మట్టిమనుషులను మహావీరులుగా... మలిచినోళ్లే కమ్యూనిస్టులు!

by Disha edit |
మట్టిమనుషులను మహావీరులుగా... మలిచినోళ్లే కమ్యూనిస్టులు!
X

"కమ్యూనిస్టులది ఎప్పుడూ వెన్నుపోటే!" పేరుతో దిశ దినపత్రికలో గత నెల 30వ తారీఖున వ్యాసం రాశారు మాసాడి బాపురావు.. వీర తెలంగాణా రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర గురించి అసత్యాలు, అర్థసత్యాలతో చరిత్రను వక్రీకరింప ప్రయత్నించారు. సమస్త భారత స్వాతంత్ర్య ఉద్యమ పరంపరకే తలమానికంగా భాసిల్లినది వీర తెలంగాణా రైతాంగ పోరాటం. రాజకీయ స్వాతంత్ర్యంతో పాటు ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ఉద్యమించిన నేలగా దేశ ప్రజలంతా వీర తెలంగాణా వైపు గర్వంగా చూసే వేళ.. తెలంగాణ గడ్డపైననే కొందరు.. నేటి కాలపు తమ మత సంకుచిత రాజకీయాల కోసం, ఆ మహోన్నత పోరాటాన్ని అల్పమైనదిగా చూపెట్టాలని ప్రయత్నించడం.. వీర తెలంగాణాకే అవమానకరం. తెలంగాణ ప్రజల చరిత్రను తెలంగాణ ప్రజల ముందే తప్పుదారి పట్టించ చూడడం.. దుస్సాహసమే అవుతుందని వ్యాసకర్త గుర్తుంచుకోవాలి. తెలంగాణ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టులు నిర్వహించిన వీరోచిత, త్యాగపూరిత పాత్ర గురించి తమ తాతలు, తండ్రులు స్వానుభవంతో చెప్పిన విషయాలు తెలంగాణ ప్రజల కళ్ళ ముందు సజీవంగా నిలిచి ఉండగా.. తప్పుడు కథనాలు చెల్లుబాటు అయ్యే ఆస్కారం ఉన్నదా?

చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడుతారా?

‘నిజామూ, రజాకార్లే సాయుధ పోరాట లక్ష్యమయినప్పుడు.. మరి నిజాం లొంగిపోయిన 1948 సెప్టెంబర్ 17న కమ్యూనిస్టుల పోరాటం ఎందుకు ఆగిపోలేదు? భారత మిలిటరీకి వ్యతిరేకంగా ఎందుకు కొనసాగింది?" అంటూ బాపురావు తన వ్యాసంలో ప్రశ్నించారు. ఆయనకి తెలంగాణ చరిత్ర తెలియదనడానికి ఈ ప్రశ్న గొప్ప ఉదాహరణ. వీర తెలంగాణా రైతాంగ పోరాటం ఎందుకోసం.. ఎవరికి వ్యతిరేకంగా మొదలయిందో.. మీరు ముందుగా తెలుసుకోవాలి! ముస్లిం రాజైన నిజాముకు హిందువులైన తెలంగాణ ప్రజలకు మధ్య జరిగిన మతపరమైన కొట్లాటగానే చిత్రీకరించాలని ప్రయత్నిస్తున్న మతోన్మాదుల కథనాలు చరిత్ర ముందు పటాపంచలు కాక తప్పదు. మౌలికంగా తెలంగాణ బిడ్డల పోరాటం మొదలైంది.. తెలంగాణ పల్లెల్లో భూస్వాముల దౌర్జన్యాలకు, వెట్టిచాకిరీకి, భూస్వామ్యదోపిడికి వ్యతిరేకంగానే. తెలంగాణ సాయుధ పోరాటానికి అంకురార్పణగా నిలిచిన దొడ్డి కొమురయ్య మరణం సంభవించింది దొర విసునూరి రామచంద్రారెడ్డి గడీ ముట్టడిలో భాగంగానేనన్న చరిత్ర మీరు తెలుసుకోవాలి.

