రిటైర్మెంట్ వయస్సుపై ద్వంద్వ ప్రమాణాలు

by Disha edit |
రిటైర్మెంట్ వయస్సుపై ద్వంద్వ ప్రమాణాలు
X

ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 61 లేక 33 యేండ్ల సర్వీసా? అనే చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వం మంచికో చెడుకో, లేదా ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాయిదా వేయడానికో లేదా ఉద్యోగుల మచ్చిక చేసుకోవడానికో రిటైర్మెంట్ వయసు 58 నుండి మూడేళ్లు పెంచి 61 చేసింది. నాలుగో తరగతి ఉద్యోగులకు సైతం 60 నుండి 61 చేసింది. అయితే తిరిగి 58 ఏండ్లకే రిటైర్మెంట్ తీసుకురావడంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. మరోవైపున నిరుద్యోగులకు ఆశలు కల్పించడానికి తెరపైకి 33 యేండ్ల సర్వీస్ అని కొత్త ప్రభుత్వం చర్చకు తెరలేపింది. అదే గనుక జరిగితే ముందుగా అత్యంత అనుభవంగల, తెలివిగల, వయసు గల ఉద్యోగుల సేవలు ప్రభుత్వం కోల్పోవాల్సి వస్తుంది.

ఒక వ్యక్తి చదువు అయిపోగానే లేదా తొలి ప్రయత్నంలోనే కనుక ప్రభుత్వ ఉద్యోగం వస్తే అతడు తప్పక తెలివిగల వాడై లేదా ప్రతిభ కల వాడై ఉంటాడు. అదే విధంగా చివరి అవకాశంగా 28 నుండి 32 యేండ్లకు ఉద్యోగం వచ్చిందంటే వారు డక్కా ముక్కీలు తిని సాధించినవారు ఉంటారు. వారు 61 యేండ్ల వరకు సర్వీసులో ఉంటారు. ఇరవై రెండు, ఇరవై మూడేళ్ళకే ఉద్యోగం వచ్చిన వారికి ఈ 33 యేండ్ల సర్వీసు అన్న నిర్ణయం ఆశనిపాతం అవుతుంది. వారు 55 ఏండ్లకే రిటైర్ అవుతారు. అంటే గతంలో ఉన్న 58 కన్న మూడేళ్ల ముందే రిటైర్ అవ్వలసిఉంటుంది. అంటే ఒక ప్రతిభ గల ఉద్యోగి 55 యేండ్లకే రిటైర్ అవడం వల్ల ప్రభుత్వానికి సాంకేతికంగా లాభం ఉండొచ్చు కానీ నైతికంగా, పాలనాపరంగా నష్టమే అని చెప్పాలి. ఒక సుదీర్ఘ అనుభవం, నిపుణత, ప్రతిభ కలిగిన, పని చేసే శక్తి గల ఉద్యోగులను బలవంతంగా ఇంటికి పంపిస్తూ మరో పక్క వయసు మీద పడ్డ 61 వరకు ఉద్యోగులను కొనసాగించడం ఏది మేలో ప్రభుత్వం ఆలోచించాలి.

వేలాది ఖాళీలు పూరిస్తే చాలు...!

ప్రభుత్వం నిజంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే, ప్రభుత్వంలో, ప్రభుత్వ రంగ సంస్థలలో వేలాది ఖాళీలు ఉన్నాయి. వాటిని తక్షణం నింపాలి. కొత్త ఉద్యోగులు పాలనాపరమైన మెలకువలు నేర్చుకోవడానికి ఇప్పుడున్న ఉద్యోగులతో కొంత కాలం పనిచేసే అవకాశం ఉండాలి. అప్పుడే ప్రభుత్వ పనితీరు మెరుగు పడుతుంది. అంతే కాకుండా రానున్న ఐదేండ్లలో ప్రతి సంవత్సరం పది వేల మంది రిటైర్ అవుతారు. ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలను కలుపుకుంటే ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. ఈ ఖాళీలు అన్నీ వెను వెంటనే భర్తీ చేస్తే నిరుద్యోగులకు వరమే. ఇప్పుడు ఉన్న 61 యేండ్ల పరిమితితో మూడేళ్లు వాయిదా పడిన రిటైర్మెంట్ల్లు వల్ల ప్రభుత్వంపై మూడేళ్ల భారం ఒకేసారి పడుతుంది. ఇక 33 యేండ్లు సర్వీసు నిబంధన కనుక అమలు చేస్తే భారం తడిసి మోపెడు అవుతుంది. ప్రభుత్వంలో ఉన్న సగం మంది రిటైర్ అవుతారు. పాలన స్తంభించిపోతుంది. పైగా, ఒక పక్క 33 యేండ్లకు కుదించాలి అనుకుంటూనే బోధన సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం 60 నుంచి 65 కి, అలాగే కేంద్ర ప్రభుత్వం 65 నుండి 75 కి పెంచే ఆలోచన చేయడం గమనార్హం.

