విపక్ష ముక్త్ భారత్.. సాధ్యమేనా?

by Disha edit |
విపక్ష ముక్త్ భారత్.. సాధ్యమేనా?
X

‘యత్ర నార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవతా’.. అంటే ఎక్కడ నారీమణి పూజింపబడుతుందో అక్కడ దేవతలు విహరిస్తారు అని మహిళల ఔన్నత్యం గురించి గొప్పగా చెప్పే భారతదేశంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు అందరినీ కలచి వేస్తున్నాయి. దేశానికి మణిహారంలాంటి మణిపూర్‌లో జరుగుతున్న సంఘటనలు బాధాకరం. నిజంగా ఇవి వాంఛనీయం కావు. ఇలాంటి సంఘటనలు ఒక్క మణిపూర్ లోనే కాదు ఏ రాష్ట్రంలో జరిగినా బాధాకరమే.

ఎన్నికలు ఉన్నా రాష్ట్రాల్లోనే ఎందుకు?

అయితే మణిపూర్ కంటే ఘోరాతి ఘోరమైన సంఘటనలు, బహిరంగంగా మహిళలను వివస్త్రలను చేయడం, కుటుంబాలకు కుటుంబాలను చంపేయడం, గృహ, ఆస్తి దహనాలతో, భౌతిక దాడులతో అక్కడి ప్రజలు పారిపోయేలాగా భయానక వాతావరణాలను సృష్టించిన సంఘటనలు పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్, తెలంగాణ లాంటి రాష్ట్రాలలో ఇటీవల కోకొల్లలు. కానీ బీజేపీ అధికారంలో ఉన్న మణిపూర్ సంఘటనలపై మాత్రమే తీవ్రంగా వేదనకు గురవుతున్న మనసులు, అన్యాయమని గొంతెత్తి అరుస్తున్న వారు, ప్రధాని స్పందించాలని పార్లమెంట్‌ను స్తంభింపజేసి అవిశ్వాస తీర్మానం కూడా పెట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్ తదితర విపక్షాలు, సో కాల్డ్ సెక్యులరిస్టులు ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న సంఘటనలపై ఎందుకు స్పందించడం లేదు? ఇలాంటి ఆందోళనలు వివిధ రాష్ట్రాలలో ఎన్నికలున్న సమయాల్లోనో, లోకసభ ఎన్నికల సందర్భాల్లోనే ఎందుకు జరుగుతున్నాయి? గతంలో బీహార్ ఎన్నికలకు ముందు రిజర్వేషన్ల గొడవలు, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల ఎన్నికల ముందు ఆ రాష్ట్రాల్లోనే రైతు ఉద్యమాలు, కర్ణాటక, మణిపూర్ లాంటి రాష్ట్రాల ఎన్నికల ముందు రెజ్లర్ల ఆందోళనలు ఎందుకు జరిగాయి ఎవరి ప్రోద్బలంతో జరిగాయి? మళ్ళీ ఇప్పుడు లోక్ సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలకు ముందు మణిపూర్ మంటలు...మణిపూర్‌లో ఎప్పుడో మే నెలలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తే జులైలో అదీ పార్లమెంట్ సమావేశాలకు ముందు ఆ వీడియో వైరల్ అయ్యేలాగా చేయడంలోనే బీజేపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకే కుట్ర చేసినట్లు తెలుస్తోందని హోమ్ మంత్రి అమిత్ షా అభిప్రాయపడడం గమనార్హం.

అల్లర్లకు కారణం బీజేపీయేనా?

మాలేగావ్ అల్లర్ల సమయంలో అయితే కాంగ్రెస్ అగ్రనాయకుడి అతి ప్రధాన అనుచరుడు మీడియా కంట పడి ఆదరాబాదరగా దొరికిన ఆటో ఎక్కి పారిపోవడం అందరికీ తెలిసిందే. అగ్నికి ఆజ్యం తోడైనట్లు దేశం పరువు తీసే విధంగా వీటికి విస్తృత ప్రచారం కల్పిస్తున్న కొన్ని మీడియా సంస్థల ఉద్దేశాలేంటి? మణిపూర్ సహా ఈశాన్య రాష్ట్రాలలో గిరిజన తెగల మధ్య అల్లర్లు కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నా బీజేపీ అధికారంలోకి రాగానే మణిపూర్లో అల్లర్లు ప్రారంభమైనట్లు, హిందూ, క్రిష్టియన్ల మధ్య అల్లర్లుగా కాంగ్రెస్, కమ్యూనిస్టు సహా విపక్షాలు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. కుకీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న స్వదేశీ, విదేశీ శక్తులేంటి? వారి చేతులకు అత్యాధునికమైన ఏకే 47, ఏకే 56, ఆటోమేటిక్ గన్స్ అందిస్తూ అల్లర్లు పెంచేందుకు దోహదపడుతున్నదెవరు లాంటి విషయాలకు కారకులు స్థానిక క్రైస్తవ మిషనరీలకు తోడు దేశంలోని కొన్ని విద్రోహ శక్తులే అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు కుకీ మహిళలు బహిరంగంగా నగ్నంగా కర్రలతో భద్రతా బలగాలపై దాడి చేయడం లాంటివి పరిశీలిస్తే నగ్నంగా ఇద్దరు మహిళలను ఊరేగించి దాడులకు పాల్పడడం లాంటివి కూడా కుట్ర పూరితంగా జరిగాయేమోనని సందేహాలు రేకెత్తిస్తున్నాయి. దేశ ప్రజల ముందు బీజేపీని బదనాం చేసి కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రాకుండా చూడాలనే కాంగ్రెస్, కమ్యూనిస్టులు వంటి విపక్షాల కుట్ర దాగి ఉండవచ్చనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ విపక్షాల మిత్రపక్షాల పాలిత రాష్ట్రాలలో ఇంతకు మించి అల్లర్లు జరుగుతున్నా కనీసం స్పందించక పోవడం కూడా ఈ సందేహాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