తెలంగాణను చెరబట్టిన దొరల భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా మొదలై.. ఆ దొరలకు అండగా నిలిచిన నిజాంను, రజాకార్లనూ.. గోల్కొండ ఖిల్లా కింద గోరీ కట్టాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రజాపోరాటం సాగింది. 1944లో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన భువనగిరిలో జరిగిన ఆంధ్రమహాసభ 11వ మహాసభ నాటికి..ఆంధ్రమహాసభ ప్రధాన నాయకులందరూ కమ్యూనిస్టు ఆదర్శాలతో ప్రభావితులై.. కమ్యూనిస్టులుగా మారారు. ఆ విధంగా 1944 నుండి తెలంగాణ ప్రజాపోరాటం ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కొనసాగింది. అయితే... నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించిన కారణాన... ఆంధ్ర మహాసభ పేరుతోనే కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలు కొనసాగాయి. బాంచన్‌ కాల్మొక్తా అంటూ బతికిన తెలంగాణ బిడ్డలు.. బరిసెలు, బందూకులూ చేతబట్టి... దొరల రాజ్యం కూల్చడానికి ఉద్యమించిన వీరోచిత చరిత్ర అది. నిఖార్సైన శ్రామికవర్గ ఎజెండాతో సాగిన ఆ పోరాటంలో.. మూడు వేల గ్రామాలు విముక్తమై... గ్రామ రాజ్య కమిటీల ఆధ్వర్యంలో ప్రజారాజ్యం ఏర్పడింది. దొరల కబ్జాలో ఉన్న పది లక్షల ఎకరాల భూమి పేద రైతులకు పంచడమైంది. రుణ పత్రాలు రద్దయ్యాయి. వ్యవసాయ కూలీల వేతనాలు పెరిగాయి. కుల వివక్ష, లింగ వివక్ష కట్టడి అయినాయి. ఇదిగో.. ఇదీ తెలంగాణ చరిత్ర! ఈ చరిత్ర తెలుసుకోక.. ఏమేమో మాట్లాడితే ఎట్లా కుదురుతుంది?

మూడేండ్ల పాటు రక్తపుటేరులు..

వీర తెలంగాణ పోరాటానికి నిక్కమైన ప్రతిబింబం వీరనారి చిట్యాల (చాకలి) ఐలమ్మ. ఈమె చేసిన వీరోచిత పోరాటం ఎవరి మీదో కూడా సక్కగా తెలవనోళ్లు.. నేడు తెలంగాణ చరిత్ర గురించి మాట్లాడాలని చూడడం హాస్యాస్పదమే! ఐలమ్మ పొలం గుంజుకున్నది.. ఐలమ్మ పంటను దారి మళ్లించి గడీకి తరలించింది.. ఐలమ్మ కొడుకులను జైలు పాలు చేసింది.. నాటి కడివెండి దొర విసునూరి రామచంద్రారెడ్డేనాయె! ఐలమ్మ లాంటి తెలంగాణా బిడ్డలందరి మీద జలుం చేసింది నాటి దొరలేనాయె! దొరతనానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టిన ఐలమ్మ, ఇతర తెలంగాణా బిడ్డలూ.. ఆ దొరలకు అండగా నిలిచిన నిజాంకు.. నిజాం బంట్లు అయిన రజాకార్లకు వ్యతిరేకంగా సైతం పోరాటాన్ని ఎక్కుపెట్టారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోయిన తర్వాత.. ఆ నిజాం స్థానంలో నిలబడి అదే దొరలకు అండగా నిలిచినోళ్లు ఎవరైనా సరే.. వారికి వ్యతిరేకంగా పోరాడటమే తెలంగాణా బిడ్డల దృష్టిలో సమంజసం కదా..!? ఆ పనే చేశారు నాటి తెలంగాణ బిడ్డలు. వీర తెలంగాణా యోధులు చేసిన ఆ పనిని.. నేడు తప్పుబట్టేవారు..సెప్టెంబర్ 17 తర్వాత లడాయి బందుచేయాల్సిఉండె అనేవాళ్లు.. తెలంగాణా బిడ్డలు ఎట్లయితరో నాకయితే సమజ్ కాదు!

