షర్మిల పార్టీకి భవిష్యత్తు ఉందా!

by Disha Web Desk 13 |
షర్మిల పార్టీకి భవిష్యత్తు ఉందా!
X

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు, ఆమె కన్నతల్లి విజయమ్మకు అసహనం పెరిగిపోవడానికి కారణం, తెలంగాణలో వారికీ, వారి పార్టీకి తగిన ఆదరణ లభించకపోవడమే కారణం కావచ్చు. తెలంగాణలో మొదటి నుంచి ఆమె పార్టీకి ప్రజల నుండి, ఇతర నాయకుల నుండి ఊహించినంత మద్దతు లభించటం లేదు. భవిష్యత్తులో కూడా ఆమె పార్టీకి పట్టంకట్టే అవకాశాలు ఎంత మాత్రం కనిపించడం లేదు. షర్మిల ఆశించినట్లుగా, ఆమె చేస్తున్న పోరాటానికి ప్రజల నుండి, రెడ్డి సామాజిక వర్గం నుండి కనీసం మహిళల నుండి కూడా తగిన మద్దతు లభించడం లేదు. రాజశేఖర్ రెడ్డి కూతురుగా, ఆయనకు తెలంగాణ ప్రాంతంలో వారసురాలుగా, షర్మిల చేస్తున్న ప్రయత్నాలు ఎంత మాత్రం ఫలించడం లేదు. పైగా బెడిసి కొడుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ రాజశేఖరరెడ్డి పైన ప్రజలకు అభిమానం ఉంది. అయితే ఆయన మీద ఉన్న అభిమానం, అదే స్థాయిలో తనకి కూడా దక్కాలనీ ఆశించడం, ఎంత మాత్రం సరైనది కాదు అని తేలిపోయింది.


దీనితో రాబోయే ఎన్నికల్లో షర్మిల పార్టీ సొంతంగా బరిలోకి దిగుతుందా లేదంటే, పొత్తులకే మొగ్గు చూపుతుందా అనేది తేలకుండా ఉంది. ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తే, తన తండ్రి వైఎస్ఆర్ నుంచి లబ్ధి పొందిన నేతలు తనతో కలిసి వస్తారా! లేదా! అని చెప్పలేని సందిగ్ధంలో పడిపోయింది. దానితో మానసికంగా సంయమనం కోల్పోయి, కోపంతో ఊగిపోతున్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆమె తల్లి విజయమ్మ ఆవేశానికి కారణం కూడా అదే. తెలంగాణలో వారి అంచనాలన్నీ తలకిందులు అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‍‌‌లో వైయస్ జగన్ సొంత పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో జగన్ జైలుకు వెళ్లి వచ్చినప్పుడు ఆయన సోదరి షర్మిల అతని తరఫున పాదయాత్ర కొనసాగించారు. ఆ తర్వాత వైఎస్ ఫ్యామిలీలో విభేదాలు వచ్చాయి అని ప్రచారం జరిగింది. అన్న మీద కోపంతో, ఆవేశంతో తెలంగాణలో సొంతంగా పార్టీ స్థాపించారు. ఈ ప్రయత్నం ఏపీలో అయితే బాగుండేది. ఆమెకు ఆదరణ లేని చోట, తెలంగాణలో పార్టీ పెట్టాలనుకోవడం సరైన ఎత్తుగడ కాదు. ఈ ప్రాంత కోడలిని అని చెప్పుకున్నా తెలంగాణలో ఆమెను ఎవరు నమ్మడం లేదు. కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించినంత మాత్రాన ఆమె గొప్ప నాయకురాలుగా ఎదగలేదు. ప్రజా ఉద్యమాలతో ఏర్పడిన తెలంగాణలో ఆంధ్ర మూలాలు ఉన్న షర్మిలను ముఖ్యమంత్రిగా ప్రజలు ఎలా ఆదరిస్తారు?


రాజకీయ పార్టీ అంటే జిల్లా నియోజకవర్గాల్లో ఒక నిర్మాణం, ఒక వ్యవస్థా, గుర్తింపు ఉన్న నేతల అండదండలు పార్టీకి ఉండటం చాలా అవసరం. షర్మిల పార్టీలో అసలు అలాంటి ప్రయత్నం కూడా జరిగినట్లు లేదు. ఆమె పార్టీకి కనీసం కార్యకర్తలు కానీ, కేడర్ కానీ బలంగా లేదు. పార్టీకి ఒక ఎజెండా కూడా లేదు. షర్మిల ఆమె తల్లి విజయమ్మ తప్ప, పార్టీలో చెప్పుకోదగిన నాయకులు ఎవరూ లేరు. గట్టు రామచంద్రరావు ఒక్కడే మిగిలాడు. షర్మిల కెసిఆర్‌ను, అధికార పార్టీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు ఆమె పార్టీతో కలిసి వచ్చేందుకు కాంగ్రెస్ కానీ, వామపక్షాలు కానీ ఎవరూ ముందుకు రావడం లేదు.

