ఆదరణ కోల్పోతున్న విలువిద్య

by Disha edit |
ఆదరణ కోల్పోతున్న విలువిద్య
X

రామాయణం, మహాభారతంలో ధనుర్విద్య (విలువిద్య) గురించి ఎంతో గొప్పగా ప్రస్తావించారు. యుద్ధాలలో శత్రు సైన్యాన్ని ఎదుర్కొనేందుకు విలువిద్యను ప్రత్యేకంగా ఉపయోగించారని పురాణాలు చెబుతున్నాయి. స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని ఛేదించిన అర్జునుడు, శివ ధనస్సును విరిచి సీతను పెళ్లాడిన శ్రీరాముడు, వీరంతా విలువిద్యలో నిష్ణాతులే. అంతేకాదు విలువిద్య నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్న క్షత్రియేతరుడైన ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడి ప్రతిమనే గురువుగా భావిస్తూ పట్టుదలతో అర్జునున్ని మించిపోయేలా విలువిద్య నేర్చుకున్నాడు. విలువిద్య అనేది పురాణాలలోనే కాదు, ఆదిమానవుడు ఆహారం కోసం జంతువులను వేటాడేందుకు, శత్రుసైన్యంతో పోరాడేందుకు విలువిద్యను ఉపయోగించేవారు. అలాగే మన్యం హక్కుల కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించినవారే. ఈ విలువిద్య స్ఫూర్తి ఆధారంగానే ఆధునిక క్షిపణి ఆవిష్కరింపబడిందని అంటారు. అయితే ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మనదేశంలో ప్రాచుర్యంలో ఉన్న విలువిద్య ఇప్పుడు నిరాదరణకు గురవుతుంది. కానీ ఆశ్చర్యకరంగా ఈ క్రీడ భూటాన్, జపాన్, ఫ్రాన్స్ మరియు ఇటలీ వంటి దేశాల్లో ఎంతో ప్రసిద్ధి చెందుతోంది.

నిరాదరణకు కారణాలుగా...

ఒలింపిక్ క్రీడలలో ఒకటైన విలువిద్యను ఇతర క్రీడలతో సమానంగా ప్రభుత్వం ప్రోత్సహించడం లేదు., దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించకపోవడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. అలాగే ఈ క్రీడ పట్ల యువతకు సరైన అవగాహన లేకపోవడం, ఉన్నా శిక్షణా కేంద్రాలు లేకపోవడం కూడా ఈ విద్య నిరాదరణకు గురికావడానికి కారణాలుగా ఉన్నాయి. అలాగే ఈ విద్య ఎంతో వ్యయంతో కూడుకున్నది కావడంతో ఎంతోమంది నేర్చుకోవడానికి వెనకాడుతున్నారు అందుకే ప్రభుత్వం ఉచిత శిక్షణ కల్పించాలి. అలాగే యువతకు క్రికెట్, ఫుట్‌బాల్ వంటి క్రీడల్లో ఉన్న ఆసక్తి, ప్రాచుర్యం దీనికి లేకపోవడం కూడా దీని నిరాదరణకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రీడను పారిస్‌లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో 1904, 1908, 1920ల వరకు కొనసాగి ఆపై 52 సంవత్సరాల విరామం తర్వాత మరోసారి 1972 నుండి కొనసాగిస్తున్నారు. ఇది ఇప్పటి వరకు కొనసాగుతుండడం గొప్ప విషయం. మనదేశంలో 1973 జాతీయ ఆర్చరీ ఛాంపియన్ షిప్ ద్వారా ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. మనదేశంలోనూ విలువిద్య క్రీడాకారులు ఎన్నో ఘనతలు సాధించారు. ఈ విద్యలో పాల్గొని పథకాలు సాధించిన లింబారామ్, డోలా బెనర్జీని ప్రభుత్వం పలు అవార్డులతో ప్రోత్సహించింది. ప్రభుత్వం ఇంకా ఇలాంటి క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా వుంది. మనరాష్ట్రంలోనూ వరంగల్‌కి చెందిన ప్రణీత పన్నెండు జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొని పదకొండు పతకాలు సాధించింది.

గణాంకాల ప్రకారం...

2021 గణాంకాల ప్రకారం విలువిద్య ఏడవ అత్యంత ప్రజాదరణ పొందిన ఒలింపిక్ క్రీడగా గుర్తింపు పొందింది. ఉత్తర కొరియా, అమెరికా, బెల్జియం, ఫ్రాన్స్, ఇటలీ, చైనా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, జపాన్, స్పెయిన్ వంటి దేశాల్లో ఈ క్రీడకు జనాదరణ ఉన్నప్పటికీ, భారతదేశానికి ఆ జాబితాలో చోటు దక్కకపోవడం చాలా విచారకరం. 2021 గణాంకాల ప్రకారం, మన దేశంలో 23 మంది మహిళా అథ్లెట్లు ఒలంపిక్ పోటీలలో పాల్గొనగా, 18 మంది పురుషులు పాల్గొన్నారు. షార్జాలో జరిగిన ఆసియా కప్ 3వ దశలో భారత ఆర్చర్లు ఐదు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలతో 10 పతకాలు సాధించారు. సంఖ్యాపరంగా తక్కువ మంది ఆర్చర్లు ఉన్నప్పటికీ మన దేశానికి మంచి అవార్డులు రావడం గర్వించదగ్గ విషయం. కేరళలోని వాయనాడ్ అడవులలో నివసించే గోవిందన్ తన పూర్వీకుల ద్వారా వేట కోసం విలువిద్య నేర్చుకున్నారు. తర్వాత వేట మానేసినా, అంతరించిపోతున్న కళను కాపాడాలనే ఉద్దేశ్యంతో యువతరానికి ఈ విద్యను నేర్పిస్తున్నాడు. అయితే ఈ విద్యను నేర్చుకోవడానికి తన సామాజికవర్గంలోని చాలామంది యువకులు ఆసక్తి చూపడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇంతటి చరిత్ర ఉన్న మన దేశ క్రీడను నేర్చుకునేందుకు దిశా నిర్దేశం చేసే వారు లేకపోవడం శోచనీయం. హిందూ సంప్రదాయాలలో విలువిద్య గురించి ఎంతో గొప్పగా ప్రస్తావించారు. ఈ విద్యను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది..

కోట దామోదర్

9391480475



Next Story

Most Viewed