1948 సెప్టెంబర్‌ 13న తెలంగాణలోకి పటేల్‌ సైన్యాలు అడుగు పెట్టాయి. కోదాడ, దురాచిపల్లిలో తప్ప... మరెక్కడా నిజాం సైన్యాలు ప్రతిఘటించలేదు. సెప్టెంబర్‌ 17న నిజాంరాజు లొంగిపోయాడు. నెహ్రూ ప్రభుత్వం నిజాంరాజును సకల మర్యాదలతో అరుసుకున్నది. ఆయనకున్న ఆస్తులు, రాజభవనాలు ఆయనవేనని ప్రకటించింది. హైదరాబాద్‌ రాష్ట్రానికి 'రాజ్‌ ప్రముఖ్‌' పదవినిచ్చి సత్కరించింది. మరోవైపు కమ్యునిస్టుల పోరాటం కారణంగా ప్రజలకు దక్కిన భూములను మళ్లీ దొరల ఆధీనంలోకి తీసుకురావడం కోసం.. తెలంగాణ ప్రజలపై తన సైనిక చర్యను కొనసాగించింది. 1948 సెప్టెంబర్‌ నుండి 1951 అక్టోబర్‌ వరకు.. మూడేండ్లపాటు తెలంగాణను పటేల్‌ సైన్యాలు రక్తపుటేరుల్లో ముంచెత్తాయి. తెలంగాణ పల్లెల్లో బీభత్సం సృష్టించారు. కాటూరు, ఎలమర్రు మొదలగు గ్రామాలలో ఆడపడుచులను బట్టలిప్పించి బరివాతగా గాంధీ విగ్రహం చుట్టూ బతుకమ్మలాడించిన పటేల్‌ సైన్యాల దారుణకాండలను నాటి పత్రికలలో చదివిన భారతీయులందరూ సిగ్గుతో తలదించుకున్నారు. తెలంగాణ ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాలను చూసి భరించలేని డాక్టర్‌ జయసూర్య (సరోజినీ నాయుడు కొడుకు) నాటి గవర్నర్‌ జనరల్‌ జే.ఎన్‌. చౌదరిని కలిసి... తెలంగాణ ప్రజలు కూడా భారతీయులేననీ.. వారి ఆకాంక్షలను గుర్తించి ఉద్యమకారులతో చర్చలు జరపాలని ప్రతిపాదించారు. నెహ్రూ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను కర్కశంగా తిరస్కరించింది. నాటి పరిణామాలన్నింటికి సజీవ సాక్షిగా నిలిచిన ప్రముఖ తెలంగాణ రచయిత దాశరథి రంగాచార్య తెలంగాణలో నాడు నెలకొన్న పరిస్థితులను నిష్పక్షపాతంగా అక్షరబద్ధం చేసారు. నిజాం హయాంలో... నెత్తిన రూమీ టోపీలు ధరించి... తెలంగాణ బిడ్డలపై జులుం చెలాయించిన దొరలు... ప్రజలు తిరగబడడంతో పల్లెల నుండి పారిపోయి, 1948 సెప్టెంబర్‌ 17 తర్వాత... పటేల్‌ సైన్యాల అండతో నెత్తిన గాంధీ టోపీ ధరించి మళ్లీ పల్లెల్లోకి అడుగుపెట్టి... తమ పాత దోపిడీ విధానాలను యధావిధిగా కొనసాగించిన వైనాన్ని దాశరధి రంగాచార్య తన రచనల్లో (జనపథం, మోదుగుపూలు, జీవనయానం) కండ్లకు కట్టినట్టు రికార్డు చేశారు.

దొరల వైపు నుంచి చూస్తే.. తప్పే కనిపిస్తది!

