ప్రశ్నార్థకంగా మారిన ఇంజినీరింగ్ విద్య!

by Disha edit |
ప్రశ్నార్థకంగా మారిన ఇంజినీరింగ్ విద్య!
X

కనీస వసతులు, లైబ్రరీ, వర్క్‌షాప్ లాంటి మౌలిక సౌకర్యాలు లేని కాలేజీలు కూడా ఎన్నో ఉన్నాయి. దీనికితోడు కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ రంగాలలో నిత్యం కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటికి అనుగుణంగా బోధనలో మార్పులు చేయాలి. అది కొన్ని యాజమాన్యాలకు తలకు మించిన భారంగా ఉంది. తగిన అధ్యాపకులు దొరకడం కూడా కష్టతరమే. ఫలితంగా అధికశాతం ఇంజినీరింగ్ విద్యార్థులకు అదొక డిగ్రీ లాగానే ఉపయోగపడుతున్నది. ఐదు, పది శాతం మాత్రమే ప్రైవేట్ కంపెనీలలో అత్యున్నత జీతభత్యాలతో చేరుతున్నారు. మిగిలిన 90 శాతం యేళ్ల తరబడి ఉద్యోగాల వేటలో ఉంటున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుంటున్నారు. ఉద్యోగం లభించక నిరాశతో కుమిలిపోతున్న ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ లక్షల సంఖ్యలో ఉన్నారు.

కాలంతోపాటు అవసరాలూ మారిపోతున్నాయి. కాలానుగుణంగా సమాజం కూడా మార్పు చెందాలి. విద్యా రంగంలో ఎన్నో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. మూడు దశాబ్దాల క్రితం ఒక్కసారిగా ఇంజినీరింగ్ విద్యకు అత్యంత ప్రాధాన్యం పెరిగింది. అంతకుముందు ఇంజినీరింగ్ విద్య పరిమితంగా ఉండేది. కొన్ని కాలేజీలే ఉండేవి. కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ ప్రవేశంతో ఇతర దేశాలతోపాటు భారతదేశంలో కూడా ఇంజినీరింగ్ విద్యకు ప్రాముఖ్యత లభించింది. ఇంజినీరింగ్ చదువు మీద ఉన్నతవర్గాలలోనే కాదు, సామా‌న్యులలోనూ ఆసక్తి పెరిగిపోయింది. అమెరికా, ఆస్ట్రేలియాలాంటి దేశాలలో ఉద్యోగం, డాలర్‌లలో జీతం, దేశంలో కూడా మహానగరాలలో అనేక సంస్థలలో అత్యున్నత జీతం, హోదా లభిస్తుండడంతో ఇంజినీరింగ్ విద్య పట్ల మోజు పెరిగిపోయింది. పుట్టగొడుగుల వలె కాలేజీలు పుట్టుకువచ్చాయి. దేశవ్యాప్తంగా 1947లో దేశవ్యాప్తంగా 44 ఇంజినీరింగ్ కాలేజీలు, 3,200 సీట్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు దాదాపు 3,500 కాలేజీలు, 17.50 లక్షల సీట్లు దాటిపోయాయి. మొన్నటి వరకు డిమాండ్ విపరీతంగా ఉంది.

సాఫ్ట్‌వేర్ రంగానికి ప్రాముఖ్యత తగ్గడంతో ఇంజినీరింగ్ విద్య పట్ల ఇపుడు మోజు తగ్గింది. ఇంజినీరింగ్ డిగ్రీతో సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఉద్యోగం సాధించడం అంత సులభం కాదనే విషయాన్ని విద్యార్థులు గ్రహిస్తున్నారు. అందుకే యేటేటా ఇంజినీరింగులో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నది. ఈ విద్యా సంవత్సరంలో తెలంగాణలోనే దాదాపు 15 వేల సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. ఎన్నో కాలేజీలు మూతపడ్డాయి. ఎంసెట్ కౌన్సెలింగ్ ముగిసిపోయింది. 177 కాలేజీలలో 79,346 సీట్లు ఉంటే, 63,900 మందికి మాత్రమే సీట్లు కేటాయించగలిగారు. మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని కాలేజీలలో మాత్రం ఇంజినీరింగ్ సీట్లకు ఇంకా డిమాండ్ ఉంది. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్న ఆ కాలేజీలలో సీటు కోసం పోటీ పడుతూనే ఉన్నారు. లక్షలాది రూపాయలు చెల్లిస్తున్నారు. ఈసారి ఫీజులు భారీగా పెంచారు.

