పదును తగ్గిన కరోనా

by Disha edit |
పదును తగ్గిన కరోనా
X

ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా ఇక ఎమర్జెన్సీ అనారోగ్యం కాదంటూ ప్రకటించడం విశేషం. దాదాపు మూడేళ్లకు పైగా ప్రపంచ స్థాయి అత్యయిక వ్యాధిగా కోరలు చాచి దేశాలను వణికించిన కరోనా తన స్థాయిని కోల్పోవడం మానవ విజయం. అయితే కోరలు పదును కోల్పోయినా ముప్పు పూర్తిగా తప్పిపోలేదని గుర్తించడం ఆవశ్యకం. కరోనా తన మహమ్మారి హోదాని కోల్పోకపోవడం గమనార్హం. ధనిక,పేద దేశాల తారతమ్యం లేకుండా లక్షలాది ప్రాణాలను తోడేసిన కరోనా కోట్లాది కుటుంబాల్ని రోడ్డున పడేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. అలలు అలలుగా విజృంభించి ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ ఈ వైరస్ విస్తృతంగా వ్యాపించి ప్రజారోగ్య వ్యవస్థను కుప్పకూల్చింది. అయితే మన దేశం సహా అగ్రదేశాలు దీటుగా స్పందించి త్వరితంగా దాని తీవ్రతను తగ్గించగలిగాయి. రానురాను వైరస్‌‍లో వచ్చిన మార్పులు కూడా ప్రమాద రహితంగా దాన్ని మార్చాయి. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాని ప్రమాదకారి కాదని తేల్చడం తాత్కాలికమైన ఊరట. ఎందుకంటే ఆ వైరస్‌లో వస్తున్న మార్పులు ప్రతీసారీ ప్రమాద రహితంగా ఉండనక్కరలేదు. ఆకస్మికంగా ప్రమాదకారి కావొచ్చు. అందుకనే గతంలో నేర్చిన పాఠాల్ని దేశాలు, అంటే ప్రభుత్వాలు, ప్రజలు మరవరాదు. ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేసి, సన్నద్ధంగానే ఉండాలి. ఆ కేసుల సంఖ్యపై, అవి పెరిగే వేగంపై, తీవ్రతపై సరైన అవగాహన తోనే ఉండాలి. ప్రజలు కూడా అవసరమైన చోట మాస్కులు వాడడం, చేతుల శుభ్రత కొనసాగించాలి. వృద్ధులు ,ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు శ్వాస సంబంధిత లక్షణాలు కనబడితే మరింత జాగ్రత్త పడాలి. కరోనాపై యుద్ధంలో పైచేయి సాధించిన మానవాళి దాన్ని మట్టి కరిపించాం అని ప్రకటించడానికి ఇంకా సమయం ఉంది. బలహీనపడ్డ మహమ్మారి పై ఓ కన్నేసి ఉంచడంతో ముప్పు తప్పుతుంది.

డా. డి.వి.జి.శంకర రావు

94408 36931

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channelNext Story

Most Viewed