స్వతంత్ర భారతావనిలో ఢిల్లీ పీఠమెక్కిన కాంగ్రెస్‌ పెద్దలు.. తెలంగాణాలోని భూస్వాములు, పెట్టుబడిదారుల పక్షం వహించడమే తప్పవుతుంది కాని.. భూస్వాముల మీద ఎక్కుపెట్టిన లడాయిని.. వారికి మద్దతుగా వచ్చిన నెహ్రూ సైన్యాల పైన సైతం కొనసాగించిన తెలంగాణ బిడ్డలది తప్పు ఎట్లవుతది? నాటి పరిస్థితులను చారిత్రక దృక్పథంతో అన్వయించి చూడకపోతే చరిత్ర సరిగ్గా అర్ధం కాదు. దేశం గర్వించదగ్గ సామాజిక విప్లవకారుడు మహాత్మా ఫూలే 1873లో రాసిన పుస్తకం పేరు ‘గులాంగిరి’. నాడు దేశ ప్రజల కడగండ్లకు కారణమైన బ్రిటిష్ వాడు విధించిన గులాంగిరి గురించి ఫూలే ఏమైనా రాసి ఉంటాడా.. అని వెతికిన వారికి నిరాశే ఎదురవుతుంది. గులాంగిరీ పుస్తకంలో బ్రిటిష్ పాలకుల మీద నిందలకు బదులు అక్కడక్కడ ప్రశంసలే ఉంటాయి. ఈ దేశానికే చెందిన మనువాదులు.. సాటి దేశ ప్రజల మీద విధించిన కుల దురహంకారపు ‘గులాంగిరి’ గురించి మాత్రమే ఎలుగెత్తి చాటాడాయన. నేటి కళ్ళతో నాటి చరిత్రను చూసి.. ఫూలే మహనీయుడు బ్రిటిష్ వాళ్లకు వత్తాసు పలికాడు అని ఎవరైనా అనగలరా? సాటి దేశస్తులను కులం పేరుతో ఊరవతలకి నెట్టేసిన మనువాద దురహంకారులదే ఆ తప్పు తప్ప.. ఫూలేదికాదు కదా..!? నిజానికి ప్రజలకు దక్కాల్సిన అసలు స్వాతంత్ర్యం గురించి పోరాడిన నిక్కమైన దేశభక్తుడు, నిజమైన స్వాతంత్ర్య సమరయోధుడు.. మహాత్మా గాంధీని మించిన మహాత్ముడు మన ఫూలే అని దేశ ప్రజలందరూ నేడు గర్వంగా చెప్పుకుంటారు. తెలంగాణ చరిత్ర గురించి తర్కించేటప్పుడు సైతం అలాంటి చారిత్రక స్పృహ ఉండాలి. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను నాటి నెహ్రూ ప్రభుత్వం గుర్తించి, వారు పోరాడి సాధించుకున్న భూములు వారికే దక్కుతాయని, భూస్వాముల దోపిడీ ఉండబోదని హామీ ఇస్తే... పరిస్థితి భిన్నంగా ఉండేది. ఐలమ్మ కళ్లతో చూస్తే పటేల్ సైన్యాలపై పోరాటం ఎందుకు సమంజసమో అర్థమవుతుంది. దొరల వైపునుండి చూసిన వారికే నాటి తెలంగాణ బిడ్డల పనిలో తప్పు కనబడుతది.

వారిని ఏమి అనాలో చెబుతారా?