Also read: అందుకే ప్రభుత్వం యూనివర్సిటీలను పట్టించుకోవడం లేదా?

నియంత్రణ లేని ఫీజులు

ప్రభుత్వ నిర్లక్ష్యం, తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎస్ఆర్) అసమర్థత కారణంగా అంతా ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అనుకున్నట్టే సాగుతున్నది. ఒక దశలో వారు కోర్టును సైతం నమ్మించి ఇష్టానుసారంగా లక్షల మేరకు ఫీజులను పెంచుకున్నారు. నియంత్రణ కమిటీ ఫీజుల పెంపునకు అనుమతించడం దురదృష్టకరం. 159 ఇంజినీరింగ్ కాలేజీలలో కనిష్టంగా రూ.45 వేలు, గరిష్టంగా రూ.1.60 లక్షలుగా ప్రభుత్వం ఫీజులు నిర్ణయించింది. లక్షకు పైగా ఫీజులు ఉన్న కాలేజీలు 40కి పైగా ఉన్నాయంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పక్కనే ఉన్న ఏపీ సహా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఫీజులు లేవు. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు బాటలు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

దేశవ్యాప్తంగా పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఏమీ లేదు. అధికశాతం కాలేజీలలో నాణ్యతా ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. 90 శాతం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌లకు సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసే నైపుణ్యం లేదనే ఆయా కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. బోధనా సిబ్బందిలో చాలా మందికి సామర్థ్యం లేకపోవడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. నిబంధనల ప్రకారం లక్షకుపైగా అధ్యాపకులు అవసరం. కానీ, లేరు.

Also read: కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యూలరైజేషన్‌పై నిర్ణయం తీసుకుంటారా?

కనీస వసతులు కరువు

కనీస వసతులు, లైబ్రరీ, వర్క్‌షాప్ లాంటి మౌలిక సౌకర్యాలు లేని కాలేజీలు కూడా ఎన్నో ఉన్నాయి. దీనికితోడు కంప్యూ టర్, సాఫ్ట్‌వేర్ రంగాలలో నిత్యం కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటికి అనుగుణంగా బోధనలో మార్పులు చేయాలి. అది కొన్ని యాజమాన్యాలకు తలకు మించిన భారంగా ఉంది. తగిన అధ్యాపకులు దొరకడం కూడా కష్టతరమే. ఫలితంగా అధికశాతం ఇంజినీరింగ్ విద్యార్థులకు అదొక డిగ్రీలాగానే ఉపయోగపడుతున్నది. ఐదు, పది శాతం మాత్రమే ప్రైవేట్ కంపెనీలలో అత్యున్నత జీతభత్యాలతో చేరుతున్నారు. మిగిలిన 90 శాతం యేళ్ల తరబడి ఉద్యోగాల వేటలో ఉంటున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుంటున్నారు. ఉద్యోగం లభించక నిరాశతో కుమిలిపోతున్న ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ లక్షల సంఖ్యలో ఉన్నారు.

కళాశాలలలో ప్రమాణాల పతనంతో విద్యార్థుల జీవితాలు అంధకారమవుతున్నాయి. ఇంజినీరింగ్ కాలేజీలు వ్యాపారంగా రూపాంతరం చెందాయి. ఆశ్రిత పక్షపాతం, అవినీతి, కుల, మత ప్రాతిపదికలు చదువుల నాణ్యతకు శాపంగా మారాయి. దళారులకు విడిచి పెట్టకుండా ప్రభుత్వమే నాణ్యతను కాపాడాలి. నిధుల కొరత లేకుండా చూడాలి. ఇంజినీరింగ్ డిగ్రీ చేతికి వస్తే చాలు తమ పిల్లలు అత్యంత సుఖవంత జీవితాన్ని గడుపుతారనే భ్రమను తల్లిదండ్రులు విడనాడాలి. విద్యను వ్యాపారంగా భావించే కోచింగ్ కేంద్రాలు, ఇంజినీరింగ్ కాలేజీలు యువతను మాయలో ముంచెత్తి వారి జీవితాలతో ఆటాడుకోవడం న్యాయం కాదు.


సభావట్ కళ్యాణ్

ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ వనవాసి కన్వీనర్

90143 22572

Next Story

Most Viewed