Civil Right Association: 50 వసంతాల పౌర హక్కుల సంఘం! పోరాటాలెన్నో?

by Disha edit |
Civil Right Association: 50 వసంతాల పౌర హక్కుల సంఘం! పోరాటాలెన్నో?
X

పౌర, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ ప్రస్థానంలో 49 వసంతాలు పూర్తి చేసుకుని 50వ వసంతంలోకి అడుగు పెడుతున్నది పౌరహక్కుల సంఘం. హక్కులు జీవించడానికి అవసరం. జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి అవసరం. ఈనాడు మనం అనుభవిస్తున్న హక్కులన్నీ ప్రజలు పోరాడి సాధించుకున్నవే. సాధించుకున్న హక్కులను, విలువలను రక్షించుకోవడానికి వాటిని మెరుగుపరచుకోవడానికి కృషి చేయడం పౌరహక్కుల(civil rights) ఉద్యమాల కర్తవ్యం. అణచివేతను ప్రశ్నించడమే పౌరహక్కుల సంఘం ప్రథమ కర్తవ్యం. 1970లలో ఆనాటి ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై అమలు చేసిన క్రూర నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక వాదులు, మేధావులు కలిసి 1973 డిసెంబరు 23న గుంటూరులో శ్రీశ్రీ అధ్యక్షతన పౌర హక్కుల సంఘాన్ని(Civil rights association) ఏర్పాటు చేశారు. సంస్థ ఆవిర్భవించిన తొలినాళ్లలో రాజ్యహింసకు వ్యతిరేకంగా మాత్రమే పనిచేసినా, తదనంతర కాలంలో తన కార్యరంగాన్ని విస్తృత పరచుకుని సమాజంలో వివిధ ఆధిపత్య వ్యవస్థల మూలంగా అణచివేతకు గురవుతున్న ప్రజల హక్కుల కోసం పోరాడే సంస్థగా ఎదిగింది.

పౌరహక్కుల సంఘం గత ఐదు దశాబ్దాలుగా హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నది. వందలాది బూటకపు ఎన్‌కౌంటర్లపై నిజ నిర్ధారణ చేసి వాస్తవాలను ప్రజల ముందుంచింది. వందలాది లాకప్ మరణాలపై నిజనిజాలను వెలుగులోకి తెచ్చింది. నిమ్న కులాలపై అగ్రవర్ణాలు సాగిస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా ముందుకు వచ్చిన దళితుల ఆత్మగౌరవ పోరాటాలలో అండగా నిలబడింది. చుండూరు, కారంచేడులలో (chandur incident)జరిగిన హత్యాకాండకు వ్యతిరేకంగా దళిత సంఘాలతో కలసి ఉద్యమించింది. పురుషాధిపత్య వ్యవస్థలో మహిళల మీద ఇంటా, బయటా జరుగుతున్న అకృత్యాలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా జరిగిన మహిళా ఉద్యమాలకు సంఘీభావంగా నిలబడింది. వరకట్నపు హత్యలకు వ్యతిరేకంగా బాధితుల పక్షాన పోరాటం చేసి నిందితులకు శిక్షలు పడేలా చేసింది.

కరువు కారణంగా, గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్న రైతుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత పడాలని ఆందోళన కార్యక్రమాలను నిర్వహించింది. ఈ క్రమంలో సంస్థ ప్రభుత్వాల ఆగ్రహానికి, నిర్బంధానికి గురయ్యింది. ఎందరో కార్యకర్తలపై, నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. జైలులో పెట్టారు. సంస్థ నాయకులు గోపీ రాజన్న, జాఫ లక్ష్మారెడ్డి, డా. రామనాథం. నర్రా ప్రభాకర్ రెడ్డిని బలిగొన్నారు. కిరాయి హంతక ముఠాల ద్వారా పురుషోత్తం, అజాం ఆలీలను చంపించారు. గ్రీన్ టైగర్స్, నల్లమల కోబ్రాల పేరుతో సంస్థకు రాజీనామాలు చేయమని బెదిరించారు. అయినా మేం ప్రజా నిబద్ధతతో కొనసాగుతూనే ఉన్నాం. దేశవ్యాప్తంగా ఉన్న అన్నిరకాల ప్రజాతంత్ర శక్తులను కలుపుకొని విశాల హక్కుల ఉద్యమాన్ని నిర్మించాల్సిన చరిత్రాత్మక కర్తవ్య నిర్వహణలో భాగంగా పౌరహక్కుల పరిరక్షణ కోసం సంఘం తన కృషిని కొనసాగిస్తున్నది.

ఈ నేపథ్యంలో, సుదీర్ఘ ప్రస్థానం సమీక్షలో భాగంగా జరుపుకుంటున్న మా 50 వసంతాల ప్రారంభ సభను జయప్రదం చేయాలని కోరుతున్నాం. డిసెంబరు 24న గుంటూరులోని గుంటూరు మెడికల్ కాలేజి ఎదురుగా ఉన్న NGO కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు సభ మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం అధ్యక్షులు,వి. చిట్టిబాబు, ఆహ్వాన సంఘం అధ్యక్షులు అబ్బయ రెడ్డి ప్రొ. హరగోపాల్, హక్కుల కార్యకర్త బేలా భాటియా, తెలంగాణ పౌరహక్కుల సంఘం అధ్యక్షులు ప్రొ. గడ్డం లక్ష్మణ్, ప్రొ. కాత్యాయని విద్మహే తదితరులు మాట్లాడతారు. సాయంత్రం ఐదు గంటలకు పౌర హక్కుల సంఘం ఊరేగింపు, అరుణోదయ, ప్రజా కళామండలి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి

చిలుకా చంద్రశేఖర్, ఎన్. నారాయణరావు

ప్రధాన కార్యదర్శులు, పౌరహక్కుల సంఘం, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Next Story

Most Viewed