మూడో ప్రపంచ యుద్ధ మేఘాలు..

by Disha edit |
మూడో ప్రపంచ యుద్ధ మేఘాలు..
X

చూస్తుండగానే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. సిరియా రాజధాని డమాస్కస్ లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఈ నెల ఒకటిన ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడుల్లో ఇరాన్‌కి చెందిన కీలక సైన్యాధికారి, మరో 12 మంది మరణించారు. సిరియాలోని రాయబార కార్యాలయంపై జరిపిన దాడికి ప్రతీకారంగానే ఇజ్రాయెల్‌పై దాడి చేశామని ఇరాన్ సైన్యం తెలిపింది.

శనివారం అర్ధరాత్రి దాదాపు 370 డ్రోన్లు, 100 బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసింది. అమెరికా, రష్యాలు ఎదురెదురుగా నిలబడుతుండటంతో మూడో ప్రపంచ యుద్ధ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని అందరూ ఆందోళన చెందుతున్నారు.

‘‘శనివారం అర్ధరాత్రి మొదలైన ఆపరేషన్.. ఆదివారం ఉదయం వరకు విజయవంతంగా పూర్తయింది. అన్ని లక్ష్యాలను సాధించామని ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మహమ్మద్ బఘేరి వెల్లడించారు. అలాగే ‘‘మేం ఈ ఆపరేషన్ పూర్తయినట్లు అనుకుంటున్నాం. దీన్ని కొనసాగించే ఉద్దేశం మాకు లేదు. మా దాడికి బదులిచ్చేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించకపోవడమే బెటర్. తిరిగి దాడులు మొదలుపెడితే.. దానికి మేం చాలా పెద్ద ప్రతిస్పందనను అందిస్తామని ఆయన హెచ్చరించారు. అయితే, లక్ష్యాలు నెరవేరాయని ఇరాన్ ఒకవైపు ప్రకటించగా... ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిస్లైల్స్‌ని నిర్వీర్యం చేశామని ఇజ్రాయెల్, అమెరికాలు ప్రకటించుకున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ చేసిన దాడికి సరైన సమయంలో తగిన మూల్యం చెల్లించేలా చేస్తామని ఇజ్రాయెల్ మంత్రి హెచ్చరించారు.

తప్పెవరిది?

అసలు అమెరికా అండ చూసుకొనే ఇజ్రాయెల్ బరితెగించి గాజాను సర్వనాశనం చేయమే కాకుండా సుమారు 35 వేల మందిని రాక్షసంగా చంపింది. పైగా ఏ మాత్రం యుద్ధ నియమాలను పాటించకుండా స్త్రీలను, పసిపిల్లలను, వృద్ధులను సైతం చంపింది. ఆసుపత్రులు, జనావాసాలు, స్కూళ్లపై బాంబుల వర్షం కురిపించింది. నీరు, ఆహారం లేకుండా లక్షలాది మంది నిర్వాసితులు అయ్యారు. ఈ పాపం అమెరికాదే. ప్రపంచంలో జరిగే అన్ని యుద్ధాల వెనుక పెద్ధ హస్తం అమెరికాదే ఉంటుంది. మరోవైపు తన నాటో కూటమిలో చేర్చుకోవటానికి ఉక్రెయిన్‌కు ఆశ పెట్టి రష్యాపైకి ఎగదోసింది. యుద్ధం వస్తే ఆర్థిక సహాయం, ఆయుధ సహాయం చేస్తానని మాట ఇచ్చి కీలక సమయంలో వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఉక్రెయిన్ సర్వనాశనం అయింది. ఇటు ఉక్రెయిన్‌కూ, ఇజ్రాయెల్‌కీ ఆర్ధిక సహాయం, ఆయుధాలు అమ్ముకొంటూ కోట్లాది డాలర్లు సంపాదిస్తుంది.

అమెరికాది రాక్షసానందం. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేస్తే ఆర్ధిక, ఆయుధ సహాయం చేస్తానని ఇజ్రాయెల్‌కు భరోసా ఇస్తుంది. భద్రతా సమితిలో తనకున్న వీటో పవర్‌తో ఐక్యరాజ్య సమితిని నిర్వీర్యం చేసి, ఇజ్రాయెల్ ఆగడాలకు అడ్డుకట్ట వేయకుండా పరోక్షంగా యుద్ధాలను ప్రోత్సహిస్తుంది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతికి పనిచేయనీకుండా అడుగడుగునా అడ్డుకుంటూ, ఆయుధాలు అమ్ముకుంటూ రాజ్యాల మధ్య చిచ్చు పెడుతుంది. పైకి ప్రజాస్వామ్యం, శాంతి, మానవ హక్కులంటూ అంటూ నీతి సూత్రాలు వల్లిస్తోంది.

