిత రావి కొండలరావు, పాత్రికేయులు గుడిపూడి శ్రీహరి లాంటి ప్రముఖులను ఆహ్వానించారు. సాధారణంగా స్వయంవరం కార్యక్రమాన్ని చాలాకాలం బిర్లా సైన్స్ ఆడిటోరియంలోని భాస్కర స్టేడియంలో నిర్వహించారు. 2018 లో మాత్రం స్వయంవర వేదిక కర్నూలుకు మారింది. అదే విధంగా స్వయంవరాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తరించాలనే ఉద్దేశ్యంతో విజయవాడ, తిరుపతి, వరంగల్, కరీంనగర్‌లో ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అయితే, కరోనా రాకతో ఈ ఆలోచన తాత్కాలికంగా పక్కన పడింది.

నవంబర్ 2019లో సైట్లోని సమాచారం హ్యాక్ కావడంతో వధూవరుల వివరాలు మాయమయ్యాయి. తిరిగి సేకరించి సైట్ ను యథావిధిగా నడపడానికి నిర్వాహకులు ఎంతో శ్రమించవలసి వచ్చింది. కరోనా కారణంగా స్వయంవరంను వాయిదా వేయకుండా 2020లో కార్యక్రమాన్ని జూమ్ విధానంలో నడిపారు. తమ 17 వ స్వయంవరాన్ని ఈ నెల అనగా డిసెంబర్ 18 ఆదివారం రోజున ఆన్ లైన్‌లోనే జూమ్ యాప్ ద్వారా నిర్వహిస్తున్నారు. సభ్యులు మాత్రమే పాల్గొనే ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 దాకా సాగుతుంది. సభ్యుల అవసరార్థం వీలైతే ముగింపు సమయాన్ని పొడగిస్తారు. ఆసక్తిగలవారు ఉచితంగా తమ వివరాలు 'ఐ డోంట్ వాంట్ డౌరీ' డాట్ కామ్ సైట్ లో నమోదు చేసుకోవచ్చు. కాంటాక్ట్@ఐ డోంట్ వాంట్ డౌరీ డాట్ కామ్ కు మెయిల్ ద్వారా కూడా పంపవచ్చు. మరిన్ని వివరాల కోసం 9885810100 మొబైల్ నెంబర్ కు కాల్ చేయొచ్చు.

సామాజిక బాధ్యతగా

వెబ్ సైట్లు రూపొందించే వ్యాపారంలో ఉన్న ఎన్‌కేజీ ఇన్ఫో సర్వీసెస్ వారు తమ వృత్తికి అనుబంధంగా ఈ సామాజిక బాధ్యతను నెత్తినెత్తుకున్నారు. పెళ్ళిలో కట్నాన్ని వ్యతిరేకించాలని ఉద్దేశ్యంతో తమ సరంజామాతో ప్రయోగపూర్వకంగా ఈ వెబ్ సైట్ ను ఆరంభించారు. మంచి స్పందన రావడంతో వీరి ఆలోచన తెర మీంచి వేదిక దాకా వెళ్ళింది. వరకట్నాన్ని వ్యతిరేకించే యువత ఈ సైటు ద్వారా తమ జోడీని వెతుక్కోవాలి. మరింత మందికి ఈ సేవ తెలిసేలా ప్రాచుర్యాన్ని కలిగించాలి.

తమ ఆఫీసుల్లో, వ్యాపార కేంద్రాల్లో ఈ సదవకాశం నలుగురికి పంచేలా ఏర్పాట్లు చేయాలి. పెళ్లీడు పిల్లలుగా పెళ్లి చేసే పెద్దలుగా ఎవరి పాత్ర వారు పోషించి వరకట్నాన్ని నిర్మూలించే దిశగా అడుగులు వేయాలి. సామాజిక మార్పుకు ముందుకొచ్చిన సంస్థను ప్రోత్సహించడం అందరి అవసరం. ఎలాంటి వ్యక్తిగత ప్రచారానికి తావియ్యకుండా ఈ సుకార్యాన్ని నిర్వహిస్తున్న సత్యనరేష్ బృందానికి అందరం జేజేలు పలకాల్సిందే.

(నేడే స్వయంవరం)


బి.నర్సన్

9440128169

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672.



Next Story