సమీక్ష: సామాజిక విలువల 'అంబుల పొది'

by Disha edit |
సమీక్ష: సామాజిక విలువల అంబుల పొది
X

సామాజిక ఆశావాద దృక్పథాన్ని కలిగినవారు సాహిత్య కళాకారులు, రచయితలు, కవులు. వీరు నిరంతరం సమాజాన్ని పరిశీలిస్తూ తమ బాధ్యతలను, విలువలను పోల్చుకుంటూ నవ సమాజ నిర్మాణానికి తన భావాలను ప్రకటించడానికి ఎన్నుకునే ప్రక్రియే సాహిత్య రచన. మాటలు ఎవరైనా చెబుతారు కానీ, ఆ చెప్పే తీరు అందంగానో, సూటిగానో చెబుతూ, ఇతరులలో జొప్పించడానికి ఉపయోగించే ఒక ఇంజక్షన్‌ లాంటిది కవిత్వం. వచన కవిత్వం రాయడంలో కవికి స్వేచ్ఛ ఉంటుంది.

తమ భావాలను సంపూర్ణంగా వివరించి, విశ్లేషించడానికి అనువుగా ఉంటుంది. ఇలా తన సామాజిక భావాలను కవితల రూపంలో అందంగా, ఆవేదనగా, ఆశావాద దృక్పథంతో రచించిన కవే చందలూరి నారాయణరావు. బాపట్ల జిల్లా, జె.పంగులూరు మండలం పంగులూరు వాస్తవ్యులు. కొరిశవాడు మండలం మెదరమెట్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాముడిగా పనిచేయుచున్నారు. తెలుగు సాహిత్యంలో పట్టున్న దిట్టమైన కవిగా నిరూపించుకున్నారు.

వీరి కలం నుండి జాలువారిన కవితలో ఓ ఫొటో గురించి చెబుతూ 'చింపిరి జుట్టుతో చూరు కింద చొక్కా లేకుండా అమ్మ కొంగు గట్టిగా పట్టుకుని బెదురు చూపులతో నిల్చున్న నా బాల్యం ఫొటో తీయగా కనిపించింది. ఏ రుచి తగిలిందో?' అంటూ తన బాల్యాన్ని నెమరు వేసుకున్నారు. నేటి, భవిష్యత్‌ బాల్యాలను పోల్చుతూ 'గుండెను నిమిరిన గతం వర్తమానాన్ని చూసి జాలిపడితే, గతంలో గెంతులు వేసిన బాల్యం భవిష్యత్తును చూసి బెంగ పడింది" అంటారు. ఆహా ! ఎంత అందంగా చెప్పారు.ఇలాంటి ఎన్నో అపురూప కవితలతో చందలూరి నారాయణరావు 'మనిషి గుర్తుల్ని బతికించుకుందాం' అంటూ ఒక చక్కని పొత్తాన్ని రచించి వెలుగులోకి తెచ్చారు.

'దారి తప్పిన బుుతురాగం' అనే తన కవితలో నేడు మారిపోయిన అసంబద్ద కాలాల మార్చు గురించి చెబుతూ 'భానుడు వెలుగునిచ్చేలోగా మేఘుడు అడ్డుపడి దారి తప్పినది బుుతురాగం' అంటారు. నిజాయితీపరుల గూర్చి చెబుతూ 'వాడు మంచోడు కాదు, నిజాలతో కడుపు నింపాలంటారు. వాడికి తెలివి లేదు, అబద్దంతో అందంగా కనబడలేడు' అంటారు. డబ్బు, అధికారం ఉన్న వారికే విలువ అనే వీది ఆవేదనా భావం. వీరి కవిత్వం చదివినవారికి వీరో మంచి పుస్తకాల పురుగు అని అర్ధమౌతుంది.

మరో కవితలో పట్నం పరిస్థితిని వివరిస్తూ 'కొంపలో సూరీడు ఎప్పుడొచ్చాడో?' తెలియదంటారు. 'ముసురు ముప్పు పట్టి చినుకు చిందితే, వీధులన్నీ గర్భం దాల్చిన ప్రాజెక్టులే, ఇళ్లన్నీ నీళ్లలో తేలియాడే పడవలే' అంటారు. అందుకు బెంగుళూరు ఒక సాక్ష్యం. నేటి మనిషి బుద్ది ఎలా ఉందో చెబుతూ 'చదువులు ఆకాశాన్ని దాటి, అంతరిక్షాన్ని దాటుతుంటే, మనిషి బుద్ధి మాత్రం దిగజారి పాతాళాన్ని దాటిపోతోంది' అంటారు. కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టారు.

వ్యాక్సిన్‌ కనిపెట్టలేని అతి పెద్ద వైరస్‌ 'బుల్లితెర' అంటూ 'తెలుగు నాట వినోదం పేరిట బుల్లితెర నట్టింట్లో తిష్టేసిన ఓ పెద్ద వైరస్‌' అని ఎద్దేవా చేస్తారు. 'ఏ చానల్‌ తలుపు కొట్టినా మరగబెట్టి, మురగబెట్టి, మురుగు వాసనలతో కంపు కొడుతున్నాయంటారు. పేదల గురించి, రైతుల కష్టాల గురించి, కవులు, దేవుళ్లు, అమ్మానాన్నల గురించి, దొంగ భక్తులు, మోసగాళ్లు గురించి, మానవత్వం గురించి నవరస భరితంగా రచించిన ఈ కవితల సమాహారం ప్రతి ఒక్కరూ చదవదగినది.


ప్రతులకు:

చందలూరి శ్రీవిద్య

డోర్‌ నెం 30-101,

పాత బస్టాండ్‌ సెంటర్‌, అద్దంకి

97044 37247

విశాలాంధ్ర, ప్రజాశక్తి పుస్తక విక్రయ కేంద్రాలు

పేజీలు 180, ధర రూ.100


సమీక్ష

మద్దిరాల శ్రీనివాసులు

నవ్య కవితా కళానిధి

ఒంగోలు, ప్రకాశం జిల్లా

90106 19066

Next Story

Most Viewed