బ్యాంకులకు టోపీ

by Disha edit |
బ్యాంకులకు టోపీ
X

బ్యాంకులకు కార్పొరేట్లు టోపీ వేస్తున్నారని మరోసారి నిర్ధారణ అయింది. కార్పొరేట్ల వేఆఫ్‌పై వేసిన ఆర్‌టిఐ పిటిషన్‌కు సమాధానంగా, గత ఐదేళ్లలో పది లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ రుణాలు వేఆఫ్ చేసినట్లు సాక్షాత్తు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియానే ప్రకటించింది. అదే మట్టిని దైవంగా.. పైరును ప్రాణంగా భావించి సేద్యంతో నేలను తడిపే రైతు, కౌలు రైతు కాళ్లరిగేలా బ్యాంకుల చుట్టూ తిరిగినా రుణాలందవు. ఎవరికైనా అందినా లక్ష మాత్రమే. అలా లక్ష రుణం తీసుకున్న రైతులే ఎక్కువ మంది ఉంటారు. లక్ష కన్నా రుణం పొందిన రైతులు చాలా తక్కువగా ఉంటారు. ఇప్పటికే పండించిన పంటకు మద్దతు ధర రాక, అతివృష్టి, అనావృష్టి, అనారోగ్యం వంటి కారణాలతో ఏ రైతు అయినా సకాలంలో తీసుకున్న రుణం కట్టక పోతే సర్కారు వారి పాట అంటూ ఊరందరి ముందు దండోరా వేసి మరీ వారికున్న కొద్దిపాటి పొలాన్నో, ఇంటినో జప్తు చేసి వేలం వేస్తారు. దీంతో పరువు పోయిందని మనస్తాపానికి గురై ఊపిరి తీసుకున్న వారు, అప్పులు తీర్చలేక సొంతూరుని వదిలి వలస పక్షుల్లా ఎగిరిపోయి అవస్థలు పడుతున్న అన్నదాతలెంతమందో.

ఎక్కువ వారి పాలనలోనే

రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, రుణాలు ఎగ్గొట్టడం ఎక్కువయిందని తెలిపింది. గత ఐదేళ్లలోనే పదిలక్షల తొమ్మిది వేల 510 కోట్ల రూపాయల రుణ సొమ్ము మాఫీ అయింది. బ్యాంకు నుండి తీసుకున్న రుణానికి సంబంధించిన వాయిదా లేదా వడ్డీ 90 రోజులకుపైగా చెల్లించకపోతే వాటిని నాన్‌ పెర్ఫార్మెన్స్‌ అసెట్స్‌ (ఎన్‌పిఎ) అంటారు. ఈ జాబితాలోకి వచ్చిన మొత్తాల్లో 13 శాతం మాత్రమే అంటే లక్షా 32వేల 36 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. గత పదేళ్లలో రూ.13 లక్షల 22వేల 309 కోట్లు మాఫీ అయితే, అందులో యూపీఏ పాలనలో 2012 - 2014 ఆర్థిక సంవత్సరం వరకూ మాఫీ అయినవి 75,227 కోట్లు. మిగతా 12,47,008 కోట్ల రుణాలు మాఫీ చేసింది కాషాయ పార్టీ ఏలుబడిలోనే. ఇలా మాఫీ చేసిన కార్పొరేట్ల పేర్లు వెల్లడించడానికి కూడా సర్కారు అంగీకరించకపోవడం గమనార్హం. కరోనా సమయంలో కష్టజీవులను ఆదుకోవడానికి చేతులు రాని మోడీ సర్కారు కార్పొరేట్‌ టాక్స్‌ను మాత్రం 10 శాతం తగ్గించింది. అందువల్ల కార్పొరేట్లకు ఏడాదికి తగ్గిన పన్నులు లక్షా 84 వేల కోట్లు. కానీ సామాన్యుడికి నిత్యావసరమైన పెట్రోల్ ధరలు మాత్రం పన్నుల పేరుతో అదనంగా వసూలు చేస్తూ రూ. 2 లక్షల 40 వేల కోట్లు వసూలు చేశారు.

సంపద సృష్టికర్తలుగా చెబుతున్న కార్పొరేట్లు ఉపాధి కల్పనకు పెట్టుబడులు పెట్టలేదని పలు గణాంకాలు స్పష్టం చేయడంతో, ఇటీవల కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సమావేశంలో మీరు ఎందుకు పెట్టుబడులు పెట్టడం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు.

వారిని ట్యాక్స్‌ నెట్‌లోకి లాగేందుకు

అన్‌రాక్ నివేదిక ప్రకారం కోటి రూపాయలకు పైగా ఉన్న విలువైన కార్లు, విల్లాల కొనుగోళ్ళు, ఇతర విలాస వస్తువుల కొనుగోళ్ళు బాగా పెరిగినట్టు తెలిపింది. బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్య, నీరవ్ మోడీ, చోక్సీ తదితరుల చరిత్ర జగమెరిగినదే. ఆదాయపు పన్ను శాఖ రూల్స్ ప్రకారం ఏడాదికి రెండున్నర లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే ఆదాయపు పన్ను కట్టాల్సి ఉంది. వీరిని మోదీ సర్కారు ఊరించి ఉసూరుమనిపిస్తుంది. ట్యాక్స్‌ కట్టకపోయినా రిటర్న్స్‌ సమర్పించాలంటూ వీరిని ట్యాక్స్‌ నెట్‌లోకి లాగేందుకు ప్రయత్నిస్తోంది. వారి ఆదాయ పరిమితి పెంచితే వస్తువులు, సేవల వినియోగానికి ఖర్చు చేస్తారు. అందువల్ల సరుకుల అమ్మకాలు పెరుగుతాయి. సంక్షోభ సమయంలో ఈ కొనుగోళ్లు ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయి. మరోవైపు దేశం కోసం శ్రమించే రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. 2019లో అట్టహాసంగా ప్రకటించిన ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం కిసాన్‌) కింద కేంద్రం సహాయం అందించే రైతుల్లో ఎనిమిది కోట్ల మంది అంటే మూడింట రెండొంతుల మందిని ఇటీవల ఆ జాబితా నుంచి తొలగించి వారికి మొండిచేయి చూపారు. 2019 ఫిబ్రవరిలో తొలి విడతకూ, 2022 మే-జూన్‌లో 11వ విడతకూ మధ్య లబ్ధిదారుల సంఖ్య 11.84 కోట్ల నుంచి 3.87 కోట్లకు తగ్గించేసింది. చేసిన అప్పు ఎలాగైనా తీర్చాలనేది సామాన్యుడు, రైతన్న తపన కాగా, అప్పు ఎగ్గొట్టే అన్ని అవకాశాలు కార్పొరేట్లకు ఇస్తోంది కాషాయ ప్రభుత్వమే. సామాన్యుల కొనుగోలు శక్తి పెరిగేలా ఆర్థిక విధానాలు మారితేనే దేశానికి రక్ష.

మేకల రవి కుమార్

కర్నూలు

82474 79824

Also Read...

పాలనలో చెరగని సంతకం… కాకి మాధవరావు



Next Story

Most Viewed