ఉన్నట్టుండి రిటైర్ అయితే..

ఆరోగ్యంపై శ్రద్ధ, పెరిగిన వ్యాధి నివారణ చర్యలు, మెరుగైన వైద్యం వల్ల మనిషి సగటు ఆయుర్దాయం పెరిగింది. ప్రస్తుతం 65 ఏండ్లు దాటినా ఎంతో మంది ఆరోగ్యంగా ఉంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019 అంచనాల ప్రకారం సగటు భారతీయుడి ఆయుర్దాయం 60 సంవత్సరాలు. అదే ఆరోగ్యవంతుడి ఆయుర్దాయం 70 ఏళ్లుగా ఉంది. అంటే సగటు భారతీయులు 60 ఏళ్ల వరకు జీవిస్తారు. అదే 1960 లో నలభై ఏళ్లుగా మాత్రమే ఉంది. మానవుడి సగటు ఆయుర్దాయం పెరిగినందున రిటైర్మెంట్ వయసు 58 నుండి 60 లేదా ఇప్పుడున్న 61 ఏండ్లు చేయడం తప్పు కాదు అవశ్యం కూడా. ఎందుకంటే మనిషి పని చేస్తున్నంత కాలం ఆరోగ్యంగా ఉంటాడు. ఆరోగ్యవంతుడైన మానవుడిని సడెన్‌గా పని నుండి విముక్తి చేయడం వల్ల చేష్టలు ఉడిగి, పని లేక నిరాశ కలిగి, అలసత్వం వల్ల అతను త్వరగా మరణం వైపు అడుగులు వేస్తాడు. ఇది జోక్ గా చెప్పడం లేదు. చాలా మంది సర్వీసులో ఉన్నపుడు చలాకీగా ఉండి రిటైర్ అయిన కొంత కాలంలోనే చనిపోయిన ఉదంతాలు చూసి చెబుతున్న. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల లెక్కలు తీస్తే తేటతెల్లం అవుతుంది.

రిటైర్మెంట్ 61 ఏళ్లు అయితేనే మేలు..

కనుక రిటైర్మెంట్ వయసు 60 లేదా 61 ఉంచడం వల్ల అందరికీ న్యాయం చేయడం అవుతుంది. 33 యేండ్ల నిబంధన మంచి కన్న చెడే ఎక్కువ చేస్తుంది. రిటైర్మెంట్ వయసును ఇప్పుడు సమీక్షించడం తేనెతుట్టెను కదపడమే అవుతుంది. ఎంతో కాలంగా ప్రభుత్వ నియామకాలు లేక వేలాది ఖాళీలు యేండ్ల తరబడి నింపకుండా ఉన్నాయి. ప్రభుత్వం నిజంగా నిరుద్యోగులకు మేలు చేయాలి అనుకుంటే ఖాళీ అయిన ప్రభుత్వ ఉద్యోగులను వెంటనే నింపాలి. ప్రతిభ గల అనుభవం గల ఉద్యోగులతో కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన వారికి శిక్షణ ఇప్పించాలి. అంతే గాని ఒకే సారి ప్రభుత్వ ఉద్యోగులను ఖాళీ చేస్తే కొత్త గా చేరే ఉద్యోగులకు సరియైన శిక్షణ లభించదు. ప్రభుత్వ సేవల్లో శూన్యత ఏర్పడుతుంది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు అవుతుంది.

శిరందాస్ శ్రీనివాస్

సీఈఓ, సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్

94416 73339



Next Story

Most Viewed