ఆజ్యం పోసిన హైకోర్టు తీర్పు

ఎవరి ఆలోచనలు, కుట్రలు ఎలా ఉన్నా అల్లర్లకు అసలు కారణాలేంటంటే, కుకీలకు చెందిన ఒక స్మారక చిహ్నాన్ని మెయితీలు ధ్వంసం చేశారన్న వదంతితో ప్రారంభమైన అల్లర్లు మణిపూర్‌ను రావణకాష్టంగా మార్చాయి. అక్కడ కుకీ, నాగాలతోపాటు మయితీలు అనే గిరిజన తెగల వారు అనాదిగా నివసిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో నివసించే కుకీలకు గతంలోని పాలకులు 371 సి అనే చట్టం చేసి ప్రత్యేక హక్కులు ప్రసాదించారు. దీంతో కుకీలు ఎస్.టి. లుగా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో నైనా భూములు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు కానీ మొయితీలు మాత్రం మైదాన ప్రాంతంలో తప్ప కొండ ప్రాంతాల్లో భూములు కొనుక్కునే వీలులేదు. అంటే సొంత రాష్ట్రంలో కూడా మెయితీలకు కుకీలతో సమానమైన హక్కులు లేవన్న మాట. కుకీలు మాత్రమే ప్రత్యేక హక్కులను కలిగి ఉండడం అన్యాయం కాక మరేమిటి? కుకీల ఆగడాలు ఎంత వరకు పెరిగాయంటే 1990లో జరిగిన ఘర్షణల్లో స్వల్ప సంఖ్యలో ఉన్న నాగాలు సైతం సురక్షిత ప్రాంతాలకు పారిపోయేలా భయానకమైన పరిస్థితులు కల్పించారు. కుకీలతో రాబోతున్న ప్రమాదాన్ని పసిగట్టిన మెయితీలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా బీజేపీ వెంట నడిచి అధికారాన్ని కట్టబెట్టారు. ఇది అక్కడి క్రైస్తవ మెషినరీలకు, కుకీలకు కంటగింపుగా తయారు కావడంతో పాటు స్థానిక హైకోర్టు అక్కడి మొయితీలకు కూడా ఎస్.టి. హోదా ఇచ్చి కొండ ప్రాంతాల్లో కూడా భూమిపై హక్కులు కల్పించే విషయాన్ని పరిశీలించవచ్చని తీర్పు చెప్పడంతో సహించలేక పోయారు.

స్వార్థంతో వ్యవహరిస్తే..

మణిపూర్ తో పాటు పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలలో జరిగిన అల్లర్లపై కూడా పార్లమెంట్‌లో చర్చిద్దామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినా మణిపూర్ ఘటనలపై మాత్రమే చర్చించాలని కాంగ్రెస్, కమ్యూనిస్టు సహా ఇతర విపక్షాలు పార్లమెంటును స్థంభింపజేశాయంటే వాటి ఉద్దేశమేమిటో గ్రహించ లేనంత అమాయకులు కాదు ప్రజలు. సున్నితమైన విషయాల్లో కూడా స్వార్థ రాజకీయాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమో కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్లమెంట్లో అవిశ్వాసానికి ప్రధాని నరేంద్ర మోడీ జవాబిస్తూ 2018 లో ఇలాగే అర్థం పర్థం లేకుండా అవిశ్వాసం ప్రవేశపెట్టడంతో ప్రజలు అంతకు ముందు కంటే ఎక్కువ సీట్లలో తమ అభ్యర్థులను గెలిపించారని, రాబోయే ఎన్నికల్లో కూడా తమదే విజయమని ఘంటా పథంగా చెప్పడం గమనార్హం. ఇలాగే విపక్షాలు ప్రజల క్షేమాన్ని కాంక్షించక స్వార్థంతో వ్యవహరిస్తే మోడీ మొదటి నుంచి చెబుతున్నట్లుగా కాంగ్రెస్ ముక్త్ భారత్ కాకుండా మొత్తం విపక్ష ముక్త్ భారత్ కూడా త్వరలోనే సాధ్యమవుతుందనడంలో సందేహం లేదు.

శ్యామ్ సుందర వరయోగి,

సీనియర్ జర్నలిస్ట్,

98669 66904

Next Story

Most Viewed