బంజారాల సంఘ సంస్కర్త సేవాలాల్

by Disha edit |
బంజారాల సంఘ సంస్కర్త  సేవాలాల్
X

సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవం. 1739 ఫిబ్రవరి 15వ తేదీన అనంతపూర్‌ జిల్లా రాంజీనాయక్‌ తండాలో జన్మించాడు. ఈయనకు సేవాలాల్‌ అని నామకరణం చేశారు. సేవాలాల్ విద్యలను నేర్చుకొని బంజారాల సేవలో నిమగ్నమయ్యాడు. ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు. వీటిలో 'పెరిఫర్‌' ఒకటి. ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడులు అరికట్టడం, క్షేత్ర ధర్మాన్ని రక్షించడం మొదలైనవి ముఖ్యమైనవి. అహింస మహా పాపమని, మద్యం, ధూమపానం శాపమని హితవు పలికాడు. ఆ రోజుల్లోనే బంజారాల పరువు ప్రతిష్టల గురించి ఊహించి, అహింస సిద్ధాంతానికి పునాది వేశారు. అతడు జగదాంబ అమ్మవారిని పూజించేవారు అతనికి మహిమలు ఉన్నాయని, ప్రజలు భావించేవారు. ఇలా ఆధ్యాత్మిక చింతనతో బంజారా ప్రజల్లో చైతన్యం తెస్తూ, మనోధైర్యాన్ని నింపినాడు. నిజాం సామ్రాజ్యాన్ని తన ఆధ్యాత్మిక శక్తితో గడగడలాడించి పేరీ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన క్రాంతివీరుడుగా ప్రసిద్ధి కెక్కినాడు.

సేవాలాల్ మహారాజ్ ఆధ్యాత్మిక శక్తిని నిజాం సామ్రాజ్యం గ్రహించి ఆయనతో నిజాం సంధి కుదుర్చుకున్నారని చెబుతారు. నైజాం కాలంలో హైదరాబాద్ నగరంలో మశూచి వ్యాప్తి చెందినప్పుడు సంత్ సేవాలాల్ నివసించిన ప్రాంతం అనగా నేటి బంజారాహిల్స్‌లో మశూచి సోకలేదని ఒక కథనం ప్రచారంలో ఉన్నది. ఆధ్యాత్మిక చింతనతో బంజారా ప్రజల్లో చైతన్యం తెస్తూ, మనోధైర్యం నింపిన యుగపురుషుడుగా బంజారాలు కొలుస్తారు.

సేవాలాల్ మహరాజ్ అనంతపురం జిల్లాలో పుట్టి హైదరాబాద్‌లో కొంతకాలం నివసించి. చివరిగా మహారాష్ట్ర పోరాఘడ్‌లో స్థిరపడి అక్కడి నుంచి పొహరాఘడ్‌ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పచుకొని బంజారాలను సంస్కరించే బోధనలు కొనసాగించారు. 1806 డిసెంబర్ 4న మరణించారు. ఆరోజు నుండి బంజారా (లంబాడీ)ప్రజలు సంత్ సేవాలాల్ మహారాజ్‌ను తమ ఆధ్యాత్మిక దైవంగా భావిస్తూ పూజిస్తుంటారు. జయంతి, వర్ధంతులను పండుగలా నిర్వహిస్తారు. జయంతి రోజున పూజలు జరిపి బోగ్ బండారి ప్రసాదాన్ని వండుతారు.

సేవాలాల్ అనేవాడు బంజారాల కోసమే పోరాటం చేశాడని సేవాలాల్ గురించి అందరూ మాట్లాడుతారు. కానీ ఇక్కడే మనం సాంస్కృతికంగా తెలంగాణ సమాజానికి దూరమవుతున్నాం. మన చరిత్రని మనం వక్రీకరించుకుంటున్నాము. హైదరాబాద్‌లో రామానుజ విగ్రహాన్నీ ఆవిష్కరించారు. దాని నుండి మనం ఏం నేర్చుకున్నాం? రామానుజ స్వామి ఒక సామాజిక సంస్కరణ వాది. దేవుడు గుడి అనేవి బ్రాహ్మణులకు మాత్రమే కావని దేవాలయంలోకి వెళ్లి దేవుడిని ప్రార్థించే హక్కు అందరికీ ఉంటుందని. దళితులకు కూడా పూజారి అయ్యే హక్కుందని ఆయన ఒక సంస్కరణ చేశాడు. అద్వైత సిద్ధాంతాన్ని రాశాడు.

సేవాలాల్ కూడా కేవలం తన బంజారాల కోసమే పనిచేశాడు అనేది తప్పు. సేవాలాల్ బోధనలలో అతి ముఖ్యమైన బోధన పర్యావరణ పరిరక్షణ అడవులను కాపాడుకోవడం. పర్యావరణ పరిరక్షణ అనేది ఈ ప్రస్తుత ప్రపంచీకరణ ప్రపంచంలో అతి ముఖ్యమైన అంశం. పలు అభివృద్ధి చెందిన మొదటి ప్రపంచ దేశాలు పర్యావరణ పరిరక్షణ కోసమే తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కానీ 300 సంవత్సరాల క్రితమే సేవాలాల్ ఇది చెప్పాడని మనం సమాజానికి చెప్పడంలో విఫలమయ్యాం. ఇదే మన మొదటి వైఫల్యం. ఇప్పుడైనా మనం ప్రపంచ పౌరులుగా మారుదాం. మనవాడు గొప్ప, అవతలి వాడు కాదు అనే విషపూరితమైన ఆలోచనలు వదిలి పెడదాం. అదే మనం సేవలాల్‌ని కాపాడుకునే విధానం.

డి. వీరేష్ కుమార్

న్యాయవాది

95055 27027

Next Story

Most Viewed