తీవ్ర పరిణామాలకు సిద్ధం!

ఇరాన్ ఇజ్రాయెల్‌పై ప్రతీకార పగతో రగిలిపోతుంది. వందశాతం దాడి చేయడానికి సంసిద్ధమైంది. ఇజ్రాయెల్ సంస్థకు చెందిన 'ఎంసీఎస్ ఏరీస్' అనే కార్గో నౌకపైకి హెలిక్యాప్టర్లతో దిగిన 'ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్' శనివారం యూఏఈ తీరం సమీపంలో నౌకను స్వాధీనం చేసుకొని, ఇరాన్ జలాల వైపు మళ్ళించిందని ఆ దేశ ప్రభుత్వం మీడియాకు వెల్లడించింది. తాజా ఘటనపై ఇజ్రాయిల్ స్పందించింది. పశ్చిమాసియాలో ఘర్షణలను ఎగదోసేలా చర్యలకు పాల్పడుతుందని ఇరాన్‌పై ఆరోపణలు చేసింది. ఇరాన్ యుద్ధానికి దిగితే 'తీవ్ర పరిణామాలు' ఎదుర్కోవాల్సి ఉంటుందని, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయిల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియెల్ హగరి ఇరాన్‌ను హెచ్చరించాడు. తాను మాత్రం ఇరాన్ రాజధానిపై దాడి చేయవచ్చు. కానీ ఇజ్రాయెల్‌పై మాత్రం దాడి చేయకూడదట. ఇదేమి యుద్ధ నీతో మరి.

ఇజ్రాయిల్‌కు బైడెన్ హామీ..

ఇజ్రాయిల్ ను యుద్ధ దాడుల నుండి రక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నాం అని అమెరికా ప్రకటించింది.రానున్న యుద్ధంలో ఇరాన్ విజయం సాధించబోదు అని వ్యాఖ్యానించారు. యద్ధం చేయకండి అంటూ ఇరాన్‌కు శాంతి సందేశాన్ని హెచ్ఛరిక రూపంలో బైడెన్ పంపారు. ఇజ్రాయిల్‌పై దాడిని అమెరికా‌పై దాడిచేసినట్లుగా భావిస్తామని హెచ్చరించారు. అదే సమయంలో ఐరోపా సమాఖ్య కూడా ఇరాన్‌కు హెచ్చరిక సందేశాలు పంపించింది. కాగా, ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అంటూ జరిగితే, అందులో అమెరికా జోక్యం చేసుకుంటే, అగ్రరాజ్యానికి తాము సహకరించబోమని పలు గల్ఫ్ దేశాలు అమెరికా మిత్ర బృందానికి స్పష్టం చేసాయి. అంతే కాక తమ భూభాగాలను ఇరాన్‌పై యుద్ధానికి వినియోగించుకునేందుకు అమెరికాకు అనుమతిచ్చేది లేదని కూడా స్పష్టంగా తేల్చి చెప్పాయి.

చక్రబంధంలో ఇజ్రాయిల్

ఇప్పటికే హమాస్‌పై పోరు పేరుతో గాజాలో ఇజ్రాయెల్ బీకర యుద్ధమే చేస్తోంది. అలాగే లెబనాన్ భూభాగంపై నుంచి దాడులు చేస్తున్న హిజ్బుల్లా ఉగ్రవాదులను ఎదుర్కొంటుంది. హమాస్ ముప్పు తటస్థమైనా, హిజ్బుల్లా ఎర్ర సముద్రంలో యెమెన్ భూభాగం నుంచి నౌకలపై డ్రోన్లతో దాడులు చేస్తున్న హౌతీలతో ముప్పును ఎదుర్కొంటూనే ఉంది. ఇరాన్‌‌కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కి అమెరికా రంగంలోకి దిగితే తాము చూస్తూ ఊరకుండిపోమని రష్యా తాజాగా తీవ్రంగా హెచ్చరించింది. ఈ ఈ పరిస్థితుల్లో ఇరాన్‌తో యుద్ధం ఇజ్రాయిల్‌కు ఇబ్బందికరమైన పరిస్థితేనని విశ్లేషకులు భావన. పైగా అగ్రదేశాలు రెండూ తలపడితే మూడో ప్రపంచ యుద్ధ పరిస్థితులు ఏర్పడబోతాయని సంకేతాలు వెలువడుతున్నాయి. ఇది యావత్ ప్రపంచానికి హాని కలిగించక తప్పదు.

డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్

98493 28496



Next Story