- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పత్తా లేని సమగ్ర భూ సర్వే!
తెలంగాణ ప్రాంతంలో 1907లో చేసిన ల్యాండ్ సర్వే నిబంధనలు 1959 వరకు అమలులో ఉన్నాయి. 1923లో మద్రాస్ రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1959లో తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టం రద్దు చేసి మద్రాస్ ప్రెసిడెన్సీలో చేసిన సర్వే బౌండరీ చట్టం - 1923నే తెలంగాణకు వర్తింపచేస్తున్నారు. ఇప్పటికీ ఈ చట్టమే తెలంగాణలో అమలులో ఉంది. ఈ చట్టం ప్రకారమే సర్వే చేయాల్సి ఉంటుంది. కానీ వాస్తవానికి భూ చట్టాల న్యాయ నిపుణుల ప్రకారం ప్రతీ 30 ఏళ్లకు ఒకసారి రెవెన్యూ రికార్డులో మార్పులు వస్తాయి కాబట్టి సర్వే జరగాలనేది ఒక నియమం. కానీ నిజాం కాలంలో జరిగిన సర్వే రికార్డులే ఇప్పటికీ ఈ ప్రాంతానికి ఆధారం.
సర్వరోగ నివారిణి పనిచేయట్లేదు!
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ‘భూ వివాదాలు’ లేని తెలంగాణ ఆవిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2020లో కొత్త రెవెన్యూ చట్టం చేసి ‘ధరణి పోర్టల్’ ఆవిష్కరించి 11 జూన్ 2021లో సమగ్ర భూ (Digital Land Survey) సర్వేకు శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వంలోని భూ పరిపాలనా శాఖకు ప్రతిపాదనలు పంపి పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాలను సర్వే ఏజెన్సీల ద్వారా ఎంపిక చేసినా ఇప్పటివరకు ఇది పట్టాలెక్కలేదు. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లకు అవినీతి ముద్ర వేసి ఇతర శాఖలలో బలవంతంగా సర్దుబాటు చేశారు. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్‌లను కూడా ఇతర శాఖలలో సర్దుబాటు చేశారు. రెవెన్యూ అధికారులకు ఉన్న విచక్షణ అధికారాలకు కత్తెర పెట్టారు. సాధారణంగా ప్రతీ భూమికి 75 రకాల రోగాలు ఉంటాయని భూ చట్టాల నిపుణుల అభిప్రాయం. ధరణి పోర్టల్ ఆ రోగాలకి సర్వరోగ నివారిణి అని చెప్తూ పోర్టల్ ప్రారంభించిన తర్వాత ఉన్న రోగాలకు 33 మాడ్యుల్స్ తెచ్చారు. కానీ ఇప్పటి వరకు భూముల రోగాలు నయం కాలేదు. సాదా బైనామా నుండి రైతుబంధు పొందుతున్న లేఅవుట్ల క్రమబద్దీకరణ (LRS) వరకు అన్ని కోర్టు పరిధిలో ఉన్నాయి. ఈ రోగాలన్నింటికి సర్వరోగ నివారిణి సమగ్ర భూ సర్వేనే అని భూ చట్టాల న్యాయ నిపుణుల అభిప్రాయం.
ధరణి పోర్టల్ ద్వారా గ్రామీణ ప్రాంతంలో పరిపాలన దూరం అయింది. 10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాలు అయింది అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఒక్క సర్వేయర్‌ను కూడ నియమించలేదు. దీంతో ఎకరం భూమి కొలవాలంటే ఏళ్లు గడుస్తున్నాయి. ధరణి పోర్టల్ ద్వారా టెక్నాలజీ, అమ్మకం, కొనుగోలు, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ లాంటివి సులువయ్యాయి కానీ ల్యాండ్ సర్వేకు పోర్టల్ ఎలాంటి దారి చూపలేదు. ఐటీ రంగంలో అద్భుత ప్రగతి అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ధరణి పోర్టల్ కాంట్రాక్టు NIC లాంటి దేశీయ కంపెనీలకు ఇవ్వకుండా విదేశీ కంపెనీలకు ఇచ్చి అపవాదు మూట కట్టుకుంది. ఇంకోవైపు ఆఘమేఘాల మీద ప్రకటించిన సమగ్ర భూ సర్వే అటక ఎక్కించి కాలయాపన చేస్తుంది.
ప్రజల మంచి ఆలోచించడం లేదు!
ధరణి పోర్టల్ కేసీఆర్ ప్రభుత్వానికి భూముల అమ్మకంలో ఏటీఎంలా మారింది, మేము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో కలుపుతాము అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి తప్ప, సమగ్ర భూ సర్వే ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించలేకపోతున్నాయి. మేము అధికారంలోకి వస్తే మా మొదటి సంతకం సమగ్ర భూ సర్వేనే అని ప్రజలకు నమ్మకం కలిగించలేకపోతున్నాయి. శతాబ్దంలో జరగని అభివృద్ధి దశాబ్దంలో జరిగిందని దశాబ్ది ఉత్సవాల జరుపుకున్న ప్రభుత్వానికి తలసరి ఆదాయంలో నెంబర్ -1 అని, అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ, బంగారు తెలంగాణ, ధనిక రాష్ట్రం అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వానికి సమగ్ర భూ సర్వే ఎందుకు సాధ్యం కావడం లేదు? ఎఫ్. టి. ఎల్ సర్వే హద్దులు నిర్ణయించకుండానే వేల కోట్లు ఖర్చుపెట్టిన మిషన్ కాకతీయ, రెవెన్యూ, అటవీ భూముల హద్దులు నిర్ణయించకుండానే పోడుపట్టాలు రాజకీయ లబ్ధి కోసం మాత్రమే శాశ్వత పరిష్కారాలు మాత్రం కాదు.
పొరుగు రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి
అప్పులు, లోటు బడ్జెట్, తక్కువ రాజకీయ అనుభవం, అసలు రాజధాని అడ్రస్ కూడా ఎక్కడో తెలియని రాష్ట్రంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా పగడ్బందీగా సమగ్ర భూ సర్వే నిర్వహిస్తూ గెట్టు పంచాయతీ లేకుండా ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించి ప్రజల చేతికి పట్టా పాస్ బుక్కులు అందజేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఉద్యమ నేపథ్యం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు ఈ పని చేయలేకపోతున్నారు? దీనిపై ఇటు అధికారపక్షం అటు ప్రతిపక్షం ఒకరి మీద ఇంకొకరు దుమ్మెత్తి పోస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నాయి తప్ప భూముల విషయంలో ప్రజలకు ఏం చేస్తే మంచి జరుగుతుంది అని ఆలోచించడం లేదు. ఇప్పటికైనా మేల్కొని కాకమ్మ కబుర్లు చెప్పకుండా ‘సమగ్ర భూ సర్వే’ నే మా నినాదం మా విధానం అని చెప్పే రాజకీయ పార్టీలను ప్రజలు ఆదరిస్తారని మర్చిపోవద్దు. ప్రజలను మోసం చేసి రాజకీయ గడుపుదామనుకుంటే రాజకీయ పార్టీలను తెలంగాణ ప్రజలు బొంద పెట్టి అస్తికలు బంగాళాఖాతంలో కలుపుతారని గ్రహించాలి.
-బందెల సురేందర్ రెడ్డి
మాజీ సైనికుడు
83749 72210