దేశ స్వాతంత్య్రం కోసం అమరుడైన తొలి ముస్లిం వీరుడెవరో తెలుసా?

by Disha edit |
దేశ స్వాతంత్య్రం కోసం అమరుడైన తొలి ముస్లిం వీరుడెవరో తెలుసా?
X

మిత్రుడి నమ్మకద్రోహంతో పోలీసులకు పట్టుబడ్డాడు. అష్ఫాఖ్‌ను పట్టుకున్న పోలీసులు ఎంత ప్రయత్నించినా మిగతా వారి సమాచారం ఇవ్వలేదు. 1927 డిసెంబర్ 19న అష్ఫాఖ్‌ను ఉరితీయాలని కోర్టు తీర్పు వెలువరింది. 'దేశం కోసం ఉరిశిక్ష పడుతున్నందుకు గర్వంగా ఉందని, ఎంతో మంది ముస్లింలు ఉన్నా తను దేశం కోసం బలిపీఠమెక్కబోతున్న తొలి ముస్లిం నేనే కావడం సంతోషంగా ఉందని' దేశభక్తిని చాటుకున్నారు. 27 సంవత్సరాల వయసులో, ఖురాన్ చేత పట్టుకొని చిరుదరహాసంతో ఉరికంబం ఎక్కారు. నిండు నూరేళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారు. అష్పాఖ్ నీ త్యాగం, దేశం పట్ల బాధ్యతను ఈ దేశం సదా గుర్తుంచుకుంటుంది.

మాతృదేశ విముక్తి సమరంలో ప్రాణాలకు తెగించి పోరాడిన యువ విప్లవ కారులలో 'అష్ఫాఖుల్లా ఖాన్' ఒకరు. వయసుకు మించిన పరిణితితో 27 సంవత్సరాలకే నూరేళ్ల ఖ్యాతినార్జించి దేశం కోసం ఉరితాడును ముద్దాడిన వీరుడు. మాతృభూమిని ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుండి విముక్తి చేయాలనుకున్న క్రమంలో తన త్యాగం వృథా పోదని, ఇది మరెందరికో స్ఫూర్తినిస్తుందని నిర్భయంగా ప్రకటించి తన దేశం స్వేచ్ఛా వాయువులు ఖచ్చితంగా పీలుస్తుందని, బానిస సంకెళ్లు తెగిపోతాయని ధీమాగా పలికిన దేశభక్తుడు.

తన దేశ స్వాతంత్రం కోసం కోట్లమంది ముస్లింలలో మొదటగా ప్రాణాలర్పిస్తున్నందుకు గర్వంగా ఉందని తన ఉరిని తానే వేసుకున్న ధీశాలి. 'నా దేశ సోదరులారా మీరు మొదట భారతీయులు, ఆ తర్వాతే మీ మత ధర్మాలు. మీరు ఏ మతం వారైనా పరస్పరం కలహించుకోకండి. ఆంగ్లేయులను ఎదిరించండి. దేశ విముక్తే మన లక్ష్యం కావాలి' అంటూ కర్తవ్యబోధ చేసిన దార్మనికుడు.

Also read: 17వ శతాబ్దంలోనే బహుజన రాజైనా సర్దార్ పాపన్న గురించి తెలుసా?

చిన్న వయసులోనే

అష్ఫాఖుల్లా ఖాన్ 1900 అక్టోబర్ 22న ఉత్తరప్రదేశ్‌లో జన్మించారు. తల్లిదండ్రులు విద్యావంతులు. తండ్రి షఫీ ఖుల్లా ఖాన్ పోలీసు శాఖలో పని చేసేవారు. అష్ఫాఖ్ ప్రాథమిక ఇస్లామీయ పరిజ్ఞానమంతా తల్లి మెహరున్నీషా వద్ద నేర్చుకున్నాడు. ధార్మిక పరిజ్ఞానం కోసం గురువును ఏర్పాటు చేశారు. గురువు దేశభక్తుడు. విదేశీ వస్తువులను వాడేవారు కాదు. అదే తన శిష్యులకు బోధించేవారు. అష్ఫాఖ్‌ను నైతికంగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర కీలకం. ఆంగ్లేయుల అరాచకాలను, వారి ఆధిపత్య ధోరణిని వివరించేవారు. వారికి వ్యతిరేకంగా పోరాడి దేశానికి విముక్తి కల్పించడం గొప్ప పుణ్యకార్యమని, వారికి సహకరిస్తే నరకం చవిచూడాల్సి వస్తుందని చెప్పడంతో ఆ మాటలు అతనికి ఎంతో ప్రభావితం చేశాయి.