పైగా ఆమె పార్టీ పెట్టింది కేవలం ఓట్లు చీల్చడానికే అనే అభిప్రాయం, ప్రజల్లో బలంగా ఉంది. అందుకే ఆమెకు ఇతర పార్టీలు దూరంగా ఉంటున్నాయి. వైఎస్ఆర్ పార్టీని బీటీమ్ పార్టీగానే చూస్తున్నారు తప్ప ప్రధానమైన రాజకీయ పార్టీగా గుర్తించడం లేదు. షర్మిల మాత్రం తాను ఎవరికీ బీ టీమ్ కాదని సొంతంగా అధికారంలోకి రావటమే తన లక్ష్యమని చెప్తున్నారు. అయినా ఇతర పార్టీలు, ప్రజలు నమ్మడం లేదు. అమె పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా తనతో నేతలు ఎవరూ కలిసి రావడం లేదు.

దానితో తీవ్ర నిస్పృహకు గురై, పోలీసు ఎస్సైపై, మహిళా కానిస్టేబుళ్లపై, షర్మిల, ఆమె తల్లి విజయమ్మ భౌతికంగా దాడికి దిగారు. పోలీసులను గాడిదలు కాస్తున్నారా అంటూ దూషణలు కూడా చేశారు. వారి చెంపలు చెళ్లుమనిపించారు. అయినా! తెలంగాణ పోలీసులు వారిపట్ల చూపిన గౌరవాన్ని, సహనాన్ని చూసి ప్రజలు విస్తుపోతున్నారు. అలాగే, పోలీసులు కూడా షర్మిలకు కోర్టులో తేలికగా బెయిల్ వచ్చే విధంగా సెక్షన్లు (కేసులు) పెట్టారనీ. ఒక్కరోజులోనే కోర్టులో బెయిల్ దొరికి, విడుదలయ్యేలా తెలంగాణ పోలీసులూ, లాయర్లు సహకరించారనీ ప్రజలు అనుకుంటున్నారు. అలాగే విజయమ్మ కూడా పోలీసులపై దౌర్జన్యం చేసినా, మరో మహిళా కానిస్టేబుల్‌ను చెంపలు వాయించినా! తెలంగాణ పోలీసులు కనీసంగా ఎఫ్ఐఆర్‌ను కూడా బుక్ చేయలేదు. ఆమెపై కేసులు కనీసంగా కూడా పెట్టలేదు. ఇదే నేరం మరొక సామాన్యుడు చేస్తే!! మన తెలంగాణ పోలీసులు, లాయర్లు ఇంత ఉదారంగా, గౌరవప్రదంగా వ్యవహరిస్తారా?

జైలు వద్ద షర్మిల భర్త అనీల్‌కూ, తల్లి విజయమ్మకూ షర్మిలను పరామర్శించటానికి అంత తొందరగా ములాకత్‌కు అవకాశం దొరుకుతుందా? ఇంత వివక్ష సామాన్య ప్రజలకూ రాజకీయ నాయకులకు మధ్య ఎందుకు చూపిస్తున్నారు అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కోర్టులు కూడా ఆగమేఘాలపై బెయిల్ ఇస్తారా? అన్ని వార్తా ఛానళ్లు వీడియోల సాక్షిగా డ్యూటీలో ఉన్న పోలీసులపై భౌతిక దాడిని స్పష్టంగా వార్తలు ప్రసారం చేసినా షర్మిలకు బెయిల్ ఇంత తొందరగా ఏలా దొరికింది ఇది సామాన్యులను వేధిస్తున్న ప్రశ్నగా మిగిలింది. ఏది ఏమైనా డబ్బు, పలుకుబడీ, రాజకీయ నేర చరిత్ర ఉంటే ప్రభుత్వాలు, పోలీసులు,ఇతర వ్యవస్థలు కూడా భయపడతాయని, ప్రజలలో ఎప్పటి నుంచో ఉన్న అభిప్రాయాన్ని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింంది.

డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్,

98493 28496



Read more:

షర్మిలకు ఎదురుగాలి స్టార్ట్.. పాలేరులో పోటీ కూడా కష్టమేనా..?

Next Story

Most Viewed