"ఇక్కడి ప్రజా ఉద్యమాల స్వభావాన్ని అర్ధం చేసుకోలేక పోయాము" అని పుచ్చలపల్లి సుందరయ్య గారు అన్నారన్నది.. వ్యాసరచయిత పుట్టించిన అబద్ధమే. కమ్యూనిస్టులు నెరపిన పోరాటాన్ని, వారి త్యాగనిరతినీ అర్థం చేసుకున్నారు కాబట్టే.. పోరాట విరమణ తర్వాత, 1951 లో జరిగిన మొదటి పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 12 సీట్లలో ఏడింటిలో కమ్యూనిస్టులకు ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు. నల్గొండ నియోజకవర్గం నుండి పోటీ చేసిన కామ్రేడ్ రావి నారాయణ రెడ్డికి తెలంగాణ బిడ్డలు ఎంతగా బ్రహ్మరథం పట్టారంటే.. దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన పార్లమెంటు సభ్యుడిగా ఆయన నిలిచాడు. తెలంగాణ దొరలపక్షం వహించిన ప్రధాని నెహ్రూ గారు.. అలహాబాద్ నుండి గెలిచినా.. మెజారిటీలో మాత్రం తెలంగాణా కమ్యునిస్టు తర్వాతి స్థానంతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. కమ్యూనిస్టులు ప్రజలను మోసగించినవారే అయితే అంతటి ఘన విజయం సాధ్యమయ్యేదా? తెలంగాణ కమ్యూనిస్టుల చరిత్ర తెలియక ఏవేవో అభాండాలు వేస్తున్న బాపురావు లాంటి వారు.. తెలంగాణ తొలి తరం జర్నలిస్టు.. స్వయంగా భూస్వామ్య వర్గం నుండి వచ్చిన.. సురవరం ప్రతాపరెడ్డి గారు.. కమ్యూనిస్టుల గురించి ఏమి చెప్పాడో తెలుసుకోవాలి. "ఈ కమ్యూనిస్టుల దగ్గర ఏమి ఇంద్రజాలం ఉన్నదో తెలియదు కానీ.. బాంచన్ దొర కాల్మొక్త అన్న సామాన్య రైతులను బందూకు చేతబట్టేట్టు చేశారు.. మట్టి మనుషులను మహావీరులుగా మలిచారు!" అన్నది సురవరం గారి మాట!

అది ఎత్తుగడలో భాగం!

క్విట్ ఇండియా ఉద్యమానికి కమ్యునిస్టులు ద్రోహం చేశారంటూ బాపురావు చేసిన వ్యాఖ్యలు సత్యదూరమే. షహీద్ భగత్ సింగ్, లాలా హర్దయాల్, హరికిషన్ సింగ్ సుర్జీత్ లాంటి ఎందరో కమ్యునిస్టులు తమ త్యాగాలతో.. స్వాతంత్ర్య ఉద్యమాన్ని పునీతం చేసారు. ఏ దశలోనూ ద్రోహం చేయలేదు. క్విట్ ఇండియా పిలుపును కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సమయంలో.. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో.. హిట్లర్ ఫాసిజపు ప్రమాదాన్ని నిలువరించడానికి.. ప్రపంచవ్యాప్తంగా ఐక్యపోరు ఉండాలనే ఎత్తుగడలను నాటి కమ్యూనిస్టు పార్టీ అవలంబించింది. చౌరీ చౌరా సంఘటన తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీ విరమించడాన్ని.. బ్రిటిష్ వాళ్లతో రాజీపడడం అని అనగలరా ఎవరైనా? పోరాటంలో ఉన్నవాళ్లు పోరాటపు ఎత్తుగడల్ని బిగించడం సడలించడమూ చేస్తుంటారు. అది సహజమే. ఆ వైఖరినే నిందించ సాహసిస్తే.. మరి స్వాతంత్ర్య పోరాటానికి మొత్తంగా దూరంగా ఉన్నవారిని ఏమనాలో బాపురావు గారు చెబుతారా? బ్రిటిష్ రాణికి క్షమాభిక్ష పత్రం సమర్పించి.. ‘ఇకనుండి మా దృష్టి అంతా మత రాజకీయాల పైననే కేంద్రీకరిస్తాం.. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న వారిని సైతం బ్రిటిష్ రాణికి గులాములుగా చేస్తాము’ అంటూ హామీ ఇచ్చిన వారు.. పొరపాటున కూడా స్వాతంత్ర్య ఉద్యమం వైపు చూడ సాహసించని వారిని.. "బ్రిటిష్ వారిపై పోరాడి మీ శక్తియుక్తులను వృధా చేసుకోకండి" అంటూ తమ శ్రేణులకు పిలుపునిచ్చిన వారిని ఏమనాలో బాపురావు తెలిపితే బాగుంటుంది!

-ఆర్. రాజేశమ్

కన్వీనర్, సామాజిక న్యాయవేదిక

94404 43183



Next Story

Most Viewed