తన అన్నలు చదువు పట్ల శ్రద్ధ వహిస్తే అష్ఫాఖ్ మాత్రం దేశం గురించి ఆలోచించేవారు. తన కుటుంబం రాజకీయాలకు అతీతమైనది అయినా తాను మాత్రం 'ఎప్పుడెప్పుడు విప్లవోద్యమంలోకి దూకాలి' అనే ఆలోచనతోనే పెరిగాడు. అదే సమయానికి గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమైంది. అష్ఫాఖ్ విద్యార్థిగానే ఉద్యమంలో పాల్గొని విదేశీ వస్తువులు వాడరాదని, అవి వారి బానిసత్వానికి ప్రచారం చేశాడు. ఈ చర్యతో స్కూల్ యాజమాన్యం ఆయనను పాఠశాల నుండి బహిష్కరించింది. అయినా అష్ఫాఖ్ బెదరకుండా ప్రభావవంతమైన విప్లవకారుల చరిత్రలు చదివి ప్రేరణ పొందేవారు.

Also read: యోధురాలు దుర్గావతి వోరా.

దేశం కోసం సఖ్యతతో

మాతృదేశం కోసం పోరుబాటలో సాగేందుకు విప్లవ దళ సభ్యుడు, తన సహ విద్యార్థి రాజారాం కోసం వెతికారు. చివరకు రాంప్రసాద్ బిస్మిల్ అనే విప్లవకారుడిని కలిశాడు. తను కూడా అష్ఫాఖ్ లాగానే దేశ విముక్తి కోసం కలలు కంటూ దేనికైనా సిద్ధమని నమ్మేవారు. ఆర్య సామాజికుడు. ఆ సమయంలో ముస్లిం, హిందూ కలిసి ఉండటం ఉప్పు, నిప్పు లాంటి పరిస్థితి. ఇద్దరి లక్ష్యం ఒక్కటే కావడంతో ఎవరి ధర్మాలను వారు పాటించి భావితరాలకు ఆదర్శంగా నిలిచిపోయారు. ఉద్యమం కోసం ఒక పథకం ఆలోచించి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టాలని నిర్ణయించారు. ఆగస్టు తొమ్మదిన అష్ఫాఖుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్, చంద్రశేఖర్ ఆజాద్, రాజేంద్ర లాహిరి, రోషన్ సింగ్ మరికొందరు కలిసి కాకోరీ గ్రామంలో ప్రభుత్వం ఖజానాతో వెళుతున్న రైలును దోపిడీ చేశారు. పట్టుమని పదిమంది లేని యువకులు ఏకంగా బ్రిటిష్ ఖాజనాకే గురి పెట్టి రైలు దోచేయడం ఆంగ్లాధికారులకు తల తీసేసినంతపనైంది.

ఉద్యమకారులకు కొత్త ఉత్సాహాన్ని అందించింది. దీంతో ఆంగ్లాధికారులు సోదాలు చేసి రాంప్రసాద్‌ను అరెస్టు చేశారు. అష్ఫాఖ్ తప్పించుకొని బనారస్‌లో పది నెలల పాటు అజ్ఞాతంలో ఉన్నారు. అనంతరం ఢిల్లీ చేరుకొని అక్కడ మిత్రుడి నమ్మకద్రోహంతో పోలీసులకు పట్టుబడ్డాడు. అష్ఫాఖ్‌ను పట్టుకున్న పోలీసులు ఎంత ప్రయత్నించినా మిగతా వారి సమాచారం ఇవ్వలేదు. 1927 డిసెంబర్ 19న అష్ఫాఖ్‌ను ఉరితీయాలని కోర్టు తీర్పు వెలువరింది. 'దేశం కోసం ఉరిశిక్ష పడుతున్నందుకు గర్వంగా ఉందని, ఎంతో మంది ముస్లింలు ఉన్నా తను దేశం కోసం బలిపీఠమెక్కబోతున్న తొలి ముస్లిం నేనే కావడం సంతోషంగా ఉందని' దేశభక్తిని చాటుకున్నారు. 27 సంవత్సరాల వయసులో, ఖురాన్ చేత పట్టుకొని చిరుదరహాసంతో ఉరికంబం ఎక్కారు. నిండు నూరేళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారు. అష్పాఖ్ నీ త్యాగం, దేశం పట్ల బాధ్యతను ఈ దేశం సదా గుర్తుంచుకుంటుంది.

(నేడు షహీద్ అష్ఫాఖుల్లా ఖాన్ జయంతి)


ఎండీ ఉస్మాన్‌ఖాన్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99125 80645

Next Story

Most Viewed