ఈ లక్షణాలున్న కుక్కలతో జాగ్రత్త

by Viswanth |
ఈ లక్షణాలున్న కుక్కలతో జాగ్రత్త
X

గ్రామ సింహాలు శునకరాజాలే.. అదేనండి కుక్కలు. ఇవి విశ్వాసానికి ప్రతీక. అంతేకాకుండా ఎన్నో నేర పరిశోధనల్లో శిక్షణ పొందిన కుక్కలు నేరస్థులను పసిగట్టడంలో విశ్వసనీయత ప్రదర్శిస్తాయి. అంతే కాదు, ప్రకృతి బీభత్సాలను ముందే అంచనా వేయడంలో మేటి. విశ్వాస ఘాతకులను తిట్టేటప్పుడు జనం కుక్కకున్న విశ్వాసం కూడా లేదంటారు! అది కుక్కకున్న విశ్వాసం. అయితే ఇలా మనిషితో ఎంతో అనుబంధాన్ని ఏర్పరుచుకున్న కుక్క, అది కరవడం వలన వచ్చే జబ్బు భయంతో ఈ విశ్వాసంలో కాస్త ఆగాధం ఏర్పడుతుంది.

వీధి కుక్కల కాటే ఎక్కువ

ఈ జీవవైవిధ్యంలో సమస్త జీవులు ఈ భూమిపై జీవించాల్సిందే. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని జీవుల జనాభాను నియంత్రించాల్సి వస్తుంది. ప్రస్తుతం పల్లె-పట్నం అనే తేడా లేకుండా ఒక వీధిలో 20-30 కుక్కలు, కోతులు సంచరిస్తుంటాయి. ఇలా పెద్ద మొత్తంలో ఉన్న వీధి కుక్కలు ప్రజలపై దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి. వైద్య శాఖ గణాంకాల ప్రకారం మన రాష్ట్రంలో గత ఏడాదిలో 1,68,367 మంది కుక్క కాటుకు గురయ్యారని తెలుస్తుంది. కేవలం హైదరాబాద్ నగరంలోనే 6.5 లక్షల కుక్కలు ఉన్నట్టు, అవి రోజుకు సుమారు 400 మందిని కాటు వేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్( ఐపీఎం) గణాంకాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో కుక్క, కోతి, పాము కాటు బెడద అంచనాలకు మించి అధికమని తెలుస్తుంది. ఇలా రాష్ట్రం మొత్తం మీద పెంపుడు కుక్కల కాటుకు 29 శాతం మంది, 71 శాతం మంది వీధి కుక్కల కాటుకు గాయపడుతున్నారు. గత ఏడాది నవంబర్ నాటికి వీటి కారణంగా గాయపడి చికిత్స పొందుతున్న వారు సుమారు 2 లక్షల పైగానే ఉన్నారు.

రాష్ట్రంలో వీధి కుక్కల సంఖ్య పెరిగిపోతున్నా నగర, పురపాలక, గ్రామపంచాయతీలు వీటిని నిరోధించడంలో ఆశించిన శ్రద్ధ కనబరచడం లేదు. వీటిని పట్టుకునే సుశిక్షితులైన సిబ్బంది, వాటిని అడవికి తరలించడానికి వాహనాల కొరత ఉండటం, అలాగే వీటి సంతాన నియంత్రణ చర్యలు అంతంతమాత్రంగా తీసుకోవడంతో ఒక్క హైదరాబాదులోనే సుమారు 6.5 లక్షల కుక్కలున్నట్లు అంచనా. వీటికి సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించాల్సి ఉంది. లేకపోతే వాటి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. హైదరాబాద్‌లో శివారు ప్రాంతాల కుక్కలు వలస రావడంతో వీటి సంఖ్య పెరిగిపోతున్నట్లు జీహెచ్ఎంసీ అధికార వర్గాలు చెబుతున్నాయి. వీధి కుక్కలు పెరిగిపోవడంతో పెద్ద ఎత్తున మందులు అందుబాటులోకి తీసుకురావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో సహా అన్ని స్థాయిల్లో కుక్క, పాము కాటు మందులను ఉచితంగా అందుబాటులోకి ఉంచి ప్రాణ నష్టం జరగకుండా కాపాడాలి. మన రాష్ట్రంలో ప్రస్తుతం 1,25,405 డోసుల యాంటీ రేబిస్ ఇంజక్షన్లు, 9147 డోసుల పాము కాటు ఇంజక్షన్లు ఉన్నట్టు తెలుస్తుంది.

కాటేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కుక్క కరిస్తే ఆందోళన పడకుండా అది పెంపుడుదా కాదా అనేది గమనించాలి. పెంపుడు కుక్క అయితే దానికి యాంటీ రేబిస్ టీకా వేయించారేమో తెలుసుకోవాలి. ఆ టీకా వేస్తే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అదే వీధి కుక్క అయితే యాంటీ రేబిస్ టీకా వేసే అవకాశం తక్కువ కాబట్టి ఆ గాయాన్ని ధారగా కారే మంచి నీటితో శుభ్రం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ యాంటీ సెప్టిక్ లోషన్లు, క్రీములు పూయకుండా, పసుపు లాంటివి పూసి కట్టు కట్టకుండా ఆ గాయాన్ని తెరిచే ఉంచాలి. ఎందుకంటే రేబిస్ వైరస్ నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుంది. క్రమంగా మెదడు వాపునకు గురిచేస్తుంది. దీంతో బాధిత వ్యక్తి ప్రాణాపాయంలో పడిపోతాడు. అంతేకాకుండా కుక్క కరిచిన ఒక రోజులో తప్పకుండా యాక్టివ్ ఇమ్యునైజేషన్ టీకాను తీసుకోవాలి. వైద్యులు నిర్దేశించిన టీకా డోసులు తీసుకున్నప్పటికీ, తప్పకుండా పాసివ్ ఇమ్యునై‌జేషన్ టీకాను ఇప్పించాలి. ఈ టీకాను గాయం ఉన్నచోట వేస్తారు. కుక్క కాటు బాధితుల్లో పురుషులు 65 శాతం, మహిళలు 35 శాతం ఉంటున్నారు.

రేబిస్ ఉన్న కుక్కలు సాధారణంగా ఒంటరిగా ఉండి, చొంగ కారుస్తూ, కళ్ళు తేలేస్తూ, నీళ్లు అంటే భయపడుతుంటాయి. వాటికి ఎదురుగా ఏది కనబడదు. ఈ లక్షణాలున్న కుక్కల పట్ల అప్రమత్తతతో ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం కుక్క, పాముకాటుల నుండి ప్రజలను రక్షించడానికి ఔషధాలు అందుబాటులో ఉంచడమే కాకుండా కోతులు, పాములు, కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి. కుక్కల నియంత్రణకు శస్త్ర చికిత్స చేస్తూ పెంపుడు కుక్కలను వీధి కుక్కలను సంబంధిత వైద్యశాఖలను అప్రమత్తపరిచి వాటి ఆరోగ్యాన్ని రక్షించాలి. ప్రజలను వాటి బారిన పడకుండా చూడాలి. అప్పుడే 'కుక్కకు- మనిషికి మధ్య విశ్వాసం' పెరుగుతుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ నుండి నగర, పట్టణ ప్రాంతాల సంబంధిత శాఖలను చైతన్యపరిచి వీటి బారినపడకుండా చూడాల్సిన బాధ్యత ముమ్మాటికి ప్రభుత్వాలదే..

మేకిరి దామోదర్

సామాజిక విశ్లేషకుడు

9573666650

Next Story